Previous Page Next Page 
కళ్ళు పేజి 26


    "అలా అని కాదు. మిమ్మల్ని కలవరపర్చిన, మీరు విపరీతంగా కలవరపడిన సందర్భాలేమైనా వున్నాయా?"

 

    హేమసుధ ఆలోచిస్తూంది.

 

    "తెలీటల్లేదు" అంది కొంతసేపటికి-

 

    "మీకు దగ్గరగా వచ్చిన వ్యక్తి ఎవరయినా వున్నారా?"

 

    "అంటే?"

 

    "ఐమీన్... మీరు ఎవర్నైనా ప్రేమించారా?"

 

    "నిజ జీవితంలో ఎవరూ నా మనసుకి దగ్గరగా రాలేదు" అన్నది హేమసుధ.

 

    "పోనీ మీకెవరన్నా శత్రువులున్నారా?"

 

    "తెలీదు."

 

    "కొంచెం ఆలోచించి చెప్పండి. మీరంటే ఎవరికయినా కక్ష, విరోధం వుండడానికి అవకాశముందా?"

 

    "చెప్పలేను. నన్ను ప్రేమించామని, ఆరాదిస్తున్నామని అనేక ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఫోన్లు చేసి కొంతమంది ప్రేమను ఒలకబోస్తూ కొంతమంది తుంటరిగా, కొంతమంది తమ కోరిక అంగీకరించకపోతే హాని చేస్తామని బెదిరిస్తూ మాట్లాడేవారు. నేను చిరాకుపడేదాన్ని గాని, వాటినెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు."

 

    "మీ బంధువుల్లోగాని, స్నేహితుల్లోగాని మీరంటే ఎవరికయినా జెలసీ వున్నదా?"

 

    "నేను చాలా సామాన్య కుటుంబంలో పుట్టి, పెరిగి కొద్దికాలంలో ఆర్టిస్టుగా ఎన్నో ఘన విజయాలు సాధించాను. వీళ్ళంతా నా పేరు చూసి, డబ్బు చూసి ఈగల్లా మూగుతోన్నా లోలోపల జెలసీ వుండదని అనుకోవటంలేదు."

 

    "మీతోటి ఆర్టిస్టులతో ఎరికయినా మీరంటే తీవ్రమైన వైరం వుండటానికి అవకాశముందా?

 

    "తెలీదు."

 

    "మిమ్మల్ని ప్రేమించానని వెంటపడ్డ వాళ్ళుగాని, మీచేత తిరస్కరించబడ్డ వాళ్ళుగానీ... మీమీద కక్ష కట్టడానికి అవకాశముందా?"

 

    హేమసుధ ఆలోచిస్తూంది.

 

    "చెప్పటానికి ఇష్టంలేని డెలికేటు పాయింట్సేమైనా ఉంటే చెప్పనక్కర్లేదు."

 

    "ఒకసారి ఓ సంఘటన జరిగింది. దానికెంత ప్రాముఖ్యత ఉందో తెలీదు..."

 

    రంజితలో చిన్న ఆశాభావం చిగురించినట్లయి ఆసక్తిగా చూసింది.

 

    "ఒకసారి ఊటీలో షూటింగ్ జరుగుతోంది. అమ్మకి జ్వరంగా ఉండి నాతోబాటు రాలేదు. హోటల్ రూమ్ లో ఒక్కదాన్నే ఉన్నాను. ఓ సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చి మేకప్ చెరిపేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. డోర్ సరిగ్గా వేయలేదనుకుంటాను. హఠాత్తుగా తలుపు తోసుకుని సర్వర్ ఒకతను లోపలికి వచ్చాడు. "ఏమిటది? గెటవుట్" అనరిచాను. "మీ అందం, వయ్యారం నన్ను పిచ్చివాడ్ని చేస్తున్నాయి. ఒక్కసారి... ఒక్కసారి... ప్లీజ్" అంటూ దగ్గరకు వస్తున్నాడు. భయంతో నా ఒళ్ళు జలదరించినట్లు దూరంగా తప్పుకోబోయాను. చాలా వేగంగా అతను నా మీదకు ఉరికి రెండు చేతుల్లో ఇరికించుకుని, నేను విడిపించుకునే లోపల బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. అతన్ని బలమంతా ఉపయోగించి తోసేస్తూ నేను గట్టిగా కేకలు పెట్టాను. మా సిబ్బందీ, హోటలు పనివారు అంతా పరిగెత్తుకొచ్చారు. అతన్ని చావచితగ్గొట్టి పోలీసుల కప్పగించారు. తర్వాత అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారని విన్నాను."

 

    "ఆ మనిషి ఎలా ఉంటాడో గుర్తున్నదా?"

 

    "భారీగా, చాలా దృఢంగా ఉన్నాడు."

 

    "హాస్పటల్లో డాక్టరుగా మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికీ, ఆ మనిషికీ పోలికేమైనా ఉన్నదా?"

 

    "చెప్పలేను. హోటల్ సర్వర్ ని ఆ ఒకటి రెండు నిమిషాలే చూశాను. మొహం అదీ గుర్తులేదు."

 

    "పోనీ హాస్పటల్లో మిమ్మల్ని... అదే- మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి గొంతు వింటే ఆనవాలు పట్టగలరా?"

 

    "ఆ గొంతు కొద్దిగా గుర్తుంది. సరిగ్గా చెప్పలేకుండా ఉన్నాను."

 

    "సరే, ఇంకో ప్రశ్న- మందాకిని మీకెప్పట్నుంచీ తెలుసు?"

 

    "మందాకినా? ఆమె ఎవరు?"

 

    "మందాకిని మీకు తెలియదా?"

 

    "తెలీదు."

 

    "మందాకిని పేరెప్పుడూ వినలేదా?"

 

    "మందాకిని పేరు ఎవరెవరికో వుండటంవల్ల ఆ పేరు విని ఉంటాను. ఉదాహరణకి ఒక సినిమాలో నాపాత్ర పేరు మందాకిని. కాని మీరెవరి గురించి అడుగుతున్నారో నాకు తెలీదు!"

 

    "కొన్నిరోజుల క్రితం మీకు జరిగినట్టే ఇంకో స్త్రీకి కూడా జరిగింది. ఆ స్త్రీ పేరు మందాకిని."

 

    "మైగాడ్! ఎవరో ఓ అమ్మాయికి ఇలా జరిగిందని చూచాయగా విన్నాను కానీ, షూటింగ్ గొడవల్లో ఉండి పట్టించుకోలేదు. ప్రొద్దుట లేచినప్పట్నుంచీ షూటింగులూ, మేకప్ వేసుకోవటం, కాల్ షీట్స్, సంపాదించిన డబ్బు ఎలా జాగ్రత్తపరుచుకోవాలా అన్న ఆలోచనలు... ఇవి తప్ప బయటి ప్రపంచం గురించి ఎక్కువగా తెలుసుకొనేదాన్ని కాను."

 

    "ఇంకో ప్రశ్న. నేను వచ్చేముందు మీతో ఎవరయినా వచ్చి మాట్లాడారా?"

 

    "లేదే!"

 

    రంజిత ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. ఎక్కడా అబద్ధం చెబుతూన్న ఛాయలు లేవు.

 

    "జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. బయటివ్యక్తి ఎవరితోనూ మీరు మాట్లాడలేదా?"

 

    "మీరలా ఎందుకడుగుతున్నారో నాకర్థం కావటంలేదు. మా ఇంట్లోని వాళ్ళతో తప్ప బయటివాళ్ళెవరితో నేను మాట్లాడలేదు."  

 

    బయట తాను చూసిన మనిషి గురించి చెప్పలేదు ఆమె భయపడుతుందని "ఊరికినే అడిగాను" అన్నది.

 

    హేమసుధ ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది.

 Previous Page Next Page