అంతా బాగుందంటే బాగున్నదన్నారు. శంకరం మాత్రం కథ చెపుతున్నంత సేపూ చలనం లేకుండా వుండిపోయాడు. అతనికి అర్ధంకాని ఆలోచనలేవో అతని తల్లో గిర్రున తిరుగసాగాయి.
"ఈ నాటకం లో మీరే నటించాలి. ఎవరు నటిస్తారో చేతులెత్తండి" అన్నాడు మేష్టారు కొందరు పొరుగూళ్ళకి పోవలసి వుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నమే చెయ్యలేదు. చాలామందికి స్టేజి ఎక్కడమంటే ఏమిటో మహా ఘనకార్యం అనిపించి ధైర్యం లేకపోయింది.
మేష్టారు అందరివంక చూసి "ఏరా? ఎవరూ మాట్లాడరేం?" అని అడిగాడు.
శర్మాయికి నోరు వూరుకోదు. తను ఏమీ చెయ్యలేకపోయినా ఇతరులచేత చేయించటానికి తయారు. గబుక్కున లేచి "శంకరం వేయగలడండి మేస్టారూ అమోఘంగా" అన్నాడు.
"ఏరా శంకరం" అన్నారు మేష్టారు.
శంకరం ఇందాకట్నుంచి ఆలోచనల్లోంచి తేరుకోలేదు. "ఏరా శంకరం!" అని మేష్టారు అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏమిటోలా అయిపోయి "ఆఁ ఆఁ" అంటూ చేయి పైకి ఎత్తేశాడు. "బలే బలే" అంటూ చప్పట్లు కొట్టారు అంతా. అప్పటికి కాని తెలిసిరాలేదు తను చేసిన పొరపాటు శంకరానికి తెలిసిన తర్వాత ముచ్చెమటలు పోశాయి. నోటివెంట మాటరాలేదు. మేష్టారు ముందుకువచ్చి అతని భుజంమీద తట్టి "బలే, నువ్వొక్కడివే రోయ్ గట్టివాడివి ఈ నాటకం అంతటికీ పిల్లదొంగ అబ్బాయిదే ముఖ్యమైన పాత్ర అది నువ్వే నిర్వహించాలి అర్ధమయిందా?" అన్నారు.
శంకరం బిక్కమొహం వేశాడు. ఇప్పుడెలా పరువు కాపాడుకోవడం? తను అంత అప్రయత్నంగా చెయ్యి ఎందుకు ఎత్తేశాడు? ఇప్పుడు వెయ్యలేనంటే ఎంత చిన్నతనంగా వుంటుంది?
అయితే ఏం చెయ్యటం? అందులో తను వేసేది పిల్లదొంగవేషం ఎందుకో శంకరం గుండె గబగబ కొట్టుకుంది.
"మా నాన్నగారు ఒప్పుకోరేమో సార్" అన్నాడు చివరికి ఇంకేం అనలేక.
"ఫర్వాలేదులేవోయ్. నేను ఒప్పిస్తాను సరా?" అన్నాడాయన. శంకరం యింక ఏమనేందుకు వీలు లేకపోయింది. తరువాత మేష్టారు మిగతా వేషాలకి కూడా పాత్రధారుల్ని ఎన్నుకొన్నారు. శర్మాయి అతికష్టంమీద ఒక వేషం వెయ్యటానికి ఒప్పుకొన్నాడు. చలం వాళ్ళనాన్న కొడతాడని వెయ్యనంటే వెయ్యనన్నాడు. ఆ క్లాసులో ఆడపిల్లలు లేనందువల్ల తల్లివేషంకూడా ఒక అబ్బాయి చేత వేయించటానికి నిశ్చయమయింది.
అంతా అయింతర్వాత మేష్టారు ఇంకోవిషయం చెప్పారు. "కేవలం నా సరదాకొద్దీ, ఆవేశంకొద్దీ ఇలా నాటకం వేయిస్తున్నానుగాని, పెద్దవాళ్ళ సహాయం మనకు లేదు. ఆర్ధిక సహాయమూ లేదు. హెడ్ మాస్టరుగారుకూడా నాకు అంత చేయూతనివ్వటంలేదు. మనం నాటకం ప్రదర్శించిన తరువాత గాని దీనిలోని గొప్పతనం ఎవరికీ తెలియదు. నాటకం అన్న తరువాత ఖర్చు అంటూ వుంటుంది. కాబట్టి మీరంతా తలా ఒక రూపాయి ఇచ్చి దీన్ని ప్రోత్సహించాలి" అని.
కొంతమంది ఒప్పుకోలేదు. కొంతమంది ఇవ్వటానికి ఒప్పుకొన్నారు. ఒప్పుకొన్నవారిపేర్లు మేష్టారు కాయితంమీద నోట్ చేసుకున్నారు. అందులో శంకరంపేరు మొదటనే వుంది.
"అయితే ఇంతకీ నాటకం వేసేదెప్పుడు మాస్టారూ?" అని అడిగాడు ఒక విద్యార్ధి.
"అసలు దసరానాడు మనం రేపట్నుంచే రిహార్సల్సు ప్రారంభించాలి. నాటకం అందరి మన్ననల్ని పొందేటట్లు వుండాలి. ఏంరోయ్ శంకరం! రేపు నేను మీ ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడుతానులే రేపు సాయంత్రం అంతా మా ఇంటిదగ్గరకు రావాలి. ఇక వెళ్ళండి" అంటూ లేచాడాయన. అందరూ ఒక్కసారిగా లేచి ఇళ్ళకు బయలుదేరారు శంకరం ఎవరితోనూ కలవలేదు. చలం పలుకరించినా ఆలోచనలతో వుండి పలకలేదు. ఇతని పరధ్యానం గమనించి చలం ఏమీ అనలేక వెళ్ళిపోయాడు. శంకరం వంటరి గానే నడవసాగాడు.
పిల్లదొంగ తను పిల్లదొంగవేషం వెయ్యాలి. ఆ పేరు....ఆ పేరు నిజంగా తనకు సరిపోతుందా? అసలు పిల్లదొంగ అంటే అర్ధం ఏమిటి? ఇంట్లో దొంగపనులు చేసేవాడై వుంటుంది. అట్లా అయితే తను అప్పుడప్పుడూ అవసరం వచ్చినప్పుడల్లా చేసేపని అదేగా అది పెద్దతప్పని ఇంతవరకూ తను ఆలోచించుకోలేదు. కాని చాలా గాఢమైన అపరాధమనీ, దాన్నిగురించి ఒక నాటకం ఆడవచ్చుననీ ఇప్పుడు మేస్టారు అన్నమాటల్నిబట్టి తెలిసింది. కాని ఆ నాటకంలో ఆడవచ్చుననీ ఇప్పుడు మేస్టారు అన్నమాటల్నిబట్టి తెలిసింది. కాని ఆ నాటకంలో దొంగకీ తనకి బేధంలేదా? ఏముంది? ఏదో వున్నట్లు కనిపిస్తోంది. అదేదో ఏమిటో ఎంత తన్నుకున్నా అర్ధం కావటంలేదు.
శంకరం చిన్నబుర్ర తలకుమించిన ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఏమి నిశ్చయించుకోవటానికీ చేతకాక అలానే ఇంటికి చేరుకున్నాడు. గుమ్మం ఎక్కుతూనే ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు అక్కయ్య!
"అక్కయ్యా! అక్కయ్యా!" అంటూ పరుగెత్తుకుపోయాడు అక్కదగ్గరకు అక్కయ్య దగ్గరకు తీసుకుంది శంకరాన్ని.
"ఎప్పుడొచ్చావే అక్కయ్యా?' అనడిగాడు సంబరంతో.
"ఇందాకేరా" అంది అక్కయ్య.
"బావో?"