Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 27


    సనపగానిరాజు చిన్నవాడు. వాడు దాటాడు. తాబేటిని రోకలితో కొట్టి చంపాడు. అందుకు అన్నలకూ, అతనికి తగాదా వచ్చింది. చిన్నవాడు గెలిచాడు. తాబేలును కాల్పించి, అందరితో తినిపించాడు.

 

    ఆ దేశంలో పారిగ తొడిమకు గుమ్మడికాయ కనిపించింది. అది వారికి విచిత్రం అనిపించింది. అందులో దేవతలు ఉన్నారనుకున్నారు. దాన్ని పగలగొట్టాలనుకున్నారు. ఎంత కొట్టినా పగల్లేదు. విల్లు నమ్ములందుకున్నారు. దాన్ని బాణాలతో కొట్టారు. పెద్ద ధ్వనితో అది మూడు చెక్కలు అయింది. అందులోంచి ముగ్గురు దేవతలు వెళ్ళారు. వారిని చూచి ఆనందించారు రాజులు. పాటలు పాడారు. వాద్యగాండ్లు వాద్యాలు వాయించారు. ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ, దేవతలను తీసుకొని వాళ్ళ రాజ్యానికి వెళ్ళారు.

 

        చో ఓ ఓ ఓ ఐ
        ఆఁ పండాని రాజు ఓ బండిమీద
        బండాని రాజు ఓ మేన మీద
        ఆఁ వారు ఆచారమంతులె కాదా?
            నీ మాము నామాము వారిది
        ఆఁ నామాటలు నీమాలు వారిని
            గంటాము గాలామె బిరుదం
        వో నూటోరి బమ్మమె దైవం
            బండాన తిరుచిన్న నామం
        జలా రేల రేలా రేల
        రేలా రే రేల రేల  

 

    ఇంకా చాలా కథలు చెప్పాడతను. ఒక చిన్నది కడసరి రాజును వలచింది. వలపించుకుంది. పెండ్లి నిశ్చయం అయింది. మాలవాడు తెల్లచీర నేశాడు. దాని నిండా బొమ్మలున్నాయి. అది ఆమెకు నచ్చింది. చీర నేసినవాణ్ణి పెండ్లాడ్తానన్నది. రాజు కాదనలేకపోయాడు. చిన్నది మాలవాణ్ణే పెండ్లాడింది!

 

    సరె. తెల్లవారింది. కుండలు బోర్లపడ్డాయి. మాంసం వడిసింది. అడవి నుంచి కోయలు గూడానికి చేరారు. సమ్మయ్య యిల్లు చక్కగా అలికాడు. తమ వెంట తెచ్చిన ఆవుతోక-వెనక తొడల సహితంగా - చూరుకు వ్రేలాడ తీశారు. అంతా చుట్టూ చేరారు. తోకను అడిగారు - నువ్వు దేవత వైనావా అని. తోక కదిలింది అవునన్నట్లు. ఇంకేం? సమ్మయ్య భార్య దేవత అయింది. అంతా సంబరపడ్డారు. తోక విప్పారు. తొడలు వండారు. అంతా తిన్నారు.

 

    అయిపోయింది. ఇక సమ్మయ్య భార్యతో సంబంధం తెగిపోయింది. ఆమె దేవత. వీరు మనుషులు. ఆమె దిగిరాదు. తమతో కలవదు. ఇక ఆమె ఎవరికీ తల్లికాదు. ఎవరికీ భార్యకాదు. అందరికీ దేవత! అవును. ఆవుతోక ఊగింది! ఆమె దేవత అయింది. అలాగే ఉండిపోతుంది.

 

    ఒకనాటి మధ్యాహ్నం గూడెంలో గజ్జెలు గల్లుమన్నాయి. గూడెం గుండె జల్లుమన్నది. గుడిసెల్లో ఉన్న వారంతా గుమ్మాల్లోకి వచ్చి చూచారు. తలారి శివడు బల్లెం గజ్జె గల్లు మనిపించుకుంటూ గూడెంలో ప్రవేశించాడు. అందరి ప్రాణాలు గడగడ లాడేయి. మళ్ళీ ఏదో మూడింది. మళ్ళీ ఎవడో వస్తున్నాడు. వచ్చేవాడికి ఏం కావాలో? అడవి ఆకులు రాల్చేసింది. ఎవడన్నా వేటకు వస్తున్నాడేమో! అదీ వారికే కష్టం. డప్పులతోనూ, కొమ్ములతోనూ పులిని రొప్పాలి. దాన్ని "దొర" ముందుకు తెచ్చి పెట్టాలి. అప్పుడు ఆయన తుపాకి వేస్తాడు. చచ్చిన పులి పక్కన నుంచొని ఫోటో తీయించుకుంటాడు. ఇంకెన్నెన్నో ఊహలు వచ్చాయి తలారి శివణ్ణి చూచి.

 

    శివడు సమ్మయ్య ఇంటికి చేరాడు. సమ్మయ్య మంచంలో కూర్చొని ఆకు చుట్ట చుట్టుకుంటున్నాడు. శివడు యమునిలా కనిపించాడు. అయినా పిలిచి కూర్చోబెట్టాడు. పొగాకుకాడ అందించాడు. ఇంట్లోంచి నిప్పు తెచ్చాడు. వ్యవహారం ఏమిటని అడిగాడు.

 

    శివడు చాలా ఏకరవు పెట్టాడు. తాసిల్దార్ బంగళా కడ్తున్నాడు. బంగళా అంటే అటువంటి ఇటువంటిది కాదు. పట్నంలో జగీర్దారు బంగళాను తలతన్నింది. పట్నం నుంచి పనివాళ్ళు వచ్చారు - పని చాలా అడావుడిగా నడుస్తూంది. వందలమంది పనిచేస్తున్నారు. చూచి తీరాలి, సంబరం చూడ్డానికే వస్తున్నారు జనం!

 

    అతడు చెపుతుంటే నోళ్ళు తెరచి వింటున్నారు జనం. శివడికి ఉషారు ఎక్కువైంది. మరీ మరీ చెప్పసాగాడు. అతడు చెప్పిందంతా వింతగా విన్నారు. పాము నాగస్వరాన్ని చూచి తల ఊపినట్లు ఊపారు. అసలు విషయానికి వచ్చాడు శివడు. గుడి బద్దలుకొట్టాలి. దాని స్తంభాలు తాసిల్దారు ఇంటికి చేరవేయాలి. ఊళ్ళో వున్న హరిజనులు పనికిరారన్నాడు గిర్దావరు. వారు తాకుతే దేవాలయం అపవిత్రం అవుతుందన్నాడు. కాబట్టి కోయగూడాలు తరలిపోవాలి. ఆ స్తంభాలు తాసిల్దారు భవనానికి చేర్చాలి. ఆ పనిమీద వచ్చాడు శివడిప్పుడు.

 

    "ఏమె శివన్న గూడెందుకు కూల కొడ్తాండె దొర" అడిగాడు సింగన్న.

 

    "అగ్గొ గదంత నాకేమి ఎరకైతది? దొర తల్చుకున్నడంటే గుడేంది గుట్టల్నె కూలగొడ్తడు. సరేగాని ఎప్పుడెల్తరు?"

 

    "ఏమొ ఎట్లెల్లుతమే కూనలను (పిల్లలను) పెట్టలను (ఆడవారిని) ఇడిచి రావాలెగదనె"

 

    "ఎళ్ళాలె, ఎళ్ళాకుంటె తుపాకితో కాల్చి చంపుతనన్నడు దొర."

 

    కోయదొరలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. గుండెలు గుబగుబలాడేయి. మనసుల్లో ఏవేవో మసిలాయి. కాని మాట ఒక్కరినోటా వెళ్ళలేదు.

 

    "ఎన్ని రోజులు పడ్తదంటావ్" సింగన్న ప్రశ్న.

 

    "ఎట్లెరికైతది? గుడి కులాలె. తంబాలు చేరాలె. బంగ్లకు ఎక్కాలె. నా కింత సాన పనున్నది. కింది గూడెం పోవాలె. కోయ గూడాలన్నిటికి పోవాలె. మందిని తోల్కరావాలె. తయారుండండి తోల్కపోత" తలారి శివడు ఇక ప్రశ్నలు వేయవద్దన్నట్లుగా చెప్పాడు.

 

    ఆ రాత్రి కోయగూడెంలో గడిపాడు శివడు. అతనికి అతిథి సత్కారం జరిగింది. తెల్లవారి వెళ్ళిపోయాడు. మిగతా కోయగూడాల జనాన్ని తీసుకొని రావడానికి.

 

    కోయగూడెపు జనం ప్రయాణానికి సిద్ధం అవుతూంది. అడవి నుంచి కాయగసరు తెచ్చుకున్నారు. గింజలు కట్టుకున్నారు. మూటా ముల్లె సర్దుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు. సమ్మయ్యను గూడెం రక్షణకు ఉంచడానికి నిర్ణయం అయింది.

 

    కోయలు గుంపులు గుంపులుగా కోయగూడెం చేరారు. కింది గూడెం వారూ వచ్చారు. కాని సింగి రాలేదు. సింగన్న ఖిన్నుడైనాడు. సింగిని గురించి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రి కోయగూడెం కిటకిట లాడింది. ఎక్కడ చూచిన జనమే. ఎక్కడు చూసినా మనుషులే. అది మానవసాగరం. ఆ రాత్రి సంబరాలు సాగేయి. అంబరాలు అందుకున్నారు. సింగన్న సంబరాల్లో చేరలేదు. వంటరిగా బండిమీద కూర్చున్నాడు. చుక్కలను చూస్తూ ఉండిపోయాడు. అతనిలో ఏవేవో జ్ఞాపకాలు తరంగాలు పొంగాయి. ఒంటరిగా గడిపాడు ఆ రాత్రి. దాన్ని జనం పట్టించుకోలేదు.

 

    కోడి కూసింది. జనమంతా ప్రయాణానికి సిద్ధం అయినారు. తలల మీద మూటలతో బయలుదేరారు. కోయల గుంపులు గూడెం దాటాయి. గుంపులు బారులైనాయి. అది అడవిబాట. కాలిబాట. ఒక్కొక్కడే నడవాలి. ఒకని వెనుక ఒకడు. వందలు, వేలు బారులుగా సాగుతున్నారు. చీమలబారు సాగుతూంది. మాటలు, ముచ్చట్లు, మంచీ చెడ్డా, అడుగులు పడుతున్నాయి. బాట సాగుతూంది. మానవ కుడ్యం నడుస్తూంది. గూడెం దూరం అవుతూంది. గమ్యం దగ్గర పడుతూంది.

 

    సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. పిట్టలు గూళ్ళకు చేరుకుంటున్నాయి. కోయలు గూళ్ళు వదలి గమ్యం చేరారు. ఊరిబయట గుడి. గుడికి దూరంగా చింతోపు. అందులో విడిశారు గుంపులు. గూడాలున్నబట్టి విడిపోయాయి. నెగళ్ళు వెలిగాయి. ఇక్కడ కర్రలు లేవు. ఇది అడవికాదు. ఆ పుల్లా ఈ పుల్లా ఏరుకొచ్చుకోవాలి. నీటిని బాసిన చేపల్లా తల్లడిల్లారు. అడవిని చూసిన కోయదొరలు. ఇది బయలు ప్రాంతం. కనుచూపు మేరలో చెట్టు కనిపించదు. అంతా మట్టి. నల్లని ఎర్రని మట్టి. అక్కడక్కడా రాళ్ళు. చెట్టులేదు. వెచ్చదనం లేదు. స్వేచ్చలేదు ఏదీ దొరకదు. అన్నీ కొనాలి. అడవి అతని జీవితంతో పెనవేసుకుంది. అది లేదిక్కడ. అతని ప్రాణాలు విలవిల్లాడాయి. బలం వచ్చింది. ఉత్సాహం లేదు. కాని ఏం చేయగలడు?

 Previous Page Next Page