తూరపు సింధూరం సింగారించుకుంది. ఎర్రవారి తెల్లవారింది. ఆటలు పాటలు ఆగిపోయాయి. కోయగూడెంవారు ప్రయాణం అవుతున్నారు. కొందరు శలవు తీసుకుంటున్నారు. కొందరు వీడ్కోలు చెపుతున్నారు. రెండు గూడాలవారు గూడెం దాటారు. కింది గూడెంవారు నిలిచిపోయారు. కోయగూడెం సాగిపోతూంది.
కింది గూడెం గూడెంలో దూరింది. సింగి మాత్రం అక్కడే నిలిచింది. సింగన్న భుజానికి తుపాకి తగిలించుకొని సాగిపోతున్నాడు. మనసు కాదు, మనిషి సాగిపోతున్నాడు. వెనకనుంచి ఏదో లాగుతూంది. కళ్ళెం పట్టుకుని లాగుతూంది. వెనక్కు తిరిగాడు! సింగి అక్కడే నిలిచి ఉంది. అతని కాళ్ళకు బంధాలు వేసింది. అతడు చూచాడు. ఆమె చూచింది. ఇద్దరి కండ్లూ చెమ్మగిల్లాయి! బలవంతంగా వెనక్కు తిరిగాడు. పది అడుగులు వేశాడు. సింగి ఉరికింది. ఒక బండ ఎక్కింది. చూడసాగింది. సింగన్నకు మరి అడుగు ముందుకు పడలేదు. వెనకకు తిరిగి చూచాడు. బండమీద సింగి కన్నీరు జల జలా రాలుస్తూంది. గుండె ముందుకు ఉరికింది. తాను అక్కడే నిలిచాడు. ఎంతసేపు నిలిచాడో! అతని కళ్ళుకాదు -గుండె ఏడ్చింది. మగవాడు ధైర్యం చేశాడు. వెనక్కు తిరిగాడు. సాగిపోయాడు.
సింగి చూపందినంతసేపు జూసింది.
నిట్టూర్చింది.
కళ్ళు తుడుచుకుంది.
గూడెంలోకి ఉరికింది.
ఇల్లుచేరి తల్లిని చూస్తే సింగన్న గుండె చీలమండల్లోకి దిగింది. ఇంటి ముందు ఎముకల గూడులా కూర్చొని వుంది. మనిషిలో ఎక్కడా రక్తం వున్న జాడలేదు. పాలిపోయింది. అడుగుల చప్పుడు విని అటు చూచింది. కొడుకు తన కొడుకు. జీవం సాంతం కళ్ళలో కేంద్రీకరించి కొడుకును చూచింది. ఆ చూపుతోనే గుండె పగిలింది సింగన్నకు. చూపు నిర్జీవంగా ఉంది. కళ్ళలో ఏదో నిరాశ గూడుకట్టుకుంది. ఆ చూపుతో సింగన్న కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమిటి? ఏమైంది తల్లికి? ఒక్కరోజులోనే ఇంతగా మారిపోయిందేం? ఏమి అవుతుంది? ఏమి కానున్నది? అతనికి ఏమి తోచలేదు. పాపం అమృతం నింపుకొని వచ్చాడు! అంతా హాలాహలంగా మారింది.
"అవ్వా!" ఒకటే మాట తల్లి ఒడిలో వాలిపోయాడు. తల్లి తల నిమిరింది. కొడుకు కళ్ళల్లోకి చూచింది. ఇద్దరి కళ్ళూ చెమ్మగిల్లాయి. అలా కొంత చూసింది. కళ్ళు తుడుచుకుంది. "ఎందుకుర గట్ల గుండె పగిల్తివి? ఏమైందిరా నీకు?" అని కృతకం అయిన చిరునవ్వు నవ్వింది. తనకున్న బాధంతా దాచుకోవాలనుకుంది. కొడుకు బాధపడరాదనుకుంది.
"పాన మెట్లున్నదే?"
"బాగున్నది గద" మళ్ళీ ఒక నవ్వు నవ్వింది. ఆ నవ్వు భయంకరంగా వుంది.
కుందేళ్ళు భుజాన వేసుకొని సమ్మయ్య వచ్చేశాడు. తల్లీ కొడుకులను చూచాడు. కుందేళ్ళు కింద పడేసి.
"ఉస్స్! ఏందో టక్కున వస్తివి. అవ్వకాడ కొచ్చి అట్లెయిన వేందిర?" అడిగాడు.
పాప ఇంట్లో ఏడ్చాడు. తల్లి సింగన్నను పక్కకు నెట్టి లేచి నుంచుంది. ఎముకలు గలగల మన్నాయి. గుడిసెలోనికి వెళ్ళిపోయింది.
తండ్రీ కొడుకులు ఒకరిని ఒకరు చూసుకున్నారు.
పాప ఏడుస్తున్నాడు. తల్లి చన్ను కుడిపింది. అందులో రక్తమే లేదు. పాలెలా వస్తాయి? పాప ఏడుపు మానలేదు. సమ్మయ్య గూడెంలోకి వెళ్ళాడు. ఒక అమ్మను తెచ్చాడు. ఆమె పాపకు పాలిచ్చింది. పాప పడుకున్నాడు.
సమ్మయ్య భార్య అలాగే లేచింది. కుందేళ్ళు వండింది. పెట్టింది. తండ్రి కొడుకులు తింటుంటే తన్మయురాలై చూచింది. వారి డొక్కలు నిండగా తన గుండె నింపుకుంది. వళ్ళంతా నొప్పులు. ఏదో అయోమయంగా ఉంది. ఏదో బాధ. బాధ ఎలాంటిదో చెప్పరావడంలేదు, పోయి పడుకుంది. తండ్రీ కొడుకులు తలలు పట్టుకొని బయట కూర్చున్నారు. పొరుగింటి అమ్మ వచ్చి కళ్ళలో పసరు పోసింది. మరొక తల్లి ఒక వేరు నమలమంది. ఇంకొక అవ్వ వేరు పొగవేసింది. ఏదేదో వైద్యం సాగుతూంది. ఒక్కొక్కరే వచ్చిపోతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క మందు వేసి పోతున్నారు.
పచ్చి బాలెంత. వానలో తడవడమే ఇందుకు కారణం అన్నాడు సింగన్న, అంగీకరించలేదు సమ్మయ్య. తానూ అలాగే వానలో పుట్టానని తన తల్లి జెప్పిందన్నాడు. గూడెం వేటకు వెళ్ళింది. సమ్మయ్య తల్లీ వెళ్ళింది. అక్కడే ఆమెకు నొప్పులు వచ్చాయి. ఒక పొదచాటున ప్రసవించిందట. రాతితో బొడ్డు తరిగి బయటికి వచ్చిందట. ఇంతలో పెద్ద వాన. అది రెండు రోజులు విడువలేదట! ఆ వానలో అడవిలోనే ఉండిపోయారట రెండు రోజులు. బిడ్డతో సహా గూడేనికి వచ్చింది. మూడవనాడు కుంటకుపోయింది. ఆమె చనిపోయేవరకూ జర్రున చీదలేదు.
ఏమిటో అర్థం కాలేదు సింగన్నకు. అమీను మీద కోపం వచ్చింది. అయినా తనేం చేయగలడు? మింగాడు. కొంతసేపు ఎద మండింది. చల్లారిపోయింది.
సమ్మయ్య భార్య-సింగన్న తల్లి-కొద్దిగా కోలుకుంది. కళ్ళలో కాస్త ఎర్రని రేకలు వచ్చాయి. తండ్రీ కొడుకులు సంతోషించారు. గండం గడిచింది అనుకున్నాడు. కాని ఎంతో కాలం అలా ఉండలేదు. మళ్ళీ జ్వరం వచ్చింది. మంచం పట్టింది. ఈ తడవ మంచంలోంచి లేవనేలేదు. మందులేవి పనిచేయలేదు. ఏ రాత్రో ఆమె ప్రాణాలు లేచిపోయాయి.
తెల్లవారి చూచారు తండ్రీ కొడుకులు. బావురుమన్నారు. గూడెం సాంతం చేరింది. ఏడ్చింది. అడవి సైతం ఆకు రాల్చింది. అడవీ గూడెమూ బోసిపోయాయి. అందరి ముఖాలూ వెలవెల బోయాయి. అందరి కళ్ళూ చెరవులైనాయి. సమ్మయ్య భార్యను-కాదు ఆమె భౌతిక కాయాన్ని ఊరిబయటకు తీసికెళ్ళారు. కట్టెల్లో పెట్టారు. నిప్పంటించారు. కాడు సింగన్న గుండెల్లో మండింది. తల్లిని బూడిదచేసి వంటరిగా గూడానికి వచ్చాడు. సమ్మయ్య భార్యను అగ్నికి అప్పగించి వచ్చేశాడు.
మూడవనాడు కాటిమీద కుండెడు అన్నం బోర్లించి వచ్చారు. అంతే అంతటితో బంధం తెగిపోయింది. వారికి ఆత్మ, పరమాత్మలు లేవు. పునర్జన్మ సిద్ధాంతం తెలియదు. పుట్టినవాడు చస్తాడు. అంతే వారికి తెలిసింది. చచ్చినవాడు ఏమౌతాడో వారికి అనవసరం. బ్రతుకు చెట్టుకు కాసే కాయలాంటిదని వారి విశ్వాసం. కాయ కాస్తుంది. పండి రాలిపోతుంది. కొన్ని పండకుండానే రాల్తాయి. కొన్ని పసిగాయలుగానే రాలిపోతాయి. అది వారి జీవితం. అదీ వారి వేదాంతం.
గూడెం సింగన్న తల్లిని మరచింది. కాని సింగన్నకు మరుపు రాలేదు. ఆమె ఒకనాడు కలలో వచ్చింది. తనను మరచారన్నది. దూరింది. తిట్టింది. తల్లిని ఏం కావాలని అడిగాడు సింగన్న. చాలా కావాలంది. ఆవులు కావాలంది, గొర్రెలు కావాలంది. కోళ్ళు, మేకలు కావాలంది. కల్లు, సారాయి కావాలంది. సింగన్న బేరం సాగించాడు. అన్నీ సాధ్యపడవన్నాడు. ఒక ఒప్పందానికి వచ్చారు ఇద్దరూ. ఒక ఆవు, రెండు గొర్రెలు, కల్లు, సారాయి, వగైరా వగైరా అన్నీ కలలోనే జరిగాయి. అయినా వాగ్దానం చేశాడు. చెల్లించాల్సిందే తప్పదు.
సింగన్న, సమ్మయ్య సాధించారన్నీ, సంపాదించారు. దినం నిశ్చయం అయింది. దినం జరగుతూంది. గూడెం యావత్తు కూడింది. ఊరిబయటకు చేరింది. ఒడ్డె వచ్చాడు. ఒడ్డె అంటే వారి పురోహితుడు. డోలువాడొచ్చాడు. ఊరు బయట ఒక చెట్టు. చెట్టుకు ఒక కొమ్మ. కొమ్మకు ఒక గురిగి, గురిగిలో ఒక ఇనుపముక్క. అది వారికి దేవత. ఆ ఇనుప ముక్కు ఎప్పుడొచ్చిందో వారికి తెలియదు. గురుగులు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
ఒడ్డె చెట్టెక్కాడు. కొమ్మకు చేరాడు. గురిగిని తీసుకొని దిగాడు. గురిగిని పగలకొట్టాడు. ఇనుపముక్క తీశాడు. పసుపు కుంకుమతో పూజచేశాడు. సూర్యుడు క్రుంగాడు. ఆవు తెగింది. గొర్రెలు తెగాయి. ఆ రక్తంతో పడమర ఎర్రబారింది. ఇంతలో నల్లవారింది. నెగళ్ళు వెలిగాయి. మాంసం కాలింది. ఆవుతోక వెనుక తొడలు వేరుంచారు. కాలిన మాంసం, సారాయి, కల్లు శికుమారుని శివం, ఒడ్డెవాని పదాలు, డోలు సూరయ్య డోలు. తాగుడు. తాగుడు. సమ్మయ్య భార్యను మరచాడు. సింగన్న తల్లిని మరచాడు. అంతా ఎగురుతున్నారు. అంతా ఆడుతున్నారు, పాడుతున్నారు.
డోలు సూరయ్య డోలు, మ్రోగుతూంది. అతడు కథ చెపుతున్నాడు. ఎప్పుడూ చెప్పేకథే, కోయ దొరల కథే. అయినా కొత్తదనం కనిపిస్తూంది.అప్పటికీ ప్రశ్నలేస్తుంటారు! ఆ కథ తెల్లవార్లూ సాగాలి.
చో ఓ ఒ ఓ ఒ ఓ
రెండు బండల సందునా
రేల చెట్టు కన్పించెను
రేల చెట్టు నానుకొనీ
నీరు జల జల పారెను
అప్పుడు పాటల మొదటి పదం పుట్టింది.
జలా రేల రేలా రేల
రేలా రే జలా రేల
ఒక ఎదురులంక. అందులో ఒక తెలగది. దానికి కడుపైంది. చేసినవాడు ఎవడో తెలియదు. పరువు దక్కించుకోవా లనుకుంది. అడవిలో కన్నది మగ బిడ్డను. వదిలేసింది. వెళ్ళిపోయింది. బిడ్డ పెద్దవాడైనాడు. పదహారేండ్ల వాడైనాడు. కొబ్బరి బొండాంకు కట్టె ఇరికించాడు. గుర్రపు వెంట్రుకలు కట్టాడు. ఒక బాణం లాంటిది తయారుచేశాడు. దానికీ గుర్రపు వెంట్రుక కట్టాడు. వాద్యం అయింది. కిన్నెరా అయింది. వాయించసాగాడు. అతడు కిన్నెరుడైనాడు. అతడు చెట్టెక్కాడు. వాద్యం వాయిస్తున్నాడు. దాహం తీర్చుకున్న రాజకుమారులు, కోయదొరలు - వాద్యం విన్నారు. అది బాగనిపించింది వారికి. వాణ్ణి తమ వెంట రమ్మన్నారు! వారు దొరలు. రాజులు. తప్పుతుందా! కిన్నెరుడు వారి వెంట సాగాడు. వాద్యాలు మ్రోగుతున్నాయి. దొరలు సాగుతున్నారు. వాద్యాలు దొరికాయి. వాద్యగాండ్లు దొరికారు. కాని దేవుదేడి? దేవతలేరీ? దేవుని కోసం వెదుకుతూ బయలుదేరారు దొరలు. ఎన్నో దేశాలు తిరిగారు. గోదావరికి ఆవల- శబరికి ఈవల-రొట్టగొట్టి దేశం చేరారు. అక్కడ వారికి ఒక పెద్ద పుట్ట కనిపించింది. దాని ప్రక్కన ఎండ్రకాయ కనిపించింది. అది వారిని చూచింది. పుట్టలోనికి దూరింది. అదే దేవుడనుకున్నారు వారు. దాన్ని పట్టాలనుకున్నారు. గోదావరి నుంచి నీరు తెస్తున్నారు. పుట్టమీద పోస్తున్నారు. మూడు వారాలు పోశారు. అందులోంచి కాకేటి పూజార (పూజారి) పుట్టాడు. అతని వంటినిండా లింగాలు. అతణ్ణే దేవుడనుకున్నారు. అతనికి మొక్కారు. వాద్యాలతో పాడారు. అతనిని కార్తించారు. తాను దేవుణ్ణి కాదన్నాడు కాకేటి పూజర. తాను పూజర నన్నాడు. అతడు వారికి ఒడ్డె అయినాడు. అతణ్ణి తీసుకొని బయలుదేరారు. గుర్రాలమీద సాగారు. వాయువేగ, మనోవేగాలతో ఉరికారు. సముద్రపు ఒడ్డుకు చేరారు. సముద్రం దాటాలి. ఏం చేయాలి? అంత విచారంగా కూర్చున్నారు. వారిని ఒక తాబేలు చూసింది. అది చాలా పెద్దది. వారి దగ్గరికి వచ్చింది. ఎందుకు విచారపడుతున్నారని అడిగింది. చెప్పారు. తాను దాటిస్తానన్నది ఒక్కొక్కరినే గుర్రాల సహితంగా దాటించింది.