Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 27


    మీరు మారరూ??
    
    ఈ అసహ్యమైన, లేకితనంతో కూడిన గోలనుంచి బయటపడటానికి ప్రయత్నించరూ?
    
    ఇహ మహానుభావులారా, పురుష సింహాల్లారా, మిమ్మల్ని మీరు హీరోలను చేసుకునే అల్పాగ్రేసురులారా మీ జోలికి వస్తున్నాను.
    
    ఎంత చౌకబారు, కఠిననత్వంతో కూడిన ఆలోచనలు మీవి!
    
    మీలో చాలామంది నా దగ్గరకు వచ్చారు.
    
    "నా భార్య నాకు తగని మనిషి అందుకే నేను..." అని ఓ రక్షణ కవచంతో మీ సొద ప్రారంభిస్తారు.
    
    నాయనా! ఏం తగదు?
    
    పెళ్ళికిముందు ఆమెను చూసుకోలేదా? ఆమె పొడుగూ, పొట్టీ, ముఖకవళికలు, కళ్ళు, నోరు, ముక్కు, తెలుపు, నలుపు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకోలేదా? పెళ్ళి చూపులతో పైనుంచి కిందిదాకా తెగ పరిశీలించావే. అప్పుడీ లోపాలు కనబడలేదా?....ఇహ మనసు...?
    
    అది నీవనుకున్నట్టుగా లేదు.
    
    ఒక ప్రశ్న.
    
    ఎందుకు వుండాలి?
    
    అసలు నీవెవరో పెళ్ళిసంబంధం ప్రస్తావన వచ్చేదాకా ఆమెకి తెలియదు. నీలో ప్లస్ లూ, మైనస్ లూ ఏమిటో ఆమెకు తెలియవు. మనం ముందు ఫిజికల్ గా ఆలోచిద్దాం. కాలేజీలో చదువుకుంటున్నప్పుడో, కొన్ని కొన్ని ఫంక్షన్స్ కు హాజరైనప్పుడో ఆమె ఎంతోమంది చక్కని యువకుల్ని చూసివుంటుంది. నా భర్త ఇలా వుంటే బాగుండును అన్న స్పందన పాపం, ఆ లేత వయసులో ఆమెకు కలిగివుంటుంది. కొంతమందితో ఆరోగ్యకరమైన చిన్నచిన్న పరిచయాలు వుండివుండవచ్చు. మానసికంగా నువ్వు మొదటివాడివి కావాలన్న పిచ్చి నిబంధన ఏమీలేదు.
    
    ఆమె మనసు ఆమె సొంత సామ్రాజ్యం.
    
    అయినా నిన్ను చేసుకుంది.
    
    ఎందుకో తెలుసా?
    
    భావిజీవితం, ఓ సుందరస్వప్నంలా భాసించాలని ఆమె ఆశించింది. అలా ఆశించటం తప్పా? ఆశించే హక్కు ఆమెకు లేదా? తప్పకుండా వుంది. అయినా ఆమె స్వప్నాలను నిజంచేసే వరుడు ఆమెకు లభించలేదు. కొంతమందికి వయసు మించిపోతుంది. పరిచితుల ఎత్తిపొడుపులు భరించలేకపోతోంది ఇంట్లోని వారికి భారం కావటం తట్టుకోలేకపోతోంది. కాలంమారింది. నాగరికత మారింది. అయినా చాలామందిలో ఆటవిక మనస్తత్వం మారలేదు. పెళ్ళయిన వారిని చూస్తోంటే తనకు కాలేదే అన్నబాధ...
    
    అందుకని... నువ్వు తన అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఆమె నిన్ను పెళ్ళి చేసుకుంది.
    
    రూపం, హోదా....ఇవన్నీ ఆమె ఆశించిన స్థాయిలో లేకపోయినా, మిగతా కొన్ని మంచిగుణాలు నీలో చూసి సంతృప్తి పడాలని ఆరాటపడింది.
    
    మొదట.... ఆ మైకంలో నీ గుణాలు తన కనుగుణంగా వున్నాయని భావించింది.
    
    కాని ఆ మైకం ఎక్కువకాలం వుండదు. నీలో ఎన్నో బలహీనతలున్నాయి.
    
    ఇతర స్త్రీలను చూసి చలించే గుణం.
    
    ఇది సహజం. అనాదినుంచి, ఋషుల దగ్గర్నుంఛీ సామాన్యులదాకా ఈ బలహీనత వున్నదని నీ భావన. అంత తప్పేమీకాదని (తప్పు చేస్తోన్నది నీవుకబట్టి) నీ నమ్మకం, బలహీనత వుంటే వుంది. తనకేమీ అన్యాయం చేయటం లేదుగా, బాగానే చూసుకుంటున్నాగా అని నీ అభిప్రాయం.
    
    చలించటం తప్పుకాకపోవచ్చు. కోరిక వుండటం అసహజం కాకపోవచ్చు. కాని వాటిని ఆచరణలో పెట్టి, ఏవేవో రూపాలు ధరించటం ఆక్షేపణీయం కాదా?
    
    ఎవరు నువ్వు?
    
    ఓ పురుషుడివి అనేక ఉన్మాద వారసత్వాలు పుణికి పుచ్చుకున్న ఓ మగాడివి.
    
    నీలో ఎన్నో ద్వంద్వ ప్రవృత్తులున్నాయి.
    
    నీలో చాలా స్వార్ధముంది.
    
    నీలో చాలా అహంకారముంది.
    
    నీలో చాలా తిక్కవుంది.
    
    చూడు! నీవు పూర్తిగా నిజం చెపుతున్నావా? నువ్వు చెప్పే ప్రతి అక్షరమూ ఆత్మవంచన లేకుండా రూపం దిద్దుకుంటున్నదా?
    
    ఒక సత్యం గమనించు. నువ్వు అనుకునేటంత మంచివాడివి కాదు నువ్వు.
    
    అలా అని దుర్మార్గుడివి కాదు.
    
    నీ ప్రవర్తన నీకో రక్షణ కలిగించుకోవాలి. లేకపోతే నీ ఉనికి దెబ్బతింటుంది. నీ మనుగడ అస్థిరమవుతుంది. అందుకని నీ పర్సనాలిటీని రకరకాలుగా మలచుకుంటున్నావు.
    
    నీకు భార్యమీద ప్రేమ వుంది. ఆమెకోసం చాలా చేస్తున్నావు. చాలా చెయ్యటంలేదు కూడా. ఆ రెండో సత్యాన్ని జీర్ణించుకునే ధైర్యం నీకు లేదు.
    
    ఆమెగురించి నువ్వు కష్టపడుతున్నావు. కాని అంతకన్నా ఎక్కువ కష్టపెడుతున్నావు కూడా.
    
    ఆమె నువ్వు చెప్పినట్లు కాల్చుకుతినటం లేదని నేనటంలేదు. నిన్ను చాలా సందర్భాల్లో అనుమానించటంలేదని నేననటం లేదు.
    
    (బహుశా) దానికి కారణం నువ్వే!
    
    ఆమె నిన్ను అనుమానించకుండా వుండేటట్లూ, అనుమానించినా బయటపడకుండా వుండేటట్లూ నీ గాంభీర్యాన్ని, ఔన్నత్యాన్నీ, పర్సనాలిటీనీ నిర్మించుకోలేక పోయావు. నీ బిహేవియరిజంలో ఎక్కడో చిన్న లోపముంది. అందుకనే ఓ అపరాధిగా ఆమెకు దొరికిపోతున్నావు. ఆ ముద్రనుంచి బయటపడలేకపోతున్నావు.
    
    సరే, ఆమె నిన్ను ఇబ్బంది పెట్టింది. పెడుతూనే వుంది.
    
    ఏంచేస్తావు? అనుక్షణం తిడుతూ, తిట్టుకుంటూ, పిల్లల ముందూ, ఇరుగుపొరుగు వారి ముందూ తేలికైపోతూ, అల్లరిపాలైపోతూ ఏమైనా సాధించగలవా?
    
    కొట్టి, తన్ని, హింసించి, ఏమైనా సాధించగలవా?
    
    ఒకప్పుడు మనకో సంప్రదాయం వుండేది. కుటుంబపెద్ద లేక భర్తను ఓ విశిష్టవ్యక్తిగా పరిగణించటం భార్య అతనికి భయపడుతూ చాలా ప్రశ్నలు తనలోనే దాచుకుంటూ వుండటం. అతన్ని చాలా అడగలేకపోవటం అయినా సమయమొచ్చి నప్పుడు అతను మనస్ఫూర్తిగా చర్చిస్తూ వుండటం, ఆమెకోసం ప్రాణం పెట్టటం, బహుశా భర్త, భార్య అనే పదాలకు అవి ఆరోగ్యకర నిర్వచనాలేమో (నన్ను చాదస్తున్ననీ, మూర్ఖుడిననీ అనుకోకండి నేను రాసే ప్రతివాక్యమూ ఆలోచించి ఆలోచించి మదిస్తూ రాస్తున్నాను)!
    
    మ్యూజింగ్స్ లో ఒకచోట చలంగారంటారు 'స్త్రీల మీద అనుక్షణం జాలిచూపిస్తూ వితంతు వివాహాలూ, ఇత్యాదుల్ని ప్రోత్సహించే ఈ సోకాల్డ్ త్యాగమూర్తుల కన్నా పూర్వాచార వలయాల్లో పరిభ్రమించే పురుషమూర్తులే ఎక్కువ న్యాయం చేస్తున్నారేమో!'

 Previous Page Next Page