Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 26


    ఎక్కడో ఒక్కచోట... "బహుశా... నా దృక్పథంలో పొరపాటు వున్నదేమో....?" అన్న చిన్న మెరపుని ప్రశాంత హృదయంతో ఆహ్వానించండి.
    
    మీరు మానవులు అ మెరుపు తప్పకుండా కనిపించి తీరుతుంది. అది సందర్శించే హక్కు మీకు వున్నది గనుక.
    
    మిమ్మల్ని ఒక్కొక్క ప్రశ్నా అడుగుతున్నాను.
    
    మీరు ఏది పొందుతున్నారో, దాన్ని గమనించటం మానేసి, దానికి తక్కువ ప్రాముఖ్యాన్నిచ్చి పొందలేని వాటికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తున్నారు అవునా?
    
    అంటే...?
    
    ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు సంతోషం కలిగించేదేదో అది వదిలేసి, అర్హత లేనిదీ, సాధ్యంకానిదీ అయిన వేరే ఛానెల్ ను అందుకోవటానికి అర్రులు చాస్తూ దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట!
    
    చూడండి. మీరు ఉద్యోగినీ, సంపాదనాపరులూ కాకపోయి వుండవచ్చు. భర్త సంపాదన మీద ఆధారపడి వుండవచ్చు. ఈ దేశంలో ఇది సహజమే. ఇందులో న్యూనత ఏమీలేదు. కాని ఆ ఆధారపడటం ఆర్ధికం వరకూ, మిగతా కొన్ని విషయాల వరకూ సమంజసమేగాని, ఓ అర్ధంలేని హక్కుగా, ఎవరికోసం చేస్తావు? అని భర్తని నిలదీసే శాసనంగా దుర్వినియోగం కాకూడదు.
    
    చాలా చిన్న విషయాలు.... ఇంట్లోనే ఓ వస్తువు- ఫ్రిజ్, మోటార్ చెడిపోవటం, గ్యాస్ సిలిండర్ అయిపోయి సకాలంలో రాక ఆందోళన కలిగించటం.... వీటికి పరిష్కారం అతనికి ఒక్కడికే పట్టిందా? కుదరకపోతే నేరగాడైపోవాలా? బాధ్యత తీసుకుని ముందుకు దూసుకెళ్ళి అలాంటివి పరిష్కరించుకోవచ్చే!
    
    మీరు తలుచుకుంటే, అది 'మీ పనికూడా' అనుకుంటే అలాంటి సహకారం అందివ్వగలిగితే, ఆ సహకారం అతనికెంత రిలీఫ్ ఇస్తుందో తెలుసా?
    
    మీకు ఒంట్లో బావుండలేదు. నిజంగానే సుస్తీ చేసింది. అతను మిమ్మల్ని మీరనుకున్నంత స్థాయిలో, అంత వేగంగా డాక్టర్లదగ్గరకు తీసుకెళ్ళకపోతే వెంటనే అతన్ని అపరాధిని చేసేయకండి. అనేక కారణాలవల్ల అతనికి కుదిరి వుండకపోవచ్చు. అంతేకాని మీరంటే శ్రద్ద లేకకాదు. నిర్లక్ష్యం వల్లా కాదు. హాస్పిటల్ కు మీరంతట మీరు వెళ్ళగలిగే స్థితిలో వున్నప్పుడు 'ఎందుకు రాడు?' అని శాసించకుండా 'నేను వెళ్ళగలను' అనుకుని అలా చేస్తే ఎంత హాయిగా వుంటుంది!
    
    వాదాలు వదిలేయండి. అల ఆని మిమ్మల్ని మీరు వ్యక్తిత్వరహితంగా చంపుకోకండి. ఇది అసహ్యకరమైన రాజీకాదు. సంస్కారంతో కూడిన మధ్యమ మార్గం. మీ మధ్యమామార్గంలోంచి ఆరోగ్యకరమైన 'భార్యభర్తలు' ఆవిర్భవిస్తారు.
    
    ప్రతిదానికీ నా భావన, నా బాధ, నా అభిరుచి, నా గాయం 'నేను-నేను-నేను' అనుకుంటూ పోతే...?
    
    దూరం ఇంకా ఇంకా పెరుగుతూ వుంటుంది. ఒక్కసారి ప్రపంచచరిత్ర అవలోకించండి. రాకుమారి స్థాయిలో వున్నవారు, సినీసామ్రాజ్యాన్ని ఏలినవారు, ఆలోచనా సరళి సరిగా లేకపోవటంచేత జీవితాలు సర్వనాశనం చేసుకున్న నిజం మీకు తెలీదా?
    
    ఎంతమంది ప్రఖ్యాతులు, నిజంగా మేధావులు, ఎంతో ఔన్నత్యం కలవారు, ఒక అస్పష్ట క్షణంలో తీసుకున్న విపరీత నిర్ణయాల వల్ల జీవితంలో ఎలా ఛిన్నాభిన్నమైపోయారో గమనించండి.
    
    నా చుట్టూ వున్న సన్నిహిత ప్రపంచంలో నుంచి ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను. హృదయవిదారకమైనవి ఎన్నో మీముందు వుంచగలను. కాని ఎవరిపేర్లూ ఉదహరించగల హక్కు నాకు లేదు.
    
    రోజుకి కొన్నిక్షణాలు ఒంటరిగా కూర్చోండి. మీ ఇంట్లోని ఓ గదిని, వీలుకాకపోతే మీరు కూర్చునే కుర్చీని తాత్కాలికాశ్రమంలా చేసుకోండి. మీరో ఆశ్రమంలో వున్నారనుకోండి. కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు చూసుకోండి.
    
    ఆ స్థితిలో.... ఆ అల్ఫా స్టేజిలో...
    
    పౌరుషం ఎంత పనికిరానిదో, ఎదుటివారి మీద తప్పులు నెట్టటం ఎంత కఠినమైన తత్వమో...
    
    'ఓవర్ థాట్' మీ జీవితాలకు ఎంత చెరుపు చేస్తున్నదో.
    
    మీలో వున్న మహోన్నత మానవతా దృక్పథాన్ని 'ఎక్కడ' మిస్ అయిపోతున్నారో,
    
    పరిస్థితులను బట్టీ క్షమించే గుణాన్నీ, క్షమించే అవసరాన్నీ ఎందుకు అందుకోలేక పోతున్నారో.
    
    కొంతమంది అతి సామాన్యులు (మీ దృష్టిలో) ఎలా సుఖంగా వుండగలుగుతున్నారో.
    
    ఎదుటివారినుంచి పొందిన మంచిని మీ గమనిక లేకుండా ఏ విధంగా పక్కకి నెట్టేస్తున్నారో.
    
    పనికిమాలిన చిన్న విషయాలకు అనవసర ప్రాధాన్యమిచ్చి ఎలా మీ ఉదాత్తతను చంపేసుకుంటున్నారో.
    
    మీరు సంతోషాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారో.
    
    అక్కర్లేని దుఃఖాన్ని ఎంత తేలిగ్గా ఆహ్వానిస్తున్నారో.
    
    నిరంతరం 'చస్తాను... చచ్చిపోతే బావుండును' అన్న భావనలతో ఎలా మీ బ్రతుకును హాస్యాస్పదం చేసేసుకుంటున్నారో.
    
    మీ అల్లరితో, గోలతో ఇతరులకు ఏ విధంగా కాలక్షేపమవుతున్నారో.
    
    ప్రేమ ఇవ్వకుండా 'నేను ప్రేమించబడాలి. నేను ప్రేమించబడాలి' అన్నకోరికతో ఎలా మగ్గిపోతూ, మిమ్మల్ని మీరు నిర్వీర్యం చేసేసుకుంటున్నారో.
    
    సెల్ఫ్పిటీతో ఎలా దగ్ధమైపోతున్నారో...
    
    ప్లీజ్! ఆలోచించండి మీరు మీకు కావాలి. వాదాలు వద్దు. మీరు మీకు కావాలి. మీ భర్తకోసం కాదు, మీకోసం మీరు కావాలి. మీ పిల్లలకోసం, మీ కుటుంబంకోసం, మీ అభిలాషల సాధనకోసం, పరిపూర్ణతలోని ఆస్వాదన కోసం మీరు మీకు కావాలి. భర్త మీది వైరుధ్యంతో మిమ్మల్ని మీరు పోగొట్టుకునే హక్కు మీకు లేదు!
    
    భర్త మీ జీవితంలో ఒక భాగం.
    
    చాలా ముఖ్యభాగం.
    
    కాని భర్తపాత్రనే కాకుండా మీలో మీరు పోషించవలసిన విలువలు ఎన్నో వున్నాయి.
    
    అవి కాపాడుకోవలసిన గురుతర బాధ్యత మీమీద వుంది.
    
    జీవితమంటే కలహాలూ, కల్లోలం కావు.
    
    అది చాల విలువైనదీ, ఆదర్శప్రాయమైనదీ, మీరనుకుంటున్న దానికంటే ఉన్నతమైనదీ.
    
    దాన్ని టచ్ చేయగలగండి.
    
    ఎప్పుడు?    
    
    మీరు మారాలన్న చిన్న సంకల్పం మీలో అంకురించినప్పుడు.
    
    మీ నాడీమండలం చాలా శక్తిమంతమైనది. కంటికి కనిపించని 'చక్రాలు' అందులో నిబిడీకృతమై వున్నాయి. మీ మంచి ఆలోచన తాలుకు సాధన దాన్ని ఆక్టివేట్ చేసి మీ దృక్పథాన్ని నెగెటివ్ నుంచి పాజిటివ్ వైపు నడిపించగలదు. ఆ సమయంలో వాటిలో జనించే కొన్ని రసాయనాలు సరియైన గమ్యం అనబడే భూమ్యాకర్షణ శక్తి లేక ఇతర ఉన్నత ప్రభావాలకు ఓ లింక్ గా, కనెక్షన్ గా ఏర్పడగలదు. ఆ ఆలోచన మీలో లేక మీ చుట్టూ పరిమిత పరిమాణాల్లో కుదించుకుపోయి వున్న 'ఆరా'ను మీ జీవితాన్ని తేజస్సుతో నింపగల స్థాయిలో విస్తరింపచేస్తుంది.

 Previous Page Next Page