Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 28


    
    దీన్ని పీకి, లాగి... ఈ స్టేట్ మెంట్ లో వున్న తప్పొప్పులు విమర్శించి పారేద్దామనుకోకుండా ఆ థాట్ ని అభినందించగలగండి.
    
    అది గొప్ప థాట్. మిమ్మల్ని కుదిపెయ్యగల థాట్.
    
    థాట్ గొప్పదైనప్పుడు అది సమంజసమా, అసమంజసమా అన్న తర్కాన్ని కాసేపు పక్కకు నెట్టాలి. ఆ గొప్ప భావుకతలను కొన్నిక్షణాలు ఆస్వాదించగలగాలి. (చలంగారి చాలా భావాలతో నేనేకీభవించను. అయినా ఆ గొప్పతనాన్ని ఆస్వాదించి ఇంకో కోణంనుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాను.)    

    అంటే.... ఇక్కడో ముఖ్యమైన పాయింట్ గుర్తించండి. చాలా ముఖ్యమైన పాయింట్. ఒక ఆలోచన.... తనతో మనం ఏకీభవించినా, ఏకీభవించకపోయినా మనసు కదిలించి నప్పుడు, ఆ కదలిక కనీసం మనం ఇంకో కోణంనుంచి ఎదగడానికి దోహదం చెయ్యాలి. ఆ కదలికను మనం అట్లా ఉపయోగించుకాకపోతే మనం పశువులతో సమానమే. (పశువులకు క్షమాపణ చెప్పుకుంటూ!)
    
    ఇప్పుడు మనం సంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నాం.
    
    ఈ రోజుల్లో మనకు ఏ సంప్రదాయమూ లేదు. పండుగలొస్తే పూజలు చేసుకోవటం, పిండివంటలు చేసుకుని తినటం, బర్త్ డేలూ, మేరేజ్ డేలూ వస్తే విషెస్ చెప్పుకోవటం, పార్టీలు చేసుకోవటం తప్ప.
    
    సంప్రదాయం ఒక ఆలోచనకు నిబద్దతనిస్తుంది. పదును పెడుతుంది. మనుషులనూ, మనుషుల్లోని రాక్షసులనూ వేరు వేరుగా నిలబడేటట్లు చేస్తుంది.
    
    ఇప్పుడా నిబద్దత లేదు. నిర్వచనం లేని స్వేచ్చ క్రియాశీలత్వం లేని వ్యక్తిత్వం.
    
    ఎవరి భావాలు వారివి ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి ఇగో వారిది. ఎవరి సెల్ఫ్ పిటీ వారిది. ఎవరి స్వేచ్చాప్రియత్వం వారిది. ఎవరి గోల వారిది.
    
    నేను... నేను... నేను...!
    
    అబ్బ! ఈ పదం వింటూంటే కంపరం పుడుతోంది. తత్త్వవేత్తలంతా ఈ 'నేను'ను నిర్వచిస్తూ అలసిపోయారు.
    
    నా బాధ.
    
    నా గాయం.
    
    అహో! నా హృదయం.
    
    ఓహో! నా గొప్పదనం.
    
    నా కథ.
    
    నా చరిత్ర.
    
    నా గుండె రాపిడి.
    
    నా ప్రేమరాహిత్యం.
    
    నా సౌందర్యోపాసన.
    
    నా అంతరాత్మ.
    
    నా గోల.
    
    అవును.. ఈ 'నేను' అన్నది అసహ్యమైన గోలే!
    
    ఎదుటివ్యక్తి గురించి పదిశాతం ఆలోచించలేని తొంభైశాతం ఆలోచించి, నీ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నావు.
    
    నువ్వెంత సివిక్ వో నీకు తెలీదు. నీలో ఎంత శాడిజం వున్నదో నీకు తెలీదు. నువ్వెంత స్వార్ధపరుడివో నీకు తెలీదు. ఇవన్నీ వొదిలేసి నువ్వుకాని, నీలో లేని 'నేను' గురించి ఆలోచిస్తున్నావు.
    
    ఇప్పుడు కొన్ని సత్యాల్లోకి వద్దాం.
    
    పెళ్ళయిన తొలిరోజుల్లోనే ఆమె ఏమిటో గ్రహించగలిగావు. కానీ మెదలకుండా వూరుకున్నావు.
    
    ఎందుకు?
    
    అప్పుడు... ఆ వయస్సులో భార్యరూపంలో వున్న స్త్రీ నీకు కావాలి. నీలో ఏవేవో చల్లారాలి.
    
    ఆమెను మార్చటం, ఆమెకోసం నువ్వు మారటం చేతకాదు.
    
    విడిపోలేవు అది నీ అసమర్ధత.
    
    ఒకవేళ ఆమెకూ, నీకూ పడకపోతే, ఆమెతో నీ జీవితం చక్కగా సాగదనుకుంటే, విడాకులు తీసేసుకో, ఎప్పుడు? చాలా మొదట్లోనే పిల్లలు పుట్టకముందే ఇంకో జీవితం వెతుక్కో నీ మనసుకూ, అభిరుచులకూ, గొప్పతనానికీ తగిన అమ్మాయి దొరుకుతుందేమో అన్వేషించు.
    
    కానీ చాలా సందర్భాల్లో నీ అన్వేషణ ఫలించదు. మళ్ళీ ఎక్కడో తొందరపాటుతో కూడిన పొరపాటు చేస్తావు. ఎందుకంటే పొరపాట్లు చెయ్యటానికి అలవాటుపడిపోయావు కాబట్టి.
    
    పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకూ యవ్వనాలు అంకురిస్తూన్న దశలో, దయచేసి మీగురించి మీరు ఆలోచించే తత్వాన్ని తగ్గించుకోండి.
    
    ఒక్క సత్యాన్ని గమనించండి.
    
    ఒక మేధావి, తన మేధను స్వార్ధరహితంగా ప్రజాహితం కోసం ధారపొయ్యాలి.
    
    ఒక ఉపాధ్యాయుడు తన విద్యాసంపదను విద్యార్ధులకోసం స్వార్ధంలేకుండా ధారపొయ్యాలి.
    
    అలాగే ఓ నాయకుడు తన నాయకత్వ బలాన్ని ప్రజాశ్రేయస్సుకోసం,
    
    ఒక డాక్టరు తన పేషెంట్లకోసం,
    
    ఒక ప్రభుత్వోద్యోగి లేక ఉద్యోగి తన ఉద్యోగధర్మం కోసం,
    
    ఒక సంఘసేవకుడు సంఘంకోసం,
    
    ఒక సైనికుడు దేశం కోసం,
    
    భార్యాభర్తలు తమ కుటుంబాభివృద్దికోసం, పిల్లల భవిష్యత్తుకోసం.
    
    స్వార్ధరహితంగా (స్వార్ధరహితంగా అంటే డబ్బు సంపాదించుకోవద్దనీ, సొంత సుఖాలూ భావస్వాతంత్ర్యం పూర్తిగా చంపుకొమ్మనీ నా ఉద్దేశంకాదు. ఆరోగ్యకరమైన పరిధులు నియంత్రించుకోవాలి. ఎంతవరకూ మన గోల లేక స్వేచ్చాభావాలూ లేక అహంకారాలూ లేక డామినేషన్లూ లేక కోరికలూ లేక ఇంకా ఇంకా కొన్ని వున్మాదాలు మితిమీరకుండా చేస్తే కుటుంబజీవితం భగ్నం కాదో, ఆ పరిమితులు మీకు మీరే విధించుకోవాలి) తూచి తూచి అడుగు వెయ్యాలి.
    
    చాలా గొప్ప వ్యక్తుల, అనేక రంగాలకు చెందిన ప్రముఖుల విజయవంతమైన జీవితాలు పరిశీలించండి. వాళ్ళను గురించిన కొన్ని బలహీనతలు అందరికీ తెలిసిన విషయాకే అయినా వాళ్ళు ఎలా కుటుంబజీవితాలు విచ్చిన్నం కాకుండా చూసుకోగలిగారు.
    
    ఒక డెడ్ లైన్... ఏ లైన్ దాటితే తమ జీవితాలు ఛిన్నాభిన్నం కావో, చాలా తెలివిగా, గడుసుగా వాటికి ఉదాత్తతను కూడా జోడించి, తమ గొప్పతనాన్ని వాటిలో మిళితంచేస్తూ సమీక్షించుకోగలిగారు.
    
    మీరు ఉత్తములు కావటం అసాధ్యమని నాకు తెలుసు. ఆమె గయ్యాళిదే అనుకుందాం. ఆ గయ్యాళితనం ఏ ఉపాయంతో శాంతిస్తుందో లౌకికంగా కనిపెట్టండి. బహుశా మీ ప్రవర్తన కొంతవరకూ కారణమని గ్రహించగలిగితే, మీ ప్రవర్తన ఎలాగూ మార్చుకోలేరు కాబట్టి ఆమె ఉపశమనం పొందే ప్రవర్తనకు హద్దులు నియంత్రించుకోండి.

 Previous Page Next Page