విరిగిపోతున్న అలలా వూగిపోతూ నడుస్తుంది.
అలా నది అవతలి రోడ్డుపై అదృశ్యమైపోయింది.
ఎందుకో మెదడు పొరల్లో సన్నని అలజడి.
అది కాదు. కడుపులో ప్రేవుల్ని ఉలితో నొక్కుతున్న గగుర్పాటు. గుండెల రక్తంతో గోడమీద ఏవో అర్థంకాని అక్షరాలను రాస్తున్న అనుభూతి.
ఎందుకిలా అవుతుంది?
తనూ ఆమెలాగే కనిపించని జూలీకోసం పడుతున్న ఆందోళన యిలాంటి ఉద్విగ్నతనే గురిచేస్తుందా"
జ్ఞానం తెలీని వయసులో ఏ తల్లి ఒడికి దూరమయ్యాడో యాదృశ్చికంగా అదే తల్లిని కలుసుకుని తల్లిగా గుర్తించలేకపోయిన శ్రీహర్ష అలా నిర్లిప్తంగా నిలబడి వుండగానే పలకరించారెవరో.
"హలో"
పరిచయంలేని ఓ యువకుడు సమీపంలో నిలబడివున్నాడు.
అదీ యింత అర్థరాత్రివేళ.
"నా పేరు రాణా. ఓ దినపత్రిక జర్నలిస్టుని. అంతకుమించి శమంత్ కి స్నేహితుడ్ని."
"ఐసీ" పరిచయం పెంచుకోవడం ఇష్టంలేనట్టు ముందుకు నడిచాడు.
"ఇలాంటి అపరాత్రివేళ మీరు ఒంటరిగా తిరగడం క్షేమం కాదు."
టక్కున ఆగేడు శ్రీహర్ష.
"ఆశ్చర్యపోకండి. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చాలా విషయాల్ని రహస్యంగా శోధించే నేను మీరు ఎలాంటి బలమయిన వ్యవస్థ చేత వెంటాడబడుతున్నదీ తెలుసుకున్నాను కాబట్టే యిలా చెబుతున్నాను."
శ్రీహర్ష ఆశ్చర్యంగా చూసేడుతప్ప వివరాలు అడగలేదు.
అడగాల్సినంత అవసరం అతడికి లేదు.
కాని తనగురించి ఎంతవరకూ తెలుసో తెలుసుకోవాలనిపించింది.
"ఒక నిజాయితీపరుడయిన పోలీసాఫీసర్ని సంహరించే ప్రయత్నంలో, అతడి పక్షాన బాసటగా నిలిచి ఎందరికో శత్రువైన మీరు ఇంత నిబ్బరంగా అర్థరాత్రివేళ తరగ్గలుగుతున్నారూ అంటే మీరు సామాన్యమైన వ్యక్తికాదని నేను గుర్తించగలను."
ఇది చాలు. ఇంతకంటే తను మరేమీ వినదలుచుకోలేదు."
"ఆగండి"
అయిష్టంగా ఆగేడు వెళ్ళబోయిన శ్రీహర్ష.
"మిస్టర్ శ్రీహర్ష. మీరు మున్నీ అనే ఓ పాపని కలుసుకోవాలని ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు అవునా."
"అఫ్ కోర్స్."
"ఆ పాప రేష్మీ అనబడే ఓ మాజీ మోడలింగ్ ఆర్టిస్టు ఆధీనంలో వుందని శమంత్ చెప్పగా విన్నారు కదూ"
ఆసక్తిగా అడిగాడు శ్రీహర్ష "అజ్ఞాతంలోవున్న రేష్మీ వివరాలు మీకు తెలుసా?"
మృదువుగా నవ్వాడు రాణా "వట్టి వివరాలేకాదు రేష్మి గురించి నాకు చాలా తెలుసు" కాని మీకు పరిచయం చేయలేను. ఎందుకంటే ఒక ఆత్మీయుడిగా రేష్మి నన్ను తప్ప మరెవర్నీ కలుసుకోవడం ఇష్టపడదు కనుక.
ఆమె వ్యక్తిత్వం ఏమన్నాకానీ తను జూలీను కలుసుకుని తీరాలి. "నేను మున్నీని కలుసుకోవాలి రాణా"
"అజ్ఞాతంలోవున్న రేష్మినే కలుసుకోవడం సాధ్యంకానపుడు మున్నీని మీరెలా కలుసుకోగలరు? పైగా మీకు తెలీదు శ్రీహర్షా. మున్నీ అంటే రేష్మికి ఆరోప్రాణం."
ఆ ఒక్కవాక్యం శ్రీహర్షపై ఎంతటి ప్రభావం చూపించిందీ అంటే జూలీని అంతగా ప్రేమించే రేష్మిని కలుసుకోవాలనుకున్నాడు.
"రేష్మి ఎందుకలా అజ్ఞాతంలో బ్రతుకుతూంది."
"అదే విచిత్రం మిష్టర్ శ్రీహర్షా. తన అందంతో అసాధారణమయిన చరిత్రని సృష్టించగలిగిన రేష్మి ఏదో ఒక సమస్యలో చిక్కుకుంది. స్పష్టంగా నాకూ తెలీదు కానీ చాలా బలమయిన ఒక నేరవ్యవస్థచేత తనూ వేటాడబడుతూందని మాత్రం నేనూహించగలను."
"ఎందుకలా అనిపించింది"
"చాలారోజులనుంచి ఆమె చాలా శక్తివంతుడయిన ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ కోసం గాలిస్తుంది కాబట్టి."
నిశ్చేష్టుడయ్యాడు శ్రీహర్ష.
"నన్ను పరుచయం చేయండి."
"వ్వాట్. మిమ్మల్నా"
జవాబు చెప్పలేదు శ్రీహర్ష.
అరనిముషం నిశ్శబ్దం తర్వాత రాణా అన్నాడు ఓ.కె మిష్టర్ శ్రీహర్శా. మీరెవరు, మున్నీకోసం ఎందుకింత కలవరపడుతున్నారో నాకు తెలీదు. కానీ తప్పకుండా మీరక్కడ అడుగుపెట్టే అవకాశం కల్పిస్తాను."
"అదిచాలు. కానీ ఎప్పుడు"
"మీరు సరేనంటే ఈ రాత్రికే."
"ఈ రాత్రికేకాదు మిస్టర్ రాణా ఇప్పుడే"
"ఓ.కే" స్థిరంగా అన్నాడు రాణా "కాని మీరు అడుగుపెడుతున్నది చాలా ప్రమాదభూయిష్టమై ఓ వలయంలో కూరుకున్న యువతి యింట్లో అని గుర్తుంచుకోండి.
అతనితోబాటు నడిచాడు ప్రమాదాల్లో బ్రతకడమే అలవాటైన 'షా' ది నోటోరియస్ కిల్లర్'
* * *
రాత్రి ఒంటిగంట కావస్తుండగా విశాలమైన ఓ భవంతి ప్రాంగణంలో అడుగుపెట్టాడు శ్రీహర్ష.
ద్వారానికి కుడిపక్కగా రోషన్ టైప్ గార్డెన్. ఆవరణలో అర్థచంద్రాకారంలో ఉన్న ట్రావెర్స్ ఆర్చెస్. గోడలపై అందంగా తాపడం చేయబడ్డ గ్రే కలర్ స్టోన్స్... పరిసరాల్ని కాంతివంతం చేస్తున్న విద్యుద్దీపాలు.
"అందర్ జాయియె"
పోర్టికోదాకా తోడొచ్చిన గూర్ఖా హాలు ద్వారంవైపు చూపించాడు.
కలలావుంది.
హాలులో ప్రవేశిస్తుంటే స్వప్నంలో నుంచి యీ క్షణమే అనూహ్యమైన వాస్తవంలో అడుగుపెట్టినట్టుంది.
"ప్లీజ్ కమ్" మెట్లపైనుంచి ఓ మధ్యవయస్కురాలయిన ఆంగ్లో ఇండియన్ లేడీ ఆహ్వానంలా పిలిచింది.
సందడిలేని యింట్లో గోడలపై అమర్చబడిన ఖరీదయిన పోర్ట్రయిట్స్. మూల ఇండోర్ ప్లేంట్స్. నేలపై వాల్ టు వాల్ కార్పెట్. రేష్మి అలనాటి వైభవానికి సాక్ష్యాల్లా ఉన్నాయి.