Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 26


    అప్పటికి అయిదోసారో ఆరోసారో మాలతిని పలకరించటానికి ప్రయత్నం చేసి ఆమెచేత చీదరించుకోబడి తన గదిలో కాలుగాలిన పిల్లిలా తిరుగాడిన శంకర్ మళ్ళీ ఆమె దగ్గరకు చేరాడు.

    "మాలతీ!"

    ఆమెలో చలనంలేదు.

    "మాలతీ, ప్లీజ్! ఎంతసేపలా నేలమీద పడివుంటావు? శేఖర్ నిద్రలేస్తాడు. లేచి మామూలుగా వుండు."

    ఆమెలో ఏమాత్రం కదలిక లేదు.

    అతడామె ప్రక్కన కూర్చుని "చూడు!" అంటూ భుజంమీద చెయ్యివేసి కడపబోయాడు.

    తోక త్రొక్కిన త్రాచుపాములా ఆమె చివాలున లేచికూర్చుంది. బెడ్ లైట్ చిరుకాంతిలో విరబోసుకున్న జుట్టుతో, చెదిరిన దుస్తులతో, ఎండిన కన్నీటి చారికలు కట్టిన ముఖంతో అందమైన పిశాచంలా వుంది.

    "వెళ్ళు, నన్ను వదిలి వెళ్ళు దుర్మార్గుగా!" అంది తీవ్రకంఠంతో.

    శంకర్ ఆమెవంక గంభీరంగా చూశాడు. కోపంగా చూశాడు. ఇష్టంగా చూశాడు. కాంక్షగా చూశాడు.

    అతని పెదవులమీద ఎదుటివాళ్లను కాల్చుకుతినే చిరునవ్వు నర్తించింది.

    "ఇంత కఠినంగా నిన్న శాసించివుంటే తప్పకుండా ఆచరించి వుండేవాడ్ని మాలతీ! ఇప్పుడు విడిచి వెళ్లలేని స్ధితికి వచ్చేశాను. కాదు వచ్చేశాము."

    "భగవంతుడా!" అంటూ ఆమె హతాశురాలైపోయింది. ఒక్క సంఘటనతో తాను అతని దృష్టిలో ఎంత పలుచనైపోయింది?

    అసలిప్పుడు ఏం చెయ్యాలి?

    తనమీద తనకు అసహ్యంగా వుంది. రోతగా వుంది. తన శరీరాన్ని తలుచుకుంటే కంపరంగా ఉంది. దాన్ని నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా కాల్చేసుకోవాలని వుంది.

    కానీ శేఖర్ రూపం కళ్ళముందు మెదుల్తోంది.

    అతని అమాయకత్వం, స్వచ్ఛత, అతన్లోని నిష్కల్మత్వం ఆమె గుండెల్ని పిండేస్తున్నాయి.

    అతన్ని తాను మనసారా ప్రేమించింది, పూజించింది, ఆరాధించింది.

    ఎవరూ నమ్మరు, మనుషుల్లో కొందరు స్వార్ధంలేకుండా ఇతరులకోసం జీవిస్తూ వుంటారంటే నమ్మలేరు. కానీ చిన్నతనంనుంచీ తను పొందిన శిక్షణ, పెరిగిన వాతావరణం - పరిశుద్ధమైన భావాలు గల వ్యక్తిగా తనని రూపొందించాయి.

    ఒక పాపిష్టి క్షణంలో, చేతనావస్ధను దాటిపోయిన దారుణస్ధితిలో జీవితం తనను అమానుషంగా దగాచేసి వుండవచ్చును. కసిగా కాటువేసి వుండవచ్చును. తనకు బ్రతుకుమీద వ్యామోహం వుంది. ఈ శరీరం మీద భ్రాంతి వుంది. అతనికోసం తాను బ్రతకాలనిపిస్తోంది. ఎట్లాగో తెలియటంలేదు. ఎలా ఈ పరిస్ధితులలోంచి, మాయాజాలంలోంచి బయటపడాలో, ఎలా సిగ్గులేకుండా, మానాభిమానాలు లేకుండా ముందుకు అడుగువెయ్యాలో తెలియటం లేదుకానీ అతను తనకు కావాలి. అతను బ్రతకటంకోసం తాను బ్రతకాలి.

    "మాలాతీ!"

    ఈ ప్రపంచంలోకి వచ్చింది. తన జీవితాన్ని తారుమారు చేసిన శంకర్ రాక్షసుడిలా కనిపిస్తూ ముఖంలోకి చూస్తున్నాడు.

    ఆమె అతనివంక అసహ్యంగా చూసి లేచి నిల్చుంది. "నువ్విక్కడ్నుంచి వెడతావా? వెళ్ళవా?"

    శంకర్ ముఖమంతా ఎర్రగా వుంది. తనేం చెయ్యాలో నిశ్చయించుకున్నట్లు గదిలో అటూఇటూ తిరుగుతున్నాడు.

    "ఆవేశపడకు మాలతీ! తాపీగా ఆలోచించు."

    "బ్రతుకంతా దుర్గంధం చేసుకుని, పాపంతో నింపుకుని - కులటగా నిలబడిన నన్ను ఇంకా ఇక్కడే తారట్లాడుతూ హితోపదేశాలు చేస్తున్నావా?"

    శంకర్ మొండికేసినట్లు ఆమెవంక తిరుగుతూ అన్నాడు "నేనిక్కడ్నుంచి వెళ్ళను."

    మాలతి కోపంతో వణికిపోతూ "వెళ్ళవూ?....ఏమిటీ నీ ధైర్యం?" అంటూ అతన్ని కాల్చేటట్లు చూస్తోంది.

    శంకర్ ఏమీ తొణకలేదు. "ధైర్యంకాదు మాలతీ! అవసరం. ఈ సంఘటన ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నేను ఆలోచించలేదు. కానీ అంతకు ముందువరకు కొంతవరకూ కోరికలు మనసులోనే దాచుకునే అమాయకుడ్ని. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి వచ్చేసింది. నరమాంసం రుచి మరిగిన రాక్షసుడిలా నీమీదకు ఎగబడాలనిపిస్తుంది. చేసిన పాపం ఎలానూ చేశాను. ఓ ప్రాణస్నేహితుడ్ని మోసం చేసిన పాపిష్టివాడిని ఎలాగూ అయాను. తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పుతప్పే మాలతీ! ఆలోచించు, నువ్వెలాగూ పతనమయ్యావు. నీ మెళ్ళో తాళికట్టింది శేఖర్ కావచ్చు కానీ అతనికన్నా ముందుగా నిన్ను అనుభవించింది నేను."

    నెత్తిమీద పిడుగు పడినట్లు చెవులవెనుక ఉరుములు ఉరిమినట్లు కాళ్ళ క్రింద భూకంపం వచ్చినట్లు.......

    మాలతి అణువణువూ వణికిపోతోంది.

    "నువ్విక్కడే వుండి మునుపటి మాలతిగా అతన్తో నిర్మలంగా మాట్లాడుతూ తిరగాలేవు. ఒకవేళ అలా తిరగగలిగావంటే ఒకసారి చేసినమోసంతో తృప్తిపడక క్షణక్షణం అతన్ని మోసం చేస్తున్నావన్నమాట. అంటే అనుక్షణం ఓ నరకాన్ని సృష్టిస్తున్నావన్నమాట. మాలతీ! నా మాటవిను. ఈ నరకానికి శాశ్వతంగా తిలోదకాలిద్దాం. నాతోరా. తెల్లవారకముందే ఇక్కడ్నుంచి ఇద్దరం వెళ్ళిపోదాం...."

    ప్రక్క గదిలో తన భర్త, ఇక్కడ ఈ అనుభవ ప్రసంగం.

    మాలతి పిచ్చి నవ్వు నవ్వింది.

    "మాలతీ! అలా నవ్వకు. నిన్నా రూపంలో నేను చూడలేను."

    ఆ మసక చీకట్లో, ఆ మసకవెల్తుర్లో నిజంగా మాలతి పిచ్చిదానిలాగే గోచరిస్తోంది. ఆమె కాళ్ళవెంట నీళ్ళు బొటబొటా కారుతున్నాయి.

    "మనసు ఓ ఆరని కుంపటై, ఆ కుంపట్లోంచి నిప్పురవ్వలు సహజమైన నవ్వురూపంలో బయటకు వస్తే, ఆ సహజత్వాన్ని మీరు భరించలేరు. కానీ అసహజమైన పతనాన్ని మాత్రం శాశ్వతంగా భరించడానికి సిద్ధపడుతున్నారు. ఇది నరకమన్నారు కదూ? అంటే నన్ను ఈ నరకంలోంచి మరో నరకంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నావన్నమాట. నిన్నెలా అసహ్యించుకోవాలో, ఎలా వదిలించుకోవాలో కూడా నాకు తెలియడంలేదు. చూడూ! నీకు సిగ్గేయ్యటం లేదూ?"                                                                                     

 Previous Page Next Page