Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 26

          

                                       మూడు
   
        పావనికి ఇంకా కొత్త పెళ్ళికూతురు సిగ్గులు పోలేదు.
   

   
    భాస్కరరామ్మూర్తి ఆమెను ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఆ రోజు ఎందుకో భర్త ఉద్విగ్నంగా వుండటం గమనించింది. పొద్దున్నే బయల్దేరి వెళ్ళాడు. అతడు వెళ్ళింది నిర్మల ఇంటికి.
   
    అత్తవారింటి నుంచి బయల్దేరి వచ్చేశాక అతడు ఇన్ని రోజులూ ఆగింది మంచిరోజు కోసం. తన భార్య ద్వారా సంక్రమించబోయే లక్షల ఆస్థికి మంచి ముహూర్తం నిర్ణయించుకొని బయల్దేరాడు.
   
    పావని ఒరిజినల్ తండ్రి వినయచంద్ర మరణించాడనీ, ఎవరో గార్డియన్ ఆ వ్యవహారాలన్నీ చూస్తున్నాడనీ తెలిసింది. అది కొద్దిగా అసంతృప్తిగా అనిపించినా తల్లి వుంటుంది కదా అనుకున్నాడు. అసలు విషయం తెలిసే ఆ "మహత్తర క్షణం" గురించి వూహించుకొంటూంటేనే అతడి మనసు నిలవటంలేదు. ఆ తల్లీ కూతుళ్ళు కలుసుకునే దృశ్యాన్ని వూహించుకుంటూ ఆ భవంతిలోకి అడుగు పెట్టాడు.
   
    ముందు హాల్లో పరమహంస కూర్చుని వున్నాడు.
   
    " నా పేరు భాస్కరరామ్మూర్తి మీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడతడు. ఆ విశాలమైన హాల్లో నిశ్శబ్దం అతడిని భయపెడుతూంది. ఇద్దరే వున్నారు ఆ గదిలో.
   
    పరమహంస కళ్ళెత్తి అతడివైపు చూశాడు. "చెప్పు బాబూ! ఏ విషయంలో?"
   
    భాస్కరరామ్మూర్తి ఆయన్ను చూస్తుంటే చెమటలు పడుతున్నాయి. నిర్మలనే కలసివుంటే బావుండేదనిపిస్తోంది. అన్ని లక్షల ఆస్థికి గార్డియన్ ఇలా వుంటాడని అతడు వూహించలేదు. నుదుట ఆ బొట్టు, మెళ్ళో రుద్రాక్షమాలా చూస్తుంటే ఋషిలా కన్పిస్తున్నాడు పరమహంస. కానీ బట్టలు మామూలుగా వున్నాయి.
   
    "త్వరగా చెప్పు బాబూ! నాకు పూజకు వేళవుతుంది" అన్నాడు పరమహంస.
   
    "చనిపోయిన వినయచంద్ర ఆస్థికి మీరే గార్డియన్ గా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఆ విషయమే మాట్లాడాలనుకుంటున్నాను" అన్నాడు ధైర్యం కూడదీసుకుని.
   
    పరమహంస మాట్లాడలేదు. ప్రశ్నార్ధకంగా చూశాడంతే.
   
    ఏ భావమూలేని ఆ ముఖం చూస్తుంటే భాస్కరరామ్మూర్తికి జంకుగా వుంది.
   
    "ఆ ఆస్థి గురించి మాట్లాడాలని వచ్చాను" అన్నాడు మళ్ళీ.
   
    "చెప్పు, వింటున్నాను ఆ వివరాలు నీకు ఎందుకు కావలసి వచ్చాయో తెలుసుకోవచ్చా?"
   
    "ఆస్థి గురించే కాదనుకోండి, వాళ్ళమ్మాయి సాహితి గురించి నాకో రహస్యం తెలుసు."
   
    పరమహంస తొణకలేదు. జాగ్రత్తగా గమనించి వుంటే అతడి కళ్ళలో మార్పు రామ్మూర్తి కనిపెట్టగలిగేవాడు. కానీ ఆ కళ్ళలోకి సూటిగా చూడలేక తలవంచుకుని కూర్చున్నాడతను.
   
    "ఏమిటీ ఆ రహస్యం?" ఆ స్వరంలో ఎలాంటి బెరుకూ, అనుమానమూ లేవు.
   
    "ఆమె వినయచంద్ర, నిర్మలకు పుట్టిన బిడ్డ కాదు. వాళ్ళ బిడ్డ మరోచోట పెరిగింది. డానికి నా దగ్గర సాక్ష్యం కూడా వుంది."
   
    పరమహంస అతడిని పరీక్షగా చూశాడు. బాగా చదువుకున్నవాడిలాగే వున్నాడు. పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వాడైతే కాదు.
   
    "అలాగా! ఏదీ ఆ సాక్ష్యం చూపించు."
   
    ఆయన సూటిగా అడిగేసరికి ధైర్యం తెచ్చుకున్నాడు భాస్కరరామ్మూర్తి.
   
    "మా అమ్మ చనిపోతూ నాకీ విషయం చెప్పిందండి. అసలు తనే ఏదో థ్రిల్ కోసం పిల్లల్ని మార్చింది. వాళ్ళ తొడలమీద పుట్టుమచ్చ గురించి కూడా చెప్పింది" భాస్కర్ ఓపిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందంతా చెప్పాడు.
   
    అతడు చెప్పింది పరమహంస చిరునవ్వుతో విన్నాడు.
   
    "అయిపోయిందా?" చివరగా అడిగాడు.
   
    "నేను చెప్పెదు సత్యమండీ! వాళ్ళిద్దరి బర్త్ సర్టిఫికేట్లు కాపీలు చూడండి. ఒకటే చోట, ఒకేసారి పుట్టారు మా అమ్మ చేసిన ఓ కొంటె పనివల్ల ఇద్దరు పిల్లల అదృష్టాలూ మారిపోయాయి. సాహితి డబ్బున్న ఇంట్లో వచ్చిపడింది."
   
    "ఆ అమ్మాయి బీద ఇంటికి వెళ్ళిందా?"
   
    "అవునండీ! వాళ్ళు చాలా బీదవాళ్ళు, తండ్రి ఓ స్కూలు టీచర్, తల్లి క్యాన్సర్ తో చనిపోయింది."
   
    "అలాగా! కథ చాలా బావుంది. దీనికోసం చాలా కష్టపడ్డావన్నమాట."
   
    "ఇది కథ కాదండి. కావాలంటే ఈ ఫోటో చూడండి. వినయచంద్ర, నిర్మల పోలికలు బాగా కనిపిస్తాయి ఇందులో..." అంటూ పావని ఫోటో చూపించాడు.
   
    ఆ ఫోటో తీసుకుని చూశాడు పరమహంస. ఆ అమ్మాయి చాలా అందంగా వుంది. కాని నిర్మల, వినయచంద్ర పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించడం లేదు.
   
    "ఈ అమ్మాయి వినయచంద్ర కూతురంటావా? ఇదేనా నీ దగ్గరున్న సాక్ష్యం?" నవ్వాడు పరమహంస. "చూడు బాబూ! నీకేదైనా సహాయం కావాలంటే డైరెక్టుగా అడుగు ఇలాంటి కట్టు కథలు చెప్పాల్సిన అవసరం లేదు."
   
    "కాదండీ ఇదంతా నిజం నాకు కావలసింది సహాయం కాదు, ఆస్థి నా భార్య ఆస్థి."
   
    "అంటే...."
   
    "పావని నా భార్య."
   
    "ఓహో! అదా అయితే నీ ఎత్తు ఇప్పుడర్ధం అయింది. పాపం చాలా కష్టపడ్డావుగాని..... నేను పోలీసులను పిలవకముందే వెళ్ళిపో నాకు నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది."
   
    "అదేమిటి? అలా తీసిపారేస్తారు....? నేను చెప్పిందంతా నిజం సార్!"
   
    "నువ్వు చెప్పిందంతా నిజం అయినా, నీవు ఫ్రూవ్ చెయ్యలేవు. ఈ పుట్టుమచ్చలు, బర్త్ సర్టిఫికేట్లు కోర్టులో వాదనకు నిలవవు. ఇకపోతే నీకో విషయం తెలుసా? మా సాహితి పుట్టిన రోజు నవంబరు పదమూడు కాదు.....మే పదిహేను, వాళ్ళ స్కూలు రికార్డులు తిరగేస్తే నీకా విషయం అప్పుడే తెలిసుండేది పాపం డూప్లికేట్ సర్టిఫికేట్ల కోసం చాలా శ్రమపడి వుంటావు."
   
    భాస్కరరామ్మూర్తి ఖంగుతిన్నాడు. ఆ సాహితి పుట్టినరోజు స్కూల్లో మరొకటి వుంటే? తానా విషయం రుజువు చెయ్యాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఇషి అతడు ఊహించలేని మలుపు. అతడికి చెమటలు బాగా పట్టేశాయి. అసలు ఇదంతా అతడు ఊహించలేదు. పావని, తన కూతురు అని తెలియగానే, నిర్మల వచ్చి తప్పిపోయిన కూతుర్ని ఆఘమేఘాల మీద కౌగలించుకుంటుందని, ఆ సంగమం ఎంతో అపురూపంగా వుంటుందనీ అనుకున్నాడు.
   
    పావనితో పాటూ తనకీ ఈ ఇంట్లో రాజప్రవేశం దొరుకుతుందనుకున్నాడు. ఈ సాక్ష్యాలూ, ఋజువులు, లిటిగేషన్లు ఊహించలేదు.
   
    పరమహంసకి అతడి గురించి కొద్దికొద్దిగా తెలుస్తోంది.
   
    "ఏం బాబూ.....! ఆస్థి కలుస్తుందని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావా?"
   
    భాస్కర్ అవునన్నట్లుగా తలూపాడు. "నేను చెప్పిందంతా నిజమే సార్! వాళ్ళు పుట్టినరోజు సర్టిఫికేట్లు నేను హాస్పిటల్లో నుంచే సంపాదించాను. ఆ రికార్డులు అక్కడింకా వున్నాయి. కోర్టుకెళితే అన్నీ బయటకొస్తాయి."
   
    "కోర్టులో అందరిముందు నీభార్యని తొడమీద పుట్టుమచ్చ చూపించమంటావా?" పరమహంస చిన్నగా నవ్వాడు. "నువ్వు అంత కష్టపడ్డా లాభం లేదు. వినయచంద్ర ఆస్థినంతా భార్యపేర్న రాశాడు. ఆవిడది కూతురికే ఇవ్వాల్సిన అవసరంలేదు. మొత్తం ఆస్థి నీ చేతికి వస్తుందని ఎలా అనుకున్నావు?"
   
    "జ్యోతిష్యం..... భార్య ద్వారా లక్షలకొద్ది ఆస్థి కలిసొస్తుందని అవదేష్ బాబా నాకు జ్యోతిష్యం చెప్పాడు. ఆయన మాట ఒట్టిపోదు. నాకు తెలుసు."
   
    "అలాగా! నేనెవరో తెలుసా? జ్యోతిష్యులకే దేవుడిని. నా గురించి ఎప్పుడూ విని ఉండవు, నేను చెపుతా సరియైణ జ్యోతిష్యం వారంరోజులలోగా నీకు మూడు గండాలున్నాయి. ఆ మూడు తప్పించుకుంటే బ్రతికి బైటపడతావు. అప్పుడైనా నీకు మనశ్శాంతి ఉండదు. ప్రతిరోజూ నరకం అనుభవిస్తావు. వెళ్ళు నా జ్యోతిష్యం తప్పని తేల్చగలిగితే మళ్ళీ రా. అప్పుడు మాట్లాడుకుందాం" అని లోపాలకి వెళ్ళిపోయాడు.
   
    భాస్కరరామ్మూర్తి నిస్సహాయంగా బయటకొచ్చాడు. తన ప్లాన్ ఇలా ప్లాప్ అవుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు. ఈ గార్డియన్ ని కాకుండా తను నిర్మలని కలుసుకుని వుంటే బావుండేది. అవును! ఈ ఆలోచన తనకి తట్టకపోవటం దురదృష్టకరం. రేపే నిర్మలని కలుసుకోవాలి. తల్లి ప్రేమ అది. పావనిని చూస్తే ప్రేమ కదలిక తప్పదు.
   
    ఎంతో ఆలోచనలో ఉన్నా అతడు చాలా స్లోగా పోతాడు. ఇవాళ ఆ రుద్రాక్షమాలాయన చెప్పింది విన్నాక భయంతో స్కూటరు అతి జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తోంది అతడు దగ్గరికి వచ్చేసరికి రెడ్ లైటు వెలిగింది. స్కూటరు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ఎడమవైపు నుంచి ఏదో దూసుకు వస్తున్నట్లనిపించి కొనగంట చూశాడు. ఒక కారు వేగంగా ముందుకొస్తోంది. భాస్కరరామ్మూర్తి కంగారుపడ్డాడు. బ్రేక్ వేసే టైం కూడా లేదు.
   
    కారు కీచుమంటూ ఆగింది. అతడు ఎగిరి కిందపడ్డాడు. తన పని అయిపోయిందనుకున్నాడు. కాని అదృష్టవశాత్తు తలకి దెబ్బతగల్లేదు. కాలు మెలికపడింది. చేతులు గీరుకుపోయాయి.

 Previous Page Next Page