Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 27


    "ఎందుకని అలా అనుకుంటున్నారు?"

    "నాకొదిలెయ్! నేను చెబుతున్నాను కదా" అన్నాడాయన ఎక్స్ పర్ట్ లాగా.

    వాళ్ళు కూర్చున్న భంగిమని బట్టే గ్రహించాడు నవాబుగారు. ఎదుటిమనిషి తప్ప వేరే ప్రపంచం ఏమీ కనపడకపోయినా కూడా, ఆ ఎదుటి మనిషి తప్ప మిగతా ప్రపంచం అంతా కనబడుతున్నట్లే బింకంగా ప్రవర్తించడం!

    ఉత్తుత్తి నఖరాలు!

    మనసులోనే నవ్వుకున్నాడు ఆయన. ఇంక అప్పటినుంచి వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరినీ శల్యపరీక్ష చూస్తున్నట్లు చూడటం మొదలెట్టారు.

    ఇంతలో కేటరింగ్ సర్వీసు తాలూకు ఒక మనిషి వచ్చి డిన్నర్స్ బుక్ చేసుకోవడం మొదలెట్టాడు.

    డైలమాలో పడ్డాడు అఖిల్.

    ఇప్పుడు తను డిన్నర్ తన ఒక్కడికీ ఆర్డర్ చెయ్యాలా? ఈ నవాబుగారూ, బేగంగారూ తనకి బాగా క్లోజ్ అయిపోయారు ఒక్కరోజులోనే!

    వాళ్ళకి కూడా తను డిన్నర్ ఆర్డర్ చేస్తే మర్యాదగా ఉంటుందేమో!

    తమ ముగ్గురికీ డిన్నర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ కొరివికి డిన్నర్ ఆర్డర్ చెయ్యాలా తను?

    ఆర్డరుచేస్తే చాలా అసభ్యంగా ఉంటుందేమో!

    ఆవిడ దాన్ని మరోలా అర్ధం చేసుకోవచ్చు.

    ఆవిడని వదిలేసి, తమ ముగ్గురికోసం ఆర్డరివ్వడమే అసభ్యంగా వుంటుందా?

    అతని డైలమాని సెటిల్ చేసేస్తూ బేగంగారే అంది_

    "నవాబుగారు బయటి తిండి తినడం మానేశారు ఈ మధ్య! అందుకని ఢిల్లీలో మా బంధువులు వచ్చేటప్పుడు రకరకాల వంటకాలు ఏవో చేసి ఇచ్చారు దార్లో తినడానికి!"

    "ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్ ఎప్పుడూ లేట్ అని వాళ్ళకీ తెలిసే ఉంటుంది" అన్నాడు నవాబుగారు నవ్వుతూ.

    "అందుకే ఈ మధ్య "డిలేడ్ ఫ్లైట్ రెస్టారెంట్" అని కూడా కొత్తగా పెట్టారు. "ఫ్లైట్ డిలే రొటీన్ అన్నమాట!" అన్నాడు అఖిల్ మర్యాదగా.

    "మేము ఉన్నది ఇద్దరం అయితే వాళ్ళేమో పదిమందికి సరిపడా చేసి ఇచ్చారు. ఢోక్ లా, కచోడీలు, దాల్ మోట్, పూరీ, హల్వా, బర్ఫీ.... మీరు కూడా తినకపోతే మిగిలిపోతాయి. అనవసరంగా!" అంది బేగంగారు.

    "మా నలుగురికీ డిన్నరు అవసరం లేదు బేటా!" అన్నాడు నవాబుగారు కేటరింగు అతనితో. అతను వెళ్ళిపోయాడు. సమస్య సెటిలైపోయింది.

    తర్వాత నవాబుగారు ఇంక అఖిల్ తో కబుర్లలో పడిపోయాడు. తిండికీ, బట్టకీ వెదుక్కోనవసరం లేకుండా, తీరిగ్గా, తృప్తిగా, పరోపకారంలో, విజ్ఞాన అన్వేషణలో, విలాసాల్లో గడిచిపోయిన జీవితం ఆయనది. చాలా దేశాలు తిరిగాడు ఆయన. దానికి తోడు మంచి మాటకారి.

    చమత్కారంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, అఖిల్ అంటే తనకి వున్న అలర్జీని కూడా మర్చిపోయి, ఆసక్తిగా వినడం మొదలెట్టింది సుధ. మాటల మధ్యలో అఖిల్ చెప్పేది కూడా తను శ్రద్ధగానే విన్నదన్న సంగతి ఆమె గమనించలేదు.

    "అందరి డిన్నరూ అయిపోయింది. మీరేం తినరా?" అని బేగంగారు నవ్వుతూ హెచ్చరించేదాకా ఎవరికీ టైం తెలియలేదు.

    బేగంగారు ప్లేట్లలో టిఫిన్లు సర్ది, అందరికీ ఇచ్చింది. తిని చూశాడు అఖిల్. ఢోక్ లా నిన్నటిది. అయినా కూడా చాలా బాగుంది. కచోడీలు మాత్రం కుదరలేదు.

    బాగున్నవాటిని గురించి మాత్రమే కామెంటు చేశాడు అతను.

    సుధకి కేసరి వడ్డించింది బేగంగారు.

    అది సుధకి కొత్త అనుభవం. తన తల్లి అదోరకం మనిషి. తన బాగోగులు ఆమెకి పట్టవు. అదంతా ఇప్పుడు గుర్తుకు వస్తే మనసు చేదుగా అయిపోతుంది. ఎప్పటికప్పుడు గుర్తు వస్తూనే వున్నా. మర్చిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తను.

    వద్దు వద్దంటున్నా కూడా ఆప్యాయంగా ప్లేట్లో ఏదో పెడుతూనే ఉంది బేగంగారు. "కడుపునిండా తినకపోతే ఎలా?" అని చనువుగా మందలిస్తూ.

    అప్రయత్నంగానే సుధ కళ్ళు తడితడిగా అయిపోయాయి. ఇలాంటి అభిమానాలు తనకి కొత్త. వెంటనే తనమీద తనకే చిరాకు కలిగింది సుధకి. ఏమవుతుంది తనకి ఇవాళ? ఎప్పుడూ లేనిది ఈ కన్నీళ్ళేమిటి తనకు?

    చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది సుధ. చేతులు కడుక్కుని, కళ్ళు తుడుచుకుని, తలుపు దగ్గరే నిలబడి బయటికి చూడడం మొదలెట్టింది. కన్నీళ్ళు ఇంకేదాకా తన మొహం వాళ్ళకి కనబడకూడదు!

    అయినా....

    ఇవాళ ఎందుకిలా?

    అభిమానం చూపించే వాళ్ళకోసం అంతగా తపించిపోతోందా తను? తనకు తెలియకుండానే!

    సుధ అలా తలుపుదగ్గర నిలబడి ఉండగానే అఖిల్ వాష్ బేసిన్ దగ్గరికి వచ్చాడు చేతులు కడుక్కోవడానికి. వచ్చీరాగానే అతను ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. సుధ డోర్ దగ్గర నిలబడి ఉంది. డోర్ రైలు వేగానికి మూసుకోబోతోంది. డోర్ గనక పడిపోతే....సుధ కూడా పడిపోతుంది! డేంజరు! క్షణంలో సగంలోనే ఇది అర్ధం చేసుకుని మెరుపువేగంతో మూసుకుపోతున్న తలుపుని ఆపేశాడు అఖిల్.

    అలికిడి విని, చటుక్కున వెనక్కి తిరిగింది సుధ. "తక్షణం కెవ్వుమని కేక పెట్టింది. బిగుసుకుపోయాడు అఖిల్. ఎందుకలా అరుస్తోంది? తను ఆమెని తోసేసాడనుకుందా ఏమిటి? అదే క్షణంలో రైలు కూత పెట్టింది. సుధ కేక ఆ రైలు కూతలో కలిసిపోయింది. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు అఖిల్."

    కానీ సుధమాత్రం అప్పటికే పరిస్థితిని "అపార్ధం" చేసేసుకుంది.

    గాడ్! 

    ఇతను తనని రైల్లో నుంచి తోసెయ్యాలని ప్రయత్నించాడు. ఇతడు మనిషి కాడు. రాక్షసుడు. నిజం!

    తన ప్రాణాలు తప్ప ఎదుటివాళ్ళ ప్రాణాలంటే అతనికి విలువ లేదు.

    ఎందుకుంటుందీ?

    ఇతనొక గ్యాంగ్ స్టర్ కొడుకు!

    ఇతనే ఒక గ్యాంగ్ స్టర్ కూడా!

    అఖిల్ ని విసురుగా పక్కకి నెట్టేసి వేగంగా లోపలికి వచ్చేసింది సుధ. తన సీటు దగ్గరికి వచ్చేసి కూర్చుండిపోయింది. ఎత్తుగా ఉన్న ఆమె గుండెలు రొప్పుతూ ఎగిరెగిరి పడుతున్నాయి.

    ఆమెకి అంతా అర్ధమైనట్లే అనిపిస్తోంది.

    ఒకప్పుడు తనని రేప్ చేస్తానని శపథం చేశాడు ఈ అఖిల్. అది కుదరలేదు.

    నిన్నటికి నిన్న తను అతన్ని ధైర్యంగా ఎదుర్కొని హోటల్ లాబీలో అందరూ చూస్తుండగా మొహం వాచేలా తిట్టింది.

    అది మనసులో పెట్టుకుని, ఇతనిప్పుడు తన ప్రాణాలు తియ్యడానికే రెడీ అయ్యాడు.

    ఏం మనిషి!

    మనిషా! కాదు! మృగం!

    కొద్దిక్షణాలు ఆలస్యంగానే అయినా, సుధ అనుకుంటున్నది ఏమిటో గ్రహించగలిగాడు అఖిల్.

    అతనికి ఇలాంటి అపార్ధాలు కొత్తకాదు! అలావాటైపోయాయి.

    కానీ చిత్రంగా ఈసారి అతనికి కోపంకంటే, బాధే ఎక్కువ కలిగింది.

    ఏం మాట్లాడకుండా మౌనంగా వచ్చి కూర్చున్నాడు.

    వాళ్ళిద్దరూ సీట్లలోలేని ఆ కొద్దిక్షణాలలోనే నవాబుగారు బేగం సాహెబ్ తో అన్నారు-

    "నేను చెప్పేది కరెక్టు వాళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు బాగా తెలుసు! ఎందుకోగానీ ఒకళ్ళంటే ఒకళ్ళు నారాజ్ గా వున్నారు. ఈడూ జోడూ సరిపోయింది. వాళ్ళ కోపతాపాలు పోగొట్టి, ఇద్దరికి కలిపి పెళ్ళి చేసేస్తే బాగుండు. మంచి జంట అవుతారు."

    "సరేలెండి! వాళ్ళిద్దరూ పామూ, ముంగిసాలాగా ఉంటే ఇంక మీరేం చేస్తారు!" అంది బేగంగారు.

    "ఏం బేగమ్! మీకూ నాకూ ఎన్నిసార్లు గిల్లికజ్జాలు రాలేదూ! గిల్లికజ్జాలు వచ్చినప్పుడల్లా ఇంత అదే ప్రపంచానికి అదే అంతం అని అనుకోలేదూ మనం. ఒహ్హో! ఇలాంటివి చాలా చూశాం. ఇప్పటికి నా ఖర్చుతో తొంభైతొమ్మిది పెళ్ళిళ్ళు చేశా! వీళ్ళిద్దరికి కలిపి ముడేస్తే వంద పెళ్ళిళ్ళు చేయించినట్లు అవుతుంది" అన్నాడు ఆయన ఎక్స్ పర్టులా మొహం పెట్టి.

    "అప్పుడు మీ పేరు వెయ్యి కుక్కల నవాబు కాకుండా వంద పెళ్ళిళ్ళ నవాబు అవుతుందేమో!" అంది బేగం సాహెబ్ నవ్వుతూ. ఆమెకీ హుషారు వచ్చింది. పెళ్ళి ఏర్పాట్లు ఎలాగా అని ఆలోచించడం మొదలెట్టింది ఆమె మనసు.

    ఈలోగా సుధా, ఆమె వెనకే అఖిల్ వచ్చి సీట్లలో కూర్చోవడంతో వాళ్ళు కొద్దిసేపు సైలెంటుగా అయిపోయి, సరదా కుట్రలో భాగస్వాముల్లాగా ఒకరి వేపు ఒకరు భావగర్భితంగా చూసుకున్నారు.

    ఒక వేపు ఇలా నవాబుగారూ, ఆయన బేగం కలిసి మంచి మనసుతో అఖిల్, సుధలని కలపాలని ఆలోచిస్తుండగా....

    అక్కడ....

    హైదరాబాద్ లో....

    మరిడేశ్వరరావు గన్ మాన్ అయిన గఫార్ శవాన్ని డ్రైవరు సత్యనారాయణ్ ఒక మసీదు దగ్గర పడేసి, కొన్ని ఫోన్ కాల్సు చేసి, సంకేతం అందించగానే, దారుణమైన కత్తిపోటు సంఘటనలు మొదలయ్యాయి నగరంలో.

    కృత్రిమంగా మతకలహాలు సృష్టించడం కోసం వేసిన మాస్టర్ ప్లాన్ అమలులో పెట్టడం మొదలైంది.

    ఇద్దరేసి గూండాలతో కూడిన 'డెత్ స్క్వాడ్స్' మోటార్ సైకిళ్ళూ, స్కూటర్ల మీద ఎక్కాయి. ప్రతి స్క్వాడ్ లోనూ ముందు కూర్చున్నవాడు వాహనం నడుపుతూ ఉండగా, వెనక కూర్చున్నవాడు తన చేతిలో వున్న పొడుగాటి మారణాయుధాలతో విచక్షణ లేకుండా జనాలని పొడిచి చంపుతున్నాడు. ఆ మారణాయుధం కూడా చాలా నైపుణ్యంగా చేయబడి వుంది. ఒక పొడుగాటి కర్ర! దాని చివర్న కట్టిన వంకర కత్తి. స్కూటర్ మీద రోడ్డుకి ఇటువేపు వెళ్తున్న మృత్యుదళం మెంబరు, రోడ్డుకి అటువేపు వెళ్తున్న అన్నెం పున్నెం ఎరగని అమాయకులను ఆషామాషీగా ఆ కత్తితో చీరెయ్యవచ్చు.  

 Previous Page Next Page