Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 25


    క్షణం బిత్తరపోయింది ప్రియాంక. బిగుసుకుపోయింది "సారీ! ఆ వివరాలు నాకేం తెలుసు? దయచేసి నన్ను ఇబ్బంది     పెట్టకండి!" అనేసింది వెంటనే ఖంగారుగ.

    హాస్టళ్ళలో జరుగుతున్న విషయాలు ఇంతవరకు ప్రిన్సిపాల్ కు కూడా తెలియవు. టెర్రరిస్టులు విద్యార్ధినీ విద్యార్ధులను క్రమంగా తమ వైపుకు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలో విద్యార్ధులను ప్రలోభపెడుతున్న వారెవరో తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళను గురించి ఇంటరాగేట్ చేస్తే, తీగలాగితే డొంకంతా కదిలినట్టు టెర్రరిస్టుల గురించి, వాళ్ళ నాయకుని గురించి సమగ్రమైన సమాచారాన్ని రాబట్టవచ్చు. ఆషా భర్తగా ఇక తను ఎంత ప్రయత్నించినా ప్రియాంక పెదవి విప్పదని అర్ధమైపోయింది....అన్ని కోణాల నుంచి ఆలోచించిన నవీన్ మరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు.

    "మిస్ ప్రియాంకా!" గంభీరంగా వచ్చిన నవీన్ గొంతు శబ్దం విని క్షణం విస్మయంగా చూసింది ప్రియాంక. అతని చూపులోని మార్పును కూడా వెంటనే గమనించింది.

    "సారీ_మెస్ కట్టేస్తారు-నే      వెళ్ళాలి...." ప్రియాంక విజిటర్స్ రూమ్ నుంచి వడిగా కదిలింది. ఆమె ఉచ్ఛాస నిశ్వాసలు వేగం పుంజుకున్నాయి.

    "నో....డోంట్ మూవ్...." నవీన్ ఆమె దారికి అడ్డుగా నిలిచాడు.

    నవీన్ కంఠంలో కాఠిన్యంతోపాటు ఈసారి అతని ముఖం క్రోధంతో కందగడ్డలా మారటాన్ని కూడా ప్రియాంక గమనించింది.                    

    అతను వుమెన్స్ హాస్టలుకు వచ్చి మర్యాద మరచి, చివరకు దౌర్జన్యానికి దిగాడు. గదిలో తను ఒక్కతే మిగిలిపోయింది. గది బయటకూడా ఎవ్వరూ వున్నట్టులేదు. ఈ క్షణాన అతను తనను ఏమైనా చేస్తే....

    ఆమెలో సన్నగా ఒణుకు పుట్టింది. దిక్కులు చూడడం ప్రారంభించింది. దీన వదన అయింది.

    ఇదే అదనుగా ఆమె చేయిపట్టుకుని ఒక్క ఉదుటున గదిలోకి లాగి తలుపులు మూసివేశాడు నవీన్. అది ఉడుం పట్టు. అతను పట్టుకున్న చోట ఆమె చేయి కందింది!

    "ఆడపిల్ల మీద చేయివేసి, గది తలుపులు మూయడానికి నీ కెంత ధైర్యం? యూ....స్కౌండ్రల్_ఈ హాస్టల్ నుంచి నువ్వెలా తప్పించుకుపోతావో చూస్తాను!" ఆవేశంతో ఊగిపోతూ అరచింది ప్రియాంక. కోపం తారాస్థాయికి చేరింది.

    "షటప్! అతిగా మాట్టాడకు. ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా?" ఆవేశంగా అడుగు ముందుకు వేశాడు నవీన్. ఆ అడుగు బరువుగా పడింది.

    "ఆగు! ఆడపిల్ల మీద అత్యాచారం చేయడానికి వచ్చావా? నేను కేకలు వేస్తే నీ బతుకేమవుతుందో తెలుసా?" రౌద్రంతో ఉగిపోతున్నది ప్రియాంక.

    "అలాగా! ఏదీ కేకలు పెట్టు!" అంటూనే జిప్ బ్యాగ్ లో నుంచి రివాల్వరు బయటకు తీసి ప్రియాంకకు గురిపెట్టాడు నవీన్.

    అదిరిపోయింది ప్రియాంక. గుండె దడదడలాడింది.

    "నన్నేం చేయొద్దు....నన్నేం చేయొద్దు....అంతా చెబుతాను...."

    "దట్స్ గుడ్! నాకు కావలసింది అంత వరకే! చెప్పండి_ ఈ యూనివర్సిటీలో టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్నది ఎవరు? వాళ్ళ జాబితా ఎక్కన్నది?"

    ప్రియాంక మరల సందిగ్ధంలో పడింది. ఒకవైపున భయం. మరొక వైపున....

    "మర్యాదగా చెప్పు. లేదా...." రివాల్వారును ఆమె కణతకు గురిపెట్టాడు నవీన్.

    "చెబుతాను....ముందు నాకు మంచినీళ్ళు...."

    గది మూలగా వున్న కూజా దగ్గరకు వెళ్ళి, గ్లాసులోకి నీళ్ళ వంచుతున్నాడు నవీన్.

    ఇదే అదనుగా తలుపులు తెరచుకుని ఒక్క ఉదుటున బయట పడింది ప్రియాంక.

    భారంగా నిట్టూర్చాడు నవీన్. వచ్చిన అవకాశం కాస్తా జారిపోయింది....

    ప్రియాంకను తక్కువగా అంచనా వేసుకున్నాడు తను. ఈమె కూడా....

    చిన్న పొరపాటుతో పెద్ద అవకాశం పోయింది....

    నీరసంగా కదిలి, హాస్టల్ దాటి రోడ్డు మీదకు వచ్చాడు నవీన్. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. అతని ఆలోచన అంతా ప్రియాంక చెప్పిన టెర్రరిస్టు విద్యార్ధుల జాబితా చుట్టూ పరిభ్రమిస్తున్నది....

    రోడ్డు ప్రక్కనే వున్న పొదల మాటునుంచి టెలిస్కోప్ అమర్చిన గన్ తో నవీన్ వైపు గురి చూస్తున్న వ్యక్తిని అతను గమనించలేదు.

    సరిగ్గా అదే క్షణంలో రోడ్డుకు మరొక వైపున వున్న పొదల చాటు నుంచి పేలనే పేలింది రైఫిల్.

    "ధన్"....

    ఆవల వైపు పొదల మాటున వున్న వ్యక్తి చావుకేక వినిపించింది.

    మరొక వైపు పొదలచాటు నుంచి ఇన్ స్పెక్టర్ వీరేష్ బయటకు వచ్చాడు. అతని చేతిలోని .303 రైఫిల్ బేరల్ నుంచి ఇంకా పొగవస్తూనే వుంది.  
 

 Previous Page Next Page