Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 26

    సాయంత్రం అయిదు గంటలవుతోంది.  స్టెనోకి లెటర్స్ డిక్టేట్ చేస్తోంది పద్మజ. ఈ మధ్యన ఎక్కువగా సెలవు పెడుతూండటం  వల్లే కాక సోమశేఖరం పనీ తనే చేయాల్సి రావడంతో చాలా పని మిగిలిపోతోంది. ఎంత సీరియస్ గా పనిచేస్తున్నా  ప్రతి క్షణం శేఖరం - శేఖరంతో పాటు గిరీ పదేపదే గుర్తుకు వస్తున్నారు. ఇదివరకు ఎవరైనా ఆఫీసు డ్యూటీమీద కాకుండా కుటుంబ విషయాలకు ప్రాధాన్యతనిస్తే  చిరాకు పాడేది పద్మజ. ఆఫీసు పని ఇంట్లో చేసేవాళ్ళంటే మరింత చిరాకు. కానీ ఇప్పుడా రెండుపన్లూ  తనే చేస్తోంది. ఏదయినా తనదాకా వస్తేగాని తెలియదన్నది ఇప్పుడే అనుభవంలోకి  వస్తోందామెకు.

    డిఫెన్సు మినిష్టరు ఫ్రాన్స్ కి వెళుతున్నాడు. వెంట వెళ్ళే బృదంలో తనూ వుంది. గిరిని వదలి వెళ్ళడానికి మనసొప్పక  రమ్మని బ్రతిమాలింది. అతికష్టంమీద ఒప్పుకున్నాడు. పారిస్ వెళ్ళేలోపున మిగిలిపోయిన  పనంతా పూర్తిచేయాలని దీక్షగా కూర్చుందివ్వాళ.

    ఫోన్ రింగయింది.

    "హలో" అంది రిసీవరు తీసి విసుగ్గా.

    "పద్మా, నేను" అన్నాడు గిరి అటువైపునించి....

    "ఆ!" అంది కంఠంలో విసుగుని తగ్గించుకుని.

    "పనిమీద ఉన్నావా?"

    "ఊ" స్టెనోని కాస్త ఆగమని సైగచేస్తూ అంది.

    "ఎవరైనా ఉన్నారేమిటి పక్కన?" అడిగాడు.

    "ఊ" అంది మళ్ళీ.

    "డిస్టర్బ్ చేస్తున్నానా ?"

    "ఊహు లేదు"

    "అచ్చులా?" అడిగాడు గిరి.

    "అచ్చులా? అంటే??" అడిగింది అర్ధంకాక.

    "అంటే పక్కన ఎవరో ఉన్నారని అర్ధం! అప్పుడు ఫోన్ కీ అవతల వున్న ప్రియమైన వాళ్ళకి సమాధానాలు ఆ ఆ ఉ ఊ అని అచ్చుల్లోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట" 

    "ఓ" నవ్వింది పద్మజ.

    "ఆ, అదే అచ్చంటే" అన్నాడు గిరి.

    మనసులో  టెన్షనంతా  తీసేసినట్లు  ఉత్సాహంతో నవ్వింది పద్మ.

    "ఇంతకూ ఫోన్ చేసిన కారణం ?" అడిగింది.

    "ఏం లేదు, ఫస్టుషోకి టికెట్లు  తీసుకున్నాను.... బయలుదేరుతావేమోనని.

    "పిక్చరా?" ఎదురుగా బల్లమీద ఫైల్స్ వైపు చూస్తూ దిగులుగా అంది.

    "నీకు పని మరీ ఎక్కువగా వుంటే చెప్పు కాన్సిల్ చేసేస్తాను"

    "అబ్బే ఫరవాలేదు వచ్చేస్తాను. రాత్రి కాసేపు కూర్చుని చేసుకుంటాలే"

    ఇప్పుడిప్పుడే  మళ్ళీ కొత్త వ్యాపారంలో పడి కాస్త హుషారుగా ఉంటున్నాడు గిరి. అతన్ని నిరాశపర్చడం యిష్టంలేదామెకు.

    స్టెనోతో చెప్పి ఫైల్సన్నీ  కార్లో పెట్టించుకుని బయలుదేరింది. ఇప్పుడెంతో ఉత్సాహంగా ఉందామె మనసు.

    మొదట్లో గిరిని గురించి చాలా బాధపడేది. ఏవిధంగానైనా  శేఖరం ఆత్మను గిరికి దూరం చేయాలని మనసులో కొట్టుకులాడేది. కానీ గిరి నాస్తికుడు. దేవుడు, దెయ్యం అంటే ఎగిరిపడుతుండేవాడు. డాక్టర్ రామకృష్ణ కూడా సైకియాట్రిస్టుగా పరీక్షచేసి గిరిలో ఏ లోపమూ లేదని ధృవపరిచాడు. ఒక ఫీజీషియన్ దగ్గరకు తీసుకెళ్ళి అన్ని పరీక్షలూ చేయించాడు. శారీరకంగా గిరిలో ఎలాంటి అనారోగ్యమూ లేదని తేలింది.

    గిరి తనకు వినిపించే స్వరం గురించి ఏ వివరణా ఇవ్వలేకపోయాడు. తనకు తెలియకుండానే  తను చెప్పానని అందరూ అంటున్న విషయాలు అతన్ని ఆశ్చర్యపరిచేవి. ఆ తరువాత చాలా రోజులు గిరిని శేఖరం ఆత్మ బాధ పెట్టలేదు.

    పద్మజ కాస్త సంతోషంలో వుండగా ఒకరోజు మరో సంఘటన జరిగింది.

    ఆ రోజు అందరూ కలిసి టి.వి. చూస్తున్నారు.

    టి.వి. లో రష్యన్ అధినేత ఆండ్రోపోవ్ గురించి చెప్తోంది సమంత.

    సమంతాస్మిత పదేళ్ళ బాలిక! అమెరికా దేశస్తురాలు! "మీరెందుకు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు? మీ దేశంలో  ఎక్కువగా మారణాయుధాలు తయారుచేయడానికే ప్రాముఖ్యతనిస్తారటగా. అక్కడ వ్యక్తి స్వాతంత్ర్యం అసలు లేదటగా." అని ఆమె రష్యన్ అధినేత ఆండ్రోపోవ్ కి ఉత్తరం వ్రాసింది. "మేమూ శాంతి కాముకులమే నువ్వు విన్నదంతా నిజంకాదు. కావాలంటే నువ్వే వచ్చి చూడు" అని ఆండ్రోపోవ్ ఆమెను తన దేశానికి ఆహ్వానించాడు. సమంతాస్మిత ఆండ్రోపోవ్ అతిథిగా రష్యా దేశాన్ని  పర్యటించింది. అగ్రరాజ్యాలమధ్య  సఖ్యతకోసం ఆలోచించే ఆ చిన్నారిపాపను చాలామంది కొనియాడారు.

    గిరి, పద్మజ ప్రకాశరావుగారింట్లో  కూర్చున్నారు. సమంతాస్మిత ఆండ్రోపోవ్ ని ఏదో ప్రశ్నిస్తోంది. టి. వి. వైపు చూస్తున్న గిరిలో అకస్మాత్తుగా మార్పు రావడం గమనించలేదెవ్వరూ.

    "పాపం ఆండ్రోపోవ్ ఎక్కువరోజులు  పదవిలో లేకుండానే పోతున్నాడు" అన్నాడు అప్పటికే అతడి స్వరములో మార్పొచ్చింది. ఇన్నాళ్ళకి శేఖరం తిరిగి కనబడటంతో  ఆందోళనగా లేవబోతున్న పద్మజని వారించి "అదేం? ఎందుకలా అంటున్నారు?" అని అడిగాడు ప్రకాశరావు.

    "అతను చావు బ్రతుకుల్లో వున్నాడు. త్వరలోనే చచ్చిపోతాడు" అన్నాడు స్పష్టంగా గిరి.

    ఆ మర్నాడు పేపర్లో ఆండ్రోపోవ్ అస్వస్థుడయ్యాడనే వార్త వచ్చింది. ఆ తర్వాత ఆయన చనిపోయాడనే వార్త తెలిసింది.

    గిరికి తను చెప్పినదేమీ గుర్తులేదు. ప్రకాశరావుగారితో సహా అందరినీ ఆలోచనలో ముంచిందా వార్త. గిరి దగ్గిర ఆ విషయం ప్రస్తావిస్తే ఏదో స్వరం అప్పుడప్పుడు వినిపిస్తుందని, కానీ అదేమిటో తనకు తర్వాత అస్సలు గుర్తుండడంలేదని అన్నాడతను. కాకపోతే ఇదంతా ప్రేతాత్మ పని అంటే మాత్రం ట్రాష్ అని కొట్టిపారేసేవాడు. 

 Previous Page Next Page