Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 25

    "మగబుద్ది అంటావేం? మీ ఆడవాళ్ళకు ఆ ధ్యాసే వుండనట్లు? మొదట్లో ఇలాగే మాట్లాడతారు, తర్వాత మాకే గురువులయి పాఠాలు చెపుతారు. అయినా తప్పేముంది చెప్పు. ప్రేమించుకున్నాం, పెళ్ళిచేసుకోబోతున్నాం, తనం పార్కులో  రొమాన్సు   మొదలు పెట్టక పోతేనే ఆశ్చర్యం."

    "లెక్చరు బాగానే వుందిగానీ నేను రమ్మన్నది అందుకు కాదు."

    "మీ బావగారి మిస్టరీ గురించేనా? ఎంతయినా జర్నలిస్టువి. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఆర్టికల్ వ్రాసేయ్ ఫోటోలు కూడా జత పరచావంటే  బ్రహ్మాండమైన  పబ్లిసిటీ. ఇండియాలో మొట్టమొదరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అరుణ్ శౌరీతో పోటీగా లేడీ జర్నలిస్టు హిమజ అన్న హెడ్డింగుతో  వార్తలు వచ్చేస్తాయి."

    "ఆపు బాబూ నీ ఉపన్యాసం. ఇంతకీ నేను రమ్మన్నది ఇంట్లో విషయం మాట్లాడడానికి. అక్కడేమో ఏం మాట్లాడాలన్నా భయంగా వుంది. అక్కయ్య దగ్గర నుంచి నౌకర్లవరకూ మాట్లాడేది శేఖరం దయ్యం గురించీ, ఆ మహిమల గురించే."

    "తర్కానికి అందని ప్రతి విషయాన్ని మానవాతీత శక్తిగా నిర్ణయించడం ఆది నుండీ మనిషిలో కనిపించే బలహీనతే. ఆదిమానవుడు ఉరుములూ మెరుపులకే అర్ధం తెలియక అదేదో లీల అనుకుని పూజించడం మొదలు పెట్టాడు. ఈరోజు మానసిక వ్యాధికి మందులు తెలియక దానికి మరో పేరు పెడుతున్నారు. ఇంతకీ యింత ఘర్షణలోనూ మీ అక్కయ్య ఆఫీసుకి వెళ్ళడం మానలేదు గదూ?" అడిగాడు సాగర్.

    "ఊహు, లేదు. తను ఆఫీసులో డ్యూటీని ఎంత సీరియస్ గా తీసుకుంటోందో  నీకు తెలుసుగా. రెండిటిమధ్యా నలిగిపోతోంది" అంది  బాధగా హిమజ.

    "నిజమే హిమా, ఈ పరిస్థితుల్లో  మానసికంగా బలహీనమవడం సహజమే ఆమెకు ! కాకపోతే కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందేమోనన్నదే పరిశీలించాలి."

    "ఏమిటి సాగర్ నువ్వంటున్నది ? సరిగ్గా చెప్పు. అక్కయ్య యాక్షన్ చెయ్యడమేమిటి ?"

    "ఉన్నమాటే అంటున్నాను హిమా! పంజాబ్ లో దర్యాప్తుచేస్తున్న  ఒక ఆఫీసరు కనుక్కున్న విషయం బట్టి అక్కడ ఆయుధాలను టెర్రరిస్టులకు  అందించే ముఠాకీ, డిఫెన్స్ సెక్రటేరియట్ లో పని చేస్తున్న లేడీ సెక్రటరీకీ  సంబంధం ఉందని  తెలిసింది."

    "సాగర్ ! వాడ్డూ యూ మీన్ బైదట్ ? ఆర్ యు సస్పెక్టింగ్ మై సిస్టర్ ? హౌడేర్ యూ?" కోపంగా అరిచింది హిమజ.

    "టేకిట్ ఈజీ హిమా! ఆవేశపడకుండా ఆలోచించు. ఇది సి.బి.ఐ. రిపోర్టు" సీరియస్ గా అన్నాడతను.

    "ఇదంతా  నీకెలా తెలుసు?" అడిగింది అనుమానంగా.

    "నేనొక సి.బి.ఐ. ఆఫీసర్ని హిమా! శేఖరం హత్య జరిగిన రోజున నీకు పూర్తి వివరాలు చెప్పలేదు. ఈ కేసు నాకు సంబంధించింది కాదుగాని నాకూ మీ కుటుంబానికి  మధ్య సంబంధం తెలిసినందువల్ల కొన్ని వివరాలు నాకూ తెలుస్తున్నాయి. పంజాబ్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసరు నాకు స్నేహితుడు. అతను నాకు టెలిగ్రాం ఇచ్చి బయటకు రాగానే దారుణంగా నడిరోడ్డులో హత్య చేయబడ్డాడు."

    హిమజకి ఒక్కొక్క వాక్యమూ ఒక్కొక్క షాక్ లా అనిపించింది. శేఖరం సి.బి.ఐ. ఆఫీసర్ అన్నది ఆమెకో న్యూస్! ఆమె ఆ వార్త తాలూకు ప్రభావం నుంచి తేరుకోవటానికి  అయిదు నిముషాలు పట్టింది.

    "నమ్మలేకుండా  ఉన్నాను సాగర్! అక్క అలాంటిది కాదు. తనలో ఎంత దైవభక్తీ, ఎంత దేశభక్తీ ఉన్నాయో నాకు తెలుసు. అయినా తనకు అవసరం కూడా లేదు."

    "గిరిధర్ వ్యాపారానికి మీ అక్క ఎంత పెట్టుబడి పెట్టిందీ మధ్య ?" అడిగాడు సాగర్.

    "ఏమీలేదు, ఎంత బ్రతిమాలినా  అతను డబ్బు తీసుకోవడం లేదని బాధపడుతూంది."

    "అయితే నీకు అదీ తెలియదన్నమాట. ఈ మధ్య దాదాపు పది లక్షలు అతను కొత్తగా పెట్టుబడి పెట్టాడు. తన భార్య దగ్గర తీసుకున్న డబ్బు అని చెప్పి."

    నిర్ఘాంతపోయింది హిమజ.

    "చూడు హిమా! మీ అక్క విషయం నేను చెప్పలేను గాని డబ్బు కోసం వెధవపనులు చేసే వాళ్ళలో చాలా మంది, ముఖ్యంగా రాజకీయ నాయకులలో  ఈ గుణం బాగా కనిపిస్తుంది. పైకి పెద్ద దైవభక్తుల్లా ఆర్భాటంగా పూజలూ, దేవుడి కళ్యాణాలూ  చేయిస్తుంటారు. రెండు విధాలుగా లాభం వాళ్ళకి. చుట్టూ సమాజానికి వాళ్ళు చాలా నీతిమంతులనీ, పాపభీతి కలవారనీ నమ్మకం కలుగుతుంది. రెండోది తాము చేస్తున్న పాపాలకు దేవుణ్ని ఒక భాగస్వామిగా చేసుకోవడంతో పాప పరిహారమయిందని  ఆత్మవంచన చేసుకుంటూ హాయిగా  బ్రతికేయవచ్చు. సారీ హిమా, నిన్ను నొప్పించడం నా అభిమతంకాదు. గానీ ఒక బాధ్యత కల ఆఫీసరు కాక నిన్ను ప్రేమించే సాగర్ గా కూడా నీకీ విషయం చెప్పక తప్పడంలేదు.

    "ఒకవేళ అక్కయ్యే  నిజంగా అంత ద్రోహానికి తల పెడితే తనను పట్టివ్వడానికి సహాయం చేసేవాళ్ళలో నేనే మొదటిదాన్ని, సాగర్! కానీ....ఇంకా అక్కయ్యమీద అలాంటి అనుమానం కలగడం లేదు."

    "నీ నమ్మకం నిజమయితే  అంతకంటే  కావల్సిందేముంది హిమా! నీలో నాకు నచ్చే గుణం అదే. చాలామంది తన వాళ్ళు అనేప్పటికి  వాళ్ళ తప్పుల్ని  ప్రత్యక్షంగా చూసినా  వాళ్ళనే సమర్ధిస్తారు. శేఖరం హత్య జరిగిన రోజున నువ్వు నన్ను అనుమానించినా నాకు బాధ కలగలేదు. నీలో నీజాయితీని  అర్ధం చేసుకున్నాను. అందుకే ఇప్పుడీ విషయం నీతో ధైర్యంగా చెప్పాను. అది మనసులో పెట్టుకుని నాతో సహకరిస్తే నా పరిశోధన సులభమవుతుంది."

    "తప్పకుండా చేస్తాను సాగర్! ఐ ప్రామిస్ యూ!"


                         *    *    *

 Previous Page Next Page