శివయ్య ఎన్నోసార్లు భూతవైద్యుణ్ని పిలిపిస్తానన్నా ఒప్పుకోలేదు పద్మజ. శేఖరం ఆత్మవల్ల తనకు కలుగుతున్న నష్టం ఏమీలేదు. ఆ తర్వాత ఆ మధ్య దాదాపు ప్రతిరోజూ శేఖరం గిరిలో కనిపిస్తుండటంతో పద్మజకు అది అలవాటైపోయింది. భయం వెయ్యడంలేదిప్పుడు. పైగా గిరికి మాటిమాటికీ తలనొప్పి కూడా తగ్గిపోయింది.
శేఖరానికి అన్యాయం జరిగిందేమోనని అప్పుడప్పుడు బాధపడుతుండేది. ఇదివరలో పైగా హిమజ అన్నట్లు శేఖరం అంటే తనలో ఏమూలో ప్రేమ కూడా ఉందేమో - ఇప్పుడు గిరిలో ఈ ద్వంద్వ ప్రవృత్తి ఆమెకు ఆనందాన్నే కలిగిస్తోంది. పైగా ఎక్కువగా ఇంటిపట్టున వుండడానికి ఆవకాశం లభిస్తోంది.
గిరిలో శేఖరాన్ని కూడా ప్రేమిస్తోందా తను ?
చాలా చిత్రంగా - ఈ ఆలోచన ఆమెలో అవసరమైనంత గిల్టీనెస్ ని కలిగించలేదు. శేఖరంతో మామూలుగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. అతడు గిరిని వదిలి వెళ్ళిపోయేవరకూ అతడి కిష్టమైన విషయాలు మాట్లాడి సంతృప్తి పరిచేది.
* * *
రాత్రి పదకొండు దాటింది. ఫైల్స్ ముందు పెట్టుకుని గబగబా రాసుకుంటోంది పద్మజ.
టక్....టక్....తలుపుమీద రెండుసార్లు చప్పుడైంది.
పద్మజ ఉలిక్కిపడింది. అది శేఖరం సిగ్నల్. అంటే ?
"కమిన్" అంది.
తలుపు తెరుచుకుని లోపలకు వచ్చాడు గిరి.
"శేఖరం" అప్రయత్నంగా అంది పద్మజ.
"చాలా పని వున్నట్లుందే. నేను సాయం చెయ్యనా?" అడిగాడు తను ఎంతో మామూలుగా, అతి సహజంగా.
"ష్యూర్! వెల్ కం" అంది పద్మజ.
రామయ్యకు నిద్ర రావడంలేదు. శివయ్య ఇంట్లో లేడు. బంధువుల ఇంటికని చెప్పి వెళ్ళాడు. కానీ తనకు తెలుసు ఎందుకు వెళ్ళాడో. ఎన్నిసార్లు చెప్పినా పద్మజ వినిపించుకోవటం లేదని ఎక్కడో పూజలు చేయించొస్తానని చెప్పి వెళ్ళాడు. అతడికి ఒంటరిగా పడుకోవాలంటే భయంగా వుంది. నల్లమందు వేసుకుని మత్తుగా నిద్రపోవాలని వుంది, కానీ పద్మ జమ్మ ఇంకా పని చేసుకుంటోంది. అప్పుడప్పుడు పిలిచి టీ పెట్టి ఇవ్వమంటుంది. తను లేవకపోతే కోప్పడుతుంది. ఆవిడకు ఫ్లాస్క్ లో టీ ఇష్టం వుండదు. తాజాగా పెట్టి ఇవ్వాలి.
పోనీ ఒక్కసారి అడిగివస్తేసరి. మెల్లిగా మెట్లెక్కాడు. పద్మజ గది తలుపు దగ్గరగా వేసి వుంది. చప్పుడు చేస్తే ఆమెను డిస్టర్బ్ చేసినట్లవుతుందని, కాస్తగా తెరిచివున్న తలుపు సందుల్లోంచి చూశాడు రామయ్య.
గదిలో దృశ్యం అతణ్ని భయభ్రాంతుణ్ని చేసింది. ముఖ్యంగా గిరి అవతారం. గిరి కళ్ళు ఎర్రగా వున్నాయి. ఫైల్స్ మీద విమానంకన్నా ఎక్కువ వేగంతో చెయ్యి కదుపుతూ ఏదో వ్రాస్తున్నాడు. కాళ్ళు పక్కమీద పెట్టుకుని ఒక చెయ్యి పద్మజ చేతిమీద వేసి వ్రాస్తున్నాడు. అతడు వ్రాసేదాన్ని ఆశ్చర్యంతో ఆమె గమనిస్తూంది. అతడామె భర్తలా లేడు. ఆమె విషయం గమనించిందో లేదో తెలీదు కానీ బయటి వాళ్ళకు గిరి మొహంమీద శేఖరం ముద్ర స్పష్టంగా తెలుస్తూంది. ముఖ్యంగా కళ్ళు.... గిరి మొహంలోంచి కళ్ళు తీసేసి, శేఖరం కళ్ళు అమర్చినట్లుగా వుంది వదనం. చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు రామయ్య గుండెలదురుతూండగా. ఒకసారి హిమజను లేపి చెప్పాలనిపించింది. కానీ ఆ చప్పుడికి పైన వాళ్ళు వచ్చేస్తే అతడిని అయోమయంలో పడేసింది గిరికాదు, మరో దృశ్యం. బెడ్ రూంలో తెర వెనకవున్న రెండు కాళ్ళు. అవి కాళ్ళేనా లేక తన భ్రమా? ఏది ఏమైనా హాల్లో ఒంటరిగా పడుకోవడానికి భయం వేసిందతనికి. వంటింట్లోకి వెళ్ళి నల్లమందు మాత్ర ఒకటి వేసుకుని దుప్పటి పరుచుకుని ఒక మూల పడుకున్నాడు. కాసేపటికి మత్తుగా అనిపించింది. 'హమ్మయ్య. నిద్ర పడుతోంది' అనుకున్నాడు.
గదిలోకి ఎవరో వచ్చిన చప్పుడు. కళ్ళు తెరవాలనుకున్నాడు. నల్ల మందు పనిచేయడం ప్రారంభించింది. మత్తుగా వుంది. ఏదో వాసన ఏమిటది? వేపాకు వాసనలా అనిపించింది. శివయ్య పూజ చేయించి వచ్చాడా? ఎవరో ఆకుల్ని తనమీద మెల్లిగా నిమురుతున్నట్టు భావన. అతనికి భయం వేసింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నిద్రపట్టేసింది బాగా.
* * *
ఉలిక్కిపడి నిద్ర లేచింది పద్మజ. అంత అకస్మాత్తుగా ఎలా నిద్ర పట్టిందో ఆమె కర్ధంకాలేదు. వాతావరణంలో అస్వాభావికత. ఎక్కడుంది తను? చుట్టూ చూసింది....తన బెడ్ రూమ్ లోనే తన పక్కమీదే....పక్కకు తిరిగి చూసింది. గిరి పక్కమీద నిటారుగా కూర్చునున్నాడు. ముందు ఫైల్స్ అలాగే వున్నాయి. అతని ముఖం చాలా సీరియస్ గా వుంది. పిడికిళ్ళు గట్టిగా మూసుకున్నాయి. చాలా టెన్షన్ లో ఉన్నట్లున్నాడు.
"గిరీ!" పిలిచింది మెల్లిగా.
అతను మాట్లాడలేదు.
"శేఖరం" అంది అనునయంగా.
"మరో మరణం సంభవించబోతోంది ఈ ఇంట్లో" అన్నాడతను.
పద్మజ నిద్రమత్తంతా వదిలిపోయింది.
"ఏమిటి శేఖరం మీరు మాట్లాడేది? ఎవరి గురించి ?" అడిగింది గాభరాగా.
"నన్ను వెళ్ళగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి పద్మజా! నా మాట వినడంలేదు మీరు. నేను వెళ్ళను. వెళ్ళలేను. నా ఆత్మకు శాంతి ఈ విధంగా లభించదు. నాకు కావల్సింది ఎవరికీ అర్ధంకాదు. మీ వాళ్ళు చేసే పూజలు వికటిస్తాయి. దాని ప్రభావం మరో ప్రాణి ప్రాణాలు తీసుకుంటోంది, ఈ ఇంట్లో" అన్నాడతను బాధగా.
పద్మజ వళ్ళు గగుర్పొడిచింది.