"నమస్కారం, వేదప్రకాశంగారూ!"
వేదప్రకాశం తిరిగి నమస్కరించి, "రండి, కూర్చోండి!" కుర్చీలో కూర్చోజేసి, తానూ క్రిందనుండి లేచి మరో కుర్చీలో కూర్చొన్నాడు. "ఏమిటి, విశేషాలు?"
"విశేషమే వుంది?"
"నిజమే! మీరు విశేషం లేకుండా వచ్చేవాళ్ళు కాదు కదా?"
"మీ గృహం ఒక పుణ్యక్షేత్రం లాంటిది! విశేషం లేకపోయినా రాతగిన చోటిది. తీరికలేక రాలేకపోతున్నాను గాని రోజూ ఒక పదినిమిషాలు మీ సమక్షంలో గడిపితే మనసు ఎంతో ప్రశాంతమైపోయేది!"
"అవునా?" స్నిగ్ధంగా నవ్వాడు వేదప్రకాశం. "చినరాణి గారి కుమారుడు యోగ్యుడేనా? చదువు పూర్తి అయిందా?"
"పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యింది. ఇంకా చదువు కొనసాగించే ఉద్దేశ్యం వున్నట్టుంది. ఇక యోగ్యుడు అవునో కాదో చెప్పలేను. ఎందుకంటే, మొన్నటి వరకు తల్లిదండ్రుల శ్రాద్దకర్మ. సంతర్పణలూ, దానాలు, ధర్మాలు అయ్యాయి. ఇక మంచిరోజు చూసి ఆఫీసు ప్రవేశం చేయించి అన్ని విషయాలూ బోధపరుద్దామనుకొన్నాను. కాని, ఆయన తిరిగి లండన్ వెళ్ళిపోతానంటున్నారు!"
"మరి ఇక్కడ........."
"అదే కదా వచ్చిన సమస్య! ఈ ఎస్టేట్ ను ఎప్పుడు కబళిద్దామా అని దాయాదులు పొంచి కూర్చున్నారు! ఈయనేమో ఇరవయ్యేళ్ళు వచ్చినా బొత్తిగా పసిపిల్లవాడి మనస్తత్వం! వట్టి అమాయకత్వం! ఇంత పెద్ద ఎస్టేట్ ను అజమాయిషీ చేయాలంటే అవి బొత్తిగా పనికిరావు. కత్తిలా కరుకుదనం, చురుకుదనం కావాలి. కొస తగిలితే చాలు అన్నీ చుట్టి వేయగల తెలివి తేటలుండాలి. ఈయన తాతదండ్రులకు పూర్తిగా భిన్నంగా పుట్టిన మనిషి, బొమ్మలు గీచుకొంటూనో , పాటలు పాడుకొంటూనే జాలీగా తిరిగే మనిషి తప్ప బరువు బాధ్యతలు పట్టించుకొనే రకం కాదు. పచ్చిక కొసలు మేస్తూ మైదానంలో తిరిగే లేడి కూన లాంటి వాడు ఆయన! ఆయన్ని మన భ్రమరాంబిక చాలా అపార్ధం చేసుకొంది. మొన్నటి నుండి ఆయన బాధ వర్ణనాతీతం!"
రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన చెప్పాడు. "భ్రమరాంబిక మీకీ సంగతి చెప్పిందా?"
"ఉహు చెప్పలేదు!" కనీకనిపించని నవ్వు ఆయన ముఖంలో ఏమైనా ఉంటే అది ఈ సంఘటన వినడంతో మాయమైపోయి పూర్తిగా గంభీరంగా తయారైంది.
"భ్రమరాంబికను పిలవండి! నేనామెతో మాట్లాడతాను! మీరు కూడా నచ్చజెప్పండి. ఆమె అపార్ధం తొలిగితో తప్ప చినబాబుగారి మనసు కుదుటపడదు. నిన్నటి నుండి ఆయన భోజనం చేయలేదు. అంతగా ఆయన మనసు గాయపడిందంటే ఆయన ఎంత సున్నిత మనస్కుడో అర్ధం చేసుకోండి!"
"సోమూ! భ్రమరాంబికను పిలువరా!" పిల్లవాడిని లోపలికి పంపాడు వేదప్రకాశం.
ఇరవయ్యేళ్ళక్రితం ఆయన చెల్లెలు లలితాపరమేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం మనసులో మెదిలింది! నివురుగప్పిన నిప్పును ఊది ప్రజ్వరిల్లజేసినట్టుగా అయింది ఈ సంఘటన వినడంతో! చరిత్ర పునరావృతం అవుతూందా? ఈ ఇంటి ఆడపిల్లలకు ఇదేదైనా శాపం ఉందా?....... ఆయన మనసు కలవరపడింది.
ధర్మలింగం అన్నాడు భ్రమరాంబిక వచ్చాక. "అమ్మా, భ్రమరాంబికా! వికాస్ బాబు గురించి చెప్పడానికి వచ్చానమ్మా! ఆ రోజు ఆయన దురుద్దేశ్యంతో మిమ్మల్ని తాకలేదని, ఒక కళాత్మకమైన భావన తప్ప నీచమైన ఆలోచన లేదని వాపోతున్నాడు. అదే మీతో చెప్పమన్నాడు. మీ చేతుల్ని కాల్చుకొని తనని ఘోరంగా అవమానించావని కూడా చెప్పమన్నాడు! ఆయన చెప్పింది మనం నమ్మొచ్చునని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఆ మనిషి ఇంకా మాయామర్మాలు వంట పట్టించుకోలేదు. పాలలా స్వచ్చమైన మనసు, గోవులా సాధువు, ముఖ్యంగా చిత్రకారుడు. వాళ్ళకి సహజంగా భావుకత ఎక్కువ. సౌందర్యపిపాస ఎక్కువ. చిన్నప్పటి నుండి మేనమామల దగ్గర లండన్ లో పెరిగాడు కదమ్మా! ఈ దేశం ఆడపిల్లలు ఎలా మడికట్టుకొని వుంటారో తెలియక, పరాయి పురుషుడు కొనగోటితో తాకినా తమని తాము ఎలా దగ్ధం చేసుకుంటారో తెలియక చప్పున తాకాడు. ఆ తాకడంలో ఇంత అనర్ధం పొంచివుంటుందని తెలియదు!"
"రాయబారం బాగానే తెచ్చారే!" భ్రమర నవ్వింది. వంకరనవ్వు అంటారే అదీ! "ఇరవయ్యేళ్ళక్రితం ఆయన తండ్రి తుంగభద్రతో నడిపిన రాయబారం వల్ల మా కుటుంబానికి జరిగిన ద్రోహం గురించి మేమింకా మరిచిపోలేదని చెప్పండి పులి కడుపున గోవు పుట్టదని కూడా చెప్పండి." కరుగ్గా అంది.
ధర్మలింగం చెదరని శాంతంతో అన్నాడు "పులి కడుపున గోవు పుట్టదు! నిజమేనమ్మా, భ్రమరాంబికా, కాని, పులిలాంటి మనిషి కడుపున గోవులాంటి మనిషి పుట్టడం మాత్రం అసంభవం కాదు.
"ఆయన గోవులాంటి మనిషో, పులిలాంటి మనిషో మా కనవసరమండీ. అంత పనిగట్టుకువచ్చి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి?"
"నేను పనిగట్టుకు ఎందుకు చెబుతున్నానంటే ఆయన చాలా సున్నిత మనస్కుడు. నువ్వు తనని అపార్ధం చేసుకొన్నావని చాలా బాధపడుతున్నాడు. ఆయన బాధ దూరం చేయవలసిన బాధ్యత మేనేజరుగా నాది కదమ్మా? అందుకని వచ్చాను. మీ అపార్ధం తొలగితే తప్ప ఆయన బాధ దూరంకాదు. వేద ప్రకాశంగారూ! మీరైనా మీ అమ్మాయికి నచ్చజెప్పండి"
"నచ్చజెప్పడానికి అంత అర్ధంకాని సంగతేం కాదు. భ్రమరాంబిక అంత తెలివి తక్కువదీ కాదు. అపార్ధమే చేసుకొందో సరిగానే అర్ధం చేసుకొందో ఇకా సంగతి పోనీయండి. మీ చినబాబుగారికి నామాటగా చెప్పండి, మరోసారి మా ఇంటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని" కటువుగా గంభీరంగా ధ్వనించింది వేదప్రకాశం స్వరం.
ధర్మలింగం కొంచెం నిరాశగానే లేచాడు. "వస్తానండీ వేదప్రకాశంగారూ! వస్తానమ్మా, భ్రమరాంబికా." రెండడుగులు వేసి ఆగి అన్నాడు తిరిగి "మీరు ఒక మామూలు కర్రను చూసి పాముగా భ్రమపడుతున్నారని చెప్పకతప్పదు."
"కర్రయితే ఫర్వాలేదు. పామే అయితే ఈసారి దాని తల చితికిపోక తప్పదు" భ్రమర కరుగ్గా అనడం వెనుక నుండి వినిపించింది.
* * *