Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 25


    "ఇంత మోసం చేస్తావా? ఛీ. నీలాంటి వాడిని నమ్మటం నాదే బుద్ధి తక్కువ" అనేసి వెనక్కు తిరిగి వడివడిగా పరుగెత్తసాగిందామె.
    "సంగీతా! ఒక్క నిమిషం! సంగీతా! ప్లీజ్ నేను చెప్పేది విను" తనూ ఆమె వెనుక పరుగెత్తసాగాడతను.
    అతని షర్టుకీ, శారద చీరకూ పురోహితుడు ముడివేసి ఉండడంతో తనూ అతనితోపాటే పరుగెత్తాల్సి వచ్చింది.
    కానీ దురదృష్టవశాత్తు సంగీత చాలా స్పీడ్ గా పరుగెత్తటంతో చిరంజీవి అండ్ శారదలు అందుకోలేకపోయారు.
    "నీ మూలానే నా సంగీత నన్ను అపార్థం చేసుకుంది" ఏడుపు ఆపుకుంటూ అన్నాడు చిరంజీవి.
    "అపార్థాలు సినిమా ఆఖర్లో విడిపోతాయి. అంతవరకూ ఎడ్జస్టవండి ఏం చేస్తాం" అన్నాడు ఒక స్టూడెంట్.
    అందరూ ఘొల్లుమన్నారు మళ్ళీ.
    చిరంజీవిని బరబరా కారు దగ్గరకు ఈడ్చుకెళ్ళింది శారద.
    "చేసిన నిర్వాకం చాలు! ఇంక యింటికి పదండి" అంది.
    చిరంజీవి కారు స్టార్ట్ చేశాడు.
    "పెళ్ళి చేసుకుంది నన్ను. అదెవత్తో అపార్థం చేసుకుందని ఇదవుతారేమిటండీ? అయినా భగవంతుని సాక్షిగా మన పెళ్ళయిపోయాక ఇప్పుడీ పిచ్చిపనేమిటి? అదెవత్తో అపార్థం చేసుకుంటుందని అనుకుంటున్నారేగానీ కట్టుకున్నది అపార్థం చేసుకుంటుందేమో అన్న ఫీలింగే కలగటం లేదే మీకు? జీవితాంతం కలసి బ్రతకాల్సిన వాళ్ళం మనం. మన మధ్య అపార్థాలు రాకుండా ఉండటం ముఖ్యమా? అదెవత్తో అపార్థం చేసుకోకుండా ఉండటం ముఖ్యమా?"
    చిరంజీవి ఆమె మాటలు వినిపించుకోవటం లేదు.
    ముందు శారదను ఎక్కడో చోట వదలి, సంగీతను కలుసుకోవాలి. జరిగిన పొరబాటుని వివరించాలి. తనింకా ఆమెను అదివరకు లాగానే ఆరాధిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడనీ చెప్పాలి. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడని తెలియజేయాలి.
    కారు అందమైన బంగళా ముందాగింది.
    "ఇక్కడాపారేమిటి?" అడిగింది శారద ఆశ్చర్యంగా.
    "ఇవాళ్టినుంచి ఇదే మనిల్లు"
    ఆమె కారు దిగింది. "ఇంత మంచి ఇల్లు మనదా?"
    "అవును! ఇకనుంచి నువ్విక్కడే ఉండాలి"
    ఆమె అనుమానంగా అతనివేపు చూసింది.
    "మీరెక్కడ వుంటారు మరి?"
    "నా యిష్టం! ఎక్కడయినా వుంటాను. సవాలక్ష పనులుంటాయి నాకు."
    ఆమె మొహం సీరియస్ గా మారిపోయింది "అంటే? నేనేమన్నా మీ ఉంపుడుగత్తెననుకున్నారా? ఓ యింట్లో పడేసి వుంచడానికి. ఇదిగో! మర్యాదగా చెప్తున్నాను వినండి. మనం సంసారం చేయబోతున్నాం. రంకుతనం కాదు. తెలిసిందా? నేనీ ఇంట్లో ఒక్కదాన్ని వుండీ మీకోసం ఎదురుచూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, స్తంభాలను, తలగడ దిళ్ళనూ కౌగిలించుకుని విరహ వేదనలు అనుభవిస్తూ 'వస్తాడే నా రాజు ఈనాడే' అని పాటలు పాడుకునే కావ్య నాయికనూ, వంకాయల నాయికనూ కాదు. మీరు యింటికి రాకపోయినా, నన్ను నిర్లక్ష్యం చేసి ఆ సంగీతతో వెధవ్వేషాలేస్తున్నారని తెలిసినా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. మీరెక్కడ వున్నా, ఎంతమందిలో వున్నా మనిద్దరి పరువూ పోయేలా ప్రవర్తిస్తాను గుర్తుంచుకోండి" అనేసి విసవిసా యింట్లోకి నడిచిందామె.
    ఇల్లు చాలా అందంగా, ఆధునికంగా వుంది.
    ఇంటి నిండా స్త్రీ నగ్న చిత్రాలు ఉన్నాయి. బెడ్ ల చుట్టూ నిలువెత్తు అద్దాలు.
    ఓ నౌఖరు పరుగుతో ఆమె వెనుకే వచ్చాడు. "రండమ్మా! మాస్టర్ బెడ్ రూమ్ పైన ఉంది. అయ్యగారు అదే వాడతారు"
    శారదకి టాపిక్ అర్థమయింది. కాని అర్థం కానట్లు నటించి అతడిని ఫాలో అయ్యి మేడ మీదకొచ్చింది. బెడ్ రూమ్ తలుపు తెరిచాడతను.
    "ఎన్నిరోజులుంటారమ్మా ఇక్కడ?"
    "షటప్! నేనెవరనుకున్నావ్?"  
    వాడికి అర్థం కాలేదు "తెలీదమ్మా...! ఇంతకు ముందెప్పుడూ మీరీ గెస్ట్ హౌస్ కొచ్చిన గుర్తులేదు."
    "నేనలా అప్పుడప్పుడు వచ్చివెళ్ళేదాన్ని కాదు. తెల్సిందా? ఈ యింటికి యజమానిని! ఇకనుంచి దీని పేరు గెస్ట్ హౌస్ కాదు! మా ఇల్లు! అర్థమయ్యిందా?"
    వాడు పూర్తిగా కన్ ఫ్యూజ్ అయిపోయాడు.
    "అర్థమయ్యిందమ్మా!"
    "నువ్వీ ఇంట్లో ఈ క్షణం నుంచీ నౌఖరువి! వాచ్ మెన్ వి కాదు. అందుకిష్టమయితే నీ ఉద్యోగం వుంటుంది. లేకపోతే పోతుంది."
    వాడు బెదిరిపోయాడు "అంటే తమరు...అయ్యగారికి...అంటే మీరూ అయ్యగారూ"
    "అవును. నిన్నే మేం పెళ్ళిచేసుకున్నాం."
    "ఇప్పుడర్థమయిందమ్మా! ఇంక మీరేం చెప్తే అది చేస్తానమ్మా!"
    ఆమె మెట్లు దిగి క్రిందకు వచ్చేసరికి చిరంజీవి హాల్లోనే సోఫాలో కూలబడి వున్నాడు. అతని మొహంలో కళ కనిపించటంలేదు. ఆమె చెప్పిన మాటలే ఇంకా చెవిలో గింగురుమంటున్నాయి.
    "మర్యాదగా చెబుతున్నాను వినండి! మనం సంసారం చేయబోతున్నాం. రంకుతనం కాదు. నన్ను నిర్లక్ష్యం చేసి ఆ సంగీతతో వెధవ్వేషాలేస్తున్నారని తెలిస్తే చాలు. మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చి మనిద్దరి పరువూ తీసేస్తాను."
    తను అనవసరంగా ఆ పాడు తాగుడు మూలాన ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాడు? ఇప్పుడీ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా?
    నౌఖరు గదిలోని నగ్న చిత్రాలన్నీ చింపి చెత్తబుట్టలో వేసేయడం కనిపించేసరికి ఉగ్రుడైపోయాడతను.
    "ఒరే కిష్టిగా"
    "ఏం సార్?"
    "ఎందుకు చింపుతున్నావురా అవన్నీ? ఇడియట్! వాటి ధరెంతో తెలుసా? నీకు ఒక్కొక్కటీ రెండు వేల రూపాయలు. ఎందుకు చేస్తున్నావురా యీ పని? ఎవర్నడిగి చేస్తున్నావురా?"
    వాడు వణికిపోయాడు "అమ్మగారు తీసేయమన్నారండీ"
    "ఈ ఇంటికి యజమాని ఎవర్రా? నేనా, అదా?"
    "మీరేనండీ"
    "మరి అది చెప్పిన మాటెందుకు విన్నావు?"
    "పొరపాటయిపోయింది సార్"
    "ఇంకోసారిలాంటి పిచ్చి పనులు చేస్తే బయటకు గెంటేస్తాను. జాగ్రత్త."

 Previous Page Next Page