Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 26


                                                   అవినీతి ! జిందాబాద్!
    ఆఫీస్ లో మా పక్క సీట్లో వున్న నర్సింహం పట్టుబడిపోయాడు.
    ఎవరో కాదు. మా ఆఫీసరే స్వయంగా యాంటి కరప్షన్ వాళ్ళను పిలిపించి నరసింహాన్ని పట్టించాడు.
    మేమంతా చూస్తూనే వున్నాం ఆ డ్రామా.
    అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక కాంట్రాక్టర్ ని పంపించారు నరసింహం దగ్గరకు.
    నరసింహం అతనిని మామూలుగానే రెండువేలు అడిగాడు. అతను ఇచ్చేశాడు.
    ఆ డబ్బు తన సొరుగులో వేసుకున్నాడు నరసింహం చాలా కాజువల్ గా. ఆ కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పంపించారని మేము సైగలు చేస్తూనే వున్నాం. అయినా నరసింహం పట్టించుకోలేదు. ఆ కాంట్రాక్టర్ ఫైల్ మీద అతను కోరిన విధంగా రాసేశాడు. ఆ పని పూర్తవగానే బయట దాక్కున్న నలుగురు అధికారులు పరుగుతో లోపలికొచ్చేసి నరసింహం రెండు చేతులూ గట్టిగా పట్టుకున్నారు. తమ అయిడెంటిటీ కార్డ్స్ చూపించి అతనిని మా ఆఫీసరు గదిలోకి తీసుకెళ్ళారు.
    అప్పటికప్పుడే మా ఆఫీసరు బక్కెట్లో నీళ్ళు తెప్పించాడు. అతని చేతులు నీళ్ళల్లో పెట్టారు వాళ్ళు. ఆ నోట్ల ద్వారా అతని చేతికంటిన రంగు నీళ్ళ రంగుని మార్చేసింది.
    "యూ ఆర్ అండర్ అరెస్ట్" అన్నారు వాళ్ళు.
    "ఎందుకు? తాపీగా అడిగాడు నరసింహం.
    "లంచం తీసుకున్నందుకు-"
    "నేను లంచం అడగలేదే! బలవంతంగా నాచేతులు పట్టుకుని మీరే ఆ నోట్లు నా చేతికి తాకించి నా సొరుగులో వేశారు."
    "అబద్ధం!" ఈ కాంట్రాక్టర్ దగ్గర నువ్వు తీసుకున్న లంచం అది."
    "అని మీరంటున్నారు - నన్ను బలవంతంగా చేతులు కట్టేసి మీరే ఇదంతా అల్లి చెబుతున్నారని నేనంటున్నాను. నాకు సాక్ష్యంగా మా ఆఫీసు స్టాఫంతా వున్నారు" అన్నాడు నరసింహం."
    మా ఆఫీసరూ, ఆ అవినీతి నిరోధకశాఖ సిబ్బంది మా అందరివేపూ చూశారు.
    "మీరూ చూశారు కదా - ఇతను లంచం తీసుకోవడం?" అడిగారు వాళ్ళు. మేమెవ్వరం మాట్లాడలేదు. నరసింహం నవ్వాడు.
    "చెప్పండి బ్రదర్స్- భయపడతారెందుకు? వీళ్ళే బలవంతంగా నా చేతిలో డబ్బు పెట్టారు కదూ?"
    "అవును!" అన్నారు మాలో చాలామంది. యాంటీ కరప్షన్ వాళ్ళ ముఖాలు మాడిపోయిననయ్. ఆఫీసర్ నిశ్చేష్టుడయ్యాడు.
    "మీరంతా అబద్ధాలు చెబుతున్నారు" అరిచారు వాళ్ళు ఆవేశంగా.
    "అవును" ఒప్పుకున్నారు మా వాళ్ళు.
    "మిమ్మల్నందరినీ కూడా అరెస్టు చేస్తాం."
    "ఏడ్చారు - ఇలా అవినీతిపరులందరినీ అరెస్టు చేసుకుంటూ వెళితే చివరకు మనదేశం చుట్టూ గోడలు కట్టి దానికి జైలు అని పేరు పెట్టాల్సి వస్తుంది" అన్నాడొకతను.
    "మిస్టర్ - నరసింహం! నువ్వు ఎంత బుకాయించినా లాభం లేదు. ఈ డబ్బు తీసుకున్నట్టు వీళ్ళు చెప్పకపోయినా ఇంకో రుజువుంది" అన్నారు వాళ్ళు.
    "ఏమిటది?"
    "ఈ కాంట్రాక్టర్ ఫైల్స్ మీద నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు రిమార్కు రాశావ్ - అది చాలు నిన్ను మూసేయడానికి" నర్సింహం విరగబడినవ్వాడు.
    "అది! ఒక వ్యక్తి అలా రాయమని కోరడం వల్ల రాయాల్సి వచ్చింది."
    "ఎవరా వ్యక్తి?"
    "ఎవరో తెలీదు. బట్టతల వున్ది౧ బహుశా ఎవరో రిక్షావాడు అనుకుంటాను. ఆ విషయం చెప్పాక రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు."
    "ఏం చెప్పాడతను?"
    "ఆ కాంట్రాక్టర్ ఫైల్ మీద ఈ విధంగా రాసెయ్" అన్నాడు.
    "అంటే ఎవరో ముక్కు మొఖం తెలీనివాళ్ళు ఏదో చెపితే చేసేయడమేనా?"
    "అతను మా హెడ్డాఫీసునుంచి వచ్చిన అధికారి అయుంటాడనుకున్నాను. రిక్షా వాడి వేషంలో-"
    "మన కేంద్ర మాజీమంత్రి సోలంకిగారు కూడా వేలిముద్రగాడు కాదు కదండి."
    "సోలంకికీ నీకూ ఏమిటి పోలిక? ఆ విషయం ఎందుకు చెబుతున్నావిప్పుడు?"
    "ఎందుకంటే ఆయన కూడా నాలాగానే ఎవడో నల్ల బట్టలేసుకుని వచ్చి "ఏయ్ యూనియన్ మినిష్టర్! ఈ కాగితం స్విట్జర్లాండ్ కు పంపించు! అంటే పంపించేశాడు కదండీ - నువ్వెవరు? నీ పోస్టేమిటి? బయటిదేశంలో కోర్టుకి నీలాంటి ఉల్ఫాగాడు నోట్ లు పంపడం ఏమిటి? అంటూ ఏమయినా అడిగాడా? ఏమీలేదే! అంత గొప్ప మినిష్టరే ఏమీ అడక్కుండా ఎవడేది చెబితే అది చేసేస్తుంటే ఆఫ్ట్రాల్ నాలాంటి గుమస్తాగాడేం అడగ్గలడు సార్!"
    "ఇదిగో! మనదేశంలోని మంత్రుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేశ ద్రోహం క్రింద కేస్ బుక్ చేస్తాం- మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయింది- ఇంతవరకు ఒక్క మంత్రి అయినా అవినీతిపరుడని ఎవరయినా రుజువు చేయగలిగారా?"
    "నేననేది అదేనండీ! వట్టి ఆరోపణలే గాని నిజానికి మన రాజకీయనాయకులందరూ శ్రీవైష్ణవుల్లాంటి వాళ్ళండీ! మరి అలాంటి నీతిమంతులు కింద పనిచేసే వాళ్ళం మేము మాత్రం అవినీతిపరులెట్లా అవుతాం సార్ -" వాళ్ళకి ఏం మాట్లాడాలో తోచలేదు.
    "ఆల్ రైట్! ముందు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నువ్వు నిర్దోషివో కాదో కోర్టులో తేలుతుందిలే" అన్నాడు ఆ ఆఫీసరు.
    ఈ గొడవంతా ఎందుకులెండి! నేను ఇప్పటికే ఈ సీట్లో నాక్కావలసినంత సంపాదించుకున్నాను - అందుకని నేనే నా జాబ్ కి రిజైన్ చేస్తాను" అంటూ పరపరా ఓ కాగితం మీద రికగ్నేషన్ లెటర్ రాసిచ్చాడతను.
    "రాజీనామా చేసినా నిన్ను వదిలేది లేదు. నీకున్న ఆస్తులన్నీ చెక్ చెశాఅమ౧ నీకొచ్చే నాలుగు వేల జీతంతో అన్ని ఆస్థులు ఎలా సంపాదించావో నువ్వు వివరించాలి"
    "ఇది అన్యాయం! మన భారతదేశంలోని రూల్స్ ప్రకారం ఎంత అవినీతిపరుడినయినా సరే - ఉద్యోగానికి రాజీనామా చేస్తే వదిలేయాలి గానీ ఇలా ఆస్తుల మీదికి వెళ్ళకూడదు."
    "అలాంటి రూల్స్ గురించి మేమెక్కడా వినలేదే?" నరసింహం మళ్ళీ పగలబడి నవ్వాడు.
    "మీకీమాత్రం ఇంగితజ్ఞానం లేదంటే అసలు మీరీ ఉద్యోగాలకే అనర్హులు! ఎప్పుడో పాతికేళ్ళక్రితం ఈ షేర్ల అవినీతి కార్యక్రమాల్లోనే కృష్ణమాచారి అనే మంత్రి ఉద్యోగం వదిలేశాడు. అంతూలే కూడా ఈ అవినీతి వ్యవహారాల్లోనే ముఖ్యమంత్రి జాబ్ వదిలేశాడు. ఈ మధ్య చెన్నారెడ్డి గారి హయాంలో ఓ మంత్రి అవినీతిపనులు చేశాడని అందరూ అన్నందుకు మనసు కష్టపెట్టుకుని ఉద్యోగం చేయను పొమ్మన్నాడు.


    సోలంకి సంగతి సరేసరి! ఎవడో ముక్కు ముఖం తెలీనివాడు చేసిన పాపానికి బలయిపోయాడు. నిన్నగాక మొన్న ఆ షేర్ల కుంభకోణంతో తనకేమీ సంబంధంలేకపోయినా గానీ పాపం ఆ పాపాల కంపెనీలో భాగస్వామి అయినందుకు కేంద్రమంత్రి చిదంబరంగారు రాజీనామా చేసేశారు.  
    మరి రాజీనామా చేశాక వాళ్ళందరూ పదవిలో వుండగా సంపాదించుకున్న ఆస్తుల గురించి ఎవరయినా పట్టించుకున్నారా? పోనీ ఆ ఆస్తులెలా వచ్చాయ్ అని మీ యాంటి కరప్షన్ వాళ్ళు గానీ సి.బి.ఐ. వాళ్ళు గానీ ఏమయినా విచారణలు జరిపారా? ఎక్స్ ప్లనేషన్ అడిగారా! అడగలేదు. ఎందుకంటే మన భారతదేశం రూల్స్ అందుకు ఒప్పుకోవు!"
    అవినీతి నిరోధకశాఖ వాళ్ళు బుర్ర గోక్కున్నారు. పక్కకు వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
    "నిజంగా అలాంటి రూల్స్ వున్నాయంటారా?"
    "వుండే వుంటాయ్. లేకపోతే ఆ మినిష్టర్ల మీద కూడా చర్య తీసుకునేవాళ్ళే కదా!"
    "అయితే ఇప్పుడేం చేద్దాం మనం?"
    "రిజైన్ చేశాడు కదా - మన దారిన మనం పోదాం" అందరూ మళ్ళీ మా దగ్గరకొచ్చారు.
    "సరే! రిజైన్ చేశావ్ కనుక వదిలేస్తున్నాం!" అనేసి బయటకు నడిచారు. నరసింహం మా అందరికీ ఆ రాత్రి చాలా ఖరీదయిన విందు ఇచ్చాడు.
                              *    *    *

 Previous Page Next Page