ప్రేమ లేఖలు
ప్రతి పత్రికకూ ఓ ఉత్తరాల శీర్షిక వుంటుంది. అందులో రచయితలను, ఎడిటర్ గారిని, కార్టునిస్ట్ లను, జర్నలిస్ట్ లను మెచ్చుకుంటూనో, తూర్పారబడుతూనో ఉత్తరాలొస్తుంటాయ్.
"ఫలానా రచయితగారూ! మీ ఫలానా నవల చదివి చాలా ఆనందించాను. అందుకని నేను రాసిన ఫలానా నవల చదివి మీరూ ఆనందించవలసిందిగా కోరుతున్నాను - ఇట్లు వర్ధమాన రచయిత"
ఆ ఉత్తరంతోపాటు ఓ నవల కూడా వస్తుంది - ఇలాంటి ఉత్తరాలు రచయితలకు ఎడిటర్లకు ఇతర సాహితీకారులకు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు కూడా వస్తుంటాయ్. చాలామంది ప్రముఖులకు ఇలాంట్ లేఖలు వచ్చే అవకాశం వుంది.
గౌ. ముఖ్యమంత్రిగారికి,
నమస్కారం! ఆర్యా! నేను ఇటీవల రాసిన 'ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు' అనే పుస్తకం తమరికి పంపుతున్నాను. ఇది చదివి మీ అమూల్యమయిన అభిప్రాయం వ్రాయగలరు. అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని క్రమబద్ధంగా ఎలా బదిలీ చేయాలి అనే కథాంశంగల ఈ పుస్తకం మీకు భవిష్యత్తులో అద్భుతంగా ఉపయోగపడుతుందని నా నమ్మకం! సారా ఉద్యమ నేపథ్యంలో ఈ పుస్తకం మీకే కాక మీ పార్టీలో అతిరథులు మహారథులందరికీ కంపల్సరీ చేయాల్సిన బాధత్య కూడా తమ భుజస్కంధాల మీద వుందని సవినయంగా మనవి చేస్తూ...మీ...
రాజకీయ రచయిత
ఆంధ్రప్రదేశ్
నోట్: ఈ పుస్తకం ఆర్డర్ మీద మీకు మాత్రం యాభై శాతం రాయితీ ఇవ్వబడును.
* * * *
గౌ. మాజీ ముఖ్యమంత్రిగారికి,
నమస్కారం! మహాశయా! మా సంస్థ ఇటీవల ప్రచురించిన 'రాజకీయాల్లో అస్మదీయులు' అనే గ్రంథం మీకు ఎంతగానో ఉపకరిస్తుందని మా అభిప్రాయం. దేశమంతా కూడా నాయకులు తమ కొడుకులను, కూతుళ్ళను, అల్లుళ్ళను, బామ్మర్దులనూ పదవుల్లోకి తీసుకొచ్చేయడం, దానిమీద దేశమంతా తర్జనభర్జనలు జరగడం మీరు చూస్తూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ అనుమానం కలుగకుండా వెనుక దారిలో అల్లుళ్ళను ఉన్నత రాజకీయ పదవుల్లోకి తేవడం ఎలా అనే అంశం మీద ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఈ పుస్తకంలో పొందపరచడం జరిగింది. మీరు ఆర్డర్ చేసిన ప్రతి కాపీకి డెబ్బయ్ శాతం డిస్కౌంట్ ఇవ్వగలవారము.
ఇట్లు - విధేయులు
అస్మదీయా పబ్లికేషన్స్
* * * *
గౌ. కేంద్రమంత్రివర్యులకు,
ప్రణామములు! 'స్టాక్ మార్కెట్' అనే సరికొత్త పుస్తకాన్ని ఈ మధ్య రచించాను. ఇందులో స్టాక్ బ్రోకర్లతో కుమ్మక్కయి ఎన్ని సంస్థలను, ఎన్ని ప్రభుత్వాలను ఎలా మోసగించి మనం కోట్లు గడించవచ్చో పటాలతో సహా విశదంగా విపులీకరించబడింది. కేంద్రంలో వున్న వివిధ శాఖల మంత్రులు స్టాక్ మార్కెట్ తో ఎన్ని విధాల ఆటలాడుకోవచ్చో కూడా ప్రత్యేకంగా రాసిన విభాగంలో పొందుపరచాను. ఈ పుస్తకం కొన్నవారికి "స్టాక్ షాక్" అనే గేమ్ బోర్డ్, దీంతోపాటు అందమయిన ప్లాస్టిక్ డైస్ కాయిన్సూ ఉచితం. ఒకేసారి ఎంతమందయినా ఈ గేమ్ ఆడుకోవచ్చు.
ఇట్లు - రచయిత మెర్షద్- గెహతా బాంబె
* * * *
పార్టీ అధిష్టాన వర్గానికి,
నమస్తే,
మా సంస్థ ప్రచురించిన "పదవులతో సరిగమలు" అనే మోడ్రన్ టెక్నిక్స్ గల పుస్తకం మీకు ఎంతో అవసరమని మా అభిప్రాయం. ఇందులో కొన్ని చాప్టర్ లు మీకెంతో ఆసక్తి కలిగిస్తాయని మా నమ్మకం.
ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను రగిలించము ఎలా?
పదవి నుంచి తప్పించడానికి పదహారు సూత్రాలు- పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన వారిని బ్లాక్ మెయిల్ చేసే పద్దెనిమిది అద్భుత మార్గాలు- వారసుడిని ఎంపిక చేసేటప్పుడు మనం లాభం పొందడం ఎలా?
విభజించి పరిపాలించేందుకు అవసరమయిన అరవై చిట్కాలు - ఇలా ఎన్నో ఆకర్షణలున్న ఈ పుస్తకం ధర కేవలం మూడొందల తొంభయ్ రూపాయలు మాత్రమే!
బల్క్ ఆర్డర్స్ కి అరవై శాతం రిబేట్.
ఇట్లు
అధిష్టాన ప్రచురణలు, న్యూఢిల్లీ.
* * * *
సారా కాంట్రాక్టర్ గారికి,
ఆర్యా౧ మా పబ్లిషింగ్ హౌస్ వారు ఇటీవల విడుదల చేసిన 'సారా గైడ్' మీకు ఎన్నోవిధాల ఉపయోగపడుతుందని మా నమ్మకము. ఇందులో ఎడిటర్ ఉద్యమాన్నయినా ఎలా నీరుగార్చాలీ అనే ఆరు సూత్రాల పట్టికను ప్రత్యేకంగా రూపొందించాము. ప్రస్తుత సారా ప్రజా ఉద్యమాలను రూపుమాపడానికి మీకు సహాయపడే అనేక ప్రభుత్వ సంస్థల చిరునామాలు, ఆయా అధిపతుల టెలిఫోన్ నెంబర్లు గల మినీ పుస్తకం ఉచితంగా ఈ పుస్తకం కొన్నవారికి లభిస్తుంది.
* ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్- వాళ్ళతోనే సారా అమ్మించడం వల్ల ఉద్యమం దెబ్బతింటుంది.
* ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్- వాళ్ళతోనే సారా తయారుచేయించి వాళ్ళ వాహనాల్లోనే సారా బట్వాడా చేయించాలి.
* పాల పాకెట్ తో పొద్దున్నే సారా పాకెట్ కొంటేనే పాల సరఫరా ఉండేట్టు డెయిరీ డెవలప్ మెంట్ వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి.
* సారాను రాష్ట్రమంతా కంపల్సరీ చేయాలంటే ముఖ్యమంత్రి సహకరించాలి.
* కల్తీ సారా తాగి జనం ఛస్తే - ప్రప్రధమంగా మనం చేయాల్సిన ప్రధమ చికిత్స ఏమిటి?
ఎలా ఎన్నో అద్భుతమయిన ఆధునిక ఉపాయాలున్న ఈ పుస్తకము విలువ ఆరువందలు మాత్రమే.
'సారా' జహాసే అచ్ఛా.
పుస్తక సంఘం
ధూల్ పేట్,
హైద్రాబాద్.
* * * *