సరికొత్త నినాదాలు
మా కాలనీ వాళ్ళందరం ఆరోజు సాయంత్రం మామూలుగానే వేదిక దగ్గరకు చేరి కొత్త ముఖ్యమంత్రి ఎంత అద్భుతంగా పరిపాలించబోతున్నాడు అనే విషయం గురించి చాలా ఎగ్జయిట్ మెంట్ తో చర్చించుకుంటున్నాం.
పానకంలో పుడకలాగా ఒక బిచ్చగాడు చిరిగిన బట్టలతో చేతిలో ఓ చిప్పతో మామధ్యకొచ్చాడు.
"గరీబోడిని బాబూ! ధర్మం చెయ్యండి బాబూ" అన్నాడతను.
మాకు వాడిని చూస్తే భయం వేసింది. ఎందుకంటే ఏ క్షణాన్నయినా దభేల్ మని కిందపడి చచ్చిపోయేటంత బక్కగా, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు.
రంగారెడ్డి ఆశ్చర్యంగా మావేపు చూశాడు.
"వీడు గరీబోడినంటాడేమిటి?" అడిగాడు నమ్మలేనట్లు.
"గరీబోడే అయ్యుంటాడు. వాడి అవతారం కనబడడంలా?" అన్నాడు సాయిరామ్.
"కానీ గరీబోళ్ళు ఇంకెక్కడున్నారు మన దేశంలో! 'గరీబీ హఠావో' అన్న నినాదం ప్రారంభించగానే వాళ్ళంతా డబ్బున్నాళ్ళయిపోయారు కదా!" అన్నాడు గోపాల్రావ్ తెల్లబోతూ. అందరం అయోమయ పరిస్థితిలో పడ్డాం!
"అదే నాకర్థం అవడంలేదు బాబూ! గరీబీ హఠావో అన్నారు గదాని ఎంతో సంతోషించాను. నా బీదతనం పోతుందని ఆశ పడ్డాను. కానీ నేనింకా ఇలా ఉండగానే ఇప్పుడు ఆ నినాదం మానేసి విదేశీ పెట్టుబడులు, ఆర్ధిక సంస్కరణలు అంటున్నారు బాబూ!" కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడతను.
"ఏడవకు, ఏడవకు! అందులో గవర్నమెంట్ తప్పు మాత్రం ఏముందని! గరీబీ హఠావో నినాదం కనిపెట్టి పదిహేనేళ్ళయి పోయింది. సాధారణంగా ఏ నినాదం కూడా అయిదేళ్ళకంటే ఎక్కువ వుండకూడదు. నువ్వే చెప్పు పోనీ! ఈ ఎలక్షన్స్ లో 'గరీబీ హఠావో' అనీ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కూడా 'గరీబీ హఠావో' అంటే ఏం బాగుంటుంది చెప్పు! ఓటర్లేమనుకుంటారు? వాడికి ఈ ఒక్క నినాదం తప్పితే ఇంకేం రాదురా అనుకుంటారు. అందుకని ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు కదా!"
"ఆ మాట నిజమే కాని మరి నా సంగతేమిటి సార్?"
"నువ్వలా ఎప్పుడూ నీ స్వార్థమే చూసుకుంటే దేశం సంగతేమిటి గరీబూ? నీకు దేశభక్తి లేదా?"
"దేశభక్తి లేకపోవడం ఏమిటి సార్? మూడో క్లాస్ చదివేప్పుడు 'సారా జహాసే అచ్ఛా' నేనే పాడేవాడిని ప్రేయర్ లో!"
"అయితే మరి అలా ఆర్ధిక సంస్కరణలకు, విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా మాట్లాడతావేమిటి?"
"నాకు అవంటే కోపమేమీ కాద్సార్! కానీ గరీబీ హఠావో పూర్తవకముందే కొత్త నినాదాలు చేసేసరికి నాకు మనసు చివుక్కుమంది.
"ఆ మాట నిజమేగానీ గవర్నమెంట్ లెక్క ప్రకారం బీదతనం ఎప్పుడో రూపుమాసిపోయింది. అందుకని కొత్త నినాదాలకు వెళ్ళడంలో తప్పులేది. ఒకవేళ అక్కడక్కడ నీలాంటి గరీబుకు ఒకరిద్దరు వున్నా కేవలం మీకోసం ఆ నినాదాన్ని పట్టుకుని వేళ్ళాడడం మీనింగ్ లెస్ ఏమంటావ్?"
"అవున్సార్! ఆ మాట నిజమే!"
"అయినా ఇప్పుడు నీకొచ్చిన లోటేమిటి? ఎవడొకడు ఇంత తిండి ధర్మం చేస్తుంటాడు కదా!"
"నాకు తిండీ, బట్టా, గూడూ గురించి ఎప్పుడూ చింత లేద్సార్!" మేము ఉలిక్కిపడ్డాం. అయితే ఇంకెందుకో ఏడుపు మరి?"
నన్నసలు బొత్తిగా పట్టించుకోవడం లేద్సార్ ప్రభుత్వం! ఆ నినాదం వచ్చిన కొత్తలో మా జీవితం థ్రిల్లింగ్ గా వుండేదో మీకు తెలుసా సార్? మమ్మల్ని వారానికోసారయినా దూరదర్శన్ వాళ్ళు పట్టుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుండేవారు. రేడియో వాళ్ళు మాతోనే ఇరవై సూత్రాల గురించి చెప్పించేవాళ్ళు. ప్రధానమంత్రి వస్తున్నాడంటే, అంతకు ముందురోజు రాత్రే మమ్మల్నందరినీ లారీల్లో ఎక్కించుకెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడించేవాళ్ళు.
"మేమిప్పుడు చాలా సుఖంగా బ్రతుకుతున్నాం" అని ప్రధానమంత్రికి కెమెరా ఎదురుగ్గా చెప్పినందుకు మాకు బోలెడు డబ్బిచ్చేవాళ్ళు- మేము చెత్తకుండీల దగ్గర కూర్చుని ఎంగిలాకులలో అన్నం ఏరుకుని తింటూంటే న్యూస్ పేపర్ రిపోర్టర్లు మా ఫోటోలు తీసి పేపర్లలో వేసేవాళ్ళు.
ఆ పేపర్ కొనుక్కోడానికి డబ్బు కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఆ జీవితం తల్చుకుంటే ఏడుపొస్తుంది బాబూ! ఇప్పుడు ఒక్కడు కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. టీ.వి వాళ్ళు బొత్తిగా మా జోలికి రావడం లేదు. ఇప్పుడన్నీ వ్యాపారస్థుల ఫోటోలే వేస్తున్నారు. ప్రధానమంత్రి ఎప్పుడూ వ్యాపారం గురించే మాట్లాడుతున్నాడు. టీ.వీ. వాళ్ళు వ్యాపారస్థులతోనే ఇంటర్వ్యూలు చేస్తున్నారు. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టయిపోయింది బాబూ మా గతి!" మళ్ళీ ఏడుపొచ్చి మాట ఆగిపోయిందతనికి.
"ఏం బాధపడకు గరీబూ! 'గరీబీ హఠావో' నినాదం ఏదొక రోజున మళ్ళీ బయటకు తీస్తారు వాళ్ళు. మళ్ళీ మీ జీవితం థ్రిల్ తో నిండిపోతుంది. టీ.వీ.లో ఎప్పుడూ మీరే కనబడతారు."
"ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది బాబూ!" నిరాశగా అన్నాడతను.
"అరె౧ ఎందుకంత నిరాశ నీకు?"
"ఎందుకేమిటి బాబూ! మళ్ళీ ఆ నినాదం వచ్చినా గరీబోళ్ళు ఎక్కడుంటారు బాబూ! బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, ఆకలి చావులు చచ్చేవారు, మామూలు చావులు చచ్చే అనాధలూ, బలహీన మైనారిటీ వర్గాలు, ఇలా ఎవరెవరు ఏ తరగతిలో ఇరుక్కుపోయారో తెలీదు!"
"ఏదేమయినా వచ్చే ఎలక్షన్లో తప్పక నీకు మంచి గిరాకీ వుంటుంది గరీబూ! డోంట్ వర్రీ!"
"ఏమో సార్ ! చూద్దాం!" సరిగ్గా అప్పుడే ఓ రాజకీయ నాయకుడు కారు దిగాడు మా కాలనీలో.
"సోదరులారా! ఎవరేమనుకున్నా, వచ్చే ఎన్నికల్లో మా పాలసీ 'గరీబీ హఠావో' అయిదేళ్ళలో బీదతనాన్ని రూపుమాపుతానని హామీ ఇస్తున్నాను అంటూ ఉపన్యాసం మొదలుపెట్టాడు.
* * *