Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 26


    "తరువాత" అంది కలెక్టరు.... అప్పటికి ముత్తాలు గాడి పెళ్లాం నీళ్లాడి ఇరవై రోజుల పిల్లుంది. అది గుర్తొచ్చి చెప్పా... ఆళ్లు పెంపకం మరి యిస్తారో లేదో తెల్వదని చెప్పాను. అడిగి సూద్దామన్నారు. వెంట పెట్టుకు ఎల్లానండి. అప్పటికి ముత్యాలు పొలం తాకట్టు పెట్టి బోలెడు అప్పుల్లో మునిగాడు. ముందు ఆడి పెళ్లాం మెత్త పడలేదు. యిద్దరు పిల్లలున్నారు. మనం పీకలదాకా అప్పుల్లో మునిగాం, ఏం పెట్టి యీ పిల్లని పెంచుతాం, పిల్లనిస్తే మన పొలం ఇడిపిస్తానంటున్నారు ఈ బాబు. పిల్లలు లేరు, ముద్దుగా మన పాపని పెమ్చుకొంటారు అని దాని మొగుడు దాన్ని వప్పించాడండి. పన్నెండు వేలకి బేరం కుదిరింది. ఈసారి పెంపకానికి కాగితాలు తయారు చేయించి తెస్తాను. అడ్వాన్సు అంటూ రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లాడు. ఇంకో నెలపోయాక కాగితాలట్టుకు వచ్చి ఏలి ముద్రలు వేపించుకుని పిల్లనట్టుకు ఎల్లిపోనాడు.
    'అది సరే, మరి తరువాత ఎందుకు వచ్చాడు. ఏమడిగాడు యిలా ఇంతమంది పిల్లల్ని ఎందుకు తీసికెళ్లాడు డబ్బిచ్చి.'
    'మరోసారి వచ్చి తన స్నేహితులు ఇంకెవరో యీ పాపని చూసి యింకో పాప వుంటే తెమ్మని అడిగారన్నాడు. యింకా యిద్దరు ముగ్గురు పిల్లలు లేని వాళ్ళు అడుగుతున్నారు. మీరెలాగో పెంచలేరు - పిల్లలు లేని వాళ్లకిస్తే చక్కగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులొస్తాయి. నీవు మీ తండావోల్లకి చెప్పి వప్పించు. నీ కష్టం వుంచుకోను అని అన్నారండి.
    'ఇప్పటికి ఎంతమందిని తీసికెళ్లాడు? కలెక్టరు అడిగింది. కొండయ్య బుర్ర గోక్కుని ఆలోచిస్తుంటే వెంకటమ్మ 'ఆ సచ్చినోడే యిప్పటికి ఏడుగురు ఆడపిల్లల్ని తీసికెళ్లాడండి అంది" మగపిల్లలని ఎప్పుడూ తీసికెళ్లలేదా?"
    'లేదండి, ఆల్లకి ఆడపిల్లలే కావాలంటండి' కొండయ్య అన్నాడు.
    "ఎంత పెట్టి కొనేవాడు పిల్లల్ని, నీకెంత యిచ్చేవాడు".    
    "ఓ సారి పదివేలకి బేరం కుదిరింది. ఇంకోసారి ఓ వెయ్యి, రెండు వేలు ఎక్కువిచ్చేవాడు. బాగున్న పిల్లలకి ఎక్కువ ఇచ్చేవాడు. పిల్లలు తెల్లగా బొద్దుగా వుంటే ఎక్కువ డబ్బిస్తారు అనేవాడు. నాకు ఒక్కో పిల్లకి ఐదొందలు,  వెయ్యి ఇచ్చేవాడు.
    "ఆ కాంట్రాక్టరు ఆడపిల్లలని కొని వ్యాపారం చేస్తున్నాడని నీకనిపించలేదా. యిది అపరాధం, నేరం అని నీకు తెలియదా!"
    'నాకేటి తెలుసండి. ఆడు పెంపకానికి పిల్లలు కావాలంటే పోనీ గొప్పింట పెరుగుతారనుకున్నాను. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడ్డాను'.
    'ఇలా పిల్లల్ని తీసికెళ్లి విదేశాల వారికి పెద్ద మొత్తానికి అమ్మి డబ్బు చేసుకుంటున్నారు కొందరు. అనాధాశ్రమం నడుపుతున్నట్టు అనాధ పిల్లలని పెంచుతున్నట్టు నాటకాలాడి పిల్లల్ని కొని అమ్మడం వీళ్ళ వ్యాపారం - అలాంటి వ్యక్తికి నీవు సాయం చేసినందుకు నీకు శిక్ష పడ్తుంది తెలుసా' దబాయించింది కలక్టరమ్మ.
    "ఆ దొంగ సచ్చినోడు నెలకోసారి వచ్చి ఎవరు నీళ్లోసుకున్నారా అని ఆత్రంగా వెతకడం, మా మగోళ్లు ఆడాళ్ళ చేత పిల్లలని కనిపించడం, అమ్మడం... మేం పడే కట్టం ఆల్లకెందుకండి. కోడి గుడ్లమ్ముకున్నట్టే, మేకల్ని అమ్ముకున్నట్టే మా చేత కనిపించి అమ్ముతున్నారండి" ఆడవాళ్లంతా కల్సి ఏక గొంతుతో అన్నారు.
    'ఆ కాంట్రాక్టరు ఏవూరి వాడో, పేరేమిటో కూడా తెలియదంటున్నావు నీకు నిజంగా తెలియదా, నాటకాలాడుతున్నావా? గంభీరంగా అడిగింది.
    "సత్తెపెమానకంగా తెలీదండి. జీపులో వచ్చేవాడు. పోయేవాడు. నేను పేరు అడగలేదు.
    "జీపు నంబరు తెలుసా పోనీ! వూర్లో ఎవరన్నా నంబరు చూశారా, చెప్పగలరా?"
    "నాకేం తెలుస్తది. సదూ రాదు నాకు అందరూ మొహాలు చూసుకున్నారు తప్ప జవాబు చెప్పలేదు. 'వూర్లో ఎవరికి చదువు చట్టుబండలు లేవు. ఒకరిద్దరికి అక్షరం ముక్కలు వచ్చినా జీపు నెంబరు గుర్తుపెట్టుకోవాలని ఎందుకనిపిస్తుంది. కలక్టరు అక్కడున్న ఆడవాళ్ళందరి వైపు చూసి 'ఏమ్మా - మీరంతా మూడు నాలుగేళ్లుగా వూరుకున్నారు. కనీసం పోలీసులకి చెప్పాలనైనా తెలియదా.
    "ఇక్కడ పోలీసుటేషను నేదు కదండి" ఎవరో చిన్నగా అన్నారు.
    "యిప్పుడు వాడిని పట్టుకోవాలంటే ఈ వూర్లో వాళ్లు సాయం చెయ్యాలి. ఈసారి వాడు వచ్చినప్పుడు వాడ్ని వదలకుండా పట్టుకుని బంధించి పోలీసులకి చెప్పాలి' అంటూ సర్పంచ్ వంక తిరిగి 'వూరి అధికారిగా నీవెలా కళ్లు మూసుకున్నావు. నీకు తెలియదా జరిగేది' నిలదీసింది. నీళ్లు నమిలాడు. 'నాకెవరన్నా సెపితే గదండి తెలుస్తది. వాడెవడో ఎప్పుడొస్తాడో ఎందుకొస్తాడో నాకెలా తెలుస్తుంది' సంజాయిషీ యిచ్చాడు. "సరే, జరిగిందేదో జరిగింది. ఈ సారి వాడు వచ్చినప్పుడు ఎవరు చూసినా సరే వాడ్ని పోనీకూడదు. పట్టుకుని ఓ తాడేసి కట్టేసి యీ సర్పంచ్ కి చెప్పాలి - వాళ్ళు చెప్పగానే పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత నీది. ఏం తెల్సిందా - వాడ్ని ఎవరన్నా వదిలేసినా ముందుగా కబురందించినా మీకు శిక్ష పడ్తుంది. కొండయ్యా వాడ్ని పట్టివ్వకపోతే నీకు జైలు శిక్ష తప్పదు జాగ్రత్త - 'ఆడవాళ్లందరికీ ధైర్యం చెప్పి, సర్పంచ్ కి మరో వార్నింగ్ యిచ్చి వెళ్లింది కలెక్టరు. పోలీసు ఇనస్పెక్టరుకి చెయ్యాల్సింది ఆర్డరు యిచ్చి వెళ్ళింది.
    కలక్టరు వెళ్లాక మొగుళ్ళంతా పెళ్లాలని గుడిసెలలోకి లాగి చితకబాదారు. ఎన్ని దెబ్బలు తిన్నా ఎవరూ నోరు విప్పలేదు. 'మాకేటి తెలుసు. కలక్టరమ్మ ఎక్కడుంటుందో కూడా మాకు తెలుసా' అంటూ దబాయించారు. వాళ్ల మాటలు నిజమనే అనిపించాయి కాని ఈ కబురు ఈ కుగ్రామం దాటి బయటికెలా వెళ్లిందో ఎవరికీ అంతుబట్టలేదు. పిల్లల్ని పెంచుకోడానికి తీసుకున్న వారెవరన్నా మాట మాట చెప్పకుంటే బయటికి పొక్కిందేమో అనుకున్నారు మగాళ్ళంతా కల్సి. ఏడాది రెండేళ్లకి ఓ పదివేలు చేతిలో పడేవి ఆగిపోయాయి అన్న దుగ్ధ మగవాళ్లది.
    నెలా పదిరోజులకి వెంకటరత్న వచ్చి జీపు హారన్ కొట్టాడు కొండయ్య ఇంటి ముందు. నాదస్వరం విని కలుగులోంచి పాములు చరచర వచ్చినట్టు దానికోసమే ఎదురుచూస్తున్న ఆడవాళ్లంతా అరక్షణం ఆలస్యం చేయకుండా ముందే పెట్టుకున్న తాళ్లు పట్టుకుని పరిగెత్తి వచ్చారు. కొండయ్య బైటికి వచ్చీరాగానే ఒక్క తోపు తోసి గుడిసె బయట తలుపు బిగించింది. చుట్టుముట్టిన పాతిక ముప్ఫై మంది ఆడవాళ్లని చూసి బిత్తరపోయాడు. తెల్లబోతూ జీపు దిగాడు వెంకటరత్నం. ఒక్కళ్ళూ నోరిప్పకుండా అందరూ అన్నివైపుల నుంచి వచ్చి పట్టేసి ఓ చెట్టు దగ్గరికి ఈడ్చికెళ్లి చెట్టుకు కాళ్లు చేతులు నడుం అన్నింటికీ తాడు చుట్టేశారు. గింజుకున్నాడు అరిచాడు. ఎవరూ జవాబివ్వలేదు. వాళ్లలో ఓ కుర్రాడిని సర్పంచి దగ్గరికి తోలారు. సర్పంచ్ డొక్కు మోటరు సైకిలేసుకుని పోలీసుస్టేషన్ వైపు వెళ్లాడు.
    'ఆనాడు పుట్టిన బిడ్డల్ని పుట్టిన వాళ్లని పుట్టినట్టే కంసుడు చంపేస్తుంటే ఆ దేవకి కడుపుకోతే యీనాడు యీ ఆడవాళ్లది - నీవా కంసుడి అంశంగా గాబోలు. అందుకే పుట్టిన వాళ్లని తల్లి నించి వేరు చేసే పాపానికి వడిగట్టావు. కృష్ణుడు పుట్టి కంసుడ్ని అంతం చేశాడు. ఈ యుగంలో ఆడవాళ్లని ఆడుకోడానికి ఏ కృష్ణుడు రాడు గదా. ప్రతి యుగంలో కంసుళ్ళు, నరకాసురులు పుడ్తూనే వుంటారనడానికి నీలాంటి వాళ్లే సాక్ష్యం. మాకు మేమే సత్యభామావతారాలు ఎత్తుకోవాలి' నర్మగర్భంగా అంటూ నవ్వింది. సెలవు మీద వచ్చి వున్న రత్నం.

                                                                                                (పత్రిక - మార్చి 2004)

                                                  *  *  *  *  *

 Previous Page Next Page