"అవును మేడమ్!"
"వంద కిలోమీటర్ల వేగంతో అది స్టేషన్ లో కొస్తుంది. కనుక ఎక్కువటర్న్ అవుట్ లైన్ మీదకు తీసుకుంటేగానీ, బండిడిరైల్ అవకుండా రావటం సాధ్యం కాదు!"
"యస్ మేడమ్! ఫ్లాట్ ఫారం నెంబర్ సిక్స్ దానికోసం ఖాళీగా వుంచాం! అది తప్పితే ఇంకో లైన్ అసలు ఖాళీలేదు."
"రిసెప్షన్ కి వెస్ట్ కాబిన్ తో మాట్లాడారా?"
"రూట్ కంప్లీట్ గా ఫీవరీబుల్ గా వుంచాం! కాకపోతే తర్వాత ఏం చేయాలీ అనేది తెలీలేదు".
మృదులకు వాళ్ళ ప్రాబ్లెమ్ అర్ధమయింది. 8 డౌన్ నార్మల్ గా అయితే వైజాగ్ డైరెక్షన్ లోకెళ్ళాలి. వైజాగ్ డైరక్షన్ లో అంటేదానిని నెంబర్ సిక్స్ ఫ్లాట్ ఫారంమీదకు తీసుకువచ్చాక ఇంజను మళ్ళీ వెనుక తగిలించాలి. అప్పుడది వచ్చిన ట్రాక్ మీద కొంత దూరం వెనక్కు వెళ్ళిఅప్పుడు డైవర్షన్ తీసుకుంటుంది.
కనుక ఈ పరిస్థితుల్లో దానిని వైజాగ్ రూట్లోకి మళ్లించటం అసాధ్యం.
అది ఎంత వేగంగా వస్తుందో అదే వేగంతో ఆగకుండా విజయవాడ మీద నుంచీ మద్రాస్ డైరెక్షన్ లోకి మళ్ళించాలి. అయితే అదే వేగంతో ఆగకుండా విజయవాడ మీద నుంచీ మద్రాస్ డైరెక్షన్ లోకి మళ్ళించాలి. అయితే ఆ డైరెక్షనులో ట్రైన్ పొజిషన్ ఎలా వుందో తెలుసుకోవాలి!
వీలయినంతదూరం 8 డౌన్ ఆగకుండా వెళ్ళేందుకు పాసేజ్ ఇవ్వగలిగితే ఏదొకచోట దానివేగం తగ్గి ఆగిపోడానికి అవకాశం వుంది.
"ఆల్ రైట్! నేను డెఫ్టీ కంట్రోలర్ తో మాట్లాడతాను. ఈలోగా 8 డౌన్ కృష్ణా కెనాల్ మీదుగా మద్రాస్ డైరెక్షన్ కి డైవర్టు చేసేందుకు సిద్దంగా వుండండి!"
"ఓ.కే. మేడమ్!"
వెంటనే డెఫ్టీకంట్రోలర్ కి రింగ్ చేసిందామె.
"సపోజ్ 8 డౌన్ ని మద్రాస్ డైరెక్షన్ లోకి డైవర్టు చేస్తామనుకోండి! ఎన్ని స్టేషన్లవరకూ దానికి ఆగకుండా పాసేజ్ దొరుకుతుంది?.
"వన్ మినిట్ మేడమ్! ఇప్పుడే చెప్తాను- "ఫోన్ డిస్కనెక్టు చేశాడు.
మృదులకు టెన్షన్ పెరిగిపోసాగింది. తనకిదియాసిడ్ టెస్ట్! అటు ప్రజల్లోనూ, ఇటు జోనల్ ఆఫీస్ అధికారులలో నూతన ఉనికిని ఫ్రూవ్ చేసుకునే ప్రమాదకరమయిన అవకాశం! తను ఏ మాత్రం తప్పు నిర్ణయం తీసుకున్నా తన కెరీర్ నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆ బండిలో ప్రయాణిస్తూన్న రెండు వేలమందిపై చిలుకు ప్రయాణీకులకు సంబంధించిన జీవన్మరణ సమస్య!
ఫోన్ రింగయింది.
ఠక్కున అందుకుంది మృదుల.
"హలో మృదులా! వాటీజ్ హాపెనింగ్?"
డివిజినల్ రైల్వే మేనేజర్ గొంతుని వెంటనే గుర్తుపట్టిందామె. బహుశా ఆయనకికూడా ఇన్ ఫర్మేషన్ అంది వుంటుంది. డివిజనల్ రైల్వే మేనేజర్ రంగనాధన్ సంగతి మృదులకి బాగా తెలుసు. అతను పరమ ఛాందసుడని పేరు. దక్షిణ దేశంలోని ఛాందసుల కుటుంబంలో పుట్టి చిన్నప్పటినుంచీ మారని ఆచారాలు, నమ్మకాలతో పెరిగిన వ్యక్తి.
ముఖ్యంగా స్త్రీలువంటింట్లోనే వుండాలిగానీ, చదువులపేరుతో, వుద్యోగాల పేరుతో వీధికెక్కకూడదన్నతత్వం అతనిది. మనదేశం పాడయిపోడానికిగానీ, అభివృద్ధి చెందకపోడానికిగానీ కారణం కేవలం స్త్రీలకు అతిగా అందించబడిన స్వాతంత్ర్యం అని అతని ప్రగాఢవిశ్వాసం.
ఆడవాళ్ళను నర్సులుగా తప్పితే ఇంకో ఉద్యోగానికి రానీయకూడదని అతనికోరిక. స్త్రీలు తెగించి ఉద్యోగాలకు రాబట్టేమగాళ్ళకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయనీ, అందుకే నిరుద్యోగ సమస్య ప్రబలిపోయిందనీ అతను తరుచుగా ప్రతి సోమవారం ఉదయంజరిగే డివిజనల్ ఆఫీసర్స్ మీటింగ్ లో ఒక్కసారయినా అంటూండేవాడు.
డివిజినల్ ఆఫీసర్స్ అందరూ మగవాళ్ళే వుండడంతో అతనిమాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతని అభిప్రాయంతో చాలామంది ఆఫీసర్స్ ఏకీభవించకపోయినాపైకి మాత్రం ఎవ్వరూ వ్యతిరేకించేవారుకాదు.
కానీ మృదుల వచ్చాకమొదటి మీటింగ్ లోనే అతని మాటలు ఆమెకి కోపం కలిగించినయ్.
"అయామ్ సారీ సార్! ఐ ఫియర్ యువర్ థింకింగ్ ఈజ్ బియాన్ డ్!" అంది నిర్మొహమాటంగా.
రంగనాధన్ తో పాటు మిగతా అందరూ కూడా ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయారు. ఆమె మాటలు రంగనాధన్ కి కోపం కలిగించినయ్.
"నో! నేనేం మాట్లాడినా పూర్తి సబ్ స్టెన్సు తోనే మాట్లాడతాను. తనకొచ్చే జీతంలో వర్కింగ్ వుమెన్ ఏం చేస్తుందో తెలుసా? చీరలు, కాస్మెటిక్స్ కొనుక్కుంటుంది. లేదా మరెన్నో సరదాలకు ఖర్చు చేస్తుంది. అదే ఉద్యోగం మగవాడు చేస్తే ఆ జీతం ఏం చేస్తాడో తెలుసా? క కుటుంబం పైకి రావటం కోసం ఖర్చుచేస్తాడు- ఎవరయినా ఈ నిజం కాదనగలరా?"
"బహుశా మీరు కలుసుకున్న వర్కింగ్ వుమెన్ చాలా తక్కువ మంది అయుండాలి. నాకు తెలిసిన వర్కింగ్ వుమెన్ అందరూ వాళ్ళవాళ్ళ కుటుంబాలను పోషిస్తున్నారు-లేదావాళ్ళ కుటుంబాలలివింగ్ స్టాండర్డ్స్ పెంచేందుకుసహాయం చేస్తున్నారు." రంగనాథన్ మొఖం ఎర్రపడిపోయింది.
"ఓ.కె! వుయ్ విల్ డిస్కస్ దట్ లేటర్" అంటూ వాదన తుంచేశాడు.
అప్పట్నుంచీ తనను ఎక్కడో చోట కార్నర్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంతవరకూ అతనికా అవకాశం ఇవ్వలేదు.
"8 డౌన్ గురించి మీకు తెలిసే వుంటుంది" అంది మృదుల.
"యస్! తెలుసు! నేనడిగేది మీరేం ప్లాన్ చేశారని?"
"నెంబర్ సిక్స్ ఫ్లాట్ ఫారం మీద రిసిప్షన్ కి ఎరేంజ్ మెంట్స్ చేశాను-"
"నాకు తెలుసు! లేడీస్ ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్ లో జీరో అయిపోతారని నేనుముందే వూహించాను."
"మీరు ఇంకొంచెం వివరంగా మాట్లాడితే బావుంటుంది."
"8 డౌన్ ఆ స్పీడ్ లో నెంబర్ సిక్స్ ఫ్లాట్ ఫారం మీద కొచ్చాక ఆగుతుందని ఎలా అనుకుంటున్నారు? అది ఆగకుండా వుండే విధంగా ఏదయినా ప్లాన్ చేసి వుండాల్సింది" హేళనగా అన్నాడతను.
"అది ఆగదని నాకూ తెలుసు సార్! అందుకే మద్రాస్ డైరెక్షన్ లోకి డైవర్టు చేసేందుకు ఇన్ స్ట్రక్షన్ ఇస్తున్నాను."
రంగనాధన్ కేం మాట్లాడాలో తెలీలేదు "ఆల్ రైట్! మద్రాస్ డైరెక్షనులో ఎన్ని స్టేషన్లు, ఎన్ని బ్లాక్ సెక్షన్లు ఖాళీగా వున్నాయ్?"
"దట్ అయాం చెకింగప్ సర్!"
"ఐ డోన్ట్ నో వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ! ఏం చేస్తున్నారో నాకు ఎప్పటికప్పుడు చెప్తూండండి!"
"ఓ.కే.సర్"
ఫోన్ డిస్కనెక్టవగానే డెఫ్టీ కంట్రోలర్ మాట్లాడాడు "మేడమ్! పెదవడ్లపాడు వరకూ బ్లాక్ సెక్షన్స్ ఖాళీగా ఉన్నాయ్ కొలనుకొండ, పెదవడ్లపాడు, మధ్యలో లక్నో - మద్రాస్ ఎక్స్ ప్రెస్ వెళుతోంది. పెదవడ్లపాడు- చిలువూరు బ్లాక్ సెక్షన్ లో గూడ్స్ ట్రెయిన్ కి మాత్రం దుగ్గిరాల వరకూ లైనుఖాళీ లేదు-కాన్సిల్డ్ లోడ్స్ వున్నాయి."
మృదుల చకచకఆలోచించసాగింది.
8 డౌన్ ఆ స్పీడ్ లో మహా అయితే తెనాలివరకూ వెళుతుంది అంతే! దుగ్గిరాల, తెనాలి మధ్యలో అప్ గ్రేడియంట్ ఉంది కనుక 8 డౌన్ అక్కడ స్లో అయి ఆగిపోవడానికి ఆస్కారం వుంది "ఆల్ రైట్, ముందా ఎక్స్ ప్రెస్ నీ గూడ్స్ ట్రెయిన్ ని రెగ్ య్లేట్ చేసేయండి! తెనాలివరకూ 8 డౌన్ కి క్లియర్ పాసేజ్ వుంచండి! అన్ని స్టేషన్స్ నీ ఎలర్టు చేయండి! బ్రేక్ డవున్ కూడా రడీ చేయండి! మెడికల్ వాన్సు కూడా వుండాలి. మన రైల్వే హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ సంసిద్దమవమని చెప్పండి. డివిజనల్ ఆఫీసర్స్ అందరినీ ఆర్.ఎమ్.ఆఫీస్ కి రావాలని మెసేజెస్ ఇవ్వండి!" చకచక చెప్పిందామె.
"అలాగే మేడమ్!"
తను కూడా వెంటనే రడీ అయి తన కార్లో కంట్రోల్ ఆఫీస్ కి బయల్దేరింది.
* * *
డివిజనల్ సేఫ్టి ఆఫీసర్ జయకర్ అలా రంబెల్ మోతకు నిద్ర లేచాడు. లేస్తూనే అలారం టైమ్ పీస్ వంక చూశాడు. తెల్లవారుజామున నాలుగవుతోంది. త్వరత్వరగా లేచి డ్రస్ చేసుకుని తన క్వార్టర్స్ బయటికొచ్చాడతను. జీప్ సిద్దంగా వుంది. డ్రయివర్ తనకోసమే ఎదురు చూస్తున్నాడు. జీప్ లో కూర్చున్నాడు జయకర్.
డ్రయివర్ జీప్ స్టార్ట్ చేశాడు.
"ఏ స్టేషన్ కి సార్?" అడిగాడతను.
"పెదవడ్లపూడి!"
జీప్ శరవేగంతో వెళుతోంది. మరోసారి టైమ్ చూసుకున్నాడు జయకర్. సరిగ్గా నాలుగయింది. ఇంకో అరగంటలో పెదవడ్లపూడి స్టేషను చేరుకుంటారు. అంటే నాలుగున్నరకు ఆ స్టేషన్ని ఎటాక్ చేయవచ్చు! అసిస్టెంట్ స్టేషను మాస్టర్ లుగానీ, కాబిన్ మెన్, గేట్ మెన్, పాయింట్స్ మెన్- అందరూ నిద్రపోయేది రెండు గంటలనుంచి అయిదు గంటల లోపే!
కనుక తను సాధారణంగా ఆ సమయంలోనే 'నైట్ చెక్స్' చేస్తూంటాడు, చాలాసార్లు చాలామంది స్టాఫ్ ని డ్యూటీలో నిద్రపోతూండగా పట్టుకున్నాడు. అందరికీ పనిష్మెంట్స్ ఇచ్చాడు. దాంతో డివిజన్ అంతటాకల్లోలం చెలరేగింది.
అంతకుముందు ఏ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ కూడా అన్ని నైట్ చెక్స్ చేయలేదు.
ట్రెయిన్ పాసింగ్ డ్యూటీలు చేసే స్టాఫ్ రాత్రిళ్ళు నిద్రపోవటం వల్ల యాక్సిడెంట్స్ చేసే అవకాశం వుందని తనకు తెలుసు. కొన్ని యాక్సిడెంట్ లు నిద్రపోయిన కారణంగానే జరిగాయని ఎంక్వయిరీలో వెల్లడయింది కూడా!