Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 25


    అతను నెమ్మదిగా సీత ఇంటివైపు వచ్చాడు.
    "నమస్తే! మీరేనా సీతగారు?" అడిగాడతను మర్యాదగా.
    "అవునండీ. లోపలకు రండి" ఆహ్వానిస్తూ అంది సీత.
    అతను లోపలకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతన్తోపాటు ఓ విధమయిన మత్తెక్కించే సువాసన కూడా ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా అల్లుకుపోయింది.
    "నా పేరు వర్ధనరావు. గంధర్వా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ ని" అన్నాడతను చిరునవ్వుతో.
    సీత ఉలిక్కిపడింది. ఆమె గుండెలు వేగంగా కొటకున్నాయి కొద్ది క్షణాలపాటు. అంతటి ప్రొడ్యూసర్ తమ ఇంటికెందుకొచ్చినట్లు? తన నవలేమయినా సినిమా తీసే ఉద్ధేశ్యం ఉందా? సినిమా అంటే బోలెడు డబ్బిస్తారని తనకు తెలుసు.
    "మీ నవలలన్నీ చదివాను నేను. అన్నిటిలోకి "జీవిత సోపానాలు" నవల నాకు బాగా నచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో గాని నాలుగుసార్లు చదివానంది. అంత ఫర్ఫెక్ట్ గా ఉంది" అడిగాడతను.
    సీత ఆనందాన్ని అణచుకోడానికి ప్రయత్నిస్తోంది.
    "అరె. మీరు నిలబడే ఉన్నారేం కూర్చోండి!" పెద్ద తప్పు జరిగిపోయినట్లు అన్నాడతను.
    సీత సన్నగా మందహాసం చేసి అతనికెదురుగా మంచంమీద కూర్చుంది. కొద్దిక్షణాలు ఆమెవంకే మైమరచినట్లు చూశాడతను. అతని చూపులు సీతకి ఇబ్బంది కలిగించాయి.
    "నాలుగుసార్లు చదివాక, ఆ నవల సినిమాగా తీస్తే ఎలా వుంటుందా అని ఆలోచించాను. దానిమీద కొంత వర్క్ కూడా చేశాను. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అక్కడక్కడా చిన్న మార్పులు కొన్ని చేస్తే అది మంచి నవలే కాదు, మంచి సినిమా కూడా అవుతుందనిపించింది. అందుకే మీ దగ్గరకొచ్చాను"
    "ఓహో..."
    "నాకనిపించిందేమిటంటే నవలలో చాలా చక్కని సంభాషణలు రాశారు ముఖ్యమయిన సన్నివేశాల్లో. మరి సినిమాకి కూడా మీరే ఎందుకు రాయకూడదు?"
    సీత ఆశ్చర్యంతో చూసిందతని వంక.
    "కానీ సంభాషణలు రాయడం అంత తేలిక కాదనుకుంటాను"
    "అవన్నీ మాకు వదిలేయండి! నవల రాసిన మీరు సంభాషణలు రాయలేరంటే నేను నమ్మను. ఓ పక్క నవల్లో సంభాషణలు కనబడుతూనే ఉన్నాయిగా. మీరు ఇప్పుడున్న డైలాగ్స్ రైటర్స్ చాలామందికంటే బాగా రాయగలరనడానికి అవే నిదర్శనం"
    "నిజమేనేమో" అనుకుంది సీత. సంభాషణలు రాయడం చేతకాక కాదుగానీ సినిమాకు అన్వయిస్తూ రాయడం కొత్తలో కొంచెం కష్టమేమోనని ఆమె అనుమానం.
    "మీకో విషయం చెప్తే మీరు నమ్మరు. ఇవాళ సంభాషణల రచయితగా వెలిగిపోతున్న నిఘ్నేశ్వర్రావుకి ఈ సినిమా టెక్నిక్ ఎవరు నేర్పారు, నేను నెలరోజులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ నాతో కూర్చోబెట్టుకొని సానబెట్టానతన్ని. ఇప్పుడు చూడండి మరి నాకే పాఠాలు చెప్పేలా తయారయ్యాడు. అంచేత నేను చెప్పేదేమిటంటే మిమ్మల్ని నాక్కావలసిన విధంగా నేను మలచుకోగలను. మీరు ఓకే అనండి చాలు. మిగతాదంతా నా బాధ్యత."
    "మీరు బలవంతపెడుతున్నారుగానీ నాకు భయంగానే వుంది.
    అతను నవ్వేశాడు.
    "భలేవారే భయపడటమేమిటి. మరో విషయం కూడా చెప్పేస్తున్నాను. సంభాషణలు రాయాలంటే తొంభయిమంది వున్నారు మార్కెట్లో కానీ. చెప్పాను కదా! నేను మీ అభిమాన పాఠకుడినయిపోయాను ఆ నవల చదివిన దగ్గర్నుంచీ అంచేత మీతోనే రాయించాలని కోరిక అంతే. అందుకే మిమ్మల్ని ఇంతగా బతిమాలుతోంది."
    ఏం చెప్పటానికి తోచలేదు సీతకి. అతను అంతగా చెప్పిన తరువాత కాదనడానికి మనసొప్పటం లేదు.
    "ఇంకా ఆలోచిస్తున్నారు కదూ?" నవ్వుతూ అన్నాడతను.
    సీతక్కూడా నవ్వాగలేదు. అతనితోపాటు తనూ నవ్వేసింది.
    "ఇంకో విషయం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీరు సినిమా ఫీల్డులో లేరుగనక మీకు నా గురించి తెలిసుండదు. నేను మిగతా అందరిలాంటి ప్రొడ్యూసర్ ని కాదు డబ్బుని లెక్కచెయ్యలేదు ఏనాడూ. నాక్కావలసింది మనమధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా ఉండటం అంటే మనసులో ఒకటి, పైకొకటి లేకుండా మాట్లాడుకోవాలి. సాధారణంగా సినిమా ఫీల్డులో అదే ఎక్కడా కనిపించదు. మీరు ముందుగానే ఆలోచించుకొని మీ నవలకూ, సినిమా సంభాషణలకూ ఎంత డబ్బు కావాలో అడగండి. నా దగ్గర బేరసారాలు కూడా లేవు. మీరెంత చెబితే అంత. నా చేతి మీదుగానే మీరు సినిమా రంగంలోకి ప్రవేశించాలి. మీరు రాసిన మంచి నవలలన్నీ నేనే సినిమాలు తీయాలి ఇది నా మనసులో వున్న విషయం."
    సీత ఆలోచనలో పడిపోయింది.
    ఎంత అడగాలి? ఏమో తనకేం తెలుసునని? అసలు సినిమాలకు ఏ రేట్లు వున్నాయో తెలియందే ఇంత అని ఎలా అడగగలదు? అదీగాక ఇక్కడో మొహమాటం వచ్చిపడింది. తననే సంభాషణలు రాయమని కూడా అడుగుతున్నాడు. దానికి చాలా టైము పడుతుంది. దానికెంత అడగాలో తెలీదు. పబ్లిషర్లతో బేరాలాడడం వేరు. ప్రొడ్యూసర్లతో మాట్లాడడం వేరు. తక్కువ అడిగితే నష్టపోవచ్చు, ఎక్కువ అడిగితే వాళ్ళు "మరీ ఆశ" అని తన గురించి అనుకోవచ్చు. వీటన్నిటి సంగతెలా వున్నా ఈయన మాత్రం చాలా మంచిమనిషిలాగున్నారు. లేకపోతే తనమీద ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం ఏముందీ? ఇలాంటి మనిషిని పొరపాటున కూడా మనసు నొప్పించడం మంచిదికాదు. పోనీ ఎంతివ్వదల్చుకున్నారో అది ఆయనకే వదిలేస్తే సరి. తరువాత అది తన అంచనాకు దగ్గరగా ఉందో లేదో చూసుకోవచ్చు.

 Previous Page Next Page