అతనితో మాట్లాడుతూంటే ఎంతో ఆత్మీయులతో మాట్లాడినట్లు అనిపించసాగింది సావిత్రికి. ఎంతసేపయినా అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది.
"నేనిక వెళ్తానండీ రేపు సాయంత్రం తెచ్చిచ్చేస్తానండి..." లేచి నుంచుంటూ అన్నాడతను.
అప్పుడే అతను వెళ్ళిపోవటం సావిత్రికిష్టం లేకపోయింది.
"కూర్చోండి__'టీ' చేసుకొస్తాను..." తను లేచి నుంచుంటూ అంది.
అతను ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు. ఒకవేళ తను తొందరపడిందేమో అనుకొంది సావిత్రి.
"మీకు శ్రమేమో?" మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ అన్నాడతను.
సావిత్రి అదేమీ పట్టించుకోనట్లు నవ్వేసి లోపలికి నడిచింది. స్టౌవ్ వెలిగించి గిన్నెతో నీళ్ళు పెట్టేసి మళ్ళీ అతనున్న చోటికి వచ్చేసింది.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని వెంటనే చూపులు మరల్చేసుకున్నారు. నిశ్శబ్దం చాలా చిరాకు కలిగిస్తోంది. ఏదొకటి మాట్లాడితే బావుండు. కాని ఏం మాట్లాడాలో తెలియందే!
"రేపు ఏం ఇంటర్వ్యూ వుంది?" అడిగింది తను.
"ఆర్టీసీ ఇంటర్వ్యూ. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కి అప్లయ్ చేశాను..."
"ఓహో..."
మళ్ళీ లోపలికి వెళ్ళి 'టీ' తయారుచేసి రెండు కప్పుల్లో తీసుకొచ్చి ఒకటి అతని కందించింది. 'టీ' తాగి కప్పు కింద పెట్టేశాడతను.
"మీ నేటివ్ ప్లేస్ ఏదండీ?" అడిగాడు.
"ఒకటని లేదులెండి! చాలా వున్నాయ్. కైకలూరు, గుడివాడ, నిజామాబాద్" నవ్వుతూ అంది సావిత్రి.
"బాగుంది? అన్ని ఊళ్ళల్లోనూ వున్నారన్నమాట. అతను కూడా నవ్వుతూ అన్నాడు. మరికొద్ది నిముషాలు తన గురించి చెప్పాడతను. చదువుని ఎలా నిర్లక్ష్యం చేసి హాకీ పిచ్చిలో పడిపోయిందీ, హాకీ మూలాన తన స్నేహితులకి కలిగిన లాభాలూ, మరికొంతమందికి కలిగిన నష్టాలు.
చీకటి పడిన సంగతి ఇద్దరూ గమనించనేలేదు.
చాలాసేపటికి సావిత్రే తేరుకుని లైట్ స్విచ్ వేసింది.
"అబ్బ! చాలా టైమయిపోయిందే_మాటల్లో తెలీలేదు" లేచి బయటకు నడుస్తూ అన్నాడతను.
"విష్ యూ బెస్టాఫ్ లక్..." గడప వరకూ వస్తూ అంది సావిత్రి.
"థాంక్యూ..."
అతను వెళ్ళిపోయాడు.
చాలాసేపటివరకూ మంచంమీదకు ఒరిగిపోయి ఆలోచనల్లో మునిగిపోయింది సావిత్రి. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. మర్నాడు సాయంత్రం తను ఆఫీస్ నుంచి వస్తోంటే అతని గది గడపలోనే కూర్చుని తనకోసం ఎదురుచూస్తూ కనిపించాడు.
"ఎలావుంది ఇంటర్వ్యూ?" తనే అడిగింది.
"హోప్ లెస్! చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను! ఆ వుద్యోగం మీద ఆశలన్నీ వదులుకున్నట్లే..."
"అరే..." సానుభూతిగా అంది తను.
"ఫర్వాలేదులెండి! నాకేం అంత బాధగా లేదు. అలవాటయిపోయింది. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడం_స్పోర్ట్సుమన్ అవడం వల్ల ఓడిపోవడం నాకెప్పుడూ విచారం కలిగించదు. స్పోర్ట్సుమన్ అనేవాడు ప్రతి ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. 'హాకీ' నా ఉద్యోగావకాశాల్ని చెడగొట్టినా ఈ మంచి గుణం మాత్రం ఇచ్చింది..." నవ్వుతూ అన్నాడతను.
"అవునులెండి. మనం వెళ్ళే ఇంటర్వ్యూలన్నీ నెగ్గుతామన్న గ్యారంటీ ఎక్కడుంది?" ఇష్టం లేకపోయినా నడవడానికి వుద్యుక్తురాలవుతూ అందామె.
"వెళ్ళిపోతున్నారా__సరేలెండి! మీ పుస్తకం నేనే తీసుకొచ్చి యిస్తాను."
"నాకివ్వండి! నేను తీసుకెళతాను..." మళ్ళీ నిలబడి నవ్వుతూ అంది తను.
"ఊహు! వద్దండీ...అది మర్యాద అనిపించుకోదు. నేనే మీఇంటికొచ్చి ఇస్తాను..." నవ్వుతూ అన్నాడతడు.
"సరే మీ ఇష్టం" తనూ నవ్వేసి ఇంటివేపు బయలుదేరింది సావిత్రి.
నిజానికి అతను మళ్ళీ తన యింటికి వస్తేనే బావుంటుందని ఉందామెకి. అతనూ, తనూ ఏకాంతంగా ఆ గదిలో కూర్చుని మాట్లాడుకోవటంలో ఎంత థ్రిల్ ఉంది? త్వరత్వరగా ఇల్లు చేరుకుని అరగంటలో స్నానం ముగించి తనకిష్టమైన చీర కట్టుకుని అందంగా ముస్తాబయిపోయింది... కళ్ళకు కాటుక పెట్టుకుంటూండగా బయటనుండి తన పేరు పిలవడం వినిపించింది.
చకితురాలయిపోయింది సావిత్రి.
అతనికి తన పేరెలా తెలుసు? ఆ! ఆరోజు బాలకృష్ణగారు చెప్పారు కదా!
గడప దగ్గరకు నడిచి కర్టెన్ తొలగించి చూసిందామె. పుస్తకం పట్టుకుని కుండీల్లోని పూల మొక్కలవేపు చూస్తున్నాడతడు.
"రండి..." చిరునవ్వుతో అతనిని ఆహ్వానిస్తూ అంది. ఆమెని కొద్ది క్షణాలు కళ్ళప్పగించి చూస్తూండిపోయాడతను. అతనలా చూడటం ఆనందం కలిగిస్తున్నా ఓ విధంగా ఇబ్బందిగా కూడా ఫీలయింది సావిత్రి. లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడతడు...ఏమి మాట్లాడకుండానే పుస్తకం ఆమె చేతి కందించాడతడు... తీసుకుని అల్మారాలో పడేసింది సావిత్రి.
"మీ దగ్గర చాలా సహాయాలు తీసుకుంటున్నాను. ఈ బాకీలన్నీ తీర్చే అవకాశాలెప్పుడొస్తాయో తెలీదు_" నవ్వుతూ అన్నాడతడు.