"ఎగ్జాక్ట్ లీ సర్! అంతకంటే అద్భుతమయిన సస్పెన్స్ మరొకటుండదు"
"అయితే ప్రారంభించి దీప్ చంద్! డిక్టేట్ చేస్తే కన్యక రాసుకుంటుంది"
భవానీశంకర్ ఆయన చేతిలోని డయిరీ తీసుకున్నాడు. వరుసగా కొన్ని పేజీలు తిరగేశాక రూమ్ సీలింగువంక చూస్తూ చెప్పటం ప్రారంభించాడు.
"ఇది 1954వ సంవత్సరం!
అర్ధరాత్రి పన్నెండవుతోంది. చలి ఎముకలు కొరికేస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయ్. ఆ సమయంలో రెండు ముసుగు ధరించిన ఆకారాలు ఆ రోడ్డుమీద నిశ్శబ్దంగా నడుస్తున్నయ్."
అప్పల్రాజు పొంగిపోయాడు.
"అబ్బ! అచ్చం డిటెక్టివ్ కథలాగుంది."
భవానీశంకర్ అతని మాటలు పట్టించుకోలేదు.
"ఓ ఆకారం చేతిలో నాలుగులక్షల రూపాయలున్న లెదర్ బాగ్ ఉంది..."
మిస్ కన్యక చకచకా రాసేస్తోంది.
* * * *
సరిగ్గా అదే సమయంలో వర్ధనరావ్ సింగారం ఊళ్ళోని ఏకైక మైన్ రోడ్ లోని వెంకటేశ్వరా బార్ లోకి నడిచాడు.
అప్పటికే లోపల కూర్చుని నాలుగో బీరు బాటిల్ ఖాళీచేస్తున్న ఓ లావుపాటి వ్యక్తి అతనిని చూసి ఆనందంగా లేచి నిలబడ్డాడు.
"రా గురూ! నీకోసం గంటసేపట్నుంచి వెయిట్ చేస్తున్నాను" అన్నాడతను. వర్ధనరావు అతని కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
"లేటయిపోయింది గురూజీ! ఇవాళ్టినుంచి మన ఆపరేషన్ ప్రారంభించేశాను" అన్నాడు ఉత్సాహంగా.
"ముందు బీరుకొట్టు. తరువాత సబ్జెక్టులోకొద్దాం" అన్నాడతను ఓ బీరు గ్లాసు వర్ధనరావు ముందుకి తోస్తూ.
వర్ధనరావు బీరు మంచినీళ్ళలా తాగేశాడు.
"ఆ రచయిత ఎవరో వస్తాడన్నావ్ కదా వచ్చేశాడా?"
"ఓ! అతనిపేరు దీప్ చంద్! ఇవాళ అప్పుడే పనిమొదలుపెట్టేశారు కూడా!" లావుపాటి ఆకారం గతుక్కుమంది.
"స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టేశారా!"
"ఆ! మా బావగారి సంగతి నీకు తెలీందేముంది? ప్రోగ్రామంటే ప్రోగ్రామే. మార్పులుండవ్."
"గురూ! నీ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక నా కొంప ముంచుతావా?" వర్ధనరావ్ నవ్వాడు.
"వినాయకరావ్! నా సంగతి నీకింకా తెలీదు. ఎలాగోలా మా బావగారి డైరీలు, ఫోటోలు దొంగిలించుకొచ్చే బాధ్యత నాది. అయితే ఈ కార్యక్రమం విజయవంతంగా నెరవేర్చటానికి నాకు ఇంకొక వ్యక్తి సహాయం కావాల్సివుంటుంది."
"వినాయకరావ్ ఉలిక్కిపడ్డాడు.
"ఇంకో వ్యక్తి కావాలా?"
"అవును."
"మరి మనం ఇంతకుముందు కలుసుకున్నప్పుడు నువ్వొక్కడివే వాటిని దొంగిలించుకొచ్చేస్తానన్నావుగా?"
"ఓవర్ కాన్ఫిడెన్స్! అప్పటినుంచీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను గానీ ఇప్పటికి తెలిసింది వాటిని బావగారు తన గదిలోని ఇనుప పెట్టెలో పెట్టి లాక్ చేస్తున్నారు. ఆ తాళంచెవులు ఆయన దగ్గరే వుంటాయ్. ఎవరికీ ఇవ్వరు."
"మరిప్పుడు నీకు తోడుదొంగగా యింకో వ్యక్తి ఎవరు దొరుకుతారు?"
"ఆ రచయిత దీప్ చంద్ ని కలుపుకుంటే మన పని చాలా తేలికయిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే అతనికే ఆ డైరీలను రోజూ చూసి, చదివే అవకాశం వుంది. కనుక అతను తల్చుకుంటే వాటిని కాజేయటం చాలా ఈజీ."
వినాయకరావ్ వర్ధనరావ్ వంక చిరాగ్గా చూశాడు.
"కానీ ఆ రచయిత అలాంటి పని చేయడానికి ఎందుకొప్పుకుంటాడు? పైగా పని పూర్తయితే మీ బావ అతనికి పాతికవేల రూపాయలు ఇస్తాడుక్ కదా?"
"ఆ డబ్బు మనమే ఇస్తేసరి" అన్నాడు వర్ధనరావ్.
వినాయకరావ్ మొఖంలోకి కళ వచ్చేసింది మళ్ళీ.
"అఫ్ కోర్స్! దానికి సమస్యేం లేదు. కానీ ఆ రచయిత ఒప్పుకుంటాడా అని?"
"నేను మాట్లాడిన దానినిబట్టి చూస్తే కొంచెం జాలీ టైప్ గానే వున్నాడు. కనుక మన ఆఫర్ పనిచేస్తుందని నా నమ్మకం."
"సరే, నీ ఇష్టం. ఎంతయినా ఖర్చవనీ. నేను సిద్ధమే. నాక్కావలసింది 'లంబోదరా పబ్లిషింగ్ హౌస్'కి మాత్రం ఆ స్క్రిప్ట్ ని పుస్తకంగా పబ్లిష్ చేసే ఛాన్స్ రాకూడదు. అంత సంచలనం రేపే ఆ పుస్తకం పబ్లిష్ చేసేడంటే ఆ నరహరిగాడు మాకంటే పెద్ద పబ్లిషర్ అయిపోతాడు. దాంతో మా పరువు ప్రతిష్టలు మట్టికొట్టుకుపోతాయ్. ఇన్ని సంవత్సరాలనుంచీ రాష్ట్రంలోని అతిపెద్ద పబ్లిషింగ్ హౌస్ అన్న పేరు కాస్తా తుడిచిపెట్టుకుపోతుంది."
"తెలుసు గురూ!"
"అంచేత ఏ పరిస్థితిలోనూ ఆ స్క్రిప్టు లంబోదరా పబ్లిషర్స్ కి చేరకూడదు."
"ఓ.కే. అన్నానుకదా."
"వినాయకరావ్ లేచి నిలబడ్డాడు. "ఇంక వెళ్దామా? హైదరాబాద్ కి బస్ ఇంకో పావుగంటలో వుంది."
"నువ్వు నిశ్చింతగా వెళ్ళు గురూ! ఆ దీప్ చంద్ ని ఎలాగోలా నేను మంచి చేసుకుంటాను."
అతను వెళ్ళిపోయాక తనూ బార్ నుంచి బయటికొచ్చాడు వర్ధనరావ్. ఇన్నిరోజులూ ఆ డయిరీలు, ఫోటోలు సంపాదించే పని చాలా తేలికనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుస్తోంది.
ఆ వినాయకరావ్ తనకు యాభైవేలు ఇస్తానన్నది వూరికే కాదు. చాలా క్లిష్టమయిన పని నిర్వహిస్తున్నందుకే అంతమొత్తం ఇస్తానన్నాడు. ప్రస్తుతం తను చేయాల్సిన మొదటి పని ఏమిటంటే ఆ రచయిత దీప్ చంద్ ని స్నేహం చేసుకోవటం. ఏ రచయిత నయినాసరే స్నేహం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం వుందీ ప్రపంచంలో. అదేమిటంటే అతని నవలలు గురించి పొగడటం. దీప్ చంద్ నవలల గురించి పొగడాలంటే తను కొన్నయినా చదివివుండాలి. కానీ తను ఒక్కటికూడా చదవలేదు. ఆ రోజంతా ఎలాగోలా కష్టపడి దీప్ చంద్ నవలలు చదవాలని నిశ్చయించుకున్నాడతను. కానీ ఆ నవలలు ఎవరిదగ్గరుంటాయ్?
ఎదురుగా బుక్ స్టాల్ కనిపించింది వర్ధనరావ్ కి. వెంటనే లోపలకు జొరబడ్డాడు.
"దీప్ చంద్ నవలలేమయినా వున్నాయా?" షాపతనిని అడిగాడతను.
"అవుటాప్ స్టాక్."
వర్ధనరావ్ నిరుత్సాహపడిపోయాడు.
"ఒక్క నవలకూడా లేదా?"
"ఒక్కటికూడా లేదు."
వర్ధనరావ్ కేంచేయాలో తెలీలేదు. తనే హైద్రాబాద్ వెళ్ళి అన్ని బుక్ స్టాల్స్ లోనూ వెతికితే దొరుకుతాయేమో!
"ఆ ఎదురుగ్గా అద్దె పుస్తకాల షాపుంది చూడండి. అందులో ప్రయత్నిస్తే దొరకవచ్చు" అన్నాడు షాపతను.
వర్ధనరావ్ వడివడిగా అద్దె లైబ్రరీ దగ్గరకు నడిచాడు.
"ఏం కావాలి సార్?"
"దీప్ చంద్ నవలలేమయినా వున్నాయా?"
వాడు చకచక తన దగ్గరున్న పుస్తకాలు చూశాడు.
"ఒకే ఒక్కటుంది సార్! ఇంకోటి సర్క్యులేషన్ లో వుంది."
"ఆ ఒక్కటీ చాల్లే ఇటివ్వు."