పిచ్చిదానిలా వీధిన పడింది రాధ __హాస్పిటల్ లో కరుణ్ మంచం దగ్గిర వాలింది...
కరుణ్ కప్పుడప్పుడే స్పృహ వస్తోంది. అస్పష్టంగా "రాధా!" అని కలవరిస్తున్నాడు.
అక్కడ కరుణ్ బంధువులంతా...లోకం దృష్టిలో అతనికి కావలసిన వాళ్ళందరూ ఉన్నారు. అయినా అతను రాధను...ఎవరి కారణంగా తనీదశకు రావలసి వచ్చిందో ఆ రాధను__కలవరిస్తున్నాడు.
అతని బెడ్ మీద అతని పక్కనే కూలబడిపోయింది రాధ, నిలబడగలిగే శక్తి తనకేమీ మిగలనట్లు...
"నేను వచ్చేసాను కరుణ్!" అంది ఉత్సాహంగా కాదు__ఆనందంగా కాదు__మొండిగా.
కరుణ్ పూర్తిగా కళ్ళు తెరిచాడు. "రాధా" అన్నాడు పట్టరాని ఆశ్చర్యంలో... "రాధా!" అన్నాడు మళ్ళీ అంతులేని భయంతో.
"అవును! రాధను!" నవ్వింది. కన్నీళ్ళమధ్య, ఆ నవ్వు చూసిన కరుణ్ ముఖంలోకి జీవం వచ్చింది...
"నిన్నొక్కసారి...చివరిసారి చూడకుండా చచ్చిపోతానేమోనని ఎంత అలమటించాననుకున్నావ్?... ఎలాగైనా నువ్వొక్కసారి కనిపించాలని తెలిసిన దేవుళ్ళందరినీ ప్రార్ధిస్తున్నాను. నిన్ను చూసాను. సంతోషంగా చచ్చిపోతాను."
రాధ పెదవులు వణికాయి. ఆపుకోలేని దుఃఖం పొంగి వస్తోంది. అంత దుఃఖాన్నీ వెనక్కు నెట్టి అల్లరిగా నవ్వింది.
"మరే పాపం! ఎంతాశ! ఒంటరిగా చచ్చిపోదామనుకున్నావా? ఈ లోకంలో నీతో కలిసి రాలేకపోయినా పై లోకాలకు నీతో కలిసి రావాలనే వచ్చాను. ఎప్పుడో మరి, ముహూర్తం, నువ్వే నిర్ణయించు!"
"అది మాత్రం పాపం కాదా?"
"కాదు! అక్కడ శరీరాలుండవు. మనసులే! అంతా గాలి ! ఒట్టిగాలి! ఏ బంధాలూ లేని గాలి!"
పకాలున నవ్వాడు కరుణ్.
"లాభంలేదు! ఇలా మాట్లాడగలిగే నిన్ను వదలి... నిన్ను చూడగలిగే నా శరీరాన్ని వదలి...గాలిగా ఎగిరిపోలేను. ధూళిలో కలిసినా ఇక్కడే ఉంటాను." అన్నాడు.
"ఛీ! ఛీ!"
గిర్రున తల తిప్పింది రాధ అయోమయంగా చూస్తూ ఛీత్కారం చేసింది స్వర్ణ. ఆ ఛీత్కారం భూన భోంతరాలు నిండి విశ్వమంతా ప్రతిధ్వనించింది. ఆ తాకిడికి తప్పించుకోలేని రాధ పాతాళానికి కృంగిపోయింది ...
"అక్కా! నా కంటిలో మెల్ల ఉంది. ఆయన నా ఆస్తికోసమే నన్ను చేసుకున్నారంటావా?" అంటే...
"ఛీ! కరుణ్ ని నువ్వు మాత్రం అర్ధం చేసుకోలేదా? మెల్ల ఉన్నంత మాత్రాన తేలిగ్గా చూస్తాడా నిన్ను? అసలు నువ్వంటే కరుణ్ కి అంతులేని ప్రేమ" అని ధైర్యం చెప్పిన రాధ...
"నేనేమీ చదువుకోలేదు. ఆయనకు తగిన భార్యను కానేమో?" అని బెంగపడితే ...
"భార్య కావడానికి కావలసింది చదువుకాదు. మనసునిండా ప్రేమ. అది నీకు పుష్కలంగా ఉంది. కరుణ్ కి నీకంటే మంచి భార్య ఈ జన్మకు కాదుకదా కోటి జన్మలకు కూడా దొరకదు" అని ఆత్మ విశ్వాసం కలిగించిన రాధ....
ఆ రాధ ఈ రాధేనా? విభ్రాంతితో చూసింది స్వర్ణ....రాధ...తన రాధ...తన నోములు పంట తన బాబుకు తల్లి ఈనాడు తన కళ్ళముందు...మరొకరి పక్కమీద...
సంభవమా! రగిలే మనసులో... రక్తం కక్కే కళ్ళతో చూసాడు శేఖర్....
రాధ...పాపం, రాధ ... భర్తను, సంపదనూ ,సంసారాన్నీ వొదిలి... సంఘాన్నెదిరించి... సంఘర్షణలకు తట్టుకొని తన కోసం తన దగ్దరకు వచ్చేసిన రాధ...
ఆరాధన నిండిన చూపులతో అభిషేకించాడు కరుణ్...
రాధ అలాగే కూచుంది. పాతాళంలోకి దిగిన తన తలను పైకెత్తలేదు. ఎవరినీ చూడలేదు. ఏదీ ఆలోచించలేదు. కట్లతో నిండిన కరుణ్ చెయ్యి గట్టిగా పట్టుకొని కదలకుండా కూచుంది.
సమయానికి వెంటనే హాస్పిటల్ చేర్చటంవల్ల...సమర్ధులైన వైద్యులతో వైద్యం చేయించటంవల్ల...త్వరలోనే కోలుకున్నాడు కరుణ్...ఆ ఖర్చంతా శేఖర్ భరించాడని తెలిసింది ... రాధ మనసు చల్లబడలేదు. మరింత మండింది. ఏదో గిల్టీగా పీలయినపుడు కాని శేఖర్ ఇలా ప్రవర్తించడు. ప్రాణాలకు మోసం వచ్చేలా తన్నించి ఆ తరువాత వైద్యం చేయించటమా ఔదార్యం?
హాస్పిటల్ కు వచ్చిన రాధ మళ్ళీ తన ఇంటికి వెళ్ళలేదు. శేఖర్ ఒకటి రెండుసార్లు వచ్చాడు. రాధ తల ఎత్తి చూడలేదు. కరుణ్ కు నయమయ్యాక అతనితో అతని ఇంటికే వచ్చింది. స్వర్ణ రెండేళ్ళు నిండిన తన కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
కర్నల్ స్వామి వచ్చాడు...
"రాధా! నువ్వు చేసినపని నాకు నచ్చలేదు!" సూటిగా అన్నాడు.
"నీకు నచ్చాలని నేను చెయ్యలేదు." నిర్లక్ష్యంగా అంది రాధ. తనను విమర్శించే వ్యక్తులతో నిర్లక్ష్యంగా మాట్లాడడం నేర్చుకొంటోంది రాధ.
"ఛ! ఛ! ఏది జరగకూడదని ఇంత చేసానో, చివరకు అదే జరిగింది!"
"ఏమిటి నువ్వు మాట్లాడేది?"
కసిగా పళ్ళునూరాడు స్వామి.
"ఆ కరుణ్ గాడిని చావతన్నిస్తే మళ్ళీ నీ జోలికి రాడనుకున్నాను. కానీ...ఏడవండి! వినాశకాలే విపరీత బుద్ధిః..."
స్వామి మాటలు వినపడటంలేదు రాధకి. ఆవిడ తల తిరుగుతోంది. గూండాలతో కరుణ్ ని తన్నించింది శేఖర్ కాదు! స్వామి! మరి శేఖర్ ఎందుకంత శ్రద్ధ తీసుకుని వైద్యం చేయించినట్లు? అంతటి ఉదారస్వభావం కాదే?
శేఖర్ వచ్చాడు. తనంతట తను భార్య మరొకడితో కాపురం చేస్తూన్న ఇంటికి వచ్చాడు. అతని ముఖం బాగా వడలిపోయి ఉంది. తలెత్తలేదు రాధ.
"ప్లీజ్ రాధా! రెండు నిముషాలు! మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చెయ్యను."
బెదిరిపోతున్న చూపులతో చూసింది రాధ ...
"జరిగినదానికి చాలా విచారిస్తున్నాను. ఎలా జరిగిందో నాకు అర్ధం కావటం లేదు. కానీ భయంకరమైన కోరిక అనుకోకుండా కార్యరూపం దాల్చింది. ఈర్ష్య అణుచుకోలేక కరుణ్ ని చావతన్నాలని నాలో నేను ఎన్నిసార్లో అనుకున్నాను. వంటినిండా గాయాలతో హృదయ విదారకంగా మూలుగుతూ, మంచానపడిన అతణ్ని ఊహించుకుని కసిగా నవ్వుకున్నాను. కానీ తీరా అతణ్ని అలా చూడగానే ఎందుకో వణికిపోయాను... నేను అంత గాఢంగా కోరుకోవటమే అలా జరగటానికి కారణమేమో అనిపించింది. అందుకే వైద్యం చేయించాను. త్యాగ బుద్ధితో కాదు. అంత ఔదార్యం నాకు లేదు, ఇప్పటికీ అతనంటే నాకు ఈర్ష్య అంతులేని ఈర్ష్య..."