ఆగాడ్ శేఖర్, కరుణ్ ని తలచుకోగానే కలిగిన ఉద్రేకం నిగ్రహించుకోవటానికి.
ఏమీ మాట్లాడలేదు రాధ. శిలలా కూచుంది.
"ఇదిగో ఇది నీకు యియ్యటానికి వచ్చాను." చెయ్యి ముందుకు జాపాడు.
లేత పసుపచ్చరాయి పొదిగిన ఉంగరం! ఒకనాడు ఎంతో ప్రేమగా తనే స్వయంగా అతని వేలికి తొడిగిన ఉంగరం! "ఇంక నా దగ్గిర అది అనవసరం! నీకే ఎందుకైనా ఉపయోగపడవచ్చు!"
మొదటి వాక్యానికి కరిగిపోబోయిన రాధ మనసు రెండో వాక్యంతో పదునెక్కింది. ఆ వుంగరం తీసుకుంది. శేఖర్ వెళ్ళిపోయాడు.
కరుణ్ కూతురు బాల వచ్చీ రాని మాటలతో ఎప్పుడూ కరుణ్ చుట్టూ తిరుగుతూ అతనిని వదిలిపెట్టేది కాదు. స్వర్ణ వెళ్ళిపోయినందుకు కరుణ్ బాధపడకపోలేదు. కానీ బాలను చూడకుండా ఉండలేకపోయాడు. బాలకోసం అభిమానం చంపుకొని అవమానాలకు సిద్ధపడి అత్తవారింటికెళ్ళాడు. అత్తమామలు అతణ్ని చూసి కూడా పలకరించలేదు. స్వర్ణ గదిలోకి వెళ్ళబోయాడు కరుణ్. గది గుమ్మానికి అడ్డుగా నిలబడింది స్వర్ణ...కదలలేదు. కరుణ్ ని లోపలకు రమ్మనలేదు. కూర్చోమనలేదు. ఆ ధోరణి అర్ధం చేసుకున్నాడు కరుణ్...
"బాల ఏదీ?"
కిటికీలోంచి మీరు రావటం చూసాను. పనిమనిషితో బయటకు పంపించాను__"
"అంటే?"
వెటకారంగా నవ్వింది స్వర్ణ.
"చదువుకున్నవారు మీరు! నాలాంటి మూర్ఖురాలు ఇంతకంటె ఏం చెప్పగలదు?"
తనే ఒక కుర్చీ తెచ్చుకుని గది బయటే కూర్చున్నాడు కరుణ్. స్వర్ణ అలా నిలబడే ఉంది.
"పిలిపించు!" అన్నాడు అధికారికంగా.
"ఎందుకు? అది మిమ్మల్ని ఎంతత్వరగా మరిచిపోతే నాకంత మంచిది!"
"నన్ను పూర్తిగా వదులుకున్నట్లేనా?"
"జాగ్రత్తగా మాట్లాడండి! మీరే నన్ను వదిలారు. నేను దేవిరించటం లేదు!"
"ఆలోచించే మాట్లాడుతున్నావా?"
"ఏవిటీ__మీరు ... నన్ను ...ఆలోచించమంటున్నారా? ఆహా! ఆలోచించాను...అన్ని విషయాలు చాలా బాగా ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను. మొగుడు లేనంత మాత్రాన నాకు మునిగిపోయింది లేదు. కనుసైగ చేస్తేచాలు కుక్కల్లావచ్చి క్యూలో నిలబడతారు, మిమ్మల్ని మించిన ప్రాణయోపాసకులు!"
"ఛీ! ఛీ! ఎంత దారుణంగా మాట్లాడుతున్నావ్! మా ప్రేమను అర్ధం చేసుకోకుండా..."
"లేదు! లేదు! అర్ధం చేసుకున్నాను. లైలా మజ్నూలను; పార్వతీ దేవదాసులను... అనార్కలీ సలీంలను...ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ మించిపోయిన పవిత్రప్రేమ. అలాంటి పవిత్రప్రేమ నాకు లేదు. నా సంసారాన్ని కూలదోసుకునే ప్రేమ...నా బిడ్డ బ్రతుకును నలుగురిలో నవ్వులపాలుచేసుకునే ప్రేమ...నా బిడ్డబ్రతుకుని నలుగురిలో నవ్వులపాలు చేసుకునే ప్రేమ అలాంటి ప్రేమ నాకక్కర్లేదు. ఆ మహా ప్రాణయోపాసకులు మీరే! మీయశస్సు భూనభోంతరాళాలు నిండి జ్వలించిపోతూంది. ఆ జ్వాలల్లో నీ పాప మాడిపోకుండా కాపాడుకోవటమే నాకు కావాలి, నా పాపచుట్టూ కంచుకోటలా నిలవటానికి ఏదైనా వదులుకుంటాను. ఎంతైనా సహిస్తాను."
స్వర్ణ మాటల్లో నిర్లక్ష్యం మాత్రమే తెలిసింది కరుణ్ కు. ఆ తరువాత ఆమె కిటికీ చువ్వలు పట్టుకుని తను కనుమరుగయ్యేంతవరకూ చూడటం తెలియదు. భరింపరాని బాధతో ఉబికిన ఆమె కన్నీరు దానిని వెన్నంటి వచ్చిన రోషాన్ని కీలల్లో ఆవిరి కావటం తెలియదు.
కరుణ్ ముఖం చూడగానే ఏదో జరగరానిది జరిగిందని అర్ధం చేసుకుంది రాధ ... కానీ అదేమిటని అడగలేకపోయింది. ఏం జరిగినా కారణం తనే!
"నీ వల్ల నాకీ అవమానం జరిగింద"ని కరుణ్ చెప్పాడు!
గంగా భాగీరాధీ సమానురాలు సుబ్బాయమ్మగారు-అక్కడి మాటలిక్కడా, ఇక్కడి మాటలక్కడా జేరవెయ్యటంలో... లేనివి కల్పించి చెప్పటంలో...పనికట్టుకుని మనసుని పొడిచేలా మాట్లాడడంలో ఆవిడకావిడే సాటి...
రెండు గంటలవేళ గుండె బాదుకుంటూ వచ్చింది ఆవిడ రాధ దగ్గిరకి...
"ఇంకేముంది రాధమ్మతల్లీ అంతా ముగిసిపోయింది నా తల్లీ! శేఖర్ చచ్చిపోయాడు రాధమ్మా!" అని దీర్ఘాలు తీసేస్తోంది.
అదిరిపడింది రాధ.
"శేఖర్ చచ్చిపోయాడా? నిన్నటి వరకూ బాగానే ఉన్నాడు..."
"నిన్నటివరకూ కాదే నా తల్లీ! గంటక్రిందటి వరకూ బాగానే ఉన్నాడు...ఇప్పుడే కారు ఏక్సిడెంట్ అయింది. శేఖర్ కారు లారీని గుద్దేసింది. నా కళ్ళారా చూసాను...."
రక్తం బొట్టు లేనట్లు పాలిపోయింది రాధ ముఖం. ఆ ముఖం చూసి తృప్తిపడిన సుబ్బాయమ్మ దీర్ఘాలు ఆపేసింది. స్థిమితంగా మాట్లాడటం మొదలుపెట్టింది....
"అవునే అమ్మడూ! ఇంతకూ నీకు __ పసుపూ కుంకం పోయినట్లా? ఉన్నట్టా?" అని ధర్మ సందేహం ప్రకటించింది... రాధ చీదరగా చూసి కోపంగా ముఖం తిప్పుకోవటంతో ఆవిడకు హుషారొచ్చింది. మరి కాస్త రసవత్తరంగా మళ్ళీ మొదలుపెట్టింది... "ఇది విన్నావా! అది ఏక్సిడెంట్ కాదనీ, శేఖర్ కావాలనే తన కారును లారీకి గుద్దించాడనీ చెప్పుకుంటున్నారు. ఏం కాలమమ్మా చావడానికి కూడా కొత్తకొత్త మార్గాలు! భలే! భలే!" అని కొంతసేపు తన హుషారు ప్రకటించిన సుబ్బాయమ్మ అంతలో అసలువిషయం గుర్తొచ్చి విచారంగా "అవునమ్మా! హాయి మన్న మొగ మహారాజు కట్టుకున్న పెళ్ళాం కళ్ళముందు మరోడితో కాపురం చేస్తోంటే చూసి ఎలా సహిస్తాడు? ఆ నరకంకంటె ఈ చావు మేలు కాదు మరీ..." అని వ్యాఖ్యానించింది.
రాధముఖ భంగిమలు చూడాలని ముచ్చటపడి పరిశీలనగా చూసింది. కానీ అప్పటికే రాధ స్పృహ తప్పి పడిపోయింది. సుబ్బాయమ్మ కంగారుపడి పారిపోయింది.
కరుణ్ వచ్చేసరికి రాధ అలాగే స్పృహతప్పి పడి ఉంది. ఆరేళ్ళ బాబు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. కరుణ్ కి మతిపోయినట్లయింది...
"రాధా! రాధా!" అని పిలిచాడు. ముఖంమీద చన్నీళ్ళు జల్లాడు. స్మైలింగ్ సాల్ట్ వాసన చూపించాడు. రాధ కళ్ళు తెరిచింది...కరుణ్ కనిపించాడు. అంతలోనే ఎక్కడినుండో శేఖర్ స్వరం మనసును మెలిపెడుతూ వినిపించింది.
"నిన్ను ప్రేమిస్తున్నాను రాధా! నిన్ను వదలలేను రాధా! వదలను ... వదలను .... నిన్ను వదలలేను రాధా! నిన్నువదలను..."
రాధ మళ్ళీ స్పృహ తప్పిపోయింది. బాబు ఏమీ అర్ధంకాక__ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. కరుణ్ బాబును దగ్గిరకు తీసుకోవాలని ఒక్క అడుగు ముందుకు వేసాడు. బాబు వెనక్కు తగ్గాడు. కోపంగా చూసాడు, అమాయకంగా అన్నాడు.