విశ్వగీతి
అలలై తేలి __ ఆశలుగా అల్లుకొని...అందరాని అందాలను మెరిపిస్తూ మురిపిస్తూ ప్రాణికోటిని పరుగెత్తించే మధుర సుధాస్రవంతి...మోహనమూర్తి మురళీగానరవళి...
ఆ స్వరాలకు సమ్మోహితులై నాదఝరిలో కొట్టుకొని పోతున్నారు. సామాన్య గోపికలు__ప్రణయ పారవశ్యాన తాము పెట్టిన పరుగులన్నీ లౌకిక పరిసరాలను దాటించలేకపోయాయని గుర్తించినపుడు తెల్లబోయారు __బేలగా తిరిగివచ్చారు.
మురళీకృష్ణునిలో విశ్వమోహనుని చూసింది రాధ - ఎంతటి సమ్మోహనమూ స్వస్వరూప జ్ఞానాన్ని తొలగించలేక పోయిందామెకు. అందుకే పరవశించినా పరుగులలో పాల్గోలేదు. అయితేనేం? ఆమె ప్రగాఢ పారవశ్యమే ఆమెను అన్నింటి నుండి తప్పించింది. దివ్యసౌందర్యంలో ఒక భాగంగా దీపింప చేసింది.
గొల్లున ఏడుపులు...కేకలు...తన ఆలోచనలలోంచి తెల్లరిల్లింది రాధ. ఎవరినో స్ట్రెచర్ మీద మోసుకొస్తున్నారు. ఎవరది? కరుణ్ ! అవును! కరుణ్! తలమీద పెద్ద గాయంతో వంటినిండా దెబ్బలతో... చూడలేకపోయింది__ఇంత ఘోరం! ఎలా జరిగింది?
"అబ్బా!"
వెనుకనుండి వినబడ్డ కంఠస్వరానికి అదిరిపడింది. గిర్రున తిరిగింది__స్ట్రెచర్ మీద ఉన్న కరుణ్ ని చూస్తున్న శేఖర్ చూపులు రాధ చూపులతో కలుసుకున్నాయి. గిరుక్కున క్రిందకు వాలాయి. శేఖర్ ముఖం చూడలేకపోతోంది రాధ__ ఆ ముఖంలో ఆమెకు భయంకర పిశాచాల బీభత్సం తాండవం కనిపిస్తోంది__కరాళ కాళిక వికటాట్టహాసం వినిపిస్తోంది.
" కరుణ్ అంతు తేలుస్తాను! ఏమనుకుంటున్నాడు? ఎవరితో చెలగాటమాడుతున్నాడు? పీకనొక్కి మురిగ్గుంటలో పారేసినా అడిగేవాడు లేడు."
ఇవే మాటలు....సరిగ్గా ఇవే మాటలు శేఖర్ నోట వినిపించాయి రెండురోజులక్రితం__అప్పుడింత దారుణాన్ని ఊహించలేకపోయింది. మానవ సహజమయిన ఈర్ష్య ఆ మాటలను పలికించిందని భ్రమపడింది __ కానీ శేఖర్ రాక్షసుడయ్యాడని __ కాగలడనీ అనుమానించలేకపోయింది__
ఒక్కసారి రాధ ముఖంలోకి చూసాడు శేఖర్__మరుక్షణం ఎదురింట్లో ఉన్నాడు. అందరినీ తీసుకోని లోపలికెళ్ళాడు. స్పృహతప్పిన కరుణ్ ని తన కారులో పడుకోబెట్టుకున్నాడు. కారుని హాస్పటల్ వైపు నడిపించాడు__
చూస్తూ నిలబడ్డ రాధ శరీరం సెగలూ పొగలూ కక్కింది. శేఖర్ తనకు బాగా తెలుసు. వల్లమాలిన ఉద్రేకం_ ఆ ఉద్రేకంలో ఎంత దారుణంగానైనా ప్రవర్తించగలడు. ఆ తరువాత పశ్చాత్తాప పడతాడు. ఎలాంటి పరిహారమైనా చెల్లించటానికి సిద్ధపడతాడు__కరుణ్ స్థితికి కారకుడు శేఖర్ కాకపోతే ఒక్కనాటికీ ఇలా కారులో హాస్పిటల్ కి తీసికెళ్ళడు.
ఇంటిముందు స్కూటర్ ఆగింది కర్నల్ స్వామి దిగాడు. ఉడికిపోతూ కన్నీళ్ళు క్రక్కుతూ నిలబడ్డ రాధను చూసాడు. "రాధా" అన్నాడు ఆప్యాయంగా....
"అన్నయ్యా!" అని స్వామి భుజాలమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది రాధ__
"పాపం! కరుణ్ ని ఎవరో..." గొంతుకేదో అడ్డుపడినట్లయింది రాధకి...
"ఊరుకో! ఊరుకో!" రాధ భుజం తడుతూ ఓదార్పుగా అన్నాడు స్వామి. అయినా రాధ ఊరుకోలేకపోయింది. తనొక సిగరెట్ కాల్చుకుంటూ రాధను యధేచ్చగా ఏడవనిచ్చాడు స్వామి__అలాంటి సమయంలో ఏడవటమే మంచిదేమో!
ఎప్పటికో తిరిగి వచ్చాడు శేఖర్. ఉస్సురంటూ కూలబడ్డాడు. అతని ముఖం చూడగానే అణచుకుంటోన్న దుఃఖం ఒక్కసారిగా పొంగింది రాధలో...
చూసి భరించలేకపోయాడు శేఖర్ ... "రాధా! ఏడవకు!" అన్నాడు. ఆ కంఠంలో ఓదార్పులేదు. బొంగురుగా ఉంది. కరుగ్గా ఉంది. రాధ తల ఎత్తలేదు__ఏడుపు మానలేదు__
"నీ కన్నీళ్ళు చూడలేను రాధా!" ఈసారి శేఖర్ కంఠం దయనీయంగా ఉంది. ప్రాధేయపడుతున్నట్లు ఉంది. రాధ మనసు మెత్తబడబోయింది. "అతనికోసం నీ కంట కన్నీరు కురిస్తే నేను సహించను__" అతి గంభీరంగా, ఏదో బెదిరిస్తున్నట్లుగా ఉంది అతని కంఠం__
మెత్తబడబోతూ రాధ మనసు బండబారింది. అహం పడగవిప్పింది...చివ్వున లేచింది__
"ఏవిటీ? నేను ఏడవాలో ఏడవకూడదో నిర్ణయించే అధికారం కూడా మీదేనా? నన్ను ఏడిపించే హక్కు మీ ఒక్కరిదేనన్న మాట!" అంది వెటకారంగా__కసిగా__
"మరే నేను నిన్ను ఏడిపిస్తున్నానుకదూ!" రోషంగా అడిగాడు శేఖర్...
"ఉహు! కాదు__ఏడిపించడం కాదు__నా మెడలో అప్పుడెప్పుడో తాళి కట్టినంత మాత్రాన... నా బాబుకి తండ్రి అయినంత మాత్రాన...నన్ను కొనుక్కున్నట్లు...నేను మీ బానిసనయినట్లు...ప్రవర్తించటం ఏడిపించటం కాదు, ఇక్కడ నిలబడకు... అక్కడ కూచోకు...ఇటు తల తిప్పకు...అటు చూడకు...ఇలా ఏడవకు...అలా నవ్వకు...అనటం ఏడిపించడం కాదు..."
ఉద్రేకంతో అంటూ ఆగిపోయి పకాలున నవ్వింది రాధ__అక్కసుగా అంది.
"అవును. ఏడిపించటంకాదు. ఏడిపించలేరు. శరీరాన్ని ఇనుపగొలుసులతో బంధించినా మనసును ముట్టుకోలేరు. దానిని శాసించలేరు. దాని మార్గాన అది యధేచ్చగా ఎగిరిపోతుంది. మీకు మిగిలేది యంత్రం...కట్టె...శవం..."
శేఖర్ ముఖం ఒక్క క్షణం పాలిపోయింది. మరుక్షణం జేవురించింది.
"అలాగేం? ఎగురుతుందే మనసు! ఎగరనీ! ఎగిరి ఎగిరి అదే నామరూపాలు లేకుండా పోతుంది. నాకు మిగిలేది యంత్రమే అయినా పరవాలేదు__ఆ యంత్రాన్ని ఎలా నడిపించుకోవాలో నాకు తెలుసు."
భగ్గుమంది రాధకి...
"కాదు! నేను యంత్రాన్ని కాను__మీరు నన్ను ఆడించలేరు. నేను మనిషిని. నా మనసు చెప్పినట్లే వింటాను. మీరు నన్నేమీ చేయలేరు."