Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 26

వారం రోజులు గడిచాయి.
ఎనిమిదో రోజున అతని రూము వెతుక్కుంటూ తనే వచ్చింది భానురేఖ.
ఆమెని చూడగానే బ్రహ్మానందభరితుడయిపోయాడు రవిచంద్ర. "థాంక్స్! నా అడ్రసు గుర్తుంచుకున్నందుకు!" అన్నాడు సంతోషంగా.
అది వినిపించుకోనట్లు సీరియస్ గా చూసింది భానురేఖ. "నేను ఇంకా బతికే ఉన్నాను" అంది, 'దీనికి నువ్వే కారణం' అని ఆరోపిస్తున్నట్లుగా.
సహనం కోల్పోయిన వాడిలా చటుక్కున లేచి నిలబడ్డాడు రవిచంద్ర. "చావాలని అంత తహతహగా ఉందా నీకు? నిన్ను చంపాలంటే క్షణం పట్టదు - చూడు!" అంటే అక్కడే ఉన్న ప్లాస్టిక్ తాడు ఒకటి అందుకుని దాన్ని బ్లేడుతో రెండు ముక్కలుగా కోశాడు. ఒక ముక్కతో ఆమె చేతులూ, కాళ్ళూ గట్టిగా కట్టేశాడు. ఊహించని ఈ పరిణామానికి నోటమాట రాకుండా చూస్తోంది భానురేఖ. ఆమె తేరుకునే లోపలే చీరె లాగేసి, కొంగుని ఆమె నోట్లో కుక్కేశాడు. అర్థనగ్నంగా ఉన్న తన శరీరాన్ని అతని దృష్టిలో పడకుండా ఉంచాలని తాపత్రయపడుతూ గింజుకుంది భానురేఖ. కానీ ఆమె చేతులు కట్టేసి ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. లజ్జతో ఆమె మొహం కందిపోయినట్లయింది.
అరుణ కిరణంలా ఎర్రబడ్డ భానురేఖ మొహాన్ని కాసేపు తదేకంగా చూశాడు రవిచంద్ర. సిగ్గు కూడా తెలుస్తోందన్నమాట ఈ అమ్మాయికి. మంచి ప్రోగ్రెసే!
ఇంకో పొడుగాటి తాడు ముక్క తీసుకుని దాన్ని ఫ్యానుకి కట్టాడు. తాడు రెండో కొసని ఉచ్చులా భానురేఖ మెడకి వేసి, ఆమెని ఎత్తి మంచంమీద నిలబెట్టాడు. తర్వాత మంచాన్ని పక్కకి జరిపేసి, ఒక్క అంగలో తలుపు తెరుచుకుని బయటికి వచ్చేసి తలుపు తాళం వేసేశాడు. రెండు సెకెండ్ల తర్వాత గదిలో పెద్ద చప్పుడు వినబడింది.
చిరునవ్వు నవ్వుకున్నాడు రవిచంద్ర. ఫ్యానుకి కట్టిన తాడుని ముందే తను బ్లేడుతో సగం కోసేసి బలహీనంగా చేసేశాడు. భానురేఖ బరువుకి అది ఫట్ మని తెగిపోయి ఉంటుంది. రెండోసారి కూడా తన ప్లాను సక్సెస్ ఫుల్ గా అయింది. హత్యాప్రయత్నం చేసినట్లూ కనబడాలి. భానురేఖకి ప్రాణాపాయం కలగకూడదు.
గదిలో భానురేఖ కోపంగా తిట్టడం వినబడింది. అక్కడే ఉండి కాసేపు విన్నాడు రవిచంద్ర.
తర్వాత చటుక్కున ఏదో స్పురించినట్లు తిట్టడం మానేసి, మౌనంగా అయిపొయింది భానురేఖ.
నవ్వుకుంటూ అక్కడినుంచి కదిలి, నేరుగా హోటల్ కి వెళ్ళాడు రవిచంద్ర. కానీ, భానురేఖ భోజనం చేసి వచ్చిందో లేదో, ఆకలి కడుపుతోనే వచ్చేసి తన రూములో చిక్కుకుపోయిందో అనుకుంటే అతనికి ఏమీ తినబుద్ధి కాలేదు. భోజనం సగంలోనే వదిలేసి వచ్చేశాడు. ఏమీ తోచక దగ్గరలోనే ఉన్న ఒక సినిమా హాల్లోకి వెళ్ళి అన్యమనస్కంగా కూర్చున్నాడు. సినిమాలో హీరోయిన్ మొదలుకుని హీరో, విలనూ, అందరూ కూడా భానురేఖలాగే కనబడటం మొదలెట్టారు. ఇంటర్వెల్ తర్వాత ఇంక ఉండబట్టలేక రూముకి తిరిగి వచ్చేశాడు.
రూము లోపల అలికిడి వినబడటం లేదు. తలుపు తెరిచాడు. మంహం పక్కన మల్లెపూల కుప్పలా పడి ఉంది భానురేఖ. అతన్ని చూడగానే కోపం కనబడింది ఆమె మొహంలో.
"నువ్వు ఎందుకూ పనికిరాని వాడివి!" అంది విరుచుకు పడుతూ. "యూ ఆర్ ఏ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో! ఆల్ రైట్! ఏ పనీ సరిగ్గా చెయ్యలేని చవటవి నువ్వు!"  
ఆమె తిట్లని సహిస్తూ, కట్లు విప్పాడు రవిచంద్ర. ఒరుసుకున్న చేతుల వైపు చూసుకుంటూ, మెడ చుట్టూ తడిమి చూసుకుంది భానురేఖ.
"అసలు నీకు బుద్ధి లేదు!" అంది మళ్ళీ మొదలెడుతూ. "చంపడానికి ఇంతకంటే మంచి ఆలోచన తట్టలేదా నీకు? నేను చచ్చి ఉంటే నువ్వు కూడా ఉరికంబం ఎక్కి ఉండేవాడివి."  
"ఎందుకు?"
"ఇది హత్య అని, ఆ హత్య నువ్వే చేశావనీ అందరికీ తెలిసిపోదూ? శవం నీ గదిలో ఉంటుంది. శవం కాళ్ళూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఏమనుకుంటారు పోలీసులు?
ఆమె వైపు కళ్ళార్పకుండా చూశాడు రవిచంద్ర. చాలా ఫాస్ట్ గా మార్పులు వచ్చేస్తున్నాయి భానురేఖలో.
స్తబ్దంగా ఉన్న మెదడులోని గ్రేసెల్సులో ముందు ఒకటి యాక్టివేట్ అయి, అది మరో రెండిటిని మేల్కొలిపితే, ఆ రెండూ నాలుగింటినీ లేపినట్లూ, నాలుగు సెల్సు ఎనిమిది సెల్సునీ, ఎనిమిది పదహారునీ, పదహారు ముప్పై రెండునీ, ముప్పై రెండు అరవైనాలుగునీ, అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిదినీ... అలా... జాగృతం చేసినట్లు మానసికంగా త్వరగా త్వరత్వరగా ఎదిగిపోతోంది భానురేఖ!
ఆమె కళ్ళలో, ఆమె గొంతులో దోబూచులాడుతున్న భావం ఏమిటి?
తను ప్రమాదంలో పడతాడేమోనని భయమా?
"మూడో ఛాన్సు కూడా ఇస్తున్నాను నీకు. ఈ నెలాఖరు లోపల నన్ను చంపలేకపోయావంటే నా డబ్బు నాకు ఇచ్చెయ్యాలి." అంది భానురేఖ బెదిరింపుగా.
"ఈసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను" అన్నాడు రవిచంద్ర.
ఇంకోసారి చేతులు నిమురుకుని, బయటికి నడిచింది భానురేఖ. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగింది. "నువ్వే స్వయంగా చంపాలని ఎక్కడా లేదు. నీ చేత కాకపోతే ఇంకెవరి చేతనయినా పని పూర్తి చేయించవచ్చు" అని త్వరత్వరగా వెళ్ళిపోయింది.
అతనికి తను చిన్నప్పుడు చదువుకున్న ఒక పొయిట్రీ లెసన్ తాలూకు పేరు గుర్తొచ్చింది. "లాబెల్ డేమ్ సాన్స్ మెర్సి!" ఫ్రెంచ్ పదాలతో కూడిన సమాసం అది. 'దయలేని యువతి' అని అర్థం. జాలిలేని జాబిలీ అన్నట్లు!
ఆమె చనిపోతే తను ఏమైపోతాడనుకుంటోంది? తను పడుతున్న మరణయాతన ఆమెకు అర్థం కాదా?

 Previous Page Next Page