వెయిటర్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా అతను మళ్ళీ ఊడిపడలేదు.
"ఈ కూర్మారావు ఒకసారి లోపలికెళితే మళ్ళీ బయటికి రాడనుకుంటాను" అన్నాడు రవిచంద్ర.
"కూర్మారావా?"
"అంటే వెయిటరని అర్థం. కూర్మారావంటే కూర్మా సర్వ్ చేసేవాడని కాదు. మన జోకులోని తాబేలు లాంటి వాడన్నమాట!"
అర్థం కానట్లు చూసింది భానురేఖ.
"మీకు చెప్పలేదా ఏమిటి? అయితే మీరు వినాల్సిందే!" అని ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు రవిచంద్ర.
"ఒకసారి ఒక తండ్రి తాబేలూ, తల్లి తాబేలూ, పిల్ల తాబేలూ కలిసి హోటలుకెళ్ళి కాఫీ ఆర్డరిచ్చాయి. తండ్రి తాబేలు ఆకాశం వైపు చూసి "వానొచ్చేటట్లు ఉంది ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా!" అంది పిల్ల తాబేలుతో.
"అమ్మా! నే వెళ్ళ! నేనింటికెళ్ళగానే మీరు నా కాఫీ తాగేస్తే?" అంది పిల్ల తాబేలు.
"నువ్వొచ్చేదాకా తాగంలే! వెళ్ళిరా!" అంది తల్లి.
పిల్ల తాబేలు మెల్లిగా వెళ్ళింది. ఆ వెళ్ళడం వెళ్ళడం మూడేళ్ళపాటు తిరిగి రాలేదు. "ఇది ఇప్పట్లో వచ్చేటట్లు లేదు. కాఫీ మరీ చప్పగా చల్లారిపోతోంది. మనం తాగేద్దాం" అంది తండ్రి తాబేలు.
ఆ మాటలు వినగానే తలుపుచాటు నుంచి బయటికి వచ్చింది "మీరు నా కాఫీ తాగేస్తారని నాకు తెలుసు. అందుకని ఇక్కడే దాక్కుని చూస్తున్నా!" అందిట గడుసుగా.
చిన్నగా నవ్వింది భానురేఖ.
ఎంత సుందర దరహాసం అది! కళ్ళార్పకుండా కాసేపు చూశాడు రవిచంద్ర. ఈ రెండు రోజుల్లో రెండుసార్లు నవ్వింది భానురేఖ. ఇంకొద్దిగా టైం ఉంటే తను ఈ అమ్మాయిని పూర్తిగా మార్చగలడేమో! బహుశా.
"ఈ సర్వా రావ్ ఇప్పట్లో రాడేమోనండీ? నేనే లోపలికెళ్ళి చెప్పివస్తా!" అన్నాడు ఇంకో అయిదు నిమిషాల తర్వాత.
తల ఊపింది భానురేఖ. రవిచంద్ర లోపలకెళ్ళి కాసేపటి తర్వాత తిరిగివచ్చాడు. వస్తూ వస్తూనే అటూ ఇటూ చూసి బలంగా భానురేఖని నెట్టేశాడు నీళ్ళలోకి. అనుకోని ఈ పరిణామానికి ఆమె ఆశ్చర్యంతో ఒక్కసారి నోరు తెరిచింది. మరుక్షణంలో నీళ్ళలో ఉంది ఆమె. దభేలుమని చప్పుడు!
ఒక్క మునక వేసి పైకి వచ్చింది భానురేఖ. మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది.
ఈసారి ఆమె కాళ్ళకి నేల తగిలింది. నీళ్ళలో నిలబడినట్లు ఉంది తను. కళ్ళూ, మొహమూ నీళ్ళ ఉపరితలానికి పై భాగానే ఉన్నాయి. తల విదిలించి చుట్టూ చూసింది భానురేఖ.
నీటి మట్టం త్వరత్వరగా తగ్గిపోతోంది. భుజాల దగ్గరకొచ్చేశాయి నీళ్ళు. నడుము దగ్గరికి దిగిపోయాయి. మోకాళ్ళ కిందికి వెళ్ళిపోయాయి. పాదాలు తడుపుతూ కొద్ది క్షణాలు ఉండి తర్వాత పూర్తిగా అదృశ్యమయిపోయాయి నీళ్ళు. కాళ్ళ కింద లేత నీలిరంగు మార్బుల్ టెయిల్స్ మాత్రం కనబడుతున్నాయి ఇప్పుడు.
జరిగినదేమిటో తెలియక తెల్లమొహం పెట్టి నిలబడిపోయింది భానురేఖ. భరించలేనంత ఆశాభంగం కనబడుతోంది ఆమె మొహంలో. ఊహించని సమయంలో రవిచంద్ర తనని నీళ్ళలోకి తోసేశాడు. తమ అగ్రిమెంటు ప్రకారం అదృష్టం వుంటే తను ఈ పాటికి చనిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేది. కానీ జరిగిందేమిటి? నీళ్ళలో పడింది గానీ చనిపోలేదు తను. నీళ్ళన్నీ మంత్రం వేసినట్లు మాయమైపోయాయి. తడిసిపోయిన జుట్టుతో, బట్టలతో, ఫూల్ లాగా ఈ స్విమ్మింగ్ ఫూల్ లో నిలబడి ఉంది తను! ఏం జరిగింది అసలు?
జరిగినది ఏమిటో రవిచంద్ర ఒక్కడికి మాత్రమే పూర్తిగా తెలుసు. భానురేఖని నీళ్ళలోకి తోసెయ్యగానే అతను త్వరత్వరగా లోపలికి వెళ్ళిపోయి, అప్పటికే తనకు పరిచయమైన వెయిటర్ తో కలిసి, స్విమ్మింగ్ ఫూల్ లోని నీళ్ళు డ్రయిన్ అయిపోయే స్విచ్ ఆన్ చేశాడు. వెంటనే ఫూల్ లోని నీళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. తను అగ్రిమెంటు ప్రకారం భానురేఖని చంపే ప్రయత్నం చేశాడు. దానితో పాటే ఆమె ప్రమాదంలో నుంచి బయటపడే ఏర్పాటు కూడా చేశాడు.
స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కలకలం బయలుదేరింది. "ఏం జరిగింది? ఏం జరిగింది?" అంటూ మేనేజరు పరిగెత్తుకొచ్చాడు. అక్కడ చేరిన గుంపులో సానుభూతి, కుతూహలం, నవ్వులూ -
"మిస్ భానురేఖ కాలుజారి నీళ్ళలో పడిపోయారు. ఆమెకి మెడికల్ కేరూ, రెస్టూ కావాలి. మీరందరూ పక్కకి తప్పుకుంటే నేను ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళతాను" అన్నాడు మళ్ళీ అక్కడికి చేరుకున్న రవిచంద్ర.
హోటల్లో నుంచి బయటకు వచ్చేదాకా కోపాన్ని ఉగ్గబట్టుకున్న భానురేఖ కారు డ్రయివింగ్ సీట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలెట్టింది. ఈ మధ్య రవిచంద్ర ఆమెకి కారు డ్రయివింగ్ కూడా నేర్పించాడు. "నువ్వు ఇంత పనికిరాని దద్దమ్మవనుకోలేదు. ఎం.బి.ఏ.చదివావ్ పేద్ద! ఏం లాభం! ఒక్క ఆడపిల్లని కూడా చంపడం చాతకాదు! ఏం తెలుసు నీకసలు? లక్షా పాతికవేలు నాదగ్గర కాజేసి కులకడం తెలుసా?" అంది ఏకవచనంలోకి వచ్చేస్తూ.
"మిస్ భానురేఖా!"
"మాటలనవసరం!"
"పోనీ మీ లక్షా పాతికా మీకు రిటర్న్ చేసేస్తాను."
ఆ మాట వినగానే గాలి తీసేసినట్లు వెంటనే తగ్గిపోయింది భానురేఖ. "అక్కర్లేదులే! ఇంకో ఛాన్సు ఇస్తున్నాను. ఈసారి ఫెయిలయి పోయావంటేనా -"
"ఈసారి చేసి తీరతాను" ప్రతిజ్ఞ పూనుతున్నట్లు అన్నాడతను.
"ఇక్కడ దిగిపో నువ్వు!" అంది నిర్జనమైన ఒక ప్రదేశంలో కారు ఆపుతూ. ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని గ్రహించాడు రవిచంద్ర.
అతను దిగిపోగానే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది భానురేఖ.
* * * *