దృష్టి టైప్ మిషన్ మీదకు మళ్ళించి తన పనిలో నిమగ్నమయింది.
* * * *
డ్యూటీలో చేరిన అయిదారు రోజుల్లోనే ఒకరొకరుగా ఆఫీసులో వున్న వాళ్ళంతా ఆమెతో మాటలు కలుపుకుని పరిచయం చేసుకున్నారు. పరిచయమైనప్పట్నుంచీ అవసరమున్నా లేకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడేవాడు. విరామ సమయంలో ఒకరిద్దరు చొరవచేసి ఆమెను టీకి పిల్చేవారు. మొదట్లో తటపటాయించినా చివరకు తప్పేది కాదు.
కొద్ది రోజుల్లోనే ఆమె ఇంకో సంగతి కనిపెట్టింది. ఆ ఆఫీసులో ఉన్న ముప్ఫయి మందిలోనే ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళంతా ఎప్పట్నుంచో రెండు గ్రూపులుగా చీలిపోయి ఉన్నారు. నీరజను రెండు గ్రూపుల వాళ్లూ తమ తమ వర్గాల్లోకి లాక్కోటానికి ప్రయత్నించేవారు. వాళ్ళు మాట్లాడినంతసేపూ రెండో వర్గం వాళ్ళని విమర్శించటమే పని. లేకపోతే ప్రొప్రయిటర్ శ్రీనివాసరావును తిట్టుకుంటూ అతని వ్యక్తిగత విషయాలు పదేపదే ప్రస్తావనలోకి తీసుకొస్తూ వుండటం.
ఈ లోకంలో ప్రతివాడూ తానొకడే మంచివాడు, రెండోవాడు లోపాలపుట్ట అనుకుంటూ వుంటాడు.
ఆఫీసులో జరిగేవన్నీ శ్రీనివాసరావుకు తెలీకపోలేదు. వాళ్ళలో రెండు గ్రూపులుగా చీలి వుండటం అతనికిష్టం కూడా. వాళ్ళందరూ కలసికట్టుగా వుంటే తాను వాళ్ళని డామినేట్ చెయ్యలేడని జీవిత సత్యం. అతను అర్థం చేసుకున్న అతనికి బాగా తెలుసు. అందుకని ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకుంటుంటే ఓపిగ్గా వినేవాడు. అలాంటి చాడీలను ప్రోత్సహించేవాడుకూడా. డివైడ్ అండ్ రూల్ పాలసీలో అతనికపారమైన నమ్మకముంది. తన దగ్గరకు ఏ వర్గం వాళ్ళొస్తే వాళ్ళను సపోర్టు చేస్తూ మాట్లాడేవాడు. ఆ పద్ధతిలోనే అతను జీవితంలో ఒక్కొక్కమెట్టూ ఎక్కుతూ పైకి వస్తున్నాడు.
* * * *
శ్రీనివాసరావు ఆఫీసునుంచి ఫియట్ కారులో ఇంటికి బయలుదేరాడు.
అతనే డ్రైవ్ చేసుకుంటున్నాడు.
విజయవాడలో కారు డ్రైవింగంటే అంత సుఖమైన అనుభవమేమీకాదు. మనుషులు అడుగడుక్కీ పందెం కట్టినట్లు అడ్డు వస్తూ ఉంటారు. దానికితోడు ఓ పద్ధతి పాడూ లేకుండా శరవేగంతో వెళ్ళిపోయే సైకిళ్ళు, ఇష్టమొచ్చినట్లు మీద మీదకొచ్చే సైకిల్ రిక్షాలు, వాటితోబాటు స్కూటర్లు, స్వైర విహారంచేసే సిటీ బస్సులు...
ఊరు పెరుగుతున్నకొద్దీ యిరుకుకూడా పెరిగిపోతున్నది.
ఎక్కడ స్థలముంటే అక్కడ షాపులు, షాపింగ్ కాంప్లెక్సులు కట్టేస్తున్నారు. వన్ టవున్ ఏరియా అయితే మరీ దారుణం. బంగారం కొట్లన్నీ వున్న పాత శివాలయం వీధిలో మనిషి అడుగుతీసి అడుగు వెయ్యటానికి వీలులేనంత రద్దీగా వుంటుంది. ఇరవై గజాల స్థలముంటే అందులో నాలుగయిదు కోట్లు వేసిపారేస్తున్నారు. ఇహ వన్ టౌనంతా ఎక్కడ పడితే అక్కడ లారీ ట్రాన్స్ పోర్టు ఆఫీసులు, లారీ రోడ్డుమీద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ అడ్డంగా పెట్టి లోడ్ చెయ్యటమో అన్ లోడ్ చెయ్యటమో చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రజలకెంత యిబ్బంది కలిగినా వాళ్ళకు చీమ కుట్టినట్లుగా కూడా వుండదు.
ప్రజలకు ఎన్ టర్ టైన్ మెంట్ మీద విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఎన్ని సినిమాలున్నా వాళ్ళకు కాలక్షేపం సరిపోవటం లేదు. ఎగ్జిబిషన్ లు, రోటరీలు, లయన్స్ లు, మెకానిక్ క్లబ్బులు వీటికి తోడుగా ఎక్కడపడితే అక్కడ బార్ లు...
తన చిన్నప్పుడు తాగటమంటే చచ్చే భయంగా వుండేది. ప్రొహిబిషన్ వున్న రోజుల్లో సరేసరి. ఆ తర్వాత కూడా త్రాగాలంటే చాటుగా, పెద్ద సాంఘిక నేరం చేస్తున్నట్లు...
ఇప్పుడు డ్రింకింగ్ పెద్ద ఫ్యాషనయిపోయింది. బహిరంగంగా తాగటం గొప్ప విలాసమైపోయింది. ఊ అంటే పార్టీ. ఆ అంటే పార్టీ. కాఫీ హోటల్ కెళ్ళినట్లు బార్ కి వెళ్ళిపోవటం.