సాయంత్రం అన్న వస్తే అడ్డుపడతాడని ఉన్న నాలుగు చీరెలూ! పౌడర్ డబ్బా, బొట్టు కాటుకా. రోల్డ్ గోల్డ్ గొలుసూ, ఒక సంచీలో సర్దుకుని అప్పటికప్పుడు చలమయ్యతో బయలుదేరిపోయింది.
వాళ్లంటే అప్పటికప్పుడు బయలుదేరెను. కాని, రైళ్ళు ఎప్పుడంటే అప్పుడుండవుగా? ఇద్దరూ బెంచీమీద కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ.....
రైల్వేలో కూలీగా పనిచేస్తున్న ఒక అతనికి జైహింద్ బాబు తెలుసు - అతడు సుందరీబాయిని చూశాడు! సంగతి గ్రహించాడు - పరుగు పరుగున మిలటరీ కేంటీన్ కి వచ్చి జైహింద్ బాబుకీ సంగతి చెప్పేశాడు.
జైహింద్ బాబు వెంటనే బయలుదేరి రైల్వేస్టేషన్ కి వచ్చి రైలెక్కబోతున్న సుందరీబాయినీ, చలమయ్యనీ లెంపలు వాయించి యింటికి తీసుకొచ్చాడు.
సుందరీబాయి శోకాలు సాగించింది.
చలమయ్యని అందరూ తన్నడానికి సిద్ధమయితే "నేనేం తప్పుచేశాను? దాన్ని మనువాడతా" అన్నాడు.
"ఇకనేం? వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసెయ్యి" అన్నారు పెద్దలు....
చేసేదిలేక రత్నమ్మను అలాగే ఉంచి సుందరీబాయికి, చలమయ్యకీ పెళ్ళి కానిచ్చేశాడు జైహింద్ బాబు.
పందిట్లో పెళ్ళవుతుండగా ఏదో పనిమీద లోపలికొచ్చిన జైహింద్ బాబుకి మారుమూల మోకాళ్ళలో తలపెట్టుకుకూర్చున్న రత్నమ్మ కనిపించింది - అతనికి ఎంతో జాలివేసింది. ఒకరకంగా తన జీవితమూ, తన చెల్లెలి జీవితమూ కూడా తన వాళ్ళ మూఢనమ్మకాలకీ, మూర్ఖాచారాలకి బలి అయిపోతున్నాయనిపించింది.
రత్నమ్మ తలమీద చెయ్యివేసి "రత్త!" అన్నాడు అభిమానంగా.
రత్నమ్మ దిగ్గున తలెత్తి గబగబా కళ్ళలో నీళ్ళు పైటకొంగుతో తుడుచుకుని పేలవంగా నవ్వుతూ "నాకేం దిగులుగా లేదన్నా వొట్టు! మన సుందికయినా పెళ్ళయిపోతన్నాదని ఆనందంగానే వుంది - ఆడకొస్తే నలుగురూ నాలుగు మాటలూ అంటారు.... అందుకే ఈడకూకున్నా?" అంది.
నవ్వుతూ ఏడుస్తూ, పడుతూ లేస్తూ. పెళ్ళి పందిటిలో తిరిగింది అన్నమ్మ-
"దీని జిమ్మడ అక్కకి కాకుండా ఏం తొందరొచ్చి సచ్చిందో దీనికి?" అని చిన్న కూతుర్ని తిట్టుకుంటోన్న తల్లని వారించి "తప్పమ్మా! సుందరి పెళ్ళవుతోంది - దాన్నితిట్టకూడదు - " అన్నాడు జైహింద్ బాబు!
అన్నమ్మ తెల్లబోయి..... పెద్ద కూతుర్ని జాలిగా చూసి, చిన్న కూతుర్ని ముద్దుగా చూసి, ఏదో గొణుక్కుంది-
సుందరీబాయి పెళ్ళికి మార్వాడీ దగ్గర అప్పు చెయ్యవలసి వచ్చింది. జైహింద్ బాబుకి - తల్లి జబ్బు పడినపుడే వ్యాసమూర్తి దగ్గిర అప్పు తెచ్చాడు. అదింకా తీర్చలేదు. మళ్ళీ వ్యాసమూర్తిని అడగటానికి నోరురాలేదు - వంటపని చేసుకుంటూ కష్టంమీద డబ్బు కూడబెట్టి తమ్ముడ్ని చదివించుకోంటోన్న సరళను అసలు అడగాలనిపించలేదు. వడ్డీకి మార్వాడీదగ్గర డబ్బు అప్పుతేవటం ఎంతమాత్రం యిష్టం లేదు జైహింద్ బాబుకి. కానీ, ఏం చెయ్యగలడు?
13
జైహింద్ బాబు కాలేజీ మానేసి సర్వర్ గా చేరినట్లు అన్నమ్మకు తెలియదు. ఆ గుడిసెల్లోనూ ఎవరికీ తెలియదు! తన తల్లికి విషయం తెలిస్తే, తట్టుకోగలదో, లేదోనని తెలియనీయలేదు.
పనిపాటలకు అలవాటుపడిన అన్నమ్మ మంచంలో పడుకోమన్నా, పడుకోలేకపోతోంది. లేచి తిరిగి ఏదో ఒకపని చెయ్యటానికి ప్రయత్నిస్తోంది - అలా ప్రయత్నించడంలో ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయింది - మందులూ, మాకులూ, వాడి మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేసరికి వారం రోజులు పట్టింది.
అక్కడితో జైహింద్ బాబు హడలిపోయి రత్నమ్మని పనిమానేసి తల్లి దగ్గిరే ఉండమన్నాడు. అన్నమ్మ లబలబలాడుతూ "అది కూడా పనిమానుకుంటే యిల్లెట్లా గడుస్తుందిరా?....." అంది - అప్పుడు కూడా తను చదువు మానుకుని సర్వర్ గా పనిచేస్తున్న సంగతి జైహింద్ బాబు తల్లికి చెప్పలేకపోయాడు! తల్లి ముఖం చూస్తూ ఆ మాట అనటానికి అతనికి సాహసం కలగటం లేదు - రత్నమ్మకు కూడా తల్లి పరిస్థితి చూసి భయంవేసి పని మానుకుని తల్లిదగ్గరే ఉండసాగింది.
సరళకు పురిటిరోజులు దగ్గిర పడ్డాయి..... నొప్పులు వచ్చేవరకూ పని చేస్తూనే ఉంది..... నొప్పులు ప్రారంభమయ్యాక రత్నమ్మే తోడుగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించింది.
గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరూ సరళలాటి వాళ్ళను పట్టించుకోరు..... నొప్పులు ఎక్కువయి బాధతో మూలుగుతే "హుష్! అరవకు" అని మందలించటమే తప్ప రోగి అవస్థ ఎవరూ పట్టించుకోరు - డాక్టర్లూ నర్సులూ ఎవరూ లేకుండానే, శిశువు జన్మించిన సందర్భాలు కూడా లేకపోలేదు.
బాధ భరించటం బాగా అలవాటయిపోయిన సరళ పళ్ల బిగువున బాధనంతా సహిస్తూ తన మూలుగు కూడా బయటకు వినపడనియ్యలేదు-
తను తల్లి కాబోతున్నాననే అపూర్వమైన సంతృప్తి ముందు ప్రసవవేదన సహితం హాయిగానే భరించగలిగింది సరళ....
సరళ తపస్సు ఫలించి మొగబిడ్డను ప్రసవించింది-
సరళకు రెండు నెలలు గడిచేవరకూ కేంటిన్ లో మరొకరిని పెట్టుకోకుండా సరళ బదులు రత్నమ్మ పనిచేసింది....
సరళ పచ్చి బాలింతరాలయినా, అటు తనబిడ్డనూ, ఇటు అన్నమ్మనూ చూసుకుంటూ గడిపింది-
సరళ తన కొడుక్కి కిరణ్ అని పేరు పెట్టుకుంది. కిరణ్ కి మూడో నెల రాగానే, సరళ మళ్ళీ కేంటీన్ లో చేరిపోయింది.
సరళ పనిలోంచి వచ్చేవరకూ రత్నమ్మ తన తల్లినీ, సరళ బిడ్డనూ చూసుకొనేది-
ఆ రకంగా అనుకోకుండా రత్నమ్మకూ, సరళకూ మధ్య ఒక ఆత్మీయత అల్లుకొంది-
ఒకరోజు సరళ ఇంట్లోనే రత్నమ్మ కిరణ్ ని ఆడిస్తోంది -
పుస్తకం ముందు పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ సారధి తదేకంగా రత్నమ్మనే చూడసాగాడు-
అది గమనించిన సరళకు మండిపోయింది.
"సారధీ!" అంది తీక్షణంగా.....
సారధి ఉలికిపడ్డాడు - అక్క ముఖం చూశాడు, అర్ధం చేసుకున్నాడు - సిగ్గుపడ్డాడు. చేతితో పుస్తకం పట్టుకుని అక్కడినుండి వెళ్ళిపోయాడు.