జైహింద్ బాబు చదువు మానేసినందుకు సుధీర్ బాబు కూడా బాధ పడ్డాడు. జైహింద్ బాబును వెతుక్కుంటూ కేంటీన్ కి వచ్చి అక్కడ సర్వర్ గా పనిచేస్తున్న అతణ్ని పలుకరించలేక ఆగిపోయాడు.
తనపని అయిపోయాక బయటికి వచ్చి "ఇలా వచ్చావేం సుధీర్?" అని తనే పలకరించాడు జైహింద్ బాబు.
"నీ కోసమే!"
"మరి నన్నెందు పలకరించలేదూ?" అని తను అడగలేదు. సర్వర్ గా పనిచేస్తున్న తనను సుధీర్ ఒక స్నేహితుడిగా పలకరించలేడని జైహింద్ బాబుకి తెలుసు. అంచేత అలాటి ప్రశ్నలడిగి అతణ్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
"నువ్వు నిజంగా కాలేజీ మానేశావా?" గిరగిర కన్నీళ్ళు తిరుగుతుండగా అన్నాడు సుధీర్.
ఆ అభిమానానికి కరిగిపోయి సుధీర్ చేతులు ఆఫ్యాయంగా పట్టుకుని "ఏం చెయ్యను చెప్పు, పరిస్థితులలా వచ్చాయి" అన్నాడు జైహింద్ బాబు. తనకూ కన్నీళ్ళు తిరుగుతుండగా....
అప్పటివరకూ తను చదువు మానెయ్యవలసి వచ్చినందుకు ఎవరి ముందూ కన్నీళ్ళు పెట్టుకోలేదు జైహింద్ బాబు. కానీ, తన క్లాస్ మేట్ అయిన సుధీర్ ముందు అతని నిగ్రహం సడలిపోయింది.
సుధీర్, జైహింద్ బాబు భుజం చుట్టూ చెయ్యివేసి "ఛ! ఛ! నేను నీకేమీ చెయ్యలేకపోతున్నాను. ఒక్క రూపాయి నా చేతిలో పెట్టడానికి మా అమ్మ లక్ష యక్ష ప్రశ్నలు వేస్తుంది" అన్నాడు.
"ఫరవాలేదులే! నువ్వు చక్కగా చదువుకుంటావుగా! పెద్ద ఉద్యోగస్తుడవుతావు. అప్పుడు నాకు సహాయం చేద్దువు గాని....."
"ఓ తప్పకుండా చేస్తాను" ఉత్సాహంగా అన్నాడు సుధీర్.
జైహింద్ బాబు చివుక్కుమంది. ఆ క్రిందటి రోజు వరకూ అతడే సుధీర్ కి చదువులో సాయం చేశాడు. ఇప్పుడు సుధీర్ ముందు ముందు ఉద్యోగస్థుడై తనకు సాయం చేస్తానంటున్నాడు! అవును! చదువులో తనకంటే తెలివి తక్కువ వాడైనా ఉద్యోగస్తుడయ్యే అవకాశాలు అతనికే ఉన్నాయి.
తమ బాటలు చీలిపోయినా జైహింద్, సుధీర్ బాబులు తమ స్నేహం మానలేదు. సుధీర్ అప్పుడప్పుడు వచ్చిజైహింద్ బాబుతో మాట్లాడేవాడు. సుధీర్ చెప్పే కాలేజీ కబుర్లు ఎంతో ఆరాటంగా విని అంతకు నిరాశతో కొన్ని క్షణాలు క్రుంగిపోయేవాడు జైహింద్ బాబు. అంతలోనే ఉత్సాహం తెచ్చిపెట్టుకునేవాడు.
సుధీర్ చిన్నతనంలో తనకు బహుమానంగా ఇచ్చిన ఆంజనేయస్వామి తాయత్తును మాత్రం జాగ్రత్తగా తన గుండెలమీద అలాగే దాచుకున్నాడు.
అది చూసి సుధీర్ నవ్వి "నీకు ఆంజనేయస్వామిలో భలే నమ్మకముందే!" అన్నాడు.
"నా విశ్వాసం ఆంజనేయస్వామిలో కాదు. మన స్నేహంలో ఆ రక్షరేకు మన స్నేహానికి చిహ్నం......" అన్నాడు జైహింద్ బాబు.
ఆ మాటలకు సుధీర్ చాలా ఆనందించాడు. జైహింద్ బాబు కాలేజీ మానేసినా, అప్పుడప్పుడూ సుధీర్ తో సాహిత్యం గురించి మాట్లాడేవాడు. తనతో సమానంగా సుధీర్ ఆలోచించలేడని జైహింద్ కు తెలుసు.కానీ, సుధీర్ తప్ప అలాంటి విషయాలు మాట్లాడటానికి తనకెవరున్నారు?
రత్నమ్మకి మరోసారి అతి ప్రయత్నం మీద సంబంధం కుదిర్చాడు జైహింద్ బాబు. అదేం విచిత్రమో, ఈసారి కూడా అటువైపు ముసలమ్మ ఎవరో చచ్చిపోయింది. అక్కడితే అందరికీ రత్నమ్మకి పెళ్ళి అనుకోవటానికే భయం వెయ్యసాగింది.
చలమయ్య పనీపాటా లేకుండా పోరంబోకులాగా తిరిగే వ్యక్తి చలమయ్య అనే పేరు షోగ్గాలేదని తనను 'చలం' అని పిలిపించుకుంటాడు. అతనిది ఒక పల్లెటూరు. కొద్దిగా పొలాలున్నాయి.
కుటుంబంలో ఆడా మొగా అందరూ ఉదయం మొదలు సాయంత్రం వరకు సంచిన నడుం ఎత్తకుండా పాటుపడతారు. ఎప్పుడైనా కాస్త తీరిక దొరికితే వడ్లు దంచుకుంటారు. పప్పులు బాగుచేసుకుంటారు. కారాలు కొట్టుకుంటారు.
ఇంకా తీరిక దొరికితే ఒకరి తలల్లో మరొకళ్ళు పేలు చూసుకుంటారు, వాళ్ళు అనుభవించే "సరదా" ఆ పేలు చూసుకోవటమే!
కంటోన్ మెంట్ ఏరియాలో ఉన్న గుడిసెల్లో చలమయ్యకెవరో బంధువులున్నారు. వాళ్ళని చూడడానికి వచ్చినప్పుడు ఒకసారి సుందరీబాయి బల్ల దుకాణంలో బీడీలు కొన్నాడు. సుందరీబాయి వాడికి నచ్చింది. రోగంతో పడుకున్న తల్లి - పనిలోకిపోయే అక్క, అన్న..... ఒంటరిగా బల్ల దుకాణం మీద వయసులో ఉన్న ఆడది.... ఈ వాతావరణం కూడా నచ్చింది వాడికి.
"చలమయ్యా ఇదిగో! యింద, బీడీలు" అని అందిస్తున్న సుందరీబాయికి కన్నుకొట్టి నవ్వి "నాపేరు చలమయ్య కాదు. చలం" అన్నాడు చలమయ్య.
సుందరీబాయికి "చలం" అన్న పేరు నచ్చింది. ఆ చలం కన్నుకొట్టడమూ నచ్చింది. కన్నుకొడుతూ నవ్వడమూ నచ్చింది.
"ఛీ! ఫో!" అంది ముద్దు ముద్దుగా, సిగ్గు సిగ్గుగా-
హుషారుగా ఈల వేశాడు చలమయ్య - ఆ ఈల ఇంకా బాగుంది సుందరీబాయికి.
అలా అలా సుందరీబాయికి చలమయ్యకీ మధ్య చనువు పెరిగిపోయింది.
ఒకనాడు సాహసించి సుందరీబాయి చెయ్యిపట్టుకున్నాడు. చలమయ్య - చాచి లెంపకాయ కొట్టింది సుందరీబాయి.
బిత్తరపోయి తలవంచుకుని వెళ్ళిపోబోయాడు చలమయ్య. సుందరీబాయి కంగారు పడిపోయింది.
"ఏయ్ చలం" అని పిలిచింది గాభరాగా! ఆ పిలుపుకి పరవశించిపోతూ వెనక్కి వచ్చి ఆశగా చూశాడు చలమయ్య....
"అట్టా మింగేసేలా చూడకు అంతగా మనసుంటే, మీ ఊరికి తీసుకుపోయి మనువుచేసుకో!"
"పద! పోదారి." అన్నాడు వెంటనే చలమయ్య - వాడికి ఏ విషయంలోనూ ముందు వెనక ఆలోచనలేదు - తను అనుకున్నది జరిగిపోవటమే కావాలి!
ఆ ఇంటిలో ఇక తనకు పెళ్ళికాదని నిర్థారణ చేసుకున్న సుందరీబాయి వెంటనే ఆ ఆహ్వానాన్ని అంది పుచ్చుకుంది.