"లోపలకు రండి."
రంజిత హాల్లోకి అడుగుపెట్టింది. బయటకు కనిపించిన దానికన్న చాలా పెద్దదిగా వుంది ఇల్లు. లోపల చాలా గదులున్నాయి. కొంతమంది దగ్గర బంధువులయి వుండవచ్చు- వాళ్ళూ, పనివాళ్ళూ, వంటమనిషీ మధ్య మధ్య కనిపించారు. ఆమె రంజితను ఓ గది దగ్గరకు తీసుకెళ్ళింది.
"అమ్మాయి ఈ గదిలో వుంది వెళ్ళండి. ఒక్క విన్నపం. అమ్మాయి వర్ణించలేనంత దుఃఖంలో వుంది. మీ ప్రశ్నలతో ఎక్కువగా బాధపెట్టకండి" అన్నది.
"ఆమెకిష్టంలేని ప్రశ్న ఒక్కటికూడా వెయ్యను. ఆమెను విసుగుపుట్టిన మరుక్షణంలో బయటకు వచ్చేస్తాను" అంది రంజిత హామీ ఇస్తున్నట్లుగా.
"వెళ్ళండి."
"ఆమె స్ప్రింగ్ డోర్ మెల్లిగా త్రోసి లోపల కడుగుపెట్టింది. ఎదురుగా సోఫాలో హేమసుధ కూర్చునివుంది. జీవితం మీద విరక్తిపుట్టినట్లుగా చాలా సామాన్యమైన చీరెకట్టుకుని వుంది. ఒంటిమీద ఆభరణాలేమీలేవు. ముఖానికి నల్లటి గాగుల్స్. చాలా నిరాడంబరంగా వుంది. కొన్నేళ్ళ క్రితం చూసిన మందాకిని గుర్తొచ్చింది.
"రండి" అన్నది హేమసుధ అలికిడి విని.
"నా పేరు రంజిత."
"తెలుసు. కూచోండి."
రంజిత ఆమెకెదురుగావున్న సోఫాలో కూర్చుంది. ముఖంలోకి పరిశీలనగా చూస్తోంది. ఆ కళ్ళద్దాల వెనక రెండు కళ్ళు వున్నాయనుకుంటే ఎంతటి అద్భుతమైన సౌందర్యం! ప్రపంచాన్ని శాసించి గుప్పెట్లో పెట్టుకోగల సమ్మోహన కళారూపం! ఒక కిరాతకుడి ఇనపవ్రేళ్ళ మధ్య నిర్దాక్షిణ్యంగా నలిగిపోయింది. ఆమెను చూస్తోంటే ఎంత మహోధృతంగా పొంగిపొర్లే దుఃఖాన్ని అణుచుకుంటుందో అర్థమయింది. ఎంత నిగ్రహించుకుందామన్నా శక్తి చాలలేదు. కళ్ళనుండి నీళ్ళు జలజలమని కారిపోయినాయి.
"అడగండి" అంది హేమసుధ.
"...ఉ" అంది రంజిత." చిన్న శోకపూరితమైన శబ్దం తప్ప మాటేమీ బయటకు వెలువడలేదు.
"ఏడుస్తున్నారా?" అంది హేమసుధ.
"మీ కళ్ళెంత అదృష్టం చేసుకున్నాయి! నా గుండెల్లోంచి ఉబికే, పెల్లుబికే, ఉప్పెనలా పొంగే దుఃఖ సముద్రాన్ని బయటపడనివ్వకుండా కళ్ళులేని ఈ ప్రదేశాలు ఆనకట్టలయి కూర్చున్నాయి."
"గుండెల్లోకి, శరీరంలోని ప్రతి అణువులోకి విషాదపూరిత బాణాల్లా దిగబడుతున్నాయి ఆమె మాటలు. ఆ బాధలోంచి, ఆవేదనలో నుండి ఆవేశం, ఉద్రేకం పొంగుకుని వచ్చాయి. ఆ దుర్మార్గుడు కనిపిస్తే అతన్ని తాను పట్టుకోగలిగితే... రక్తం వేడెక్కినట్టయి ముఖం ఎర్రబడిపోయి ప్రభాతసమయ అరుణకాంతితో ప్రకాశించింది. చాలా బరువయిన, బాధాపూరితమైన నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ "అడగండి" అన్నది హేమసుధ.
"ఆ రాత్రి... ఏం జరిగింది?"
తాను హాస్పటల్లో ఎడ్మిటయిన దగ్గర నుంచీ వివరంగా గుర్తుచేసుకుంటూ చెప్పసాగింది.
"...డాక్టర్ కృష్ణచైతన్య వెళ్ళిపోయాక సిస్టర్ వస్తుందని ఎదురుచూస్తూ పడుకున్నాను. ఇంతలో అతను వచ్చాడు. ఎందుకో అతన్ని చూడగానే ఏదోలా అనిపించింది. అతని కళ్ళు చాలా భయంకరంగా, క్రూరంగా వున్నట్లనిపించాయి. తాను అసిస్టెంటునని చెప్పి, డాక్టర్ కృష్ణచైతన్య సెడేషన్ కోసం ఇమ్మన్నారని చెప్పి ఏదో ఇంజక్షనిచ్చాడు. అది మామూలు మత్తు ఇంజక్షన్లా లేదు. అందుకు పదింతలు శక్తివంతమైన దానిలా పనిచెయ్యడం ప్రారంభించింది. జరగాకూడనిది జరుగుతూన్నదని తెలుస్తుందిగాని, నేనేమీ ఎదురు చెప్పలేకుండా వున్నాను. అతను నన్ను వీల్ చెయిర్ లో కూచోబెట్టి తీసుకెడుతున్నాడు. ఏదో ప్రమాదం ముంచుకొస్తూందని అర్థమయింది. గట్టిగా అరవాలని ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. గొంతు, నా నరాలు నా స్వాధీనంలో లేవన్నట్లనిపించింది. ఆపరేషన్ చేసేందుకు పేషెంటును తీసికెళ్ళినట్లు ధైర్యంగా, బాహాటంగా నన్ను థియేటర్ లోకి తీసుకెళ్ళిపోయాడు. నిస్సహాయంగా వుండిపోయి, నేను ఇంకా ఇంకా మగతలోకి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టబడినట్లు తెలిసింది. ఆ తర్వాత...
మళ్ళీ అతి బరువయిన నిశ్శబ్దం వ్యాపించింది.
"ఆ భయంకరమైన సన్నివేశాన్ని ఊహించటమే కష్టంగావుంది."
"ఆ వివరాలన్నీ శ్రమపడి గుర్తుచేసుకోవద్దులెండి. అలా జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు?"
"ఏదో గలాభాలా వినిపిస్తే తెలివిలోకి వచ్చాను. నా చుట్టూ కంగారు కంగారుగా ఎవరో మనుషులు తిరగటం, అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరవటానికి ప్రయత్నించాను. కనురెప్పలు కదిలినట్లయినాయిగానీ, నాకేం కనబడటంలేదు. జరిగింది వెంటనే గుర్తురాలేదు. నాకు ఆపరేషన్ జరిగిందేమో, కళ్ళకి బ్యాండేజెస్ వేశారేమోననుకున్నాను. కాని ప్రక్కన గలభావల్ల ఏదో జరగకూడనిది జరిగినట్లు తెలుస్తూంది. "ఏమయింది?" అనడిగాను. నా గొంతు బాగానే వస్తోందిప్పుడు. ఎవరూ జవాబు చెప్పలేదు. నన్ను ఇద్దరు ముగ్గురు పట్టుకొని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. నా గదికిగావును తీసుకెడుతున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుపడుతున్నారు? క్రమక్రమంగా జరిగిందంతా గుర్తు వస్తోంది. మా అమ్మ పెద్ద పెట్టున ఏడుస్తూ ఉండడం వినబడింది. నాకు పూర్తిగా తెలిసిపోయింది. అంతకు కొన్ని గంటలకు ముందే ప్రపంచం నాకు శాశ్వతంగా కనిపించటం మానేసిందని."
ఎంత దారుణమైన హృదయవిదారకమైన వివరణ!
"మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. దయవుంచి కొంత ఓపిగ్గా జవాబులు చెప్పాలి" అంది రంజిత ఆ విషాదాన్ని ఛేదిస్తూ.
"అడగండి."
"మీకు గతంలో- చెప్పుకోదగ్గ, చాలా ముఖ్యమైన సంఘటనలేమైనా జరిగాయా?"
"నేను చాలా పేరున్న సినిమా తారను, ఇంటరెస్టింగ్ సంఘటనలు లేకుండా ఎలా వుంటాయి?"