Previous Page Next Page 
చెక్ పేజి 26


    మరుసటి రోజు దామూ ఇచ్చిన కాఫీ తాగి శిలాతోరణం చూడడానికి వెళ్ళాం. రాళ్ళు తోరణంలా వుండడం అక్కడ ప్రత్యేకత. దానిని చూసేసరికి అంతక్రితం నేను విన్నంత గొప్పగాలేదనిపించింది నాకు. కీర్తి కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

 

    అక్కడ కాసేపు కూర్చుని, భోంచేసి తిరిగి గుడి దగ్గరకు చేరుకున్నాం.

 

    సాయంకాలం అయింది.

 

    కాటేజ్ కు బయల్దేరాం.

 

    అప్పటికే చలిగా వుంది. రాత్రంతా మంచులో తడిసిన తురాయి చెట్టు ఎండలో ఒంటిని ఆరబెట్టుకుని తిరిగి మంచులో తడవడానికి సిద్ధపడుతున్నాయి. కొండ అంచుల మీది కాటేజ్ లు దేవతలు ఆడుకోవడానికి అమర్చిన బొమ్మల్లా వున్నాయి. అప్పుడే వెలిగిన దీపాలు కిందకు దిగిన నక్షత్రాల్లా వున్నాయి.

 

    కాటేజ్ చేరుకునేసరికి చీకట్లు అలుముకున్నాయి.

 

    మమ్మల్ని చూస్తూనే దామూ పరుగెత్తుకొచ్చాడు.

 

    ఆ చలిలో, ఆ చీకట్లో వరండాలో కీర్తి లాంటి అందమైన అమ్మాయితో కాఫీ తాగడం రక్తాన్ని మరింత రగిల్చే అనుభవం. వరండాలో దీపం వేయకపోవడంతో మా చుట్టూ నల్లటి కంబళితో దడికట్టినట్టుంది. పార్క్ లోని దీపం జబ్బు నుంచి తేరుకున్నట్టు కాసేపు వెలిగి, ఆరిపోతూ వుంది. ఇంతకు ముందులా క్షణం సేపు వెలిగి మలిగిపోవడం లేదు. దీపం వెలిగినప్పుడు గుప్పెడు మల్లెపూలు ఎవరో మామీద విసురుతున్నట్టుంది.

 

    మరో రెండు కాఫీలు తాగి, రెండు సిగరెట్లు తగలేసిన తరువాత భోజనానికి లేవమన్నాను.

 

    ఇద్దరం భోంచేసి, మళ్ళా కాటేజ్ కి చేరుకున్నాం.

 

    దామూ వెళ్ళి పోయినట్టున్నాడు. ఎక్కడా కనిపించలేదు. ఈ మూడు రోజుల్లోనే నేనూ, దామూ దగ్గరయ్యాం. మధ్యాహ్నంపూట కాసేపు అతనితో కబుర్లు.

 

    కీర్తి నైటీలోకి దూరి, వరండాలో కొచ్చింది.

 

    రాత్రి మా ముందు నిలబడిపోయినట్టు చీకటి.

 

    "ఈ రోజు ఏం కథ మదన్?" కీర్తి తనే పావును ముందుకు జరిపింది.

 

    "ఈ రోజు కథేం లేదు"

 

    "అదేమిటి?"

 

    "అదంతే. నువ్వు భయమేసి నా దుప్పటి ముసుగేసుకుని కూర్చుంటున్నావ్. మాటకు కట్టుబడడంలేదు."    

 

    "లేదయ్యా మహానుభావా! నిజంగా భయమేసినా ఆంజనేయ దండకం వల్లెవేసుకుంటూ కూర్చోవడం లేదు. నీ కథ అంత భయం కలగచేయకపోవడం వల్లే పడుకోగలుగుతున్నాను. ఈ రోజు అద్భుతమైన కథ చెప్పు. బెస్టాఫ్ లక్."

 

    నాకు రోషం వచ్చింది. ఆఫ్టరాల్ ఓ ఆడపిల్ల దగ్గర ఓడిపోవడమా? నెవర్.

 

    నా మౌనాన్ని అర్థంగీకారంలా భావించి "కమాన్" అంది.

 

    నేను గొంతు సవరించుకున్నాను.

 

    "ఎప్పుడో పదిహేనేళ్ళ నాటి సంగతి. అప్పుడే పట్టణ నాగరికత రాత్రుల్లో కట్లు తెంచుకున్న దొంగగొడ్డులా పల్లెల్లో ప్రవేశిస్తోంది. ఆడపిల్లలంతా సాయంకాలం పూట వీథిలో కాసేపు నిలబడుతున్నారు. యువకులంతా ప్రతిరోజూ సాయంకాలం పనివున్నా, లేకపోయినా టౌన్ కి వెళ్ళి, అక్కడ టీ తాగి, ఏ వార పత్రికో, మాసపత్రికో కొనుక్కుని ఇంటికి చేరుకుంటున్నారు. గోధూళివేళ దాటిన తరువాత పంచన చేరిన రైతులు వ్యవసాయం గురించిగాక రాజకీయాల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. కాలం మారిందని గ్రహించిన బామ్మలు కొంతలో కొంత నసపెట్టడం తగ్గించుకున్నారు. స్త్రీలు నెలకోమారు సినిమాకు బయల్దేరుతున్నారు. ఓ సినిమా చూసొస్తే ఆ సినిమా కథ ప్రతి గడపా ఎక్కుతూ దిగుతూ వుంది. కొన్ని కులాల స్త్రీలు పాత సంప్రదాయానికి తిలోదకాలిచ్చి జాకెట్టు వేసుకుంటున్నారు. ముప్పై ఏళ్లు దాటాక జాకెట్టు లేకుండా వుండాలన్న ఆచారాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. ఊర్లో క్రాప్ చేయించుకోవడం నామోషీగా భావిస్తోంది కుర్రకారు.

 

    తోలు బొమ్మలాటలు, పౌరాణిక నాటకాలు చివరి శ్వాస పీల్చుకుంటున్న కాలం. అవి చాలా రోజులు బతకవని ఆట ఆడేవాళ్ళకు కూడా అర్థమై, పిల్లలను స్కూళ్ళకు పంపుకుంటున్నారు. అయినా మా వూరికి మాత్రం తోలు బొమ్మలాటలు, నాటకాల కంపెనీలు వస్తూనే వున్నాయి.

 

    మే నెల వచ్చిందంటే మా వూరు కళకళ లాడిపోయేది. అప్పటికి వ్యవసాయం పనులు పూర్తయ్యేవి. వరి ఊడ్పులు, జొన్న్ ఒబ్బిడులు, వేరుశనగ నూర్పిళ్ళు అయిపోయేవి. రైతుల గాదెలు వడ్ల గింజలతో నిండిపోయేవి. కూలీ జనానికి కూడా కాసిన్ని డబ్బులు, కాసిన్ని వడ్లగింజలూ వచ్చేవి.

 

    నవంబర్ వస్తే తప్ప వ్యవసాయం మొదలుకాదు. అప్పటి వరకు వున్న వాటిని తింటూ కాలక్షేపం చేసేవాళ్ళు.

 

    మే నెల నుంచే ఎండలు విపరీతమయ్యేవి. పగలంతా ఇంట్లో దూరుకున్న జనం సాయంకాలమైతే బయటపడేవారు. కబాడీ ఆటకు మా ఊరు ప్రసిద్ధి. వి.ఎల్.డబ్ల్యు క్వార్టర్స్ దగ్గర ఓ చేనును అందుకు కేటాయించారు. సాయంకాలమైతే ఊరి జనం అక్కడ గుమిగూడేది.

 

    ఇక రాత్రి బాగా పొద్దుపోయేవరకు పెద్దలు దాడులు, పులి జూడాలు ఆడుకుంటూ వుంటే పిల్లలు వెన్నెల కుప్పలు, నాలుగు రాళ్ళు ఆట ఆడుకునేవారు.

 

    సాయంకాలం జరిగే కబాడీ ఆట మహా సందడిగా వుండేది.

 

    అరవై ఏళ్ల ముసలివాడి దగ్గర్నుంచి, ఆరేళ్ళ పసిపిల్లవాడి వరకు అక్కడకు చేరేవాళ్ళు. కడకు సత్యనారాయణరెడ్డి కూడా హాజరయ్యేవాడు.

 

    సత్యనారాయణరెడ్డి మా ఊర్లో కంతటికీ మోతుబరి రైతు. ఊర్లోని అయిదు వందల ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు ఆయనవే. మిగిలిన వారికి ఎకరమో, రెండెకరాలో వుండేవి. ఆయనంటే మా ఊర్లో హడల్. ఆయన వీధిలో నడుస్తుంటే ఎవరూ తిన్నెలమీద కూర్చునేవాళ్లు కాదు. ఎడ్లబండి నొగలమీద కూర్చున్నవాడు కూడా దిగి, ఆయన వెళ్ళాకే తిరిగి నొగలమీద కూర్చునేవాడు. ఆయన బస్టాప్ కు ఫర్లాంగ్ దూరంలో వస్తున్నా ఆయనొచ్చేవరకు బస్సు ఆగిపోయేది. కండక్టర్ వినయంగా లేచి నిలబడి ఆయనకు సీటిచ్చేవాడు.

 

    తాగుబోతు వెధవకైనా ఆయనను చూస్తే భయంతో కిక్కు దిగి పోయేది.

 

    అలాంటి సత్యనారాయణరెడ్డి కాలక్షేపం కోసం రోజు సాయంకాలం పూట కబాడీ ఆట చూడడానికే వచ్చేవాడు. ఆయన వెనకాలే పాలేరు నులకమంచం మోసుకొచ్చేవాడు. ఆయన దానిమీద కూర్చుని ఆట తిలకించేవాడు. ఆటలో ఏదైనా పేచీ వచ్చినా ఆయన చావిడిలోనే పరిష్కారమయ్యేది. చాకలివాడు తన ఇంట్లో మైలగుడ్డలు ఎత్తడం లేదన్న దగ్గర్నుంచి, తన పెళ్ళాం పక్కింటివాడిని చూసి నవ్వుతూ ఉందన్న వ్యవహారం వరకు ఆయనే తీర్పు చెప్పేవాడు. ఆయన తీర్పు శిలాశాసనం.

 

    ఆయనకు నలభై ఏళ్ళుంటాయి. ఆయనకు భార్య, ఒక కొడుకూ వున్నారు. కొడుకు అప్పటికి హార్సిలీహిల్స్ లో అయిదో తరగతి చదివేవాడు.

 

    యథాప్రకారం ఆ సంవత్సరమూ మే నెల వచ్చింది. అయితే ఆ నెల ఊర్లో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఎవరూ ఊహించలేదు.

 

    ఇక పంటల నూర్పిళ్ళు మొదలవుతాయనగా హరిజనులు తమ కూలీ పెంచాలని సత్యనారాయణరెడ్డిని అడిగారు.

 

    అప్పుడు మగవాళ్ళకు రోజుకు రూపాయి, రెండు ముద్దల సంగటి వేసేవారు. ఆడవాళ్ళకయితే రూపాయి, ఒక ముద్ద సంగటి ఇచ్చేవారు. అలా కాకుండా ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ సమానంగా రూపాయిన్నర, రెండు ముద్దల సంగటి వేయాలని కూలీలంతా సత్యనారాయణ రెడ్డికి విన్న వించుకున్నారు. ఇంట్లో పిల్లలు పస్తులుంటున్నారని, ఆడవాళ్ళకూ రెండు ముద్దలు వేస్తే ఒకటి పిల్లలకు పెట్టవచ్చని చెప్పారు.

 Previous Page Next Page