మనుషులను బాగా చదివినట్టు ప్రతివిషయం మీదా అవగాహన వున్నట్టు అతను మాట్లాడడం ముచ్చటేస్తోంది. వాక్యాల్లో 'లాభం' అనే పదం దొర్లకుండా వుండడం ఆమెకు చాలా రిలీఫ్ నిస్తోంది.
"లెక్కప్రకారం సంసారం చేసే వాళ్ళంటే నాకసహ్యం. అలాగే డబ్బులు బీరువాల్లో దాచుకునే వాళ్ళంటే మంట. బహుశా అందుకే నాకు డబ్బు అవసరమైనప్పుడు ఇలాంటి పెద్ద ఇళ్ళకు కన్నం వేస్తుంటాను. బయటకు వచ్చి ఇక బయల్దేరుదామని అనుకుంటూ పడమటి ఆకాశం వంక చూశాను. అప్పుడే పుట్టిన చంద్రుడు వెన్నెలను వంచుతున్నాడు. నాకే గనుక పెళ్ళయి వుంటే నాభార్యతో ఈ పాటికి ఏ మైదానంలోనో కూర్చుని వెన్నెలను దోసిళ్ళతో తాగుతూ వుండేవాడ్ని. అయినా మీ భర్త ఇంత డబ్బు ఎలా సంపాదించాడు. నాకు ఈ విషయమే అంతుపట్టదు" అన్నాడు. ఎందుకో అతను చాలా ఎగ్జయిట్ మెంట్ తో వున్నాడు. బహుశా శ్రీలేఖ అందం అతన్ని ఉప్పెనలా ముంచేస్తూ వుండచ్చు.
"నాకు డబ్బు కావాలి. తీసుకుంటున్నాను. ఏమీ అనుకోకండి" నవ్వుతూ అని, కరెన్సీ కట్టల మీద చేయి వేశాడు.
"మాట" అంది ఠక్కున.
అతను ఆగిపోయాడు. చేతిని వెనక్కు తీసుకుని ఆమెవైపు విస్మయంతో చూశాడు.
"ఆ సొమ్ము తాకకండి. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో వున్నట్టు ఆయన ప్రాణాలు ఆ బీరువాలో వున్నాయి. డబ్బుపోయిందని తెలిసిన మరుక్షణం ఆయన చనిపోతాడు. అదీకాక మీ మాటలను బట్టి మీరు మాటవినే మనిషిలా అనిపించారు. అందుకే చెబుతున్నాను" అంది మెల్లగా.
మళ్ళీ ఆమె ఇలా అంది "తనింట్లో దొంగలు పడ్డారని తెలిసిన మరుక్షణం ఆయన పిచ్చివాడైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. దుకాణం నుంచి డబ్బు తెస్తున్నప్పుడు పదిపైసల నాణెం దారిలో పడిపోతే మా ఆయన టార్చ్ లైట్ వేసి వెదకడు- తెల్లవారే వరకు అక్కడే వుండి, ఆ పదిపైసలు తెచ్చుకుంటాడు. టార్చివేసి వెదికితే బ్యాటరీ ఖర్చయిపోతుందని, దాదాపు ఏడుగంటలసేపు మేల్కొని, పదిపైసలను ఇంటికి తెచ్చుకుంటాడు. అది పాపిష్ఠి డబ్బు. దానిని మీరు తీసుకుంటే మీరు ఆయనలా అయిపోతారు. డబ్బు పెద్ద అంటురోగం మీరు స్వచ్చంగా మాట్లాడుతున్నారు. ఆ డబ్బు తీసుకుని కల్తీ అయిపోకండి."
అలా మాట్లాడుతున్న ఆమెను అతను ఎంతో ఆరాధనతో చూశాడు.
ఆమె భర్త ఎంత పిసినారో అతనికి తెలిసింది. అలాంటి వ్యక్తికి భార్యగా బతకాల్సి వచ్చినందుకు ఆమె మీద జాలేసింది.
ఓ క్షణంపాటు నిశ్శబ్దం.
దానిని ఆమె భంగపరుస్తూ "మీకు ఓ విలువైన వస్తువును చూపిస్తాను. దానిని పట్టుకుపోండి" అంది.
ఏమిటన్నట్టు చూశాడతను.
"రండి చూపిస్తాను" అని వెనక్కు తిరిగింది.
ఆమెను అతను అనుసరించాడు.
శ్రీలేఖ హాల్ దాటి ముందు గదిలోకి వచ్చింది.
అంత విలువైన వస్తువు ఏమిటా అని తెగ ఆలోచిస్తున్నాడతను.
గోడను తడిమి లైట్ స్విచ్ వేసింది. నలభైక్యాండిల్ బల్బు నీరసంగా వెలిగింది.
ఆ గదిలో ఓ పక్క నవారుతో మంచం వుంది. దాని మీద అడ్డదిడ్డంగా ఓ దుప్పటి వుంది. మూలగా ఓ డ్రెస్సింగ్ మిర్రర్ వుంది. మూడడుగుల బెల్జియం అద్దం శుభ్రంగా వుంది. టేబుల్ పైన రెండు తిలకం సీసాలు, ఓ పౌడర్ డబ్బా వున్నాయి. దాని పక్కనే ఓ కుర్చీ గోడకు ఆనించి వున్నాయి.
ఈ గదిలో రాఘవులు దాచి పెట్టిన విలువైన వస్తువు ఏమిటో అంతుపట్టడం లేదు దొంగకి. ఎవరికీ సందేహం రాకుండా ఇక్కడ ఆ వస్తువును దాచి పెట్టిన రాఘవుల తెలివికి అతను సంతోషించాడు. అంత విలువైన వస్తువును ఈమె తనకెందుకు చూపిస్తూ వుందో తెలియడం లేదు అతనికి.
"అదిగోండి అక్కడ" అని వేలితో గదిలోపలికి చూపించింది.
ఆమె వేలువైపు సాగిన అతని చూపు ఓ దగ్గర ఆగిపోయింది. వస్తువు కనిపించింది. ధగధగా మెరుస్తూ అది అతన్ని వూరించింది.
"తీసుకుపొండి" అంది.
నమ్మలేనట్టు చూశాడు ఆమెవైపు.
ఆమె నిజంగానే తీసుకెళ్ళమని చెబుతున్నట్టు నమ్మకం కుదిరింది అతనికి.
శ్రీలేఖ వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆ వస్తువును అందుకున్నాడు. దానిని ఎంతో ఆరాధనతో చూస్తూ అతను బయటికి అడుగువేశాడు.
లైట్ ఆర్పింది శ్రీలేఖ.
మళ్ళీ గది అంతా చీకట్లో మునకేసింది.
ఉదయం నిద్రలేచిన రాఘవులకు ముందు గదిలోగాని, మరెక్కడా ఆ వస్తువు కనిపించకపోయేసరికి ఘెల్లుమన్నాడు.
* * * * *
"కథ అయిపోయింది" అన్నాను కీర్తితో.
"అయిపోయిందా? దొంగ ఎత్తుకెళ్ళిన విలువైన వస్తువేమిటి?"
"అది చెప్పను. పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ హాయిగా సేద తీరుతూ చెబుతాను."
"దారుణం మదన్. కథ అసంపూర్తిగా వుంది."
"అసంపూర్తిగా లేదు. దొంగ డబ్బులెత్తకుండా మరో విలువైన వస్తువు ఎత్తుకుపోవడం కథ మొదటి కొసమెరుపు. రెండో కొసమెరుపు చెప్పడం లేదంతే."
"కానీ భయానకమైన కథ చెబుతానని ఇదేమిటి చాలా శాంత రసంతో కూడుకున్న కథ చెప్పావ్?"
"శాంతమా?"
"కాకపోతే మరేమిటి? దొంగ దొంగలా కాకుండా చాలా శాంతంగా అచ్చు గౌతమ బుద్ధుడులానో, గాంధీ మహాత్ముడు లాగానో ప్రవర్తించడం. మధ్యలో కవిత్వం కూడా!"
"కొందరిని చూస్తే ఎంతటి దొంగైనా శాంతంగా తయారవుతారు. శ్రీలేఖ కాకుండా రాఘవులు లేచి వుంటే దొంగ అంత శాంతంగా వుండేవాడు కాదేమో?
"శ్రీలేఖ కూడా అంతే కదా. దొంగను చూస్తూ చాలా నింపాదిగా మాట్లాడింది. ఎనీ హౌ ఈ రోజు నువు దారుణంగా ఫెయిలయ్యావు. నాకు ఏ మాత్రం భయం కలగచేయలేదు ఈ కథ. సో! ఈ రోజు నేను ఎట్టి పరిస్థితులలోనూ పోర్షన్ లోకి రాను" ఖచ్చితంగా అంది కీర్తి.
"దొంగ అనే పదమే భయాన్ని కలుగచేస్తుంది కదా! అందుకే ఈ కథ చెప్పాను" నసిగాను నేను. నాకు తెలుస్తోంది నేను ఫెయిలయ్యానని.
"నిజంగా భయం కలిగితే వస్తాను కానీ, దొంగ ఎత్తుకు పోయిందేమిటి?"
"చెప్పను."
పెదవులతో వెక్కిరించి లోపలికి వెళ్ళిపోయింది కీర్తి.
ఇక తప్పదని నేనూ దుప్పట్లోకి దూరాను. ఇరవై అయిదేళ్ళ యవ్వనం పైనబడి స్వారీ చేస్తోంది. పక్కపోర్షన్ లో కాబోయే భార్యను పెట్టుకుని, అక్టోబర్ చలిలో ఒంటరిగా పడుకోవాల్సి రావడం దురదృష్టకరం.
ఇంతవరకే అస్కలిత బ్రహ్మచారినైన నాకు ఇప్పుడే ఈ వెధవ కోర్కెలు పుట్టాలా? డిసెంబర్ వరకూ ఆగితే ఆ తరువాత నేనే స్వయంగా రోజూ స్వర్గద్వారాలు తీయచ్చు.
మూడు రోజులూ రాని కీర్తి ఈ రోజు వస్తుందన్న నమ్మకం లేదు. దొంగ, దయ్యం, రేప్ కథలు చెప్పాను. ఇవన్నీ భయాన్ని కలుగ చేసేవే కదా! అయితే ప్రతి దాన్లోనూ మరో రసం డామినేట్ చేస్తోంది. మరి నేను సక్సెస్ అయ్యేదెలా?