మీరు... మిమ్మల్ని దాచుకునే అసహ్యమైన పనిని చేయకండి. ప్లీజ్! ప్రపంచంలోని కొన్ని సత్యాలను బయటకు లాగాలంటే మీనుంచి మీరు బయటకు రావాలి.
మీకో రహస్యం తెలుసా? ప్రపంచంలో ఏ మనిషీ...ఎంత హృదయవిదారకమైన స్థితిలో వున్నాసరే... తనను తాను నూరుశాతం వెల్లడి చేసుకోలేడు. తనను తాను కాపాడుకోవాలన్న చిన్న స్వార్ధం. తన ఉనికికి గుర్తింపు తెచ్చుకోవాలన్న తప్పించుకోలేని హిపోక్రసీ, మనకు తెలీకుండానే వెంటాడే అహంకారం - ఇవన్నీ మిళితమై ఉంటాయేమో!
మీరెన్నో చెప్పారు. మీ బాధలగురించీ, రెండోవారు మీకు కలిగిస్తోన్న గాయాల గురించీ...
అందులో ఎంతో నిజముంది. కాని పూర్తిగా కాదు. వుండటానికి వీల్లేదు. అది ప్రకృతి శాసనం.
మీరు విలవిల్లాడే నిస్సహాయస్థితిలో కూడా మీవైపునుంచీ తప్పు ఎంతో కొంత వున్నది. అది మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ సత్యానికి తిరుగులేదు!
మీరు ఒప్పుకోలేరు.
నిజం చెప్పాలంటే మీలో లోపాలు లేవా? మీ భార్యకు తెలీకుండా మీరు కొన్ని తప్పులు చెయ్యటంలేదా? వాళ్ళు చెయ్యటంలేదా? వీళ్ళు చెయ్యటం లేదా.... వాళ్ళ పెళ్ళాలు ఇలాగే కాల్చుకు తింటున్నారా అని సమర్ధించుకోవచ్చు. ఇంకొకరితో పోలిక వద్దు. మీరు చేస్తున్నారా లేదా?
చేస్తున్నాను.
వాటి రియాక్షన్ మీరు అనుకున్నదానికంటే ఎక్కువ వస్తుండేసరికి తట్టుకోలేక పోతున్నారు.
మీరు స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు. పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో వాదాల్లో వున్నంత రమణీయంగా నిజజీవితంలో వుండదు.
స్వేచ్చ కొంతవరకూ అవసరమే కాని ఆ 'కొంత'ను నిర్ణయించటం, నియంత్రించటం ఎలా?
అలాంటి ఆరోగ్యకరమైన స్వేచ్చను మీరనుభవించాలంటే మీ మనసూ, ప్రవర్తనా, మీ జీవిత విధానమూ చాలా పరిశుభ్రంగావుండి, అందులోనుంచి ఔన్నత్యంతో కూడిన మీ వ్యక్తిత్వం దర్శనమిస్తూ వుండాలి. అలాంటి నిర్దుష్టమైన వ్యక్తిత్వం మీరు కలిగి వున్నప్పుడు, ఆ నిర్దుష్టతతో కూడిన స్వేచ్చను మీరనుభవిస్తున్నప్పుడు, మీ స్వేచ్చా లోకంలోకి అడుగుపెట్టడానికి, మీ భాగస్వామి కాదు ఎవరైనా సరే.... అడుగు పెట్టడానికి సాహసించలేరు!
అసలు విజయరహస్యం ఎక్కడుందో తెలుసా? మీరంటే ఏమిటో, మీలో ప్లస్ లూ, మైనస్ లూ ఏమిటో పెళ్ళయిన క్షణంనుంచీ రెండవసారికి తెలిసేలా మిమ్మల్ని మీరు వ్యక్తం చేసుకోగలగాలి. అలా కాకుండా అవతలివారి నుంచి మంచిమార్కులు కొట్టేయడానికి మిమ్మల్ని మీరు అతీతంగా చిత్రించుకుంటారు. అది మీకో ఇమేజీను సృష్టిస్తూ కొంతకాలం ఆనందడోలికల్లో మునిగేటట్లు చేసినా, తర్వాత తర్వాత నాలుగువైపులనుంచీ బంధించిపారేస్తుంది.
పెళ్ళయిన మొదటిక్షణంనుంచీ....మీరేమిటో, మీ సహజత్వం ఏమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో, మీ అలవాట్లు ఏమిటో, మీలో మంచీ-చెడూ ఏమిటో రెండవవారు అర్ధం చేసుకునేలా ప్రవర్తిస్తే చాలామంచిది. అసలు 'మీరే'మిటో, రెండవవారికి తెలియాలి. అదీ మొదటి క్షణంనుంచీ తెలియాలి.
అట్లా జాగ్రత్త పడండి. ప్రపంచంలో ఏ ఇతర వ్యవహారాల్లో కన్నా అతిజాగ్రత్తగా నడుచుకోవలసింది....సంసార వ్యవహారాల్లోనే.
గుర్తుంచుకోండి. మీ భర్తకు అందం, మంచి ఉద్యోగం, హోదా, ఇంకా కొన్ని మంచి లక్షణాలు వుండి వుండవచ్చు. కాని అతనిలో సామాన్యమానవుడి లక్షణాలూ, కొన్ని బలహీనతలూ తప్పకుండా వుండి వున్నాయి. ఇది తిరుగులేని సత్యం!
అతన్ని అతని లోపాలతో అంగీకరించటం నేర్చుకోండి. ఎందుకంటే అంతకన్నా మరోమార్గంలేదు.
ఇలా అంటే మీకు కోపమొస్తుంది. మీలోని ఏవేవో వాదాలు ఈ సలహాలను తిరస్కరిస్తున్నాయి. తిప్పికొడుతున్నాయి.
అంగీకరించటమంటే... మీ ఆత్మలను చంపేసుకొమ్మనీ, మీ వ్యక్తిత్వాలను కించపరుచుకొమ్మనీ, మీ ఉనికిని 'కళ'లేకుండా చేసుకొమ్మనీ అర్ధంకాదు.
కనీసం ఇలాంటి సందర్భాలలోనైనా అర్ధం అనేమాటకు అర్ధం తెలుసుకోండి.
అంగీకరించటమంటే మిమ్మల్ని చిన్నబుచ్చుకోవటంకాదు. మీరు ఎంతో ఎదగటం.
మీలో ఔన్నత్యాన్నీ, హుందాతనాన్నీ ఎంతో పెంచుకోవటం.
'భర్త' అనేవాడు అతి ప్రధానవ్యక్తి కాని జీవితమంటే అతనొక్కడే కాదు. మీలోకి మీరు చూసుకుంటే, మీ చదువునూ, విజ్ఞానాన్నీ, మీ చుట్టూ వున్న ప్రపంచాన్నీ చూసుకుంటే మీకు మిగతా అంశాలు కూడా ఎంత ముఖ్యమైనవో, మీ విలువ అనేక ప్రాధాన్యాలమీద ఎలా విస్తరించవచ్చో గ్రహించగలుగుతారు.
మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. దాంపత్యమొక్కటే జీవితంకాదు. దాంపత్యం ప్రపంచంలో ఒక భాగం. కాకపోతే అతి ముఖ్యభాగం. అతి పదిలంగా కాపాడుకో వలసిన భాగం.
మీరు ఎంతో కొంత చదువుకున్నవారైతే... చిన్నప్పటినుంచీ అనేక ఇతర వ్యాపకల్లోకి ప్రవేశించటానికి వచ్చిన అవకాశాలను ఎంత మూర్ఖంగా ఎన్నిసార్లు వదులుకున్నారో గుర్తుచేసుకోండి. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, ఇంకా కొన్ని హస్తకళలు, క్రీడలు, సాంఘిక సేవలు, నటన... వీటిలో ఏవో కొన్ని ఎప్పుడో ఒకప్పుడు మీ ఇంటితలుపు, మీ హృదయద్వారం తట్టి వుంటాయి. తట్టాయి. మీలో ఏ కొద్దిమందో తప్ప మిగతావారు వాటిని స్వీకరించటానికి సిద్దపడలేదు. బద్ధకం 'ఇది' నా పనికాదు. ఈ బద్దకమే మిమ్మల్ని కూడదీసుకోవటానికి నిరాకరించినప్పుడు ఈ యంత్రబద్దమైన బంధాన్ని సర్వాంగ సుందరం చేసుకోవాలన్న తపన, కార్యరూపం దాల్చని ఓ తపనగానే మిగిలిపోతుంది. యంత్రాలు సర్వాంగ సుందరంగా భాసించవు.
అన్ని వ్యాపకాలూ పోగొట్టుకుని చివరకు హక్కులమీద అధికారం చలాయించాలన్న నిరర్ధకస్థితికి వచ్చేస్తారు. చాడీలు వినటం, సెల్ఫ్ పిటీ, ద్వేషం, నిస్సహాయత, అనుమానం, గయ్యాళితనం మీలో వున్న విశాల కోణాల్ని మూసేసినట్లు చేస్తాయి.
ప్లీజ్! చూడండి. కొంచెం వినండి. ముందు వినటం నేర్చుకోండి. మీరు చాలా అలసి వుండవచ్చు. కాని మీకింకా చాలా తెలియవన్న సత్యాన్నికూడా గ్రహించండి.
వినండి. మీకు ఒంటరిగా కూర్చుని బాధపడటం వచ్చు కాని ఆ ఒంటరితనంలో ఆలోచించటం వచ్చా?
ఎలాంటి ఆలోచన? అహంకారంతో కూడిన ఆలోచన కాదు. మీమీద మీకు జాలి కలిగించే ఆలోచన కాదు.
మిమ్మల్ని మీరు చూసుకునే ఆలోచన.
మిమ్మల్ని మీరు తెలుసుకునే ఆలోచన.
నిజమైన 'మీరు' ఎక్కడ వున్నారో వెదికి పట్టుకునే ఆలోచన.
వస్తుంది. ఆ స్థితిలోకి మీరు తప్పకుండా పోతారు. దీనికి హిప్నాటిజమే అక్కర్లేదు. అల్ఫా స్టేజ్ లోకి వెళ్ళనక్కర్లేదు. ఏవో సాధనాలు... 'ధ్యానం' అలాంటి పెద్ద పెద్ద వాటిలో ప్రవేశించనక్కర్లేదు.