Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 25


    ఇద్దర్నీ ఏదో ఆవహిస్తోంది. ఎక్కడ్నుంచో మృదు సుగంధం వీచినట్లయి, చక్కగా రాగాలు వినిపించినట్లు, కాళ్ళముందు అందమైన దృశ్యాలు కదిలినట్లు.

    ఇందులో ఇంత మాయ వుందా? తను ఏమయిపోతుంది?

    చూట్టూ ఏదో మత్తులాంటి పోర అల్లుకుపోతున్నది. మాట్లాడదామనుకుంటున్నది. పెదిమలు కదుల్తున్నాయి గానీ అవెక్కడో ఇరుక్కుపోయినట్లయినాయి.

    నిద్ర వస్తున్నట్లు.....

    కానీ.....

    తను భార్య......

    అతని మంగళం కోరే భార్య.....

    త్రుళ్ళిపడినట్లయింది. ఒక్క త్రోపు త్రోసి విడిపించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

    తర్వాత - ఇద్దరూ మాట్లాడుకోలేదు.

    కలిసే భోంచేశారు. గదిలోకి పోయి ఎవరిదారిన వాళ్ళు పడుకున్నారు. అయినా ఒక్కమాట మాట్లాడుకోలేదు.

    నిద్ర ఇప్పుడు వెయ్యిమైళ్ళ దూరంలో వున్నట్లుంది. ఇద్దర్లో ఏదో దిగులు, అసంతృప్తి, బాధ, ఆరాటం. పలకరిస్తే మంటలు ప్రజ్వరిల్లేలా వున్నాయి. క్షణాలు గడిచిపోతున్నాయి. మనస్సులు బుసలు కొడుతున్నాయి.

    అక్కడ వుండలేక మాలతిలేచి హాల్లోకి వచ్చేసింది. కాళ్ళ క్రింద పచ్చికలాంటి మెత్తటి తివాసీ. ఆ మందమైన కాంతిలో గోడలకున్న చిన్నచిన్న బొమ్మలు వింతగా మెరుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తనువూ, మనసూ అన్నీ అస్పష్టమైన దశలో వున్నాయి.

    "మాలతీ!"

    వెనుదిరిగింది.

    ఆ కనిపించీ కనిపించని వెలుగులో ఎదురుగా భర్త -వేల ఆరాటాలతో. దగ్గరగా వచ్చాడు.

    ఆ చిరుకాంతిలో అతని కళ్ళు భగ్గుమని మండిపోతున్నట్లుగా గోచరిస్తున్నాయి.

    "తప్పదు"

    కళ్ళప్పగించి చూస్తోంది.

    "ఇవేళ నిన్ను తీసేసుకుంటాను."

    మాలతి అతని ముఖంలోకి తదేకంగా చూస్తున్నట్లూ, ఉన్నట్లుండి పిచ్చి పట్టినదానిలా నవ్వింది. ఆ నవ్వులో ఏడుపు వుంది. ఆ నవ్వులో కసి వుంది. ఆ నవ్వులో బాధ వుంది. ఆ నవ్వులో సెగ వుంది.

    "మంచిది. మీకు కావాల్సింది జీవితపు శాశ్వత విలువలు కావుగా? రండి నన్ను తీసుకోండి. మీక్కావలసింది మీ భార్య శరీరం. లోపలి ఆవేదనని, ఆకర్షణగా కప్పుకున్న శరీరం. మీ భార్య ఓ హంతకురాలిగా లోకంముందు  నిలబడాల్సి వచ్చినా మీకు అభ్యంతరం లేదు. మీ భార్య కర్తవ్యాన్ని మర్చిపోయిన దోషిలా లోకంముందు నిలబడాల్సివచ్చినా మీకభ్యంతరం లేదు. రండి..... శేఖర్! రండి, రండిసార్ రండి. నేనూ మనిషినే. నాలోనూ రక్తం మీలోనంత వేగంగా ప్రవహిస్తోంది. నా మనసూ మీ మనసంత భయంకరంగా చెలరెగుతోంది. ఊ, రండి...."

    ఆమె అతన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ముందుకు జరిగి కళ్ళు మూసుకుంది.

    శేఖర్ భయ విహ్వలుడై ఆమెవంక చూశాడు.

    కిటికీలోంచి దూసుకువచ్చిన గాలికి ఆమె పమిటచెదిరి క్రిందపడి పోయింది.

    ఆమె కనులు మూతపడి వున్నాయి.

    ఆమె గుండెలు తెరుచుకుని వున్నాయి.

    ఆ చిరుకాంతి, ఆమె నిలబడ్డ భంగిమ, వణికే ఆమె పెదవులు - అన్నీ అతన్ని ఆహ్వానిస్తున్నట్లుగా వున్నాయి.

    కానీ......

    ఆ రూపం అతనికి ఉన్నతంగా గోచరించింది.

    మహా తేజస్సులా, తనకు మించిన శక్తిలా దృగ్గోచరమైంది. కనులు మిరిమిట్లు కొలిపినట్లయిపోయాయి. "నో! నో!"అంటూ వెర్రివాడిలా లోపలకు వెళ్ళిపోయాడు.

    అప్పుడో చిత్రం జరిగింది.

    అప్పుడో మహా విచిత్రం జరిగింది.

    అదే సమయానికి లోపలకు వచ్చిన శంకర్ కు అలా శిల్పంలా నిలబడి వున్న మాలతి - ఓ శక్తిలా కనిపించలేదు.

 

    శృంగార దేవతలా సాక్షాత్కరించింది.

    విరుచుకు పడిన ఆమె హృదయం అతన్ని ఎలుగెత్తి పిలిచింది.

    మూతలుపడ్డ కనుదోయి స్వాగతాలు చెబుతున్నాయి.

    అతను మనిషి. మరింత మనిషైపోయాడు.

    అయోమయంగా దగ్గరకు వెళ్ళి ఆమె భుజంమీద చేయి వేశాడు.

    ఆమె కనులు తెరవలేదు కానీ ఆమె చేతులు అతన్ని చుట్టుకున్నాయి.

    "శేఖర్! "శేఖర్! అంటున్నాయి ఆమె పెదవులు.

    అతనికి అస్పష్టంగా ఏదో బోధపడింది. స్వార్ధం అతన్ని శాసించింది. గోడనున్న స్విచ్ బోర్డు చేతికి అందేటంత దూరంలో వుంది. మరుక్షణంలో హాలంతా చీకటిమయమైపోయింది.

    ఆ చీకటిలో ఆమెచేతులు అతనిచుట్టూ మరింత బిగుసుకున్నాయి.

    ఆమె ఎటో తేలిపోతుంది. జరిగేది ఆమె గుర్తించిందా? గుర్తించగలిగిందా? గుర్తించగలిగినా ఏమీ చెయ్యలేని స్ధితిలో ఉండిపోయిందా? అలాంటి స్ధితిలో ఏం చేస్తుంది?

    ఈ విషయాలు మాత్రం నాకు తెలియవు.

    అమాయకంగా తెల్లవారిన ఆరోజు శంకర్ అనే చీకటిరూపంలో ఆమెను కబళించిందని మాత్రం వ్రాయగలను.

                                             13

    అప్పటికింకా తూరుపురేఖలు విచ్చుకోలేదు. దెయ్యంలాంటి చీకటీ విడిపోలేదు.

    మాలతి మాత్రం శవంలా నేలమీద పడివుంది.

    జీవితమంటే అతి విలువైనదీ, అమిత భద్రంగా దాచుకుందామనుకున్నది. కనుమూసి తెరిచేటంతలో అతి తేలిగ్గా పోగొట్టుకుంటాము. వాటి విషఫలితాలు మాత్రం చివరిదాకా అనుభవిస్తూ వుంటాము.

    లోపలిగదిలో నిద్రబిళ్ళలు వేసుకున్న శేఖర్ అశాంతితో కూడిన గాఢసుషిప్తిలో మునిగివున్నాడు.  .                                                                                                 

 Previous Page Next Page