"ఏమోయ్ మాట్లాడవేం?"
"ఏం మాట్లాడను?"
"మీ యిద్దరిమధ్యా ఏమయినా జరిగిందా?"
అమ్మాయిలు వాళ్ళని దాటి వెళ్లిపోయారు. వారివంక చూడలేదు. 'హమ్మయ్య' అని నిట్టూర్చాడు.
"ఛ ఛ. లేదోయ్" అన్నాడు. అతనికి బొత్తిగా అబద్ధం చెప్పటానికి భయం వేసింది.
"మరి ఎంతవరకూ వచ్చింది?"
అతనికి చాలా యిబ్బందిగా వుంది. పూర్తిగా నిజం చెప్పినా తంటాయే. వాళ్లు అసూయపడే అంశం లేకపోయేసరికి తనని గడ్డిపోచ క్రింద కట్టేస్తారు.
"ఏదో కొంచెం కొంచెం" నసిగాడు.
"మాట్లాడుతున్నప్పుడు ఆమెచేతిని నీచేతిలోకి తీసుకుంటూ వుంటావా?"
"ఊ..."
"ఇంకేం చేశావు."
"అబ్బ! యింకేం చెయ్యలేదోయ్."
"కొయ్యకు. ముద్దుపెట్టుకున్నావా?"
మృత్యుంజయరావు జవాబు చెప్పలేదు. అతని ముఖమంతా ఎర్రగా కందగడ్డలా అయిపోయింది.
"అదిగో! నీ వాలకమే చెబుతోందిలే. ఏం? నిజమేనంటావా?"
మెల్లిగా తల వూపాడు.
"ఎప్పుడన్నా దగ్గరకు తీసుకున్నావా?"
"ఉహుఁ!"
"ఫర్వాలేదు. అహఁ చెప్పు. నీచేతులు ఆమె నడుంచుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నావు, ఏం?"
అతను మాట్లాడలేకపోయాడు. నానాయాతనా పడుతున్నాడు.
"నువ్వు దాచలేవోయ్. నాకు తెలుసు. నీ గుండెలకు అదుముకున్నావు. అవునా?"
'ఏం చెప్పను?' అన్నట్లు చూశాడు మృత్యుంజయరావు.
"ఆఁ అదీ! సరేగాని ఒకమాట అడుగుతాను. ఇంత వ్యవహారం నడిపినవాడివి ఆ కాస్తా కానియ్యకుండా వూరుకుంటావా? నన్ను బుకాయించలేవోయ్. ఆవలిస్తే పేగులు లెక్కపెడతాను. ఊఁ అను."
"ఊఁ"
తురంగరావు విజేతలా అట్టహాసం చేశాడు. "మరి ఏమీ లేదంటావే? కాలాంతకుడివోయ్ నువ్వు. చల్లచల్లగా వుండి వ్యవహారం చక్కబెడుతున్నావు" అని భుజంమీద గట్టిగా కొట్టాడు.
* * *
ఒక ఆదివారం ఉదయం మృత్యుంజయరావు క్షవరం చేయించుకుందామని బార్బర్ షాపుకు వెళ్ళాడు. అక్కడ ఒక కుర్చీలో శేఖరం క్రాఫ్ చేయించుకుంటూ కనిపించాడు. ఇతనిని చూసి విష్ చేశాడు.
మృత్యుంజయరావు ఖాళీగా వున్న ఓ కుర్చీలో చతికిలబడ్డాడు. వెనకనుండి ఓ పనివాడు వచ్చి "క్రాఫా? షేవింగా సార్?" అన్నాడు.
"క్రాఫ్" అన్నాడు. "షేవింగ్ యింట్లో చేసుకుంటాను."
ఆ పనివాడు కొత్తగా చేరినట్లున్నాడు. అలవాటైనవాడు కాదు. తెల్లనిగుడ్డ తెచ్చి క్రిందనుండి అతడి కంఠంవరకూ కప్పుతూ "ఎలా చెయ్యమన్నారు సార్? పొడుగ్గా వుంచమన్నారా? పొట్టిగా కత్తిరించమన్నారా? ప్రక్కలన బాగా తగ్గించమన్నారా? ఒత్తుగా వుంచమన్నారా?" అని చిక్కుప్రశ్నలు వేశాడు.
ఇలాంటి సందర్భాలంటే అతనికి చెడ్డభయం. తన జుట్టును గురించి, దాని ఆకారాలను గురించీ అతనికి ఓ నిర్ధారణ లేదు. మౌనంగా మంగలాడికి తల వప్పచెప్పి వూరుకుంటాడంతే. వాడెట్లా చెక్కి వదిలిపెట్టినా వాడిష్టం. అతనెప్పుడు 'హెయిర్ కట్' చేయించుకున్నా బయటకు రాగానే "ఎవడ్రా నీకు చేసింది?" అని ఆక్షేపించనివాళ్ళు అరుదు. అందుకని యీబాధ పడలేక ఒకేషాపుకు వెళ్ళటం మొదలుపెట్టాడు. గుడ్డిలో మెల్లగా ఆ షాపువాడికి అతని తలపద్ధతి కొంత అర్ధమయింది. అతన్ని ప్రశ్న వేసి వేధించకుండా తమపని తాము చేసుకుపోసాగారు. కాని యివాళ యితనెవరో కొత్తకుర్రాడు, తనని సతాయిస్తున్నాడు. ఇంకో పరిచితమైన పనివాణ్ణి పిలవమని చెప్పటానికి మొహమాటపడి, "అదే! అంత పొడుగూ పొట్టీ కాకుండా చెయ్యి. ప్రక్కలన ఒకమాదిరిగా వుంచు" అని అద్దంలోకి చూసుకుంటూ కూర్చున్నాడు.
కొంతమంది దబాయించి చేయించుకుంటారు. "ఇదిగో! సైడ్స్ న ఏమాత్రం ఎక్కువ తీసినా నాకు బాగుండదు. వెనకాల షేప్ మాత్రం పోకూడదు తెలిసిందా?" అని హెచ్చరికలు చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని చూస్తే మృత్యుంజయరావుకు చాలా గౌరవం.
టైలర్ దగ్గరకు వెళ్ళినా అంతే. అందరూ కొలతలు అలా ఇచ్చి, యిలా యిచ్చి దర్జీవాడికి తొంభయి నిబంధనలు చెప్పి, వాడు కుట్టాక అది ధరించి అద్దంముందు యిటుతిరిగి, ముందు చూసుకుని, వెనక చూసుకుని, 'యిక్కడ టైట్ గా వుంది', యిక్కడ లూజ్ గా వుంది' అని వాడి దుంపతెంచి మళ్ళీ కుట్టించి- యింత హడావుడి చేస్తారు. మృత్యంజయరావు అదేంలేదు. గుడ్డ వాడిచేతిలో పెట్టటం, శవంలా నిల్చోవటం, మీ స్ట్రక్చర్ లో లోపం వుంది సార్' అని టైలర్ అనకుండా వుంటే అదే పదివేలు.
క్షవరం చేయించుకుంటూ శేఖరంవంక ఓరగా చూశాడు. సిగిరెట్టు కాల్చుకుంటూ దర్జాగా కూర్చునివున్నాడు. అలా సిగిరెట్టు కాల్చటంలో, అలా కూర్చటంలో ఓ ప్రత్యేకత కనిపించింది మృత్యుంజయరావుకు. "ఎలాగైనా అతను వేరు అనుకున్నాడు. అందుకే మంజులత అతనంటే మోజుపడింది. "సరి సరి! నా జీవితమంతా ఇతరుల్ని అభినందించటంతోనే సరిపోతోంది" అని విసుక్కున్నాడు అతను.
మంజులత కోరికనుగురించి యింతవరకూ శేఖరానికి తెలియనివ్వలేదు తను. తన దాపరికానికి గర్వపడ్డాడు.
శేఖరం పని పూర్తయిపోయింది. షాపువాడికి డబ్బులిచ్చేసి మృత్యుంజయరావు భుజంమీద మెల్లిగా తట్టి, "నీతో కాస్త మాట్లాడాలి, బయట వెయిట్ చేస్తూ వుంటాను" అని వెళ్ళిపోయాడు.
అతనికి కంగారుపుట్టింది. ఏం మాట్లాడుతాడు శేఖరం తనతో? ఎవర్ని గురించి?
కొంతసేపటికి పనివాడు తన కార్యక్రమం ముగించి, దువ్వెన అదించి "దువ్వుకొని చూసుకోండి సార్" అన్నాడు.
తను దువ్వుకునే పద్ధతి చూసి అతను నవ్వుతాడని "అబ్బ! నువ్వే దువ్వెయ్యవోయ్ ఫర్వాలేదు" అన్నాడు.
అతను ఓపిగ్గా అతని జుట్టు అటు దువ్వి, ఇటు దువ్వి ఓ ఆకారం చేసి "ఇప్పుడు చూసుకోండి సార్ అద్దంలో. ఎంత ఫస్టుగావుందో! రోజూ యిలా దువ్వుకుంటూ వుండండి" అన్నాడు సలహా యిస్తూ.
మృత్యుంజయరావు "బాగుంది" అని మెచ్చుకుని, లేచి నిలబడి, బట్టలు దులుపుకుని, వాడికి డబ్బులిచి బయటపడ్డాడు.
కిళ్ళీకొట్టు దగ్గర శేఖరం సిగరెట్టు కాల్చుకుంటూ నిలబడ్డాడు. ఇతను దగ్గరకు రాగానే ఓసారి క్రాఫింగ్ వంక ఎగాదిగా చూశాడు. ఏమైనా వ్యాఖ్యానం చేస్తాడేమోనని భయంవేసింది మృత్యుంజయరావుకు.
"పద!" అన్నాడు శేఖరం కదుల్తూ గంభీరంగా.
ఇద్దరూ నడవసాగారు.
శేఖరం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నడుస్తున్నాడు. ఏమీ చెప్పడేం? ఏమిటి మాట్లాడుతానన్నాడు?
అడుగుదామనుకున్నాడు, కాని భయంవేసింది. ఊరుకున్నాడు.
చివరకు శేఖరం అన్నాడు. "మాలతితో తిరగటం మానెయ్యి."
అతనికంఠంలో గంభీరత్వం విని అతను చలించాడు. 'ఏం?' అని అడగటానికి కూడా వెరిచాడు.
"మాలతిమీద నాకు ఉద్దేశం వుంది. తెలిసిందా?" అన్నాడు శేఖరం తిరిగి కఠినంగా.
మృత్యుంజయరావు అతని ముఖంలోకి చూసి భయపడిపోయాడు. తంతాడేమోననిపించింది. ఏం మాట్లాడటానికీ ధైర్యం చాలక ఊరుకున్నాడు. అంతే, శేఖరం యింకేమీ మాట్లాడలేదు. సందుచివరకు వచ్చాక "అర్ధమయింది కదూ!" అంటూ గబగబా నడిచి వెళ్లిపోయాడు.
అతను వెళ్ళిపోయిన అయిదు నిముషాలకుగానీ అతను దిగ్భ్రమనుంచి తేరుకోలేదు. తర్వాత ఇదేమిటీ? బోడి శేఖరానికి ఎందుకిలా భయపడిపోయాను? వాడు నన్ను తన్నటమేమిటి? తంతే మళ్ళీ తంతాను. నేనుమాత్రం తక్కువ తిన్నానా? నాకు కోపంవస్తే నేను తన్నగలను' అనుకున్నాడు.
శేఖరం ఎదురుగా వుండగా యీ విధంగా ఎందుకు ఆలోచించుకోలేకపోయాడో అర్ధంకాలేదు.
ఏది ఏమైనా శేఖరంలాంటివాడిని అసూయతో కుమిలిపోయేటట్లు చేశాను అని మురిసిపోయాడు.
* * *
'నేను వీరుడిగా వుంటాను' అని నిశ్చయించుకున్నాడు మృత్యుంజయరావు. అట్లా నిశ్చయించుకుని మాలతితో సన్నిహితత్వం కొనసాగించటానికే నిర్ణయించుకుని, యీ సంఘటన జరిగిన మరునాడే మాలతియింటికి వెళ్ళాడు. మెట్లు ఎక్కి లోపలకు పోతుంటే, గదిలో మాలతితో మాట్లాడుతూ తురంగరావు కనిపించాడు. మృత్యుంజయరావుని చూసి తురంగరావూ, తురంగరావుని చూసి మృత్యుంజయరావూ గాభరాపడ్డారు. మాలతి లేచి నిల్చుని "రండి" అని ఆహ్వానించింది ఆదరపూర్వకంగా.
ఇద్దరూ ఒకరివంక ఒకరు భావయుక్తంగా కాసేపూ, భావశూన్యంగా కాసేపూ చూసుకుని మెదలకుండా కూర్చున్నారు.
"తురంగరావుగారు యీమధ్య మంచి విమర్శనా గ్రంథం ఒకటి రాశారుట. దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు" అంది మాలతి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.
"ఆహాఁ! యీమధ్య తురంగరావు రాయటం విరమించుకున్నాడనుకున్నానే" అన్నాడు మృత్యుంజయరావు వ్యంగ్యాన్ని జోడిస్తూ 'పెద్దవాడిలా మాట్లాడుతున్నాను' అని తననుతాను మెచ్చుకున్నాడు.
"ఇది సృజనాత్మకమైన సృష్టికాదు. విమర్శనా గ్రంథం. 'తెలుగుభాషలో ఆంగ్ల పర్యాయపదాలు గ్రంథంపేరు. చాలా కృషిచేసి, చాలా పుస్తకాలు చదివి కష్టపడి రాశాను. దానికి ఆవిష్కరణా, అదీ కొంత హడావుడి చెయ్యాలిగా" అన్నాడు తురంగరావు బోధపరుస్తూ.
"ఎవరిచేత ఆవిష్కరింపచేస్తున్నారు?"
"చూస్తున్నాను. పుస్తకం అచ్చు పూర్తయి రెడీగావుంది. వారం పదిరోజుల్లో మంత్రులు పర్యటన నిమిత్తం యిటు వస్తున్నారేమో వాకబు చేస్తున్నాను. మంత్రిగారు ఎవరూ లభించకపోతే చైర్మన్ గారినో, కాలేజి ప్రిన్సిపాల్ గారినో ఆహ్వానిస్తాను" అన్నాడు తురంగరావు.
"శుభం" అనుకున్నాడు మృత్యుంజయరావు మనస్సులో.