ఒక సాయంత్రం పశుపతిగారి యింట్లో మాలతీ, మృత్యుంజయరావూ దగ్గరదగ్గరగా కుర్చీలలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతకుముందే మాలతి వేడివేడి టీ యిచ్చింది. పశుపతిగారు యింట్లో లేరు. మిగతా కూతుళ్లు సినిమాకి వెళ్ళారు. సత్యవతమ్మగారు వంటింట్లో పని చేసుకుంటోంది.
"నాపెళ్ళి యింట్లో పెద్ద సమస్య అయిపోయింది" అంది మాలతి బలవంతాన నవ్వి, రేడియోమీద వేలుపెట్టి రాస్తోంది మృదువుగా.
"మీరు ఎడ్యుకేటెడ్ గరల్ కదా! మీకూ యిది సమస్యగా తయారయిందా?" అనడిగాడు అతను.
"ఎడ్యుకేటెడ్ గరల్ మాత్రం మనిషికాదా? ఆమెకు సమస్యలుండవా?"
"అదికాదు. ఈ సమస్యను స్వయంగా పరిష్కరించుకోలేరా?"
"అది కబుర్లలో అనుకున్నంత తేలికకాదండీ! ప్రేమించాలని ఒకరిని ప్రేమించలేం. కాని పెళ్లికోసం ఎర వేయవలసిన దుర్గతి పట్టింది చదువుకున్న అమ్మాయికి" అంది మాలతి ఆవేదన ధ్వనిస్తూన్న కంఠంతో.
అతనాశ్చర్యంగా చూస్తున్నాడు.
"మాకు పెళ్ళి వద్దు, మేం చేసుకోం" అంటారు చదువుకుంటున్న ఆడపిల్లలు. ఎంతమంది మనఃపూర్వకంగా అంటారో, ఎంతమంది డిగ్నిటీ కోసం అంటారో చెప్పటం కష్టం. తలిదండ్రులుకూడా 'మా పిల్లలముందు పెళ్లిమాట ఎత్తకండి' అంటారు గొప్పగా. చదువు పూర్తి అయిపోతుంది. ఉద్యోగాలో, ఏదో మొదలుపెడతారు. రోజులు గడిచి ఏళ్ళు పైబడుతూ వుంటాయి. ఇహ భుజాలు తడుముకుంటూ వరాన్వేషణకు మొదలుపెడతారు తల్లిదండ్రులు. ఇంత చదువు చదివినా కట్నాల బెడద తప్పదు. పైగా చదువు పూర్తిచేసినవారూ, సంపాదించుకుంటున్నవారూ కావాలి. పిల్లకు పాతికేళ్ళు పైబడుతూంటాయేమో, ఏ ముప్పయి ఏళ్లవాడన్నా దొరకాలి. ఎంతకాలానికీ పెళ్లిగాక 'పెళ్ళో పెళ్ళో' అని కలవరించి, బాధ దాచుకోలేక అనేక విధాల బయటపడిపోయిన స్త్రీలను చాలామందిని చూశాను. సమవుజ్జీ దొరక్క తనకంటే అనేకరెట్లు చదువులోనూ, స్థానంలోనూ కూడా తక్కువదశలో వున్నవారిని ప్రాణం విసిగి చేసుకున్న స్త్రీలను చూశాను. ఎంతకీ పెళ్ళిగాక జీవితాంతం అవివాహితగా మిగిలిపోతూ, కుమిలిపోతూన్నవాళ్ళని చూశాను. పెళ్లివద్దని సంవత్సరాల తరబడి కబుర్లు చెప్పి, మూడుముళ్ళూ పడిన మరుక్షణంనుండీ మొగుడ్ని విడవకుండా అంటిపెట్టుకుని, లోకాన్ని మరిచిపోయిన వాళ్ళని చూశాను."
మాలతి ఆగింది. ఆమెలో ఎంత ఆవేదన గూడుకట్టుకుని వుందోననిపించింది అతనికి.
ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. కాని ఆమె ఏమయినా అనుకుంటుందేమోనని భయపడ్డాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని నసుగుతూ అన్నాడు. "ఒక ప్రశ్న అడిగేదా?"
"అడగండి" అంది మాలతి తేలిగ్గా.
"మీకూ పెళ్ళి చేసుకోవాలని వుందా?"
సిగ్గుతో ఆమె కపోలాలు ఎర్రబారాయి. లేత చిగుళ్ళను వ్యక్తం చేస్తూ ఆమె పెదిమలు విప్పారినై. "ఉండదా మరి? అందరిలాటి ఆడపిల్లను కానా?"
ఈ సమాధానం విని అతడు పులకితుడయాడు. ఒకక్షణం ఆగి "ఎవరినైనా ప్రేమించారా?" అని అడిగాడు ధైర్యం ఎక్కువ చేసుకుంటూ.
"అలాంటిదేమీ లేదనుకుంటాను" అంది మాలతి లేతగా నవ్వి.
అతనికీవేళ ఎక్కడలేని సాహసమూ కలుగుతోంది. "ఎవరినైనా ప్రత్యేకంగా పెళ్ళి చేసుకోవలాని సంకల్పం వున్నదా?"
"ఇంతవరకూ లేదు"
"ప్రేమించకుండా పెళ్ళాడటానికి ఏమైనా అభ్యంతరాలున్నాయా మీకు?"
"అవీ లేవు"
"ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మీ ఆశయం?"
"అంటే?"
"అతను అందగాడై వుండాలా?" ఈ ప్రశ్న అడుగుతూంటే కంఠం చలించింది.
"నా మనసుకు నచ్చాలికదా?"
"ఉద్యోగం, కులం, స్టేటస్..."
"పెద్ద కోరికలు లేవు."
'నన్ను చేసుకుంటారా?' ఈ ప్రశ్న అతను అడగలేదు. అతడి సాహసం అక్కడితో ఆగిపోయింది.
ఆరాత్రి యింటికి తిరిగివస్తూ అతనాలోచించాడు. "ఛీ, ఛీ. నేను సంభాషణ సరిగ్గా జరపలేదు. ఎప్పుడూ యిలాంటి ప్రమేయం వచ్చినప్పుడు ఎదుటివారి అభిప్రాయాన్ని గుచ్చిగుచ్చి అడక్కూడదు. మనంతప్ప అక్కడ యింకో వ్యక్తివైపు గాని దృష్టి మర్చలనీయకూడదు. ఆమె అభిప్రాయాలకు అంత విలువ యిచ్చినప్పుడు. మనం కేవలం ప్రేక్షకుడుగానో, శ్రోతగానో నిలబడి చోద్యం చూడవలసివస్తుంది. ఛీఛీ! నాకు మాట్లాడటం చేతకాదు."
* * *
మాలతి, మృత్యుంజయరావుతో ఎక్కువ సంభాషిస్తూ వుండటంతో అతన్ని కథానాయకుడ్ని చేసేసింది ఆఫీసులో. అందరికీ వంటిమీద చీమలు పాకుతున్నట్లు వుంది. ఆఫీసరుకూడా గుర్రుగా చూస్తున్నాడు. ఏదో మిషమీద అతన్ని గదిలోకి పిలిపించి తిడుతున్నాడు.
సాయంత్రాలు కళాసమితి మందిరంలో అతడ్ని గురించి వదంతులు పేలిపోతున్నాయి.
"వీడ్నెట్లా వరించిందయ్యా ఆ మాలతి? ఆ అమ్మాయింత టేస్ట్ లెస్ ఫెలో అనుకోలేదు."
"యింటికి రోజూ వెడుతున్నాట్ట."
"వీడు వొట్టి చవటనుకున్నాం. అబ్బో, గ్రంథసాంగుడే."
"అసలు ఎంతసేపూ హస్కేనా? ఏమయినా... జరిగిందా అని?"
"ఊరుకోవయ్యా. ఇంతవరకూ వచ్చింతర్వాత వాడూరుకుంటాడేమిటి? ఏం, అంత మగతనం లేనివాడనుకుంటున్నావా?"
"అయినా అసలు ఎట్లా పట్టాడయ్యా మనం యింతమంది వుండగా?"
"వాడి ముక్కు వొంకర దానికి కనిపించలేదా?"
"అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ వీలవుతుందా అని."
"ఎక్కడేమిటి? 'వ్వేర్ దేర్ యీజ్ ఎ విల్, దేర్ యీజ్ ఎ వే' అన్నారు. ఆవిడింట్లోనే సాధ్యపడుతుంది. ఎక్కడా చోటు లేకపోతే?"
"ఇంట్లోనా? తండ్రి లేడూ?"
"ఆయనకిలాంటి అభ్యంతరాలు లేవటలే. కూతురు సంపాదిస్తే బతుకుతున్నాడు. వాడో మనిషా?"
"ఆహా. అలానా? పెద్దమనిషి అనుకున్నాం సుమా."
"అసలు ఆయనే కూతుళ్ళని వొప్పచెబుతాడనికూడా యీ మధ్య తెలిసింది. ఆరా తీస్తున్నాను."
"మొత్తంమీద మనవాడి పంట పండింది."
"డబ్బిస్తున్నాడేమో."
"ఈ నీళ్ళచెంబు మొహంగాడు ఎంతవాడయ్యాడు?"
"వీడు ముద్దుపెట్టుకుంటూన్నప్పుడు- అంత దగ్గరగా- అబ్బ, ఎలా భరిస్తుందర్రా ఆ అమ్మాయి."
"అదిసరే! ముద్దు రెసిప్రొకేట్ చేసినప్పుడు వీడిముఖాన వున్న చిల్లులు గుచ్చుకోవటం లేదా అని?"
"కాని, వాడిదగ్గర టిప్స్ నేర్చుకోవాలయ్యా."
"వాడిమొహం. వాడిదగ్గర టిప్స్ ఏమిటి? ఏదో లక్కీగా పట్టేశాడు."
ఇలా చెరిగేస్తున్నారు.
ఒకసారి సోమయాజులు అతనిదగ్గరకు వచ్చాడు. "ఇదిగో అబ్బాయి, కుర్రవాడివి ఆఫీసులో శ్రద్ధగా పనిచేస్తున్నావు. టెస్టులు ప్యాస్ అవుతున్నావు. వృద్ధిలోకి రావల్సినవాడివి. నువ్వింకా యెంతో బుద్ధిమంతుడివనుకున్నాను. ఇలాంటి వెధవ్వేషాలు వెయ్యటం నాకేం నచ్చలేదు. ఆ మాలతి చాలా అమాయకురాలు, పెళ్ళికాని పిల్ల. ఆ పిల్లను యిలా పాడుచేయటం తప్పు. కూడనిపని. ఆఫీసరుగారుకూడా పసిగడ్తున్నారు. దెబ్బతింటావు. ఇహనైనా యీ పాడుపన్లు మానెయ్యి. నీ హితవుగోరి చెబుతున్నాను" అని ఏకబిగిన లెక్చరిచ్చాడు.
తనగురించి నలుగురూ యిలా అనుకుంటున్నందుకు, అసూయపడి అలజడి లేవదీస్తున్నందుకు మృత్యుంజయరావుకు చాలా ఆనందం కలిగింది. 'ఇంతమంది నన్నుచూసి కుమిలిపోతున్నారు' అనుకుంటూ ఉప్పొంగిపోయాడు. 'ఎంత అలజడి సృష్టిస్తున్నావురా జయా' అని తనని తానభినందించుకున్నాడు.
సోమయాజులతో అవుననీ కాదనీ ఏమీ చెప్పక అమాయకుడిలాగా ముఖంపెట్టి వూరుకున్నాడు.
సోమయాజులు అంతటితో వూరుకోకుండా మాలతి వంటరిగా కూర్చుని వున్న సమయం కనిపెట్టి ఆమెదగ్గరకు వెళ్ళాడు. కాసేపు ఆ కబురూ యీ కబురూ చెప్పి మెల్లిగా అసలు విషయంలోకి వచ్చాడు. ఆ మృత్యుంజయరావు అడపాదడపా నీ దగ్గరకు వస్తున్నట్లున్నాడు. అతన్తో జాగ్రత్తగా వుండాలమ్మా."
ఆమెను అమ్మా అని సంబోధించటం అతనికి అంత యిష్టంలేదు. కాని పెద్దవాడు కాబట్టి అలా పిలవకపోతే బాగుండదని అతనికి తెలుసు.
మాలతి కనుబొమలు ముడివేసి ఏమిటన్నట్టు చూసింది.
"అతను చాలా గ్రంథసాంగుడు. బయటకు అట్లా ముచ్చులాగా కనిపిస్తాడు. అతనికి చాలామంది ఆడవాళ్ళతో సంబంధాలున్నాయి. ఒకసారి వర్షంలో ఎవరో అమ్మాయి రాత్రి సమయంలో యితను వుంటూన్న యింటివాళ్ళకోసం వచ్చిందట. వాళ్ళు ఊళ్ళోలేరు. అదే అదననుకుని ఆ పిల్లను మాయమాటలతో వంచించి, లోబర్చుకున్నాట్ట. ఇలాంటివి చాలా వుదంతాలు తెలుసు అతన్ని గురించి, నీ మేలుకోరి చెబుతున్నా."
"థాంక్స్ అండీ! జాగ్రత్తగా వుంటాను" అంది మాలతి ఆమెకంఠంలో గాంభీర్యమూ లేదు, ఎగతాళీ కనబడలేదు.
"అసలివన్నీ నాకనవసరమనుకో. అయినా నీ మేలు కోరినవాడ్ని, పెద్దవాడ్ని..." అంటూ లేచాడు.
ఒకరోజు తురంగరావు, మృత్యుంజయరావును వంటరిగా రోడ్డుమీద పట్టుకున్నాడు. "స్టేషన్ లో కొంచెం పనివుంది. అలా వెళ్లివద్దాం రావోయ్" అని లాక్కుపోయాడు.
"మంచి ఛాన్స్ కొట్టావులే" అన్నాడు దారిలో కన్నుగీటుతూ.
మృత్యుంజయరావుకు వెంటనే అర్ధమయింది. కాని అందరూ అనుకునేటంతటి అమాయకుడుగాక, వొట్టి అర్భకుడే అయివుండాలి. "ఏమిటి" అనడిగాడు ఏమీ తెలియనట్లు.
"అదేనోయ్, మాలతిని పట్టేశావుగా."
మృత్యుంజయరావు గుంభనగా నవ్వి వూరుకున్నాడు. ఇంతలో ఎదురుగుండా ఎవరో అమ్మాయిలు కనిపించారు. కాలేజీ విద్యార్థినుల్లా వున్నారు. తనలో ఏదో లోపం పసిగట్టి నవ్వుతారు. తురంగరావు చూడకుండా వుంటే బాగుండును.