Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 25

  

        సాహితి హతాశురాలైంది. తప్పుచేసింది వాళ్ళు! కానీ ఇప్పుడు దోషిగా తనే నిందించబడుతోంది. రాత్రి తాలూకు జ్వరం కన్నా ఈ మాటలతో మరింత నీరసించిపోయింది. ఎలాగో నోరు పెగలించి" ఊరుకోమ్మా, మావయ్య ఏమనుకున్నాడోనన్న బాధతో అనేశాను" అంది.   
   
    "మావయ్య ఏమీ అనుకోలేదు. మీ అంకుల్ కి మాత్రం కోపం వచ్చింది. తిరిగి వెళ్ళిపోయారు. ఎలా? నేనేం చేసేది?" ఆవిడకి దుఃఖం ఆగడం లేదు.
   
    "ఎందుకు రారు? వస్తారులేమ్మా" అంది సాహితి. అల్లుడి కోసం ఏడుస్తున్న కూతుర్ని తనే ఓదారుస్తున్నట్టు.
   
    ఒక్క ఉదుటున నిర్మల మంచం దిగి వచ్చింది.
   
    "నీకు దణ్ణం పెడతాను సాహితీ! వెళ్ళి ఆయనకు క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురా నువ్వు అడగందే ఆయన రారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టేవరకూ నేను పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకొను" అంటూ తల్లి తన రెండు చేతులూ జోడించి అడుగుతుంటే సాహితి బిత్తరపోయింది.
   
    కష్టం మీద తమాయించుకుని, నిస్సహాయతను అణుచుకుంటూ "అలాగే మమ్మీ! వెళ్ళి పిల్చుకొస్తాలే" అంది.
   
    సూర్యుడు ఇంకా బయటకు రాకముందే తన తల్లి సవతి ఇంటికి సాహితి బయల్దేరింది. జ్వరమంతా పూర్తిగా తగ్గలేదామెకు.
   
                               *    *    *
   
    సాహితి సంకోచంగా డోర్ బెల్ నొక్కింది. ఈ ఇల్లు తన స్వంత తండ్రిదేనని తెలుసుగానీ ఎప్పుడూ రావలసిన అవసరం రాలేదు. పరమహంస ఈ ఇంట్లోనే వుంటున్నట్లు ఇప్పుడే తెలిసిందామెకు. పనిమనిషి కాబోలు తలుపు తీసింది.
   
    "ఎవరు కావాలి?"
   
    "పరమహంసగారు"
   
    "అల కూర్చోండి" సోఫా చూపించి లోపలకు వెళ్ళిపోయింది.
   
    పరమహంస రాలేదు. రాజ్యలక్ష్మి వచ్చింది.
   
    చాలా అందంగా వుందావిడ. వయసు కూడా ముఫైలోపే అనిపించేటట్టుగా వుంది. పరమహంస చిత్రించిన దృశ్యానికి భిన్నంగా వుంది. "పరమహంసగారు లేరు బయటకు వెళ్ళారు. నువ్వెవరమ్మా? ఏం పనిమీద వచ్చావ్?"
   
    "నా పేరు సాహితి నిర్మల గారి కూతుర్ని, మమ్మీ అంకుల్ ని పిలుచుకు రమ్మంటే...."
   
    "ఓహో! ఆవిడగారు కూతురివా? నా భర్తని వల్లో వేసుకుని పైగా కూతుర్ని పంపుతుందా పిలుచుకురమ్మని, అదసలు ఆడదేనా?" ఆవిడ ఆవేశంతో ఏదో అంటూంది.
   
    సాహితికి ఒక్కక్షణం ఆవిడ మాట్లాడేది అర్ధంకాలేదు. అర్ధం అయిన మరుక్షణం వచ్చి కారులో కూలబడింది. కారు ఇల్లు చేరడం, తన గదిలోకి పరుగున రావటం ఆమెకు తెలియదు. ఎదురుగా టేబుల్ మీద డిసెక్షన్ బాక్స్ కనిపించింది. అందులోంచి పాయింటెడ్ నైఫ్ తీసుకుని అరచేతిలో పెట్టి గట్టిగా నొక్కింది. నొప్పి తెలియలేదుగానీ రక్తం ధారగా కారసాగింది.
   
    ధారగా కారే రక్తాన్ని చూసుకుంటూ ఆమె ఏడవసాగింది. దాన్ని 'ఫారానాయిడ్' అంటారో.....'స్కెజోఫేన్రియా' అంటారో మానసిక శాస్త్ర నిపుణులకే తెలియాలి.
   
    అది ప్రారంభం మాత్రమే......



                              --* * * *--

 Previous Page Next Page