ఒక తండ్రికిచ్చిన భయహస్తం ఒక నేస్తం అందించిన స్ఫూర్తి ఆ క్షణంలో స్పురించి జయేంద్ర సహనాన్ని హరించాయి.
మరొక్క అరక్షణం ఆగితే నాగుకోరలు లల్లీని తాకేవే.
మెరుపువేగంతో తనను పట్టుకున్న వాళ్ళని విసిరికొట్టి ఒక్క అంగలో కేజ్ లోకి చొచ్చుకుపోయాడు...
వెనక్కి తిరిగిన త్రాచుపడగ పిడికిలితో అందుకున్నాడు...... వేగంగా దూకబోయిన రక్తపింజర తలని పాదంకింద అణిచిపెట్టాడు. ఇదంతా జరిగింది కొన్ని లిప్తల వ్యవధిలోనే.
ఒక భయంకరమైన ముఠాకిచెందిన ఆ వ్యక్తులు అంతవరకూ రకరకాల ప్రత్యర్ధుల్ని ఢీకొన్నారు.
పోరాటంలో సైతం ప్రాణభీతితో తిరగబడిన వ్యక్తుల్ని చూసారు...
కాని పోరాటాన్ని ఇంత ప్రమాదంగా భావించిన మనిషిని చూడలేదు.
ఇక్కడ జరుగుతున్న సర్పనృత్యం వాళ్ళకి వినోదాన్ని అందిస్తూంది.
నాగు శరీరం ఉచ్చాస నిశ్వాసాలతో ఎగిరిపడుతూ అతడి చేతిని చుడుతుంటే రక్తపొడ తన లావుపాటి ఒంటిని అతడి పాదాలకు సంకెళ్ళుగా మారుస్తూంది.
పాప స్థాణువై చూస్తూంది ఏడుపాపి...
ఒకటి...రెండు...మూడు...
నిముషాలు గడుస్తున్నాయి.
సర్పాలలో చైతన్యం క్షీణించిపోతూంది.
నిన్న సరిగ్గా ఏ కేజ్ లో ఒక పసికందు ప్రాణాల్ని తీసాయో ఇప్పుడారెండు సర్పాలూ మరో అరనిముషంలో నలిగి నేల రాలిపోయాయి.
అప్పుడు తేరుకున్న బ్లాక్ మాంబా అనుచరులు అప్పటికి కర్తవ్యం గుర్తుకొచ్చినట్టు వేగంతో కేజ్ వేపు కదలబోతుంటే "ఆగండి" ఓ కంఠం హెచ్చరించింది.
అలా అన్నది జయేంద్రకాదు...అంతదాకా పోరాటాన్ని ఓ మూల కిటికీలోనుంచి కనువిందుగా చూసిన బ్లాక్ మాంబా.
"వాళ్ళని చంపకండి..."
అలా వారించింది ఇప్పుడొక మానవాతీతమైన శక్తిగల యోధుడిని చూసాను అన్న ఆలోచనతోకాదు...ఒక పసికందు ప్రాణాలపై ప్రేమ పుట్టుకొచ్చికాదు...
అక్కడ కేజ్ లో పాపని విసిరేసిన నిముషంలో ప్రదీప్ సక్సేనా బ్లాక్ మాంబాని చేరుకున్నాడు క్షేమంగా.
వస్తూనే చెప్పాడు ఆలస్యానికి కారణం...వెంటనే పాపని విడిచిపెట్టమని ఆదేశిద్దామనుకున్నాడు కూడా...కాని అప్పటికే జయేంద్ర లోపలికి అడుగుపెట్టాడు...పాములతో అతడు సాగించిన పోరాటం అతడికీ ఆసక్తిని కలిగించింది.
"ఇద్దర్నీ విడిచిపెట్టి రండి...తీసుకొచ్చేటప్పుడు అనుసరించిన పద్ధతిలోనే" కావాల్సిన ఇన్ స్ట్రక్షన్సు ఇచ్చి అతడు ప్రదీప్ సక్సేనా వున్న గదిలోకి నడిచాడు.
"అసలు నిన్నెందుకు అడ్డగించారట."
"అమనతో అవసరంపడే..."
"అంటే..."
రాజకీయాలలో రంగు నీకు తెలీనిదేముంది మాంబా...వాళ్ళకి నిజంగా ప్రజాసంక్షేమం కావాలంటే రాజకీయాల్లో అడుగుపెడితే మనలాంటి వాళ్ళ ఉనికి ఎప్పుడో సమసిపోయేది. అక్కడ ముఖ్యంగా రాజ్యంచేసేది వ్యక్తివాద సిద్ధాంతం మాత్రమే. ఇంతకాలం ఒకకులం పాలించింది తనవాళ్ళకి మంచిచేసింది మనకేదో అన్యాయం జరిగిపోతూంది అనుకున్న మరోకులం సమయంచూసి విజృంభించాలనుకుంటుంది. ఇప్పుడా నాగరాజు నన్ను ఆటంకపరిచింది, అర్థించిందీ ఏమిటో తెలుసా... ఇప్పుడనుకున్న కులం ప్రభుత్వం కూలిపోవాలి. నాగరాజు కులానికి మనం పట్టం కట్టాలి" ప్రదీప్ సక్సేనా అసాధారణమైన మేధస్సు బ్లాక్ మాంబాకి తెలినిదికాదు...అంతటి మేధావి కాబట్టి అతడు ముఖ్యసలహాదారుడైంది.
"నాగరాజు మనల్నిప్పుడేం చేయమంటాడు."
నవ్వేడు ప్రదీప్ సక్సేనా "మనం ఈ మధ్య సాగించిన టెర్రరిజాన్ని కొనసాగించమంటాడు. కనీసం ప్రభుత్వం పడిపోయేదాకా... ఈలోగా తన ఏర్పాట్లు తను చేసుకుని ముఖ్యమంత్రినవుతానంటాడు. ప్రభుత్వాన్ని కూలదీయగలిగితే కోటిరూపాయలిస్తాడట. తను అధికారంలోకివస్తే మనపై ఏ నేరారోపణలూ లేకుండా చేసి మన స్మగ్లింగ్ వ్యాపారం మామూలుగా కొనసాగడానికి తనే పూర్తి సహకారాన్ని అందిస్తానంటాడు."
ఇదీ దేశ రాజకీయాల పరిస్థితి.
పచ్చినెత్తురుతాగే బ్లాక్ మాంబా సైతం యీ ప్రపోజల్ కి ఆశ్చర్యపోయాడు. ఓ క్షణం ఆగి "మాటిచ్చావా" అన్నాడు.
"లేదు...ముందు మన కార్యక్రమాలున్నాయిగా...తర్వాత ఆలోచించి చెపుతానన్నాను. వెల్...ఆ ప్రొఫెసర్ ఏమంటాడు."
"ఇంకా దారిలోకి రాలేదు..."
"లెట్స్ వెయిట్...ముందు మనం డీల్ చేయాల్సిన మరో కన్ సైన్ మెంటు సంగతి చూద్దాం."
ప్రదీప్ సక్సేనా ఫోన్ దగ్గరికి నడిచాడు.
ఇప్పుడు ఓనర్సీస్ కాల్ లో ప్రదీప్ సక్సేనా ఫ్రాక్స్ కు చెందిన ఓ సంస్థలో మాట్లాడింది. కోటిరూపాయల ఖరీదుచేసే హెరాయిన్ గురించి. అతడ్ని విడుదలచేయించిందీ ముఖ్యంగా ఈ వ్యవహారాల కోసమే కూడా.
ఇన్నాళ్లూ అతడు పోలీస్ కస్టడీలో వుండటంతో ఇప్పటికే జాప్యమైపోయింది.
మరో రోజులో ఆ కన్ సైన్ మెంటు హైద్రాబాద్ చేరుకుంటుంది. అంతర్జాతీయస్థాయిలో అతడికున్న సంబంధాలెలాంటివో నిరూపించే సంఘటనది. ఆ ఇద్దరికీ తెలీదు ఆఫ్రికానుంచి రవాణా చేయబడుతున్న డెడ్లీ పాయిజనస్ స్నేక్ బ్లాక్ మాంబా కూడా అదే విమానంలో వస్తున్న విషయం...
* * * *
సాయంకాలం నాలుగుగంటల సమయం.
ద్వారం తెరిచిన శృతి జయేంద్రని చూసి ముందు నమ్మలేకపోయింది. ఉదయంనుంచే ఎంత ఆందోళనగా ఎదురుచూస్తుందని... ఆశాజనకంగా ఒక్కమాటా చెప్పలేకపోయారు పోలీసులు.
తోవకి అడ్డంగా నిలబడి తెల్లపోయి చూస్తున్న శృతినిచూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. "నా దారికి అడ్డంగా నిలబడ్డారు."
అప్పటికి తేరుకున్న శృతి బిడియంగా తనూ నవ్వేసింది.
"ఎందుకు నవ్వుతున్నారు"
"మీరు నవ్వగలరని తెలిసి" అతడికభిముఖంగా కూర్చుంది.
"థేంక్స్ గాడ్. అది గుర్తుకొచ్చిందనుకున్నాను."
"ఏమిటీ" విస్మయంగా అడిగింది.
"లుంగీ" నిజాయితీగా అతడు గుర్తుచేస్తుంటే ఈసారి ఫకాలున నవ్వేసింది.
"ఆపేయండి"
"ఏమిటో నేను లుంగీ కట్టుకోవడమా...లుంగీగురించి గుర్తు చేయడమా..."
ఇప్పుడు జయేంద్ర మాట్లాడే తీరుకి ఆమె ఎంతగా విస్మయం చెందుతుందీ అంటే ఇతను మొన్నటి జయేంద్రలాలేడు. ఇరవైనాలుగు గంటల ఓ కొత్త ప్రపంచంలో ట్రెయినై వచ్చినట్టున్నాడు. ఇంత స్వల్పవ్యవధిలో ఇలాంటి మార్పు ఆమె వూహకందనిది.
"ఫర్వాలేదు. జోక్సువేయడం మీకూ వచ్చు."
"ఇప్పటికి అర్ధమైంది..."
"ఏమని" ఓరకంట అతడ్ని గమనిస్తూ అడిగింది.
"సీరియస్ గా వుండటంకన్నా జోకుమిన్న అని"
"ఇరవై నాలుగుగంటల్లో తెలుసుకున్న సత్యం ఇదన్నమాట."
"అవును శృతీ..." ఇప్పుడు జయేంద్ర ముఖంలో ఇందాకటి చిలిపితనంలేదు. "మొన్నదాకా నేను చూసిన ప్రపంచంవేరు. అక్కడ కక్షలూ, పగలూ, కార్పణ్యాలూ తప్ప మరోటి నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను వచ్చిన ప్రపంచంలోనూ వున్నాయని. కాని అంతకుమించిన ఆర్ద్రత, అనుబంధం, ఒకరిపై మరొకరికి సానుభూతి ఇదీ నన్నెక్కువ ఆకట్టుకున్నది. ఇరవై నాలుగుగంటల్లోనూ నేను నిజంగానే కొత్త ప్రపంచంలో మానసికమైన ఆందోళనకు గురయ్యాను. కాని ఇందులో చిత్రంగా ఆనందాన్ని మాత్రమే పొందగలిగాను."
నిజానికి జరిగిన సంఘటన ఏ ఒక్కటీ అతడు వివరించలేదు. పాపని రక్షించడంలో పొందిన సంతృప్తిని గొంతులో ధ్వనింపచేశాడే తప్ప ఎలాంటి రిస్కు తీసుకున్నదీ కావాలనే చెప్పలేదు.
ఆమె నిశ్శబ్దంగా చూస్తూంది.
సరిగ్గా అప్పుడు లోపలికి వచ్చాడు ప్రసన్న లల్లీతోసహా...