Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 25


    నిజమే...తాను డీల్ చేస్తున్నది అసాధారణమైన ప్రజ్ఞా మేధస్సుగల నేరస్థుడ్ని.

    "సో మిస్టర్ డి.జి.పి. మీరు చేసిన పొరపాటుకి ముఖ్యమంత్రిపై పాము ప్రయోగంతో నా పగ చెల్లిపోయింది కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నట్టు ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టేయాలి. రేపు ఉదయం సరిగ్గా తొమ్మిదిగంటలకి...మరో హెచ్చరిక...ఈసారి వెంటాడితే పాపని క్షమించను.

    "సారీ మిస్టర్ బ్లాక్ మాంబా" టక్కున అన్నాడు డి.జి.పి. "ఇక పొరపాటు దొర్లనివ్వను."

    రాష్ట్రాన్ని మొత్తం చట్టపరంగా శాసించగల ఓ పోలీస్ జనరల్ ఇలా క్షమార్పణలు చెప్పుకోవడంతో ఎంత సంతృప్తిచెందాడూ అంటే బ్లాక్ మాంబా ఉద్వేగంగా నవ్వాడు. "నాకు తెలుసు. ఇంతసేపూ మానసికంగా నలిగిన మీరలాంటి పొరపాటు చేయరని...మరోసారి చెబుతున్నాను. సరిగ్గా తొమ్మిదిగంటలకి నువ్వు విడిచిపెడితే ప్రదీప్ సక్సేనా నన్ను చేరుకోవడానికి పట్టేది అరగంటమాత్రమే. నువ్వు చేయాల్సింది జైలుదాటి సక్సేనా బయటికిరాగానే ఓ మోటర్ బైక్ దాని తాళాలు అతడికిప్పించు. ఆ తర్వాత తక్కింది మేం చేసుకుపోతాం. అతడు నా దగ్గరికి చేరిన గంటకి అంటే ఇంచుమించు పదకొండు గంటల ప్రాంతంలో మీ మనుషులు నీ దగ్గరుంటారు...గుడ్ లక్..."

    అప్పటికి డి.జి.పి. మనసు తేలికపడింది.

    "నో టైల్స్" గట్టిగా ఆదేశాలు జారీచేసాడు డి.జి.పి. తన సిబ్బందికి. "ఎవరూ అనుసరించకూడదు. యస్."

    మరో అరగంటకి హాస్పిటల్ చేరుకున్న ప్రసన్న నిద్రపోతున్న సబితని చూశాడు.

    ఇంకెంతసేపని. రేపు మధ్యాహ్నానికల్లా లల్లీని సబిత దగ్గరికి చేర్చగలడు.

    మానసికంగా ఎంత అలసటకి గురయ్యాడూ అంటే వెంటనే హాస్పిటల్ నుంచి శృతికి ఫోన్ చేసాడు.

    "గుడ్ న్యూస్ శృతీ...బోత్ జయేంద్రా అండ్ మై చైల్డార్ సేఫ్."

    శృతి కళ్ళనుంచి రాలిపడుతున్న నీటిబొట్లకు వారధి పడిపోయింది.

    ప్రమాదం గురించి తెలిసినప్పట్నుంచీ ఒక పక్క లల్లీ మరో పక్క కోరి తను మృత్యుకూపంలోకి నెట్టానన్న భావంతో జయేంద్ర మరీ మరీ గుర్తుకొస్తుంటే ఎంత కలత చెందిందని.

    రుధిరం కక్కుతున్న శిధిల నిశీధిలోకి చూస్తూనే నెమ్మదిగా అనుకుంది... "ఇంత స్వల్ప కాలంలోనే నన్నింతగా ఆకట్టుకున్న జయేంద్రా...ఇదిగో ఇక్కడో పాలపుంత అర్ధ నిమిలిత నేత్రాలతో నీ అడుగుల చప్పుడు కోసం నిరీక్షిస్తూంది. పలకకుండానే పాలమీగడని పెదవులపై నుంచి నువ్వు వర్షిస్తానంటే నిన్ను ఓ ముత్యంలా నిత్యం దాచుకోవాలని ఆశగా ఎదురు చూస్తూంది."


                                                   *    *    *    *


    ఆకాశంనుంచి అణుబాంబు పడుతుందన్నంత భయంతో భాగ్యనగర ప్రజలు బెంబేలు బడిపోతున్నారు. ఆ భయాన్ని ద్విగుణీకృతం చేసింది. ఆ రోజు పేపర్లో చూసిన వార్త...అంతవరకూ తెలీని వాళ్ళకి తెలిసిపోయింది రాష్ట్రముఖ్యమంత్రిపై కూడా జరిగిన సర్పప్రయోగం.

    ఇక సామాన్యుల బ్రతుకు మరింత దుర్భరంకాబోతూందని తెలియచెప్పింది. ఆ ఒక్క సంఘటనేకాదు. ఇప్పుడు టెర్రరిస్టులకు భయపడి పోలీసులు ఓ నేరస్థుడ్ని విడిచి పెడుతున్నాడు ఆ ఉదయమే.

    ఇక్కడ సామాన్యుడు తొట్రుపడేది విడిచిపెట్టబడిన ఆ ఖైదీ తమనేదో చేస్తాడనికాదు ఇంతగా ఇటు ప్రజల్ని మాత్రమే కాకుండా అటు పోలీసు ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసిన ఆ టెర్రరిస్టు ఇక అక్కడితో ఆగడని.

    కడుపునిండేక వక్కపొడి వేసుకుని టీ.వి.లో క్రికెట్ చూస్తూ ప్రపంచ క్రికెట్ చరిత్ర గురించి తెలీని విషయాన్ని తెలిసినట్టు పెళ్ళాం పిల్లల దగ్గర చెప్పే మిడిల్ క్లాసు మొదలుకుని అటు సిల్వర్ స్పూన్ తోనే భోంచేసే ఉన్నవాళ్ళ దగ్గర్నుంచి ఇటు ఏ రోజు సంపాదనతో ఆ రోజు పొట్టపోసుకుని బ్రతికే క్రిందితరగతి జనందాకా ఇదే విషయం చర్చించుకుంటున్నారు.

    ఇది ప్రభుత్వం ఓటమిగానే భావించి ఇక త్వరలో మరిన్ని దారుణాలు చూడబోతున్నామని గుండెలుగ్గ పట్టుకుని ఆలోచిస్తున్న ఉదయం తొమ్మిదిగంటలవేళ...

    ప్రదీప్ సక్సేనా జైలుగోడలు దాటి బయటికి వచ్చాడు. గెడ్డం మాసివున్న సుమారు ఆరడుగుల ఎత్తున్న అతడు చూడగానే ఏ అమ్మాయికీ ఓ నేరస్థుడిలా కనిపించడు.

    గుండెల్లో చోటుచేసుకోవాలని గంధర్వలోకంనుంచి దిగివచ్చినట్టుంటాడు.

    ఇంతకాలమూ మతిభ్రమించినట్టు నటించిన ఆ వ్యక్తి స్వేచ్చా విహంగంలో బయటికి వచ్చాడు.

    ఇంతకాలమూ జరిగిందంతా తన ఆలోచనలనించి పుట్టుకొచ్చిందే అని తెలీని పోలీసుల్ని ఓమారు చూసాడు తన పథకం అంత అద్బుతంగా పనిచేసినందుకు...

    "బై" హూండా మోటర్ బైక్ కీస్ అందుకుని రెప్పపాటులో బండిని దుమికించాడు. ఇప్పుడు తనను పోలీసులు వెంటాడరన్న బలమైన నమ్మకంతో యూనివర్శిటీ రోడ్డుమీదుగా సుమారు డెబ్బై కిలోమీటర్ల వేగంతో పోనిస్తున్నాడు.

    జడిసిపోయిన జంటనగరవాసులు రోడ్లకి విడాకులిచ్చి ఇంట్లోనే కూచున్నట్టు ఉస్మానియా యూనివర్శిటీ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.

    అతడికి తెలుసు. ఇదే వేగంతో వెళితే తమ గమ్యాన్ని మరో పావుగంటలో చేరిపోగలడు...

    ఇక ముందు చేయాల్సినవన్నీ ఒక్కొక్కటీ గుర్తుకొస్తుంటే ఆలోచిస్తూ నడుపుతున్న హోండా కిచుమంటూ ఆగిపోయింది తార్నాక చౌరస్తాలో. ఇప్పుడతడికి అభిముఖంగా వున్న జీపులోని కొందరు వ్యక్తులు అక్కడేం జరుగుతున్నదీ ఆలోచించేలోగానే అతడ్నమాంతం చుట్టుముట్టి నోరునొక్కారు...

    అప్పుడు టైం ఉదయం తొమ్మిదిన్నర కావస్తూంది.


                       *    *    *    *


    పదిన్నర...పదకొండు...పదకొండున్నర...పన్నెండుగంటలు కావస్తున్నా బ్లాక్ మాంబానుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో డి.జి.పి.తో సహా అంతా ఆందోళనగా నిలబడి వున్నారు.

    డి.జి.పి. తదేకంగా ఫోన్ వేసే చూస్తున్నాడు...

    బ్లాక్ మాంబా 'చీట్' చేసాడంటే నమ్మకం కుదరడంలేదు...

    ప్రదీప్ సక్సేనాని వెంటాడకుండా స్వేచ్చగా విడిచిపెట్టిన తను ఎలాంటి నియమాన్ని ఉల్లంఘించలేదు. ఏమైంది...ఇప్పుడు తను తీసుకున్న రిస్క్ ఏమాత్రం ఫలితాన్నివ్వకపోయినా తన ముప్పయ్యేళ్ళ చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అదిగో అప్పుడు ఫోన్ రింగయ్యింది.

    ఒక్క అంగలో చేరుకున్న డి.జి.పి. వెంటనే అందుకున్నాడు.

    "మిస్టర్ డి.జి.పి..." బ్లాక్ మాంబా కంఠం ఖంగుమంది.

    "మళ్ళీ నియమాన్ని ఉల్లంఘించావు."

    "లేదు...అలాంటిదేమీ జరగలేదు..."

    "దెన్ వేరీజ్ సక్సేనా?"

    డి.జి.పి. విస్మయంగా అన్నాడు. "సరిగ్గా తొమ్మిదిగంటలకే నేను విడిచిపెట్టాను. ఐస్వేర్..." ఆయన గొంతు ఆందోళనగా వణుకుతూంది.

    "బుల్ షిట్..." బ్లాక్ మాంబా గొంతులో ఇలాంటి రాక్షసత్వం ఇంతదాకా ధ్వనించలేదు. "సో మిస్టర్ డి.జి.పి... రిసీవ్...మరో అరగంటలో మీవాళ్ళ ఇద్దరి శవాలూ పంపబోతున్నాను" ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.


                      *    *    *    *


    "కిల్ హెర్" బ్లాక్ మాంబా కంఠం పిడుగులా వినిపించింది. అంతే...ప్రయోగశాలలాంటి ఓ హాల్లో వున్న లల్లీ బలవంతంగా జయేంద్రనుంచి లాక్కున్న నలుగురువ్యక్తులు వేగంగా పక్కగదిలోకి నడిచారు.

    లల్లీ భయంతో ఏడుస్తూంది.

    విశాలమైన గ్లాస్ కేజ్ ద్వారాన్ని తెరిచి లల్లీని అమాంతం లోపలికి నెట్టారు.

    ముందుకురాబోయిన జయేంద్రని ఒడిసి పట్టుకున్నారు...

    ఆ చప్పుడికే ఉలికిపడ్డ విషనాగు ఉద్వేగంగా తలపైకెత్తి కసిగా పడగ విప్పింది.

    "అంకుల్..." లల్లీ గొంతునాళాలు పగిలిపోయాయి.

    త్రాచు మరో అడుగు ముందుకు ప్రాకింది.

    వెనుకవున్న రక్తపింజర నిశ్శబ్దంగా పాపపాదంవేపు ప్రయాణం చేస్తూంది.

    జయేంద్ర శ్వాస పాము బుసగా మారుతూంది.

    నక్షత్రగోళాలు పగులుతున్న భృకుటిలా అతడి నేత్రాలు ఆ మహిమను పుంజుకుంటున్నాయి. శిలను చీల్చే వైశ్యానరశక్తి ఝంఝూ ప్రభంజనంలా రక్తాన్ని సలసలమనిపిస్తూంది.

 Previous Page Next Page