థేంక్యూ జయేంద్రా" ఇందాక పాపతోబాటు సిటీఅవుట్ స్కర్ట్స్ లో విడిచిపెట్టబడిన జయేంద్ర పాపని పోలీసులకి అప్పజెప్పాడే తప్ప ప్రసన్నని కలుసుకోలేదు. "వయసులో నాకన్నా చిన్నాడివి. లల్లీని రక్షిస్తూ నువ్వుచేసిన సాహసానికి కృతజ్ఞతలు కాదు. నిజానికి తండ్రిగా..." లల్లీచెప్పిన విషయం ఒక్కొక్కటీ గుర్తుచేసుకుంటుంటే గొంతు రుద్ధమైపోతూంది ప్రసన్నకి.
లల్లీ ఓ మూల నిలబడి శృతికి అంతా కథలు కథలుగా చెబుతూంది...
"థేంక్యూ వన్స్ ఎగైన్" శృతి కాఫీ కోసం వారించబోయినా సుతిమెత్తగా తిరస్కరించి వెళ్ళిపోయాడు ప్రసన్న లల్లీతోసహా...
ఎవరితను...
జయేంద్ర గురించి మరింత వివరంగా తెలిసిన శృతి అతడ్నే చూస్తూంది. క్షణ క్షణం ఇంత లోతుగా మనసుపొరల్లోకి చొచ్చుకుపోతున్నాడేమిటో.
వెలుగుతీరం దొరకని చీకటినావ తనుచుట్టు తాను పరిభ్రమిస్తుంటే గతం నాయనాల్లోనుంచి జారిన ఓ బాష్పకణమా వేదాన్ని ఓ గీతికలా కూడా ఆలపిస్తూ ఆ స్రవంతిలో నిశ్శబ్దంగా కొట్టుకుపోగల కరిగిన కిరణమా...
నెమ్మదిగా అతడి భుజంపై చేయి వేసింది.
ఆ స్పర్శలో అపశృతి లేదు. నిశ్శబ్దంగా తెలియచెప్పే ఓశృతి తప్ప... "జయేంద్రా...పాములతో చెలిమి అన్నావు. అంత ఆవేశంగా ఎలా చంపగలిగావు" ఆత్మీయంగా అడిగింది ఏకవచనంలోనే.
"చెలిమి అన్నానేకాని కళ్ళముందే ఓ పసికందుని కాటేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటాననలేదే."
"అసలు ఎలా...వాటిని చంపగలశక్తి నీకెలా వచ్చింది" ఉద్విగ్నంగా అడిగింది.
కాలం జవాబు చెప్పాల్సిన ప్రశ్నది...అందుకే భావరహితంగా చూస్తూ వుండిపోయాడు జయేంద్ర.
"అసంపూర్తిగా మిగిలిన ప్రయోగాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది జయేంద్రా" ఓ కలలా చెప్పింది శృతి.
"ఫ్లయిట్ లో రేపు సాయంకాలమే వస్తూంది జయేంద్రా...అదే బ్లాక్ మాంబా"
* * * *
సుమారు నాలుగురోజుల తర్వాత తొలిరాత్రి...
జంటనగరాల్లో కొద్దిపాటి ప్రశాంతత...టెర్రరిస్టులతో జరిగిన ఒప్పందం మూలంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదని ఆ రోజు సాయంకాలం వార్తలలోవిన్న చాలామంది ఆనందంగా ఊపిరి పీల్చితే మరికొందరు ఇంకా అనుమానిస్తున్నారు. మరేదో తుఫానుకు ముందు స్థబ్ధతే ఇదని.
రాత్రి డిన్నర్ పూర్తిచేసిన జయేంద్ర శృతి ఇద్దరూ చెరో మేగజెన్ తీసుకుని రిలాక్స్ అవుతుండగా తూనీగలా లోపలికి దూసుకొచ్చాడు నానీ...
"ఆంటీ...మరేమో" ఠక్కున ఆగిపోయాడు జయేంద్ర కట్టుకున్న లుంగీని చూస్తూ.
శృతికాచూపులో భావం అర్ధంకాలేదు. కాని బోధపడిన జయేంద్ర అసంకల్పితంగా లుంగీని తడుముకున్నాడు.
"మరేమో...ఆంటీ డేవిడ్ అంకుల్లేడూ...విమానాలస్టాండులో పనిచేస్తుంటాడే ఈరోజు ఎక్కువ తాగేసేడన్నమాట... నన్ను పట్టుకుని ఏడ్చేస్తున్నాడు."
నానీని దగ్గరకు తీసుకుంది. విస్మయంగా చూస్తున్న జయేంద్రతో అంది. "విమానాలస్టాండంటే విమానాలు ఆగే ఎయిర్ పోర్టని నానీ ఉద్దేశం. డేవిడ్ అని ఓ కస్టమ్స్ ఆఫీసరున్నాడు. ఆయన గురించి చెబుతున్నాడు" నానీని ముద్దుపెట్టుకుని "ఏమని ఏడ్చాడూ" అంది ఆసక్తిగా.
"మరేమో పెద్దయితే నువ్వుతాగకూ చెడిపోతావన్నాడన్నమాట"
"అప్పుడు నువ్వేమన్నావు..."
"నువ్వెందుకు చెడిపోయావంకుల్ అన్నాను. అప్పుడు తాగుడులో అన్నాడన్నమాట" అప్పుడు అసలు సందేహాన్ని వ్యక్తం చేశాడు నానీ "ఆంటీ...తాగితే చెడిపోతారు...చెడిపోతే తాగుతారా"
జవాబు చెప్పలేకపోయింది శృతి.
"తాగాలనుకున్నప్పుడే చెడిపోయినట్టు నానీ" జయేంద్ర విడమర్చి చెప్పాడు... "ఆ తర్వాత తాగి ఇంకా చెడిపోతారన్నమాట..." నానీ తెల్లమొహం వేసుకుని చూస్తుంటే "అర్ధం కాలేదా" అన్నాడు జయేంద్ర.
తల అడ్డంగా వూపేడు.
"ఇప్పుడు ఆంటీ వుందనుకో..."
"ఇప్పుడే ఏంటి పెద్ద...ఎప్పుడూ వుంటుంది. అప్పుడప్పుడూ బయటికెళ్తుందిగానీ...కదాంటీ" ఈసారి సీరియస్ గా శృతి ఒడిలో సెటిలైపోయాడు. జయేంద్ర ఇబ్బందిగ మొగం పెట్టేసరికి నవ్వాపుకోలేనట్టు పెదవులకి అడ్డంగా వుంచుకుంది.
"అదికాదమ్మా...చూడూ" నానీని ఎలాగన్నా ఒప్పించి తీరాలన్నంత సంకల్పంతో "నువ్వెక్కువ అల్లరిచేస్తావటగా" అన్నాడు.
"ఒట్టంకుల్...నేనస్సలు అల్లరి చేయనన్నమాట"
"కదా...మరి నువ్వు అల్లరి నానీవని మీ ఆంటీ అందనుకో."
"అప్పుడు మరేమీ ఆంటీ అబద్ధం చెబుతుందన్నమాట..."
"అదికాదు అసలలా అబద్ధం చెప్పడం చెడుకదూ."
టక్కున దూకేడు నేలపైకి. "ఎందుకు చెడవుతుంది...మరి అప్పుడు అమ్మ చెప్పిందిగా" నానీ కళ్ళనుంచి జలజలానీళ్ళు రాలేయి. ఏ స్మృతిశకలమో మెదిలినట్టు వెనక్కి చూడకుండా బయటికి పరుగెత్తాడు...హఠాత్తుగా నానీలో ఇలాంటి మార్పేమిటో అర్ధంకాలేదు జయేంద్రకి.
"నానీదో చిత్రమైన కథ జయేంద్రా...అమ్మా తాతయ్యలు వాడికి చిన్నతనంనుంచీ నిజం మాట్లాడ్డమే నేర్పారు..." నిర్వేదంగా చెప్పుకుపోయింది.
ఒకనాడు నానీతల్లి పావని భర్త అత్తా ఆడబడుచులచేత సృష్టించబడిన ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు వదిలింది పావని. బ్రతికినంతకాలం కొడుక్కి నిజమే నేర్పిందికాని చనిపోతో మరణ వాంగ్మూలంలో అబద్ధం చెప్పింది. తను ప్రమాదవశాత్తూ గాయపడ్డాను తప్ప తనకెవరూ హాని తలపెట్టలేదు.
ఆ తర్వాత నిజం చెప్పబోయిన నానీపై సైతం హత్యాప్రయత్నాలు జరిగాయి.
ఎంత దురదృష్టవంతుడూ అంటే కోర్టులో నిజమెక్కడ చెబుతాడో అని కన్నతండ్రే చంపాలని చూసాడు. ఇంటినుంచి పారిపోయిన నానీ నిజం మాట్లాడిన ప్రతిచోటా సమస్యల్లో ఇరుక్కున్నాడు. అబద్దమంటే అంత అసహ్యమన్నమాట...
చివరికి అన్ని గండాల తర్వాత కోర్టుకి రప్పించబడ్డాడు. వచ్చేక తనూ అబద్ధం చెప్పాడు.
"ఎందుకని" టక్కున అడిగాడు.
"హానిచేసే నిజంకన్నా ప్రమాదంకాని అబద్ధమే నయమనుకున్నాడు కాబట్టి" బాధగా నిట్టూర్చింది. అందుకే అబద్ధం అంటే చెడూఅని నువ్వనేసరికి రియాక్టయ్యాడు గతం గుర్తుకొచ్చినట్టు."
ఒక గుండెలార్చే కథ విన్న ఆర్ద్రత జయేంద్ర గొంతులో. "మరి నానీ ఇప్పుడు తండ్రితో ఉండటంలేదా..."
"లేదు! ఆ సంఘటన తర్వాత నానీ తాతయ్య విశ్వేశ్వరశాస్త్రి తనకున్న ఆస్తిపాస్తుల్ని అమ్మి నానీచదువుకోసం సిటీకొచ్చేసి ఇక్కడో ప్లేట్ లో వుంటున్నాడు."
కారిడార్ లో ఓ గంభీరమైన గొంతు వినిపించింది. "నానీ" అంటూ.
జయేంద్ర శృతితోబాటు ద్వారం దగ్గరికి వచ్చాడు.
"రండి బాబాయ్ గారూ" పిలిచింది. వడలిన వృద్ధాప్యంతోకూడా వేదాభాస్యంతో కాంతులీనే విశ్వేశ్వరశాస్త్రిగారి కళ్ళనే తదేకంగా చూస్తూ.
"లేదమ్మా...నానీ వచ్చాడేమోనని"
"వచ్చాడు...వెళ్ళిపోయాడుకూడా"
"ముసలిముండావాడ్నమ్మా...గడుగ్గాయి ఒక్కక్షణం ఇంట్లో వుండడుకదా. ఊరంతా వీడి తాతసొత్తే" పక్షవాతం వచ్చినట్టు కొద్దిగా కాలుకుంటుతూనే నడవబోతూ ఓ క్షణం ఆగారు జయేంద్రని చూస్తూ "మీ బంధువా"
"స్నేహితుడు బాబాయ్"
అంతకన్నా లోతుగా వెళ్ళే సంస్కారి కాదాయన. "బాబూ...నానీ నీ గురించి కూడా నా దగ్గర అప్పుడే చెప్పాడు కాబట్టి వాడు నీకూ చనువే అన్నది అర్ధమైపోయింది. అసలు వాడి తత్వమే అంత...రెప్పపాటులో మనుషుల్తో కలిసిపోతాడు. వాడికీప్రపంచంలో అపరిచితులంటూ ఎవ్వరూ ఉండరు. కాని ఒక్క అభ్యర్ధన" ఓ క్షణం ఆగాడు. "వాడ్ని ఏదన్నా అడుగు. కాని నిజం గురించి వాడి బ్రతుకులో అబద్ధంగానే మిగిలిపోయిన అమ్మగురించి మాత్రం అడక్కు..."
వెళ్ళిపోతున్నారాయన నానీకోసం కేకలువేస్తూ...
జయేంద్ర ఇప్పుడు బాల్యంలోనే అంత ప్రపంచాన్ని చూసిన నానీ గురించి ఆలోచించడంలేదు. నానీలో తన బాల్యాన్ని చూసుకుంటున్నాడు.
* * * *