"పని చేయడానికి బుర్ర ఉండాలి కదా....!" అంది ఆమె.
"అంటే?" అన్నాను కాస్త కోపంగా.
"నువ్వు శ్రీరామచంద్రుడివి గదా! శ్రీరామ చంద్రుడికి బుర్ర ఎందుకు? తన కేర్పడిన పరిస్థితిని బట్టి రియాక్టయ్యే వాడికి బుర్ర అవసరం గానీ, పెద్దలు ఏర్పరచిన సంప్రదాయాల ననుసరిస్తూ పోయేవాడికి బుర్ర ఎందుకు?"
చాలా పెద్ద దెబ్బ తీసింది. కానీ కోమలి ఏమన్నా నాకు పెద్దగా కోపం రాదు. ఎందుకంటే ఆమె మాట ఎలా గన్నా -అనే పద్దతిలోనూ, అనేటప్పుడు చూసేచూపులోనూ నాపైన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది.
"ఇంతకీ ఈ రోజు మనమిక్కడ ఎందుకు కలుసుకున్నాం?" అడిగాను.
"నువ్వే చెప్పు" అంది కోమలి.
"నాకేం తెలుసు?" అన్నాను.
"అయితే నేను చెప్పనా?"
"ఊఁ."
"మనం ప్రేమికులం కదా-అందుకని మళ్ళీ కలుసుకున్నాం..."
"కోమలీ! మనమిద్దరం యిప్పుడు వివాహితులం. చిన్ననాటి చిలిపితనం యిప్పుడు పనికి రాదు."
"నీ సంగతి నాకు తెలియదు కానీ....నేనెప్పుడూ చిన్నపిల్లనే..." అంది కోమలి నా వైపు చిలిపిగా చూస్తూ.
"అయితే ఏమంటావ్?"
"నా పిలుపు నీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పాను, గుర్తువుందా...?"
నాకు కోపం రాలేదు. భయం వేసింది.
"ప్లీజ్ కోమలీ....అలా మాట్లాడకు."
"మనమెందుకు కలుసుకున్నామని అడిగావు... చెప్పాను..."
"మనం కలుసుకున్నది అందుకు కాదు..."
"మరెందుకు?"
"డాక్టర్ విలాస్ గురించి మాట్లాడటానికి..."
"ఓహ్! ఆ సంగతే మరిచిపోయాను" అంది ఆమె "నిజం చెబుతున్నాను రామం! నిన్ను చూస్తే నాకు వళ్ళు తెలియదు. అన్నీ మరిచిపోతాను"
ఆమె రామం అనడంలో ధ్వనించే చనువు, అభిమానం నాకు మా యింట్లో వాళ్ళను గుర్తుచేస్తాయి. నిస్సందేహంగా ఆమె నాకు ఆత్మీయురాలే?
"నేను డాక్టర్ విలాస్ కథ చదివాను..."
"ఎలాగుంది?"
"అతడంటే భయంగా వుంది. అతడి వల్ల నాకు రానున్న ప్రమాదమేమిటో తెలుసుకోవాలని వున్నది..." అన్నాను.
"అతడంటే నీకెందుకు భయమో చెప్పు" అంది ఆమె.
కోమలి చాలా తెలివిగా మాట్లాడుతుంది. ప్రమాదం గురించి ఆమెను అడగడమెందుకు? ఆమెకు తెలుసు_నాకు తెలుసునని!
"చెప్పు కోమలీ...ప్లీజ్!" అన్నాను.
"నువ్వనుకుంటున్నదే..." అన్నదామె.
"అంటే?"
"డాక్టర్ విలాస్ కన్ను నీ భార్యపై పడింది."
అనుకున్నదే అయినా ఉలిక్కిపడ్డాను.
"నీవు జాగ్రత్తగా ఉండాలి తప్పితే.....భయపడనవసరం లేదు...." అంది ఆమె.
"ఎందుకని?"
"శ్రీరామచంద్రుడి భార్యను రావణుడు కూడా ఏమీ చేయలేకపోయాడు." అంది కోమలి మళ్ళీ.
నేను తేలికగా నిట్టూర్చి "నిజమే చెప్పావు..." అన్నాను.
"కానీ, ఒక్కమాట!" అంది ఆమె.
చెవులు రిక్కించాను.
"శ్రీరామచంద్రుడికి బుర్ర ఉండదు. సంప్రదాయం ప్రకారం పోతాడు. ఒక చాకలివాడు అన్న మాటలకు విలువ నిచ్చి తన అర్దాంగిని అడవిపాలు చేశాడు. ఆ చాకలి వాడు అమాయకుడు, తాగుబోతు....సీతాదేవిని అరణ్యాల పాలు చేయాలనే ఉద్దేశ్యంతో వాడా మాటలు అనలేదు. అరణ్యాల పాలయిన సీతాదేవిని ఏమో చేయాలనీ అనుకోలేదు. అవునా?"
"అవును."
"ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే- డాక్టర్ విలాస్ ఆ చాకలివాడికి ఒక్క తాగుడు విషయంలో తప్ప మిగతా అన్నిట్లో వ్యతిరేకం...."
"అంటే?"
"డాక్టర్ విలాస్ సామాన్యుడు కాడు చాలా తెలివిగా పకడ్బందీగా- బాగా ముందుగా పథకం వేసుకునిఅప్పుడే కార్య రంగంలోకి దూకుతాడు. ఒకసారి కార్య రంగంలోకి దూకాడా__తను అనుకున్నవన్నీ సాధిస్తాడు...."
"వివరంగా చెప్పు నా కేమీ అర్ధం కావడం లేదు...."
"ఇందులో అర్ధం కాకపోవడానికి ఏముంది? నీకూ, నీ భార్యకూ మధ్య అడ్డు గోడలు సృష్టించి-నీ అంతట నీవే నీ భార్యను తనవేపు తరిమే పరిస్థితులు కల్పిస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. నీవు శ్రీరామచంద్రుడి వని తెలిసిన కారణంగా ముందుగా ఈ విషయమై హెచ్చరిస్తున్నాను. నే ఎవన్తి అమాయకుల్ని బుట్టలో వేయడం డాక్టర్ విలాస్ కు చాలా సులభం."
నాకు కంగారు, వణుకు కలిగాయి.
"డాక్టర్ విలాస్ యిదంతా ఎందుకు చేస్తాడు? పద్మిని తప్ప లోకంలో ఆడవాళ్ళు లేరా?" అన్నాను.
"అందు బాటులోకి ఆడది వచ్చినా అవకాశం ఉపయోగించుకోని నీవంటి వారున్నట్లే-దరిదాపుల్లో ఉన్న ప్రతి ఆడదాన్నీ అనుభవించాలనుకునే విలాస్ వంటి వారుండి ఈ సృష్టిని చక్కగా బ్యాలన్సు చేస్తున్నారు..." అంది కోమలి.