Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 27

    నేను ఆలోచిస్తున్నాను.
   
    "నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా?" అంది ఆమె మళ్ళీ.
   
    "అవును. ఆ విషయమే నాకు స్ఫురించలేదు..." అన్నాను.
   
    "నీ కాపురం నిలబెట్టాలని!"
   
    "నా కాపురం నీవు నిలబెట్టాలనుకుంటున్నావా?"
   
    ఎందుకో కోమలి చటుక్కున కళ్ళు తుడుచుకుంది.
   
    "రామం! నీకు నా మీద ఎటువంటి అభిప్రాయ మున్నదో తెలియదు. కాని చిన్నతనం నుంచీ నిన్ను ప్రేమిస్తున్నాను కాంక్షిస్తున్నాను ఆ ప్రేమ, కాంక్ష ఇప్పటికీ అలాగే ఉన్నాయి అయితే నేను బరితెగించిన దాన్ని కాను. ఎంతో బుద్దిగా కాపురం చేసుకుంటున్నాను. ఒక్క నీ విషయంలో తప్ప మిగతా ఏ మగవాడి విషయంలోనూ నా మనసు చలించదు. న ఆప్రేమను నీవు అపార్ధం చేసుకొనకపోవడం నా దురదృష్టం. నా పిలుపును నీవు అపార్ధం చేసుకోకు. అదొక్కటే నిన్ను కోరేది." అని ఒక్కక్షణం ఆగి-"నాకు నీ మనస్తత్వం తెలుసు. నీ భార్య నీ అంత పవిత్రురాలిగానూ ఉండాలని కోరుకుంటావు. మనసు కంటే శరీరానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. చిన్న పొరపాటును కూడా మన్నించలేవు డాక్టర్ విలాస్ వంటి వాడు నీ ఇంట అడుగు పెడితే అది నీ మనసు నెంతగా దెబ్బ తీస్తుందో ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో గ్రహించి ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. అనవసరంగా నీభార్య పవిత్రతను శంకించకు....." అన్నదామె.
   
    నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను. కొన్ని సాంప్రదాయాలనూ, నైతిక వర్తననూ నమ్ముకున్నప్పటికీ - కోమలి ముందు నేనే అల్పుడినన్న భావం ఆమె ఎదుట ఉన్నప్పుడల్లా నాకు కలుగుతూనే వుంటుంది.
   
    ఆమె ప్రేమను నిజంగానే నేను అర్ధం చేసుకోలేకపోయానేమో!
   
    కోమలిని వివాహం చేసుకోవలసిందేమో!
   
    ఆమె నన్ను ప్రేమించింది. నన్ను కోరింది బహుశా అవకాశమిస్తే నాకు స్వర్గం చూపించి వుండేది.
   
    పద్మినిలో అసంతృప్తి లేదు నాకు-ఇటీవల మాధవరావు దగ్గర ఆ బొమ్మ చూసేవరకూ! అంత రహస్యాన్ని కడుపులో దాచుకుని అంత అమాయకంగా కనపడగలిగిన మనిషి చాలా ప్రమాదకరమైనదనీ, నమ్మదగినది కాదనీ నాకు అనిపించసాగింది.
   
    మరి కోమలి!
   
   వివాహమైనప్పటికీ నన్నింకా ప్రేమిస్తూ నేనుసుఖంగా ఉండాలని కోరుకుంటూ అందుకు అమిత శ్రద్ద తీసుకుంటూన్నది.
   
    "కోమలీ! నన్ను మన్నించునాకూ నువ్వంటే గౌరవభావం వున్నది అయితే ఒక్క విషయం నా భార్య నలుగురిలోకి వచ్చే టైపుకాదు. ముభావంగా వుంటుంది. ఆమె జోలికి డాక్టర్ విలాస్ వచ్చే అవకాశం లేదని నా అనుమానం"
   
    "అలాంటి పొరపాటు అభిప్రాయంలో నీవు వుండకూడదు. డాక్టర్ విలాస్ నీ ఇంటిని పూర్తిగా స్టడీ చేశాడు. తన పధకాన్ని కొద్ది రోజుల్లోనే అమలు జరపనున్నాడు" అంది కోమలి.
   
    "ఎలా?" అన్నాను ఆత్రుతగా.
   
    "నీవేప్పుడైనా అతని భార్యను చూశావా?"
   
    "లేదు"
   
    "ఎందుకో తెలుసా?"
   
    "ఎలా తెలుస్తుంది?" అన్నాను.
   
    "డాక్టర్ విలాస్ కథ చదివావు గదా - ఆలోచించి చూడు..."
   
    ఆలోచించాను నాకేమీ స్ఫురించలేదు. అదే ఆమెకు చెప్పాను.
   
    "క్రమంగా అంతా నీకే తెలుస్తుంది. కానీ నీ భార్యకున్న ప్రమాదమెలాంటిదో తెలుసుకోవాలంటే రేపు మధ్యాహ్నం మూడింటికి ఒక్కడివీ ఒంటరిగా ఇంట్లో ఉండు. ఎధొఇ వంకపెట్టి నే ఎభార్యను బయటకు పంపించివేయాలి"
   
    "ఎందుకు?"
   
    "నేను చెప్పినట్లు చెయ్యి మధ్యాహ్నం మూడింటికి ఒక్కదివీ నీ డ్రాయింగ్ రూంలో కూర్చో అప్పుడేం జరుగుతుందో చూడు"
   
    "ఏం జరుగుతుంది?"
   
    "కొన్ని కొన్ని విశేషాలు అనుభవంలో తెలుసుకో తగ్గవే..." అని ఊరుకున్నది కోమలి.
   
    నేనూ ఆమెను నొక్కించలేదు.
   
                                                                     O    O    O    O
   
    ఆ ఊళ్ళో పద్మినికి దూరపు బంధువులున్నారు. వారు అప్పుడప్పుడు మా ఇంటికివచ్చి వెడుతూంటారు ఆయన పద్మినికి బాబాయి అవుతాడు పిన్నిగారంత్రే పద్మినికి చాలా ఇష్టం. వాళ్ళు నన్ను అల్లుడూ అని నోరారా పిలవడమే కాకుండా అత్తవారికంటే ఎక్కువ మర్యాదనిస్తారు.
   
    నాలుగురోజులక్రితం ఆ మామయ్యగారు నన్ను డిపార్టుమెంటులో కలిసి "ఏంటల్లుడూ బొత్తిగా మా ఇంటి వైపు రావడం లేదీమధ్య" అన్నాడు. నేనో వెర్రినవ్వు నవ్వి తప్పకుండా వస్తానన్నాను.
   
    నా అత్తయ్యగారికి ఆరోగ్యం అంతగా బాగుండడం లేదుట. ఈ మాత్రం సమాచారమిచ్చి ఆయన వెళ్ళి పోయాడు. అది శ్రీమతికి చెప్పాలనుకునే మరిచిపోతున్నాను.

 Previous Page Next Page