Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 25

    అతడి భార్యగురించి తలచుకున్నప్పుడల్లా నాకు అతడి పైన కోపం పెరుగుతుంది.
   
     మళ్ళీ నేను విలాస్ కారులోనే డిపార్టుమెంటుకి వెళ్ళాను.
   
    "నిన్న మీకోసం డిపార్టుమెంటుకి వచ్చాను. మీరు లేరన్నారు."
   
    "సారీ...అర్జంటు పనితగిలి వెళ్ళిపోయాను. మీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను" అన్నాను.
       
    విలాస్ నవ్వి, "దీనికి సారీ చెప్పడం ఎందుకు?" అని "ఆడదాని వంటికి శారీ మగాడినోటికి శారీ ఈ రెండూ నచ్చవు నాకు" అన్నాడు.
   
    "అంటే?" అన్నాను.
   
    "స్త్రీ సౌందర్యమంతా శరీరంలోనే ఉన్నది. ఆ శరీరాన్ని కప్పేసే శారీ నాకు నచ్చదు. అలాగే మగాడు ఏం చేసినా అధి సబబే అనిపించుకుంటుంది. అతడు దేనికీ సారీ చెప్పకూడదు."
   
    జోక్ బాగుంది. కానీ నేను ఎంజాయ్ చేయలేదు.
   
    ఆడదంటే భార్య మాత్రమేకాదు. వారితోనే మన తల్లులున్నారు, సోదరీమణులున్నారు.
   
    ఆడదాని శరీరం గురించి జనరల్ స్టేట్ మెంట్ ఇచ్చేముందు ఈ విషయం మగాళ్ళకు ఎందుకు గుర్తుండదో మరి!
   
    విలాస్ నావంక అదోలాచూసి "నా జోక్ మీకు నచ్చినట్లులేదు. అవును మీరు సౌతిండియాదాటి ఎక్కడికి వెళ్ళినట్లు లేదు" అన్నాడు.
   
    "అయితే?" అన్నాను.
   
    "నార్తిండియాలో ఇలా కాదు. అక్కడ మనసులో కలిగిన ప్రతిభావాన్నీ ఏ సంకోచమూ లేకుండా పైకి అనేస్తారు. అదో సరదా నోటి దురద అంటారు చూడండి. అది తీర్చుకొనడం బాగుంటుంది. సౌతిండియాలో అలాకాదు చంపేస్తాను అనడమే హత్యచేయడంగా భావిస్తారు."
   
    నేను మాట్లాడలేదు.
   
    "మనమింకా చాలా ముఖ్య విశేషాలు చర్చించవలసి వుంది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి. ఓ
సాయంత్రం ఏ పార్కులోనో కూర్చుందాం. జీవితంలో మీకు తెలియని అద్భుత విశేషాలున్నాయి" అన్నాడు డాక్టర్ విలాస్.

    "అలాగే" అన్నాను.
   
    అతను కాస్త నిరుత్సాహపడ్డాడు. బహుశా నేను వెంటనే ఏదో టైము చెబుతాననుకుని ఉంటాడు. రాత్రి అతడి కథ చదివి ఉండకపోతే నేను తప్పక అతడ్ని కలుసుకునేందుకు ఆసక్తి చూపించి ఉండేవాడినే! ఎందుకంటే నాకు అతడిమీద సదభిప్రాయం, గౌరవభావం రెండూ ఉన్నవి. అతడికథ చదవగానే ఆ రెండూపోయాయి.
   
    డిపార్టుమెంటు వచ్చింది.
   
    "ఈరోజు కూడా సాయంత్రం నేనురావడంలేదు" అన్నాను.
   
    "ఏమిటి కథ...." అన్నాడతను కుతూహలంగా.
   
    "కధేమీ లేదు" అన్నాను.
   
    "ఫరవాలేదు మీ ఆవిడకు చెప్పన్లెండి," అన్నాడతను కన్నుగీటుతూ.
   
    నాకు కోపం వచ్చింది. "మా ఆవిడకు చెప్పకూడని విశేషాలు నా దగ్గరుండవు" అని ఉలిక్కిపడ్డాను.
   
    ఈ రోజు కోమలిని కలుసుకుంటున్నట్లు పద్మినికి చెప్పగలవా? ఆ మాటకొస్తే నిన్న ఆమెను కలుసుకున్న విషయమామెకు చెప్పానా?
   
    "ఇట్సాల్ రైట్," అని వెళ్ళిపోయాడు విలాస్.
   
    నేను సాయంత్రం కోమలిని కలుసుకున్నాను.
   
    కోమలి ఈ రోజు చాలా ఆకర్షణీయంగా తయారయింది. ఆమెను చూడగానే నా మనసు చలించిందనే చెప్పాలి. అలా ఆమెను చూస్తూ ఉండిపోయాను.
   
    "ఏమిటలా చూస్తున్నావ్? అంది కోమలి.
   
    "చాలా బాగున్నావ్!" అన్నాను.
   
    ఆమె కిసుక్కున నవ్వింది.
   
    చాలా కాలం తర్వాత్ విన్నాను ఆ నవ్వు. నిన్న ఆమె అలా నవ్వలేదు. అందుకు కారణం బహుశా మొహమాటపడి వుంటుంది. లేదా నేను అందం గురించి నిన్న వ్యాఖ్యానించకపోవడమూ అయుంటుంది.
   
    "నవ్వుతావేం!" అడిగాను.
   
    ఆమె పైట సవరించుకుని "నేను నిన్న కూడా బాగానే ఉన్నాను. కానీ నువ్వు నా వంక ఇలా చూడలేదు__" అంది.
   
    "అయితే?"
   
    "నేనెప్పుడూ ఒకలాగే ఉంటాను. కానీ ఈ రోజు కాస్త సెక్సీగా తయారయ్యాను. నువ్వుమగాడివైపోయావు" అంది కోమలి.
   
    అబ్బ! కోమలి ఏమీ మారలేదు....! తనకిప్పుడు వివాహమైంది ఇద్దరు పిల్లలు. నేను ఆమెకు పరాయి మగాడ్ని. నాతో మాట్లాడవలసిన తీరు ఇదేనా? అదే ఆమెకు చెప్పాను.
   
    ఆమె మళ్ళీ కిసుక్కున నవ్వింది. నేను కోపగించుకునే లోగానే "అది సరే! నా గురించి బాగానే చెప్పావు. మరి ణీ సంగతి ఏమిటి? నిన్న మనం కలుసుకున్నాం. ఈరోజు మళ్ళీ కలుసుకున్నాం. నన్ను చూసి ఆనందించడమే కానీ న అభార్థ గురించి కానీ నా పిల్లల గురించి కానీ వివరాలేమయినా అడిగావా?" అన్నదామె.
   
    ఏమనాలో తెలియలేదు. ఆమె మాటల్లో నిజమున్నది. తలా వంచుకుని "అయాం సారీ కోమలీ! నిజం ఒప్పుకుంటున్నాను. నీ ముందు నా బుర్ర పని చేయదు" అన్నాను.

 Previous Page Next Page