"మీరు ప్రియాంక కదూ! మీ గురించి ఆషా అన్నీ చెప్పింది నాకు!", ఆమె ముఖకవళికలను పరీక్షగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు నవీన్. చిరునవ్వుతూ అన్నాడు.
"నాగురించి అన్నీ చెప్పిందా....?" తెల్లబోతూ అన్నది ప్రియాంక. ఆమెలో గాభరా!
"అబ్బే! అన్నీ అంటే_మీరు ముక్కోపి అని, ఎప్పుడూ సీరియస్ గా వుంటారని...." ఆమె ఖంగారును గమనిస్తూ మెల్లిగా నవ్వుతూ అన్నాడు.
"అంతేగద!" తనలో తాను గొణుక్కున్నట్టు తేలిగ్గా అనేసింది ప్రియాంక.
లోనికి వచ్చి కూర్చున్నాడు నవీన్. విద్యార్ధినులంతా అతనికి దారికల్పించారు.
"నేను ప్రియాంకతో మాట్టాడాలి....మిగిలినవారు....ఎక్స్ క్యూజ్ మి...."
ఆడపిల్ల లందరూ గది దాటి వెళ్ళిపోయారు. ప్రియాంక, నవీన్ మిగిలారు.
"మీ కీ విషయం తెలియదా?" నిశబ్దాన్ని చీలుస్తూ అడిగింది ప్రియాంక.
"ఏ విషయం?"
క్షణం తటపటాయించింది ప్రియాంక. "ఆషా ఈమధ్య మీకేమైనా ఉత్తరాలు రాసిందా?" అనుమానంగా అడిగింది. ఆమె అతనినే మార్చి మార్చి చూస్తున్నది.
"నేను గత నెలరోజులుగా కేంప్ లో వున్నాను. క్యాంపు నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాను. బహుశః ఉత్తరాలు మా స్వగ్రామానికి రాసిందేమో!" ఏ మాత్రం తత్తరపాటు లేకుండా చెప్పాడు నవీన్.
"పోనీ....తను చేస్తున్న రిసెర్చ్ గురించి అయినా ఎప్పుడైనా చెప్పిందా!"
"చెప్పలేదు!"ఠక్కున చెప్పాడు నవీన్.
ఈ సమాధానంతో ప్రియాంకలో అనుమానం పెరిగిపోయింది.
ఆషా గురించి ఇతనికేమీ తెలియదని నిర్ధారణకు వచ్చింది.
తెలియని వ్యక్తి గురించి తెలిసినట్టు మాట్టాడుతున్నాడంటే ఇతనొక మోసగాడై వుండవచ్చు. లేదా సి.ఐ.డి. అయినా అయివుండవచ్చు. 'ఎవరైనా గాని, కట్టు కథ అల్లుతున్నాడు' అని నిర్ణయించేసుకుంది ప్రియాంక.
ఆమె ముఖ కవళికలలోని క్రీగంట గమనిస్తున్నాడు నవీన్.
"మీరు నిజంగానే ఆషా భర్తే అయితే, ఆమె చేస్తున్న రిసెర్చ్ విషయం గురించి అయినా మీకు తెలియకుండా ఉంటుందా? తెలియనట్టు నాటకమాడుతూ నన్ను డబుల్ క్రాస్ చేయడానికి చూస్తున్నారు. అవునా?" సూటిగా అడిగింది ప్రియాంక. ఆమె ముగ్గోళ్ళు అదురుతున్నాయి....
నవీన్ భృకుటి ముడిపడింది. 'ప్రియాంక చాలా తెలివిగల పిల్ల! ఆవులిస్తే ప్రేవులు లెక్కించేట్టున్నది. తను డబుల్ క్రాస్ చేయడం అటుంచి, తనే ఫూల్ అయ్యేట్టు వున్నాడు! అనుకున్నాడు. 'ఈ పిల్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి!' అని కూడా అనుకున్నాడు.
"భలేవారే! నేను నాటక మాడుతున్నాననుకుంటున్నారా! ఆషా మీరూ రూమ్ మేట్స్! ఆషా పట్టుదల గురించి ఆ మాత్రం తెలియదా మీకు? అనుకున్నది సాధించేంతవరకు అన్నీ రహస్యంగా వుంచుతుంది ఆషా. అన్ని విషయాలూ భర్తకు చెప్పాలని ఎక్కడాలేదు కదా! అలాగే, నాకు అవసరం లేని విషయాలు గురించి నేనెప్పుడూ ఆమెను అడుగను!" సమయస్పూర్తిగా చెప్పుకుపోయాడు నవీన్. అదీ నదురు బెదురూ లేకుండా!
"అయితే, తన రిసెర్చ్ విషయం మీ దగ్గర కూడా గుంభనగా వుంచిందన్నమాట ఆషా?" అని తనే అడిగాడు మళ్ళీ నవీన్.
"అబబ్బే! మా మధ్య సీక్రెట్స్ అంటూ ఏవీ వుండవండి! అన్ని విషయాలూ నాతో చెబుతుంది!"
"అయితే చెప్పండి_నేనూ తెలుసుకున్నట్టు అవుతుంది." చిరుమందహాసంతో ఆసక్తిగా అన్నాడు నవీన్. 'ఈమెను బోల్తాకొట్టించగలిగాను' అనుకున్నాడు.
"ఆషా క్రిమినాలజీలో రిసెర్చ్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రరూపం దాల్చిన 'టెర్రరిజం' అంశాన్నే తను సబ్జెక్ట్ గా తీసుకుంది. మేమంతా ఆ టాపిక్ వద్దన్నా వినలేదు. చివరకు గైడ్ కూడా రిస్క్ తీసుకోవద్దని వారించినా వినలేదు. దాన్నొక చాలెంజ్ గా తీసుకుంది ఆషా.
"మా యూనివర్సిటీలో తీవ్రవాదులతో రహస్య సంబంధాలు పెట్టుకున్న కొందరు విద్యార్ధుల జాబితాను కూడా కష్టపడి తయారుచేసింది ఆషా. అజ్ఞాతంలో వున్న వాళ్ళ నాయకుని కలిసి మాట్టాడతానని ఒక రోజున చాలెంజ్ చేసింది. అప్పుడు ఏదోఆవేశంతో అన్నదనుకున్నామే కాని...." చెప్పడం ఆపి, నవీన్ వాలకాన్ని కనిపెట్టడంలో నిమగ్నమయింది ప్రియాంక. ఆమె అనుమానం ఆమెది!
"నో ఎమోషన్స్! నేను అన్నింటికీ అతీతంగానే వున్నాను, చెప్పండి ప్రియాంకా!"
"సరిగ్గా వారం రోజుల కిందట ఆషా అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా హాస్టల్ వదిలి వెళ్ళిపోయింది! బహుశః అజ్ఞాత నాయకుని వెదుక్కుంటూ అడవికి వెళ్ళిందేమో...." తన రూమ్ మేట్ కోరికష్టాల పాలయిందనే జాలితో అసలు విషయం కాస్తా చెప్పేసింది ప్రియాంక.
"థాంక్స్ ప్రియాంకా! చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడిక ఆషాను కాపాడుకోవాలి! మీ యూనివర్శిటీలో తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న విద్యార్ధుల పేర్లు కాస్త చెబితే, నా ప్రయత్నాలను నేను ప్రారంభిస్తాను!" అప్పుడే ముగ్గులోకి దిగుతున్న ధోరణిలో నిదానంగా అడిగాడు నవీన్.