Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 24

    "అంత ధైర్యంవంతురాలివి నువ్వే అలా అంటే ఎలా? బీబ్రేవ్" ఆమె భుజం తడుతూ అన్నాడు డాక్టర్ రామకృష్ణ.

    కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తోంది పద్మజ. ఈ విషయం గురించి తను బాధపడుతోంటే బిజినెస్ గురించి బెంగపడుతున్నాడు గిరి. చాలా అప్ సెట్ అవుతున్నాడు. తన దగ్గరున్న డబ్బు ఇస్తానంటే తీసుకోడానికి ఇష్టపడటంలేదు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగే మనిషి అంత ఉదాసీనంగా వుంటే చూడలేకపోతోంది. ప్రకాశరావుగారితో చెప్పించినా ప్రయోజనం లేకపోయింది.

    ఆఫీసులో పని ఎక్కువగా వుంది. పంజాబ్ సరిహద్దులో పోలీస్ ఆఫీసర్ల హత్య పెద్ద దుమారాన్నే లేపింది, కారణం - హత్యకు ఉపయోగించిన ఆయుధాలు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళితే ఆఫీసరు రెండు మూడురోజుల్లో  వస్తాడని తెలిసింది. రాత్రి ఆ విషయం గురించి శేఖరం ఆత్మ ప్రస్తావించింది - మళ్ళీ వస్తే డిస్కస్ చెయ్యాలి.

    మళ్ళీ మళ్ళీ శేఖరం ఆత్మ రావాలని అతనితో సంభాషించాలని కోరుకొంటోందేం మనసు ? శేఖరం బ్రతికి వుండగా అంతర్లీనంగా వున్న ప్రేమ ఇప్పుడు బయటపడుతోందా? తనను తానే ఒక అర్ధంకాని సమస్యగా మారుతోందా? 

    ఏ రోజైనా, ఏ మాసమైనా అతడు వెళ్ళిన తరువాతే తను వస్తుందని తెలియని సంధ్య, సూర్యుడికి ప్రేమలేఖలు వ్రాసి వ్రాసి ఎదురు చూసి చూసి గడ్డిపరకలమీద కన్నీటి బొట్లు వదిలి వెళ్ళిపోతుందట.


                                 8


    పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సిటీ. రైల్వేస్టేషన్ ఎదురుగా వుంది పోస్టాఫీస్. సూటులో వున్న ఒక సర్దార్జీ అరగంట నుంచి పోస్టాఫీసులో కూర్చున్నాడు, తను బుక్ చేసిన ఢిల్లీ కాల్ కోసం. అతను చాలా టెన్షన్ లో వున్నాడు. ఆలోచనలు పరి పరి విధాలు పోతున్నాయి. చెక్ పోస్టు నుంచి సేకరించిన సమాచారంలో అతని పరిశోధనకు ఒక 'క్లూ' దొరికింది. తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్సులో చెక్ చేస్తే తెలిసిన విషయం అతని దిగ్ర్భాంతిలో  ముంచింది. పంజాబులో ఆయుధాలు ఓపెన్ గా సరఫరా చేయబడుతున్నాయి, మిలటరీ ట్రక్కుల్లో కావాల్సిన ఆర్డరు పేపర్లన్నీ సవ్యంగా  వుంటున్నాయి - ఎవరికీ అనుమానం రాకుండా అవన్నీ సంతకం చేస్తున్నది డిఫెన్సు సెక్రటేరియేల్ తో ఒక లేడీ సెక్రటరీ. ప్రస్తుతం  ఆ అధికారంలో వున్నది ఒక స్త్రీ మాత్రమే!

    ఆమె పద్మజ !

    తనే ఈ పనులన్నీ  చేయిస్తోందా ?

    "సర్ ! ఢిల్లీ లైను  పనిచేయడం లేదు. వెయిట్ చేస్తారా ?" అడిగాడు అటెండెంటు.

    కాన్సిల్ చేసి ఒక చిన్న టెలిగ్రాం ఇచ్చేసి బయటకొచ్చేడతను. వెంటనే వెళితే రైలుంది, అందుకోవచ్చు. గబగబా పోస్టాఫీసు మెట్లు దిగాడు. చేతిలో బ్రీఫ్ కేసుతో  రైల్వేస్టేషన్ ముందు ఆగివున్న  మోటారు సైకిల్ స్టార్ట్ చేశాడో వ్యక్తి. వెనక మరొకతను ఎక్కి కూర్చున్నాడు. రోడ్డుక్రాస్ చేయబోతున్న సర్దార్జీ రెడ్ లైటు వెలగటంతో  ఆగాడు. మోటారు సైకిల్ వచ్చి అతని
 పక్కగా ఆగింది. సిగ్నలింకా  రాలేదు. పిలియన్ సీటులో కూర్చున్న వ్యక్తి సైలెన్సర్ బిగించబడ్డ అత్యంత ఆధునికమైన గన్ తీశాడు సంచిలోంచి.

    సడెన్ గా తన ముఖంమీద తాకుతున్నట్లుగా ప్రత్యక్షమైన గన్ ను చూసి ఏదో అనబోయాడు సర్దార్జీ. ఒక బుల్లెట్ అతని నోటినుండీ, మరొకటి అతని నుదుటి నుంచీ దూసుకుపోయింది.

    హత్య జరిగింది అని పక్కవాళ్ళు గమనించే లోపునే మోటారు సైకిలు ట్రాఫిక్ లో కల్సిపోయింది.


                         *    *    *


    మనిషి ప్రవృత్తి చాలా చిత్రమైంది. ఒక మనిషి ఎప్పుడు ఏ రకంగా  ప్రవర్తిస్తాడో ఒక్కోసారి బాగా పరిచయం వున్న  వాళ్ళకయినా చెప్పటం చాలా కష్టం. ఒక్కొక్కరి గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటాం. కాని వాళ్ళు మనం అనుకున్న విధంగా ప్రవర్తించక మరోవిధంగా ప్రవర్తిస్తూంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది.

    పార్కులో  కూర్చుని  ఇదే విషయాన్ని  ఆలోచిస్తోంది హిమజ. తనకి బాగా ఊహ వచ్చేటప్పటికి అక్క హైస్కూల్లో చదువుతోంది. చదువులో, ఆటల్లో  ఎప్పుడూ  ఫస్టు అని అందరూ  ఆమెను  మెచ్చుకుంటుంటే  పెద్దయితే నేనూ అక్కలాగే మంచి - పేరు తెచ్చుకోవాలని అనుకుంటుండేది.

    ఎంత అర్తడెక్స్ గా పెరిగినా అక్కయ్యలో  ధైర్యం కూడా ఎక్కువే. బహుశా అది నాన్నగారితో  ఎక్కువగా తిరుగుతున్నందువల్ల వచ్చింది కాబోలు. చిన్నప్పటి నుండీ అక్కంటే తనకెంత ప్రేమో, అంత భయం. ఎంత అభిమానమో అంత సాన్నిహిత్యం కూడా. అమ్మ పోయిం తర్వాత  అక్క ఇంటికి అధికారిణి అయింది. అప్పట్లో అక్క మెలిగిన తీరు ఇప్పటికి తన మనసులో నిలిచిపోయింది. నాన్నగారు ఎప్పుడయినా  కాస్త దిగులుగా కనిపిస్తే అది ధైర్యం చెపుతుండేది. అలాంటిది ఈనాడు....

    పెళ్ళయిన రెండు నెలలకే అక్కయ్యలో  ఎంత మార్పు. పేలగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చునే అక్కను చూస్తుంటే  మనసు కెలికినట్లవుతోంది? శేఖరాన్ని  కాదని తను గిరిని చేసుకోవటం పెద్ద పొరపాటు. శేఖరంటే అక్కయ్యకు చాలా అభిమానం, ప్రేమా. గిరిలో ఎత్తి చూపటానికి ఏ లోపం లేదు. కాని అతన్ని చేసుకున్నాక అక్కయ్య సుఖపడలేకపోతోందే  అని తన బాధ. అంతే.

    "సారీ హిమా! చాలా సేపయిందా  వచ్చి" పక్కన కూర్చుంటూ అన్నాడు సాగర్.

    "ఇంత ఆలస్యమయిందేం. ఇక  వెళ్ళిపోదామనుకుంటున్నాను" కోపం నటిస్తూ అంది.

    "ఆఫీసులో  అనుకోకుండా ఏదోపని  వచ్చిపడింది. అయినా ఏమిటి ఇవ్వాళ ఇంట్లో కాకుండా పార్కులో రొమాన్స్ కావాలనిపించిందా__ఇక్కడకు రమ్మన్నావు."

    "నీ మగబుద్ది పోనిచ్చుకున్నావు గాదు. ఎప్పుడూ అదే ధ్యాస"
 

 Previous Page Next Page