"అంత పరిష్కరించలేని సమస్య వచ్చిందా? నాతో చెప్పండి చినబాబు. నేనున్నదెందుకు? నా మేనేజరుగిరీ ఎందుకు?" "ఒక నిర్దోషిని నిర్దాక్షిణ్యంగా చెంపలు వాయగొట్టింది ఒకమ్మాయి. అతడు నిర్దోషి అని నిరూపించి ఆమెచేత తప్పును ఒప్పించగలరా?"
"ఆ నిర్దోషి ఎవరో, ఆ అమ్మాయి ఎవరో చెప్పందే?" ధర్మలింగం స్వరంలో కుతూహలం వ్యక్తమైంది.
"ఆ అమ్మాయి పేరు భ్రమరాంబిక అని విన్నాను"
"భ్రమరాంబికా? వేద ప్రకాశంగారి పెద్దమ్మాయి"
"అవును"
"మరి ఆ నిర్దోషి?"
"నేను"
"మీరా? జరిగింది వివరంగా చెప్పండి మహాప్రభో" చెప్పాడు వికీ.
ధర్మలింగం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ సమస్య పరిష్కరించడం అంత సులభంగా కనిపించలేదు. ఎందుకంటే వికీ నిర్దోషి అని వాదించడానికి ఈవైపున బలం చాలా తక్కువగా ఉంది. ఈయన తొలి కలయికలోనే ఒక అపరిచిత యువతి కపోలాలు స్పర్శించాడంటే అది కేవలం ఒక సౌందర్య రసానుభూతి అంటే ఎవరు నమ్ముతారు? ఈయన రక్తంలో తన పూర్వీకుల రక్తం, రాజరికపు దురహంకారం ప్రదర్శించకపోతే ఇంత సాహసించి ఒడిగట్టేవారా?"
"ఆమె చేత తప్పును ఒప్పించడం తరువాత సంగతి. కానీ మీరు మాత్రం తొందరపడ్డారనిపిస్తుంది చినబాబు"
"నేను తొందరపడ్డానా?" ఎగిరిపడ్డట్టుగా అడిగాడు వికీ
"మీరు విదేశంలో పెరిగారు. శీలం, పవిత్రత అంటే విలువలేని, స్త్రీ పురుషుల భేదం లేకుండా స్వేచ్చా ప్రణయం జీర్ణించుకున్న వాతావరణంలో పెరిగారు. వాళ్లని నడిరోడ్డున ముద్దులు పెట్టుకున్నా. బిగియార కౌగిలించుకున్నా తప్పులేదు వింతకాదు. కానీ ఇక్కడ హిందూ స్త్రీలు శీలానికి, పవిత్రతకూ ఎంత విలువ ఇస్తారో, అది భంగపడే పరిస్థితి వస్తే తమని తాము ఎలా ఆహుతి చేసుకుంటారో మీకు తెలియదు. నాకు తెలుసు. లలితా పరమేశ్వరి అని భ్రమర మేనత్త ఒకామె......"
"విన్నానా కథ. కానీ నేను భ్రమరను ఆ దృష్టితో చూడలేదు. ఆమెపట్ల నాకు కలిగింది ఆరాధనే కాని వ్యామోహం కాదు" ఇంకా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న ఆశ చావలేదు వికీకి.
"అటువంటి సున్నితమైన విషయాలు ఇక్కడి వాళ్లకు చెప్పినా అర్ధంకావు చినబాబు. వాళ్లకు చప్పున అర్ధమయ్యేది ఒక్కటే. మీ కన్ను ఆమె మీద పడిందని"
"పరిష్కారం నాకు సూచిస్తారని చెప్పి మీరు ఎదుటి పక్షంలో చేరిపోయారేమిటి మేనేజరుగారూ?" వికీ విస్మయం ప్రకటించాడు.
"న్యాయదృష్టితో చూసినప్పుడు ఇలాగే మాట్లాడాలి. మీ తండ్రి తాతల్లాగే న్యాయం గీయం ఏంలేవు. మా ఉప్పు తింటున్నావు కాబట్టి మా పనులు చేసిపెట్టడం మీ ధర్మమంటారా? భ్రమరాంబికను కాళ్లు చేతులు కట్టించి మీ గెస్ట్ హౌస్ లో పడేయిస్తాను"
వికీ ముఖం ఎర్రగా కందిపోయింది "ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మేనేజరుగారు. మీక్కూడా నేనొక కామదాహంగల మనిషిగా కనిపిస్తున్నానా? మీరు కూడా నన్ను దోషిగా భావిస్తున్నారా?"
"నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను చినబాబు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టే శక్తి నాకెక్కడిది? నేను భ్రమరాంబికను కలిసి మాట్లాడతాను. మీమీద కలిగిన అపార్ధాన్ని తొలగించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను"
"ఆమె నన్ను అపార్ధం చేసుకోవడమేకాదు ఆమె చేతులు కాల్చుకుని నన్ను దారుణంగా అవమానించిందని కూడా చెప్పండి."
"అలాగే చెబుతాను చినబాబు. మీరు లేచి భోజనం చేయండి."
"ఊహు! భ్రమరాంబిక ఏమన్నదీ విన్నాకగానీ నేను భోజనం చేయను"
"మీరు చిన్నపిల్లాడిలా హఠం చేస్తే బాగుండదు. అమ్మా నాన్నా ఎవరూలేరు. మీరే పెద్ద. ఇంత పెద్ద ఎస్టేట్ ను అజమాయిషీ చేయవలసినవారు మీరు. మీరు పెద్ద తరహా అలవరచుకోక తప్పదు" గంభీరంగా చెప్పాడు ధర్మలింగం. "జరగాల్సినవి జరుగుతాయి. దానికోసం మీరు భోజనం మానేసి కూర్చోవడం వట్టి కుర్రచేష్ట అనిపిస్తుంది. నాకొచ్చిన పెద్ద వయసుతో నేనీ చనువు తీసుకుని చెబుతున్నాను. క్షమించండి" ధర్మలింగం వినయంగా చేతులు జోడించాడు.
ఆల్ రైట్! మీ మాట వింటాను! కాని, మొన్నటి నుండి నా మనసు ముల్లు గుచ్చినట్టుగా సలుపుతూంది. ఈ శల్యబాధను దూరం చేసే బాధ్యత మీదే....! తుంగభద్రా! భోజనం వడ్డించు పద!" వికీ కొంచెం హుషారు తెచ్చుకొని లేచాడు.
భ్రమరాంబికను ఒంటరిగా కలిసి మాట్లాడడం కంటే, ఈ విషయం ఆమె పెద్దల వరకూ తీసికెళ్ళి వాళ్ల చేత కూడా నచ్చజెప్పిస్తే బాగుంటుదనుకొన్నాడు ధర్మలింగం. ఆ సాయంత్రమే వేద ప్రకాశం ఇంటికి వెళ్లాడు.
ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని అమరం వల్లె వేయిస్తున్నాడు వేదప్రకాశం. యజ్ఞోపవీతాల దారం తీస్తూ చేతిలో కుదురు తిరుగుతుంది.
వేదప్రకాశం ఆయన ఆకృతి, ముఖవర్చస్సూ చూసి ఆపేరు పెట్టారేమో అన్నట్లుగా ఉంటాడు. వయసు ఏభై ఏళ్ళ వరకు వుంటుంది. ఆయన సంభాషణా తీరు తొణుకుబెణుకు లేకుండా వుంటుంది.
వేదప్రకాశం తండ్రి, తాతలు రాజస్థానాలలో పండితులుగా వుండి చాలా గ్రంధాలూ, శతకాలూ రాసి కీర్తినీ, డబ్బునీ గడించినవారు. వేదప్రకాశం వాళ్ళలా రాజాస్థానాల్లో పండితుడు కాకపోయినా తండ్రితాతలు సంపాదించి పెట్టిన కీర్తినీ, సంపదనూ చెక్కుచెదరకుండా చూచుకొంటున్నారు. అపారమైన భూ ఆస్తి వున్నా, లక్షలు ఖరీదు చేసే ఇల్లున్నా అదే సాదా పంచెకట్టు, పైన అంగవస్త్రం, లక్ష్మీ తాలూకు సరికంటే జ్ఞానసిరే ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూంటుంది. అది దాచుకోవాలన్నా దాగని సిరి.
ఆ ఇంట్లో నిత్యాగ్నిహోమం జరుగుతున్నట్టు ఆ ప్రక్కనే వరండాలో హోమగుండం నుండి సన్నగా పొగవస్తూంది.